కూలిన సౌధం

కూలిన సౌధం

రచన: సావిత్రి కోవూరు 

“అమ్మ నాన్న ఎవరో ఒక ఆంటీ, ఒక పాప తో కలిసి రాత్రి మనము ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు కనిపించారు” అన్నది పదో తరగతి చదువుతున్న శరణ్య.

“నీవు ఎవర్ని చూసి ఎవరనుకున్నావో నాన్న వేరే వాళ్ళతో ఎందుకు వస్తారు. అసలు ఊర్లోనే లేరు కదా” అన్నది కరుణ.

“లేదమ్మా నాన్నని నేను అన్నయ్యకి కూడా చూపెట్టాను. నీవు మామయ్య, అత్తయ్యతో ఉన్నావ్ అని చెప్పలేదు” అన్నది.

“ఏమోలే ఈ విషయం ఎక్కడ చెప్పకు” అన్నది కరుణ.

“ఎందుకు చెప్పొద్దు. నాన్న మా చిన్నప్పటి నుండి  రోజు ఎవరి ఇంటికో వెళ్తారు. రోజు మన ఇంట్లో ఉండరు. ఇన్ని రోజులు ‘మీరు చిన్న వాళ్ళు ఆ విషయాలేవీ మాట్లాడొద్దు’ అన్నావు. ఎప్పుడన్నా వచ్చినా నిన్ను రోజు కొట్టి నీ డబ్బులు లాక్కెళతారు. ఇప్పుడు మేము పెద్దవాళ్ళమయ్యాం. అర్థం చేసుకుంటాం. ఎందుకమ్మా, నాన్న అలా చేస్తాడు. మామయ్య వాళ్లకి చెప్పి బుద్ధి చెప్పిద్దాము” అన్నాడు ఇంటర్ చదువుతున్న రమణ.

“వద్దు అలాంటి పని మీరు చేయకండి. అలా చేస్తే నాన్న నన్ను ఇంకా కొడతారు. మిమ్మల్ని కూడా కొడతారు. మీరు మంచిగా చదువుకొని మీ కాళ్లపైన మీరు నిలబడ్డాక, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. అప్పటి వరకు ఇలా ఉండటం తప్పదు” అన్నది.

“ఇన్ని రోజుల నుండి ఎలా భరిస్తున్నావమ్మా. నాన్న మన ఇంటికి రాకుంటేనే బాగుంటుంది మాకు. వచ్చాడంటే డబ్బులుకి వస్తాడు. నిన్ను వేధిస్తాడు” అన్నది కూతురు.

సరేలే మీరు ఇవేమీ ఆలోచించకుండా, మంచిగా చదువుకోండి. మళ్లీ పొద్దున్నే స్కూల్ కి వెళ్ళాలి. ట్యూషన్ కి వెళ్ళాలి” అన్నది. పిల్లలు పడుకోవడానికి వెళ్ళిపోయారు.

 కరుణ నిద్ర రాక ఆలోచిస్తు పడుకుంది. పెళ్లికాకముందు తను ఎన్ని ఊహించుకున్నది. తన భర్తతో ఎంతో ప్రేమగా ఉండాలని, ఇద్దరు హాయిగా చిలకాగోరింకల్లా బ్రతకాలని, పదిమంది తమ కాపురం చూసి మెచ్చుకోవాలని ఎన్నెన్నో ఊహించుకున్నది. కానీ ఆ ఊహలన్నీ పాప పుట్టిన కొన్ని రోజులకి తలకిందులయ్యాయి. తన బ్రతుకు ఇలా అవుతుందని ఏనాడు ఊహించలేదు కరుణ.

పిల్లలు అన్నట్టుగానే మోహన్ వచ్చాడంటే ఇంట్లో పెద్ద యుద్ధమే చేస్తాడు మొదట్లో కరుణను పిల్లలను బాగానే చూసుకునేవాడు. శరణ్య పుట్టినప్పుడు పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి ఈ మనిషి పూర్తిగా మారిపోయాడు. ఒక స్నేహితుని చెల్లెలు రాధ. ఆమె భర్త చనిపోయి చిన్న పిల్లతో అన్న దగ్గరికి వచ్చింది. స్నేహితుడి దగ్గరకు వెళ్ళినప్పుడల్ల మోహన్ ఆమెను చూసేవాడు. అప్పటినుండి వాళ్ళ ఇంటికి వెళ్లడం ఎక్కువ చేశాడు. ఆమెతో సరదాగా మాట్లాడేవాడు. కొన్నిరోజులకు వాళ్ళ స్నేహం హద్దులు దాటింది. కొన్ని రోజులకు అక్కడే పడుకోవడం అలా మొదలైంది.

వీళ్ళ శ్రుతిమించిన పరిచయం పసిగట్టిన స్నేహితుడు “చూడు మోహన్ నీకు భార్య, పిల్లలు ఉన్నారు. ఇలా ప్రవర్తించడం సరికాదు అని ఎంత చెప్పినా వినలేదు. తర్వాత ఎంతో హెచ్చరించాడు అయినా కూడా వినకపోయేసరికి, వాళ్ళ చెల్లెలికిచెప్పినా  ఆమె కూడా వినలేదు. ఇద్దరు వినకపోయేసరికి మోహన్ ని ఇంటికి రావద్దని ముఖం మీదనే తలిపేశాడు స్నేహితుడు.

ఆ అవమానాన్ని తట్టుకోలేక దూరంగా చిన్న పోర్షన్ అద్దెకు తీసుకొని రాధను అక్కడికి తీసుకెళ్ళిపోయాడు మోహన్. శరణ్యకు మూడో నెల వచ్చిన తర్వాత పుట్టింటి నుండి వచ్చిన కరుణకు భర్తలో మార్పు స్పష్టంగా కనిపించింది. ముందు బాబుతో గంటలు గంటలు గడిపే మోహన్ మెల్లమెల్లగా వాడు దగ్గరికి వెళ్ళినా ఎత్తుకొనే వాడు కాదు. పాపనయితే అసలే దగ్గర తీయలేదు. మొదట్లో కారణం ఏంటో తెలిసేది కాదు కరుణకు.

కొన్ని రోజుల తర్వాత కరుణ వాళ్ళ అన్నయ్య ఫోన్ చేసి “కరుణా మీ ఆయన హయత్ నగర్ లో వేరే ఎవరో ఆడ మనషితో వెళ్లడం చూశాను.నేను పిలిచే సరికి ఒక ఇంట్లోకి వెళ్లి తలుపు పెట్టుకున్నారు” అన్నాడు.

“ఈయన హయత్ నగర్ లో ఎందుకు ఉంటాడన్నయ్య. ఆయన ఆఫీసు పని మీద టూర్ వెళ్ళాడు. నీవు ఎవరిని చూశావో” అన్నది.

“లేదు మీ ఆయన టూర్ వెళ్ళలేదు. హైదరాబాదు లోనే ఉన్నాడు” అన్నాడు.

రాత్రికి ఇంటికి వచ్చిన మోహన్ తో “మీరు ఎక్కడి నుండి వస్తున్నారు” అన్నది.

“చెప్పాను కదా టూర్ వెళ్తున్నానని” అన్నాడు మోహన్.

“లేదు మీరు హయత్నగర్ లో ఒక ఇంట్లో కి వెళ్లడం నేను చూశాను” అన్నది గట్టిగా.

“చూసావు కదా. ఇక అడగడం ఎందుకు? నోరు మూసుకొని పడి ఉండు” అన్నాడు మోహన్.

“లేదు మీరు ఎందుకు ఇలా మారిపోయారు ఈ మూడు నెలల్లో. నేనేమి తప్పు చేశాను. మీకు పిల్లలు ఉన్నారు. వాళ్ల భవిష్యత్తు ఏమిటి” అంటూ ఏడవటం మొదలు పెట్టింది కరుణ.

“ఇలా వచ్చినప్పుడు ఏడుపులు తూడుపులు పెడితే అసలు ఇంటికి రాను ఏం చేసుకుంటావో నీ ఇష్టం” అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి నరకం చూపించాడు. డబ్బులు అస్సలు ఇచ్చేవాడు కాదు. కరుణ ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్ లో జాబ్ వెతుక్కుని పిల్లలను పెంచసాగింది. తీరిక సమయాల్లో బట్టలు కుట్టి కొంత సంపాదించుకునేది. అలాగా పిల్లలు మంచిగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అమ్మాయిని అన్నయ్య కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసింది.

ఒకరోజు మోహన్ వచ్చి “నీ నగలు కావాలి ఇచ్చేసేయ్” అన్నాడు.

“నా నగలు ఎందుకు ఇస్తాను. ఇన్ని రోజులు జ్ఞాపకం రాని మేము ఇప్పుడు జ్ఞాపకం వచ్చామా?” అని నిలదీసింది.

“నా కూతురు పెళ్లికి నగలు కావాలి. దానికి పెళ్లి కుదిరింది. నగలిస్తే వెళ్ళిపోతాను. మళ్ళీ నీ మొహం కూడా చూడను” అన్నాడు.

“ఎవరి కూతురినో నా కూతురు అని గొప్పగా చెబుతున్నరు. ఈరోజు నా అల్లుడు వస్తున్నాడు ఇంట్లో ఉండండి. అతనికి మీ ఆటలు తెలియవు” అన్నది.

“నీ అల్లుడు వస్తే నేను ఎందుకు ఉండాలి. తొందరగా నగలిస్తే నేను వెళ్ళిపోతాను” అని దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చేసరికి బాగా డ్రింక్ చేసి వచ్చాడని తెలిసిపోయింది. ఇప్పుడు ఏమి మాట్లాడినా లాభం లేదని మీరు మొదట ఇంట్లో వచ్చి వెళ్ళండి. ఆ అబ్బాయి చూస్తే బాగుండదు” అన్నది.

“నా ఇంట్లో నుంచి నన్ను పొమ్మంటావా” అని పక్కనున్న ఇనుప రాడ్ తీసుకుని తలపై కొట్టాడు. తలనుండి రక్తదారలు కురువసాగాయి కూతురు అల్లుడు వచ్చేసరికి. వెంటనే వాళ్ళ అన్నయ్యకు ఫోన్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు.

మోహన్ పై హత్య ప్రయత్నం నేరం క్రింద అరెస్టు చేసి జైల్లో పెట్టించారు. శిక్ష అనుభవించి తిరిగి వచ్చిన మోహన్ రాధా ఇంటికి వెళితే తాళం వేసుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఎవరు చెప్పలేకపోయారు. మెల్లగా కరుణ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్లు కూడా  కొడుకు అమెరికాలో ఉద్యోగం వచ్చిందని ఇల్లమ్ముకొని వెళ్లిపోయారని చెప్పారు పక్క వాళ్ళు.

ఎక్కడికి వెళ్లాలో తెలియక, దారీ తెన్నూ లేకుండా తిరిగి తిరిగి ఆకలితో నకనకలాడుతున్నాడు. లేవడానికి కూడా చేత కావట్లేదు. గతం కళ్ళముందు కదలాడింది. తాను చిన్నప్పటి నుండి క్లాసులో ఫస్ట్ వచ్చేవాడు. అందరూ తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఉత్సాహం చూపేవారు. తల్లిదండ్రులు కూడా తనను చూసి చాలా సంతోష పడే వాళ్ళు. చుట్టాలందరికీ గొప్పగా చెప్పుకునేవారు.

దేవుడు అంతా అందమైన  జీవితాన్నిచ్చిన మోహన్ చేతులారా దానిని సర్వ నాశనం చేసుకుని రోడ్డుపై పడిపోతే పై నుండి గుర్తుతెలియని వాహనం పోయి చనిపోయాడు. కనీసం అతని చూడడానికి  కూడ ఎవరూ రాకపోయేసరికి, మున్సిపల్ వాళ్లే తీసేశారు. ఈ విధంగా కరుణ ఆశల సౌధాన్ని కఠినంగా కూల్చేసిన మోహన్, దారీ తెన్నూ లేకుండా గాలివాటంగా తిరుగుతూ స్వర్గం లాంటి సంసారాన్ని చేతులారా పాడు చేసుకున్న మోహన్ జీవితం దిక్కులేని చావుతో ముగిసిపోయింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!