మాటీవీ నా వ్యధ

(అంశం: హాస్యకథలు)

మాటీవీ నా వ్యధ

రచన: శ్రీదేవి విన్నకోట

అబ్బా ఆ టివి సౌండ్ కాస్త తగిద్దు, రాగానే ఏంటే
ఈ మోత అంటూ రెండు చెవులూ ముస్కుంటూ అరిచారు మా వారు.ఆయన మధ్యాహ్న భోజనానికి ఇప్పుడే ఇంటికి వచ్చారు. నేనేం మాట్లాడకుండా ఆయన వంక బేల చూపులు చూస్తూ ఉండిపోయా.

ఆ టీవీ చూసేది మహారాజశ్రీ మా అత్తగారు. సౌండ్ తగ్గించమని నా నోటితో నేను ఎలా చెప్తాను. అలా చెప్పినప్పుడు ఆవిడ చూసే చురకత్తిలాంటి చూపులు మాటలు నేను భరించగలనా? కాలి బూడిద అయిపోను.  కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం ఇలా అయిపోయింది నా పరిస్థితి
మా ఇంట్లో.

మా అత్త గారికి, మా వారికి మధ్యలో ఈ విషయంలో అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నాను. ఈయన సౌండ్ తగ్గించమంటారు.వేరే న్యూస్ ఛానల్ పెట్టమని
వార్తలు చూస్తాను అంటారు, మా అత్తగారు అదేం  సేసేమీరా సాగనివ్వరుగా. ఆమెకి టీవీ సీరియల్స్ అంటే  మహా ఇష్టం.ఆవిడ ఎప్పుడు సీరియల్స్ లో వచ్చే పాత్రల గురించే ఆలోచిస్తూ తనలోతాను అతిగా మదనపడుతూ ఉంటారు. మా ఇంట్లో సమస్యల కంటే కూడా ఆ సీరియల్స్ లోని కష్టాలే ఎక్కువగా అనిపిస్తాయి మా అత్తయ్య కి.

నాతో ఎప్పుడైనా మాట్లాడిన డాక్టర్ బాబు దీప కాపురం ఎప్పుడు చక్కబడుతుందో, అసలు చివరాఖరికి కలుస్తారు అంటావా ఆమోనిత పీడా వాళ్ళకి వదులుతుంది అంటావా, దేవుడా వదినమ్మ కి కష్టాలు తీరేదారే లేదా, ఇంటింటి గృహలక్ష్మి లో తులసి భర్తతో ఎప్పుడు ఆనందంగా ఉంటుందో
ఆ లాస్యను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు గెంటేస్తారో అప్పుడు ఆకొంప కి పట్టిన దరిద్రం వదులుతుంది. దేవత సీరియల్ లో ఆ పిల్ల రుక్మిణి నిజంగా దేవతే, చెల్లెలి కాపురం సీరియల్ లో భూమి భర్త ఆకాష్ పెళ్ళాన్ని పిల్లని గుర్తుపట్టకపోవటం ఏంటో చోద్యం కాకపోతే అని తెగ ఆలోచిస్తూ ఉంటారు.  జానకి కలగనలేదెలో, ఏంటో బంగారం లాంటి అందమైన పిల్ల, చక్కగా చదువుకుంటే ఆ అత్తకి వచ్చిన రోగం ఏంటో అంటూ అవన్నీ చూసి నాకు పైకి చెప్తూ ఉంటే నా తల ఏం పెట్టి పగలగొట్టుకోవలో నాకు అర్థం కాదు.

నా పెళ్లయిన కొత్తలో మా అత్తయ్య టీవీ పిచ్చి గురించి తెలీక ఆమె ఏదో ఆలోచిస్తూ ఎవరి గురించో తలుచుకుని లోలోపలే బాధపడుతూ ఉంటే ఏమైంది అత్తయ్య అలా ఉన్నారు  మన చుట్టాలకి ఎవరికైనా బాలేదా మీరు వెళ్లి ఒక్కసారి వెళ్లి చూస్తారా అని అమాయకంగా అడిగే దాన్ని. ఆవిడ ఒక చిన్న చిరునవ్వు నవ్వి ఒసేయ్ పిచ్చి మొహమా నేను ఫలానా  టీవీ సీరియల్ లో పాత్ర  గురించి బాధపడుతున్నాను. వాళ్ళు మన చుట్టాలు కాదు అంతకంటే ఎక్కువ అని చావు కబురు చల్లగా చెబుతుంటే నేనొక  పిచ్చి మాలోకం లా పిచ్చి చూపులు చూస్తూ ఉండేదాన్ని. మా అత్తయ్య పొద్దున కాఫీ ఇచ్చేటప్పుడు ఇదిగో అమ్మాయి నీకు నీ కూతురికి ఏమైనా టీవీ చూడాలనిపిస్తే 12 గంటల్లోపు చూసేయండి తర్వాత నేను చూస్తాను అని  తెలుసు కదా అంటారు.అప్పుడు నేను తింగరి దానిలా  ఇంత పొద్దున్నే ఏంకార్యక్రమాలు వస్తాయి అత్తయ్యా కానీ నాకుపని ఉంటుందికదా అప్పుడు నేనేంచూస్తాను అనిఅంటాను. వెంటనే ఆవిడ అందుకుని అయ్యో టీవీ చూడమంటే చూడవు సరేలే నీఇష్టం నీపని నువ్వు చూసుకో నేను చూస్తాలే అంటారు.ఆవిడ మాటలకి ఏమనాలో తెలియక మీడి గుడ్లేసుకుని చూడడంతప్ప ఏమీచేయలేను.

ఇలాసాగుతుంది నాకు మాఅత్త గారికి మధ్య టీవీ ప్రహసనం. పొద్దున 11 గంటల నుంచి అన్ని చానల్స్ చూడటం మొదలు పెడతారు.నేను భక్తి ఛానల్ పెట్టమంటారా అని  అడుగుతాను.నేను చూస్తాలే అమ్మాయి నువ్వు వెళ్లి పని చూసుకో అని అంటారు. ఒక గంట సేపు అన్ని చానల్స్ చూస్తూ కరెక్ట్ గా పన్నెండు కొట్టేసరికి  జీ తెలుగు గు గు దగ్గర ఆగుతారు. అప్పుడే మొదలవుతాయి,కష్టాలు కన్నీళ్ళ కలబోత సీరియల్స్ అన్ని, అప్పటి నుంచి మొదలుపెట్టి
చూస్తూ అమ్మాయి ఏం కూర వండుతున్నావు అని అడుగుతారు. ఏదో ఒక కూర అత్తయ్య.మీరు తినేదే వండుతున్నాను  అంటాను. ఆ తర్వాత వరుసగా అలా చూస్తూనే చూస్తారు, ఏదో ఒక సీరియల్ వస్తూనే ఉంటుంది, డాక్టర్ బాబు  హిట్లర్ గారి పెళ్ళాం లో అంతగా బాలేదు అంటారు, ఈ లోపు ఒంటిగంట అవుతుంది అమ్మాయి 1:00 అయిపోయింది అన్నం వడ్డించేసి ఇలా తీసుకొచ్చి ఇచ్చెయ్ అని అంటూ అంటూ  సీరియల్ ఊహలు గుసగుసలాడే చూస్తూ ఉంటారు. ఆ సీరియల్ పూర్తి అయ్యేలోపు ఆమె భోజనం కూడా పూర్తవుతుంది. ఆ తర్వాత గుండమ్మ కథ,ఇంటిగుట్టు, మిఠాయి కొట్టు చిట్టెమ్మ, వైదేహి ముద్దమందారం, చూశాక అక్కడి వరకు చూసి ఇదిగో అమ్మాయి టీవీ లో ఏమైనా చూడాలి అంటే ఇప్పుడు నువ్వు చూడు. మళ్లీ నేను 6 గంటల నుంచి చూస్తాను.  కూర్చునికూర్చుని నడుంపట్టేసింది అందుకే కాసేపు నడుం వాలుస్తా  అని పడుకుంటారు.

నాకు ఈ ఈ రెండు గంటల్లో ఏం చూడాలో ఎంత ఆలోచించినా అర్థం కాదు అందుకే టివి కట్టేసి దానికి కాస్త  విశ్రాంతి ఇస్తా.మళ్లీ 6 నుంచి మళ్ళీ మోగాలి కదా పాపం మా టీవీ పిచ్చితల్లి. మళ్లీ 5:30 అవ్వగానే  లేచి నేను ఇచ్చిన స్నాక్స్ తింటూ, అల్లం టీ తాగుతూ, టీవీ ముందు హాయిగా సెటిల్ అవుతారు.అలా మళ్లీ  ఆ టీవీ ప్రహసనం మొదలవుతుంది. టీవీ 9  నిరంతర వార్తా స్రవంతిలా  9: 30 వరకు కొనసాగుతుంది.6 గంటలకి వదినమ్మతో మొదలై గుప్పెడంత మనసు, కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి, దేవత, జానకి కలగనలేదు, ఎన్నెన్నో జన్మల బంధం అంటూ ఆ సీరియల్  ప్రహసనం  పదింటివరకు కొనసాగుతుంది.

ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి అన్ని సీరియల్స్ లో కంటే కార్తీకదీపం సీరియల్ అంటేమా అత్తగారికి చాలా ఇష్టం. దీప డాక్టర్ బాబు  మీద ఒకింత అభిమానం ఎక్కువే.దీప కార్తీక్ బాబు ఎప్పుడు మోనిత గొడవ లేకుండా కలిసి ఉంటారో అని వాళ్లు కూడా మా ఇంట్లో సభ్యులు అయినట్టు మధన పడుతూనే ఉంటారు.ఈవిడకి ఇంట్లో విషయాల గురించి ఎలాంటి చింత లేదు గాని  ఆ సీరియల్స్ గురించి బాధపడుతూ మనసు పాడు చేసుకుంటారు.

ఏంటో ఈవిడ అని  మనసులో అనుకుంటాను అంతే పైకి అంటే చచ్చానన్న మాటే. కానీ మా అత్తయ్యకి ఇంకో విషయంలో కూడా థ్యాంక్స్ చెప్పాలి.ఆ తరవాత వొచ్చే సీరియల్స్, బిగ్ బాస్ చూస్తానని అననందుకు.ఇలా సాగుతుంది మా ఇంట్లో టీవీ గోల. టీవీ గురించి అప్పుడప్పుడు మావారి కోప తాపాలు. మా అమ్మాయి అలకలు మా అత్తయ్య ఆపసోపాలు ఇవన్నీ నేనే భరించాలి.

మా అత్తయ్య టీవీ సీరియల్ చూసేటప్పుడు ఎప్పుడైనా కరెంట్ పోయిందో, వాళ్లని అతి దారుణంగా తిడతారు. (దయచేసి నిజంగా వాళ్ళు చదివితే ఏమీ అనుకోవద్దు) నేను కరెంట్ వచ్చేస్తుంది అత్తయ్య ఊరుకోండి అంటాను. నిజంగా ఆమె తిట్లు కి భయపడి కరెంటు కూడా త్వరగానే వచ్చేస్తుంది.
ఇక కొత్త సీరియల్ మొదలవుతుంది అంటే ఆవిడ సంబరం చూడాలి. చాలా సంతోషంగా ఉంటారు.

ఆదివారం  ఆమెకు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు సీరియల్స్ ఉండవుగా.  ఒక్క ఆదివారం పూటే మనం ఆవిడకి ఏదైనా చెప్పాలన్నా ఆమె నుంచి మనం ఏదైనా తెలుసుకోవాలన్నా ఒక్క ఆదివారం మాత్రమే సాధ్యమవుతుంది. మిగిలిన రోజుల్లో ఆమె ఎవరిమాటా వినరు ఒక్క టీవీ మాట తప్ప. టీవీ  సౌండ్ మాత్రం విపరీతంగా పెడతారు. నేను చూడకపోయినా ఆ సీరియల్ లో మాటలు పాటలు అన్నీ వింటూనే ఉంటాను. ఇంచుమించు కథ ఏంటో కూడా తెలిసిపోతూనే ఉంటుంది. చూడక పోవడం వల్ల ఒక్క వాళ్ళ హావభావాలు మిస్ అవుతాను అంతే,అవి కూడా పూర్తిగా చూస్తే నేను ఏమైపోతానో ఏంటో అనిపిస్తుంది నాకు.

ఈ ఒక్క టీవీ సీరియల్స్ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో మా అత్తయ్య చాలా మంచివారే. చాలామంది అత్తగార్లు సాధించినట్టు నన్ను సాధించరు. మిగిలిన ఏవిషయాలు అంతగా పట్టించుకోరు. ఇంట్లో నాదే ఇష్టారాజ్యం అందుకే మా అత్తయ్య అంటే నాకు ఇష్టం ఆమె ఎంతో ఇష్టపడే టీవీ సీరియల్స్ తో సహ అమెను మా అమ్మలా కాదు కాదు ఇంకాస్త ఎక్కువగానే ఇష్టపడుతున్నాను. నేను కథాపరంగా సరదాకి మా ఇంట్లో జరిగే కొన్ని సరదా సంఘటనలకి కొంత కల్పిత గాధ జోడించి ఇలా రాశాను దయచేసి టివి సీరియల్స్  ప్రేమికులు ఎవరు నొచ్చుకోవద్దు అని నా మనవి. గమనించగలరు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!