కూర కావాలా

కూర కావాలా

రచయిత్రి :: మంగు కృష్ణకుమారి

భాస్కరరావు నవ్వుతూ అక్క‌ శ్రీలక్ష్మి వేపు చూసేడు. “ఎన్నాళ్ళయిందిరా? నిన్ను చూసి”
ఆప్యాయంగా అంది శ్రీలక్ష్మి.

“గత రెండుసార్లు నేను వచ్చినప్పుడు నువ్వు లేవే? ఒకసారి మీ ఆడపడచు
కొడుకు పెళ్ళి అని వెళ్ళేవు. ఇంకోసారి
మీరు టూర్ లో ఉన్నారు” భాస్కర్ అక్కని ఇష్టంగా చూస్తూ అన్నాడు.

భాస్కర్ పక్కనే కూచొని చేతులు పట్టుకు మాటాడుతూ అంది శ్రీలక్ష్మి “రారా భోజనానికి” అంది.

“మళ్ళా నేను మీ మరదలూ వస్తాం
కదక్కా!” అన్నాడు భాస్కర్
“అది తరవాతరా, ముందు పద”
అంటూ లాక్కెళ్ళింది శ్రీలక్ష్మి.

బంగాళదుంపల వేపుడు, కొబ్బరి పచ్చడి, సాంబారు, వేపిన అప్పడాలు అన్నీ
సద్ది అన్నం పెట్టి, నెయ్యి గిన్నె తెచ్చింది శ్రీలక్ష్మి. భాస్కరం కుర్చీలో కూచొని నవ్వుతూ “అక్కా, నాకు సుగర్ బిపి
అన్నీ వచ్చేసాయి. బంగాళదుంపలు
పూర్తి నిషిద్ధం. కొబ్బరి అసలు కుదరదు.. మా ఆవిడ ఉంటే గోల పెట్టేసేది” అంటూ కూరంత వేరే ప్లేట్‌లోకి
తీసేసాడు.

శ్రీలక్ష్మి ఉసూరుమన్నట్టు చూసింది. “ఫరవాలేదే, సాంబారు ,అప్పడాలు
చాలు” అంటూ అన్నంలో సాంబారు వేసుకున్నాడు. శ్రీలక్ష్మి కాస్త దీనంగా
“నాలుగు కూరముక్కలు వేసుకోరా!” అంటూ గరిటతో కూర వేసింది.

“డయాబిటిక్ ని కదే” అంటూ శ్రీలక్ష్మి
వేపు చూసేడు. అప్పటికే శ్రీలక్ష్మి కళ్ళు నీళ్ళచెలమలా ఉన్నాయి.
పాత ఙ్ఞాపకాలతో ఆమె గుండె గంగలా
అయిపోతోంది.

కనకరత్నం భర్త చనిపోయిన అభాగిని.
పిల్లలు ముగ్గురు కూతుళ్ళు, ఒక కొడుకూ
పెద్దకూతురుకి పన్నెండేళ్ళపుడే తన తమ్ముడికి ఇచ్చి పెళ్ళి చేసేసారు. భర్త చనిపోయేసరికి దానికి పధ్నాలుగేళ్ళు రాడం తమ్ముడు తీసికెళిపోయేడు.
తరవాత శ్రీలక్ష్మి, ఉమా, భాస్కర్

దిగువ మధ్యతరగతి కన్నా అన్యాయంగా
ఉండేవారు. చిన్న గదీ, వంటింట్లో అద్దెకి ఉండేవారు. కనకరత్నానికి
ఆమె భర్త అన్నయ్య రామారావు జాలి
పడి ఒక ప్రైవేటు హాస్పిటల్ లో
ఉద్యోగం ఇప్పించేడు. జీతం చాలా తక్కువ. కటకటలాడుతూ బతికేవారు.

ఆమె అదృష్టానికి పిల్లలు ఏదిపెడితే అదే తినేవారు. ఏవి కొంటే అవే కట్టేవారు.
మధ్య మధ్యలో రామారావు గారయిన
సాయపడేవారు గానీ, తమ్ముడు ‘నమో నారాయణా’ అన్నట్టు ఉండేవాడు.

కనకరత్నం దేవుడి మీద భారం‌ పెట్టి, ఏరోజు భయం నీడలో బతుకు‌ సాగిస్తూ ఉండేది. పొద్దుట కొంచెం కూరగానీ పప్పు చారు గానీ చేసేది. ఇహ రాత్రి మిగిలిన వాటితో గడుపుకోడమే!

రామారావు గారు ఏదొ‌ పనిమీద వచ్చి తమ్ముడి‌ పిల్లలకీ‌ బిస్కట్లు పట్టుకొని
వచ్చేరు. రాత్రికి భోజనానికి రమ్మని
మరీ మరీ చెప్పింది కనకరత్నం.

రామారావు గారంటే చాలా గౌరవం. ఆయన వల్లే తను పిల్లలూ ఈపాటి ఉన్నారని కృతఙ్ఞత. కిరాణా దుకాణంలో అరువు పెట్టి సామాన్లు తెచ్చి రామారావు గారికని బంగాళదుంపల వేపుడు, గోంగూర పచ్చడి చేసింది. ముక్కల పులుసు చేసి కాస్త దోసావకాయ కలిపింది.

శ్రీలక్ష్మికి పెదనాన్న వస్తారని చెప్పి,
పెరుగు తెస్తానని వెళ్ళింది. ఆడి ఆడి ఆకల్తో ఇంటికి వచ్చి రెండు చెంబులు
ములిగి వంటింట్లోకి వచ్చిన భాస్కర్ కి
కమ్మటి వాసనలు వచ్చేయి.

వాడు సంతోషంగా కంచం పెట్టుకు కూచున్నాడు. శ్రీలక్ష్మి వచ్చింది.
తమ్ముడి కంచంలో పచ్చడి వేసి అన్నం పెట్టింది. నూనె కాస్తవేస్తుంటే,
“అక్కా, దుంపల వేపుడు ఉందే వెయ్యి”
అని అడిగి మరీ వేయించుకున్నాడు.

ఎర్రగా వేగిన దుంపలవేపుడులో కనకరత్నం ఆఖరున కాస్త వెన్నపూస, జీలకర్ర కారం వేసిందేమో కరకరలాడుతూ
చాలా కమ్మగా ఉన్నాయి. గబగబా కూరతో తిని మళ్ళా కూరే వేయమన్నాడు భాస్కర్. వేసీవెయ్యనట్టు వేసి “పచ్చడి తినరా, ఎంత బాగుందో!” అంది.

“అబ్బా,దుంపల వేపుడు సూపరక్కా, అదే వెయ్యి” అన్నాడు. శ్రీలక్ష్మికి భగ్గుమంది. చేసిన కూర కాస్తా వీడే తినేస్తే ఇహ పెదనాన్న గారికో?

గరిటతో ఒక్కటి వేసింది. “వెధవా! తిన్నది చాలాదురా? పులుసుతో
తినలేవా? అమ్మ పెదనాన్న గారికి
చేసిందంతా నువ్వే తింటావా?”
అంటూ అరిచింది.
బిక్క చచ్చిపోయిన భాస్కర్ ఏడుస్తూ
కాస్త మజ్జిగ వంపుకొని తినేసి లేచేడు.

శ్రీలక్ష్మి వెక్కి వెక్కి ఆరోజులాగే ఈరోజూ
ఏడుస్తోంది. చెయ్యి కడుక్కొని వచ్చి
భాస్కర్ ప్రేమగా శ్రీలక్ష్మి చెయ్యి పట్టుకొని “ఏమిటక్కా, ఇన్నాళ్ళయినా
నిన్న మొన్న అయినట్టు ఏడుపు.ఇప్పుడు మనకేం తక్కువ. చదువులు అబ్బేయి. ఉద్యోగాల్లో పైకొచ్చేం. అమ్మ సంతృప్తిగా మన చేతులమీదే దాటిపోయింది.
ఇంకా పాత పేదరికం తలచుకోవచ్చా?”
అన్నాడు.

“కాదురా లేమితో ఆరోజు నీకు పెట్టలేదు. అన్నీ ఉన్నా నీకు చేసి పెట్టే ప్రాప్తం నాకు లేకుండా అయిపోయింది”
అంటూ కళ్ళు తుడుచుకుంది.

భాస్కర్ ప్రేమగా అక్కవేపు చూస్తూ
“మానీయాల్సినవి మానేసే వయసక్కా
మనది” అన్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!