మహిమ

మహిమ

రచన: రాయల అనీల

“అంతా అయోమయంగా ఉంది లక్ష్మి….. మన అమ్మాయి అక్కడ అలా ..  ” అంటూ మోహనరావు గారు ఎదో ఆలోచనల్లో ఉండి గత 5 నిమిషాలుగా అలానే ఆయనలో ఆయనే మధనపడుతూ తాను చూసింది నిజామా కాదా అన్న సంశయం లో కొట్టుమిట్టాడుతూ ఉండిపోతారు

” మీరలా ఆందోళన చెందకండి…..ముందు మీరు నిమ్మళంగా ఉండి..అసలు అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా చెప్పండి ” అంటూ భర్త పక్కన కూర్చుంటారు …తన అయోమయ పరిస్థితి నుండి ఏదైనా స్పష్టత వస్తుందేమోనని తాను చుసిన సంఘటనని లక్ష్మి గారికి వివరించేందుకు సిద్ధమవుతారు
**
మోహనరావు ,లక్ష్మి గార్లది పాతక వసంతాల వివాహ బంధం….
వారి ఇరువురి ప్రేమ కి గుర్తే మహిమ..వాళ్ళ గారాల కూతురు
మధ్యతరగతి చిన్న కుటుంబమే అయినా వాళ్ళ ఇంట్లో సంతోషాలకి ఏ కొదవా లేదు
భార్యని అర్థంచేసుకునే భర్త , భర్తకి అనునయంగా నడిచే భార్య,తల్లితండ్రులకి గౌరవ మర్యాదలు ఇస్తూనే ఈ తరానికి తగినట్లు నడుచుకునే కూతురు ,కూతురే ప్రాణంగా బ్రతికే తల్లితండ్రులు..ఏ చీకు చింతా లేకుండా కలహాలకి దూరంగా ప్రేమ,ఆప్యాయతలకి దగ్గరగా ఉండే కుటుంబం ….
అలాంటి కుటుంబం లో ఈవేళ మోహనరావు గారు అంత అయోమయ ఆందోళన పరిస్థితికి కారణమైందే మహిమ…..
శివభక్తుడైన మోహనరావు గారు ప్రతి సోమవారం వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళడం ఆయన జీవనశైలిలో ఒక భాగం..అలానే ఈవేళ కూడా ఆపరమేశ్వరుని దర్శన నిమిత్తమై ఆలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా పూర్తి భక్తి శ్రద్ధలతో శివాభిషేకం చేపించి ఆలయ ఆవరణంలో కూర్చొని శివనామ స్పరణ లో ఉండిపోయారు..ఆలయంలో ఎంతటి హడావిడి ఉన్నా ఏనాడూ ఆయన ఏకాగ్రత తప్పలేదు…. కానీ ఈ రోజు ఆయన వెనుక గా వచ్చిన స్వరం ఆయన ఏకాగ్రతని భంగంచేసింది ….. ఎందుకంటే ఆ స్వరం మోహన్ రావు గారికి చాలా సుపరిచితమైన స్వరం కావడంతో వెంటనే వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయి వెనువెంటనే అక్కడికి వెళ్లగా..అక్కడ ఉన్నవారు
” పంతులు గారు…ఇవేళ మా అమ్మానాన్నల పెళ్ళి రోజు…వారి పేర్ల మీద అర్చన చేయండి ” ఆ తర్వాతి మాటలు మోహనరావు గారి చెవికి చేరకపోగా వారి మాటలకి అయోమయంగా అక్కడే నిలబడి పోతారు…
కారణం ఆ స్వరం మరెవరిదో కాదు మోహన్ రావు గారి కూతురు మహిమది తన ఎదురుగానే వేరే వాళ్ళని తన తల్లిదండ్రులుగా చెబుతూ పూజ చేయించే సరికి ఆయనలో మొత్తం అయోమయం ఆవహించినట్లుగా అనిపించి ఆ ఆలోచనల్లో ఉండగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారు మోహన్ రావు గారు ఎంత వెతికినా కనిపించకపోగా అదే ఆలోచనలో ఇంటికి చేరుకున్నారు…
“ఇదీ..లక్ష్మీ జరిగింది….మన మహి వాళ్ళను తన అమ్మ నాన్నలుగా…నాకు అసలు అర్థం కాలేదు ఒక్క క్షణం నా కళ్ళ ముందు ఏం జరుగుతుందో నేను నమ్మలేకపోయాను”
“సరే అండి మీరు చెప్పింది, మీ బాధ నాకు అర్థం అయింది….మన అమ్మాయి మీద మనకు నమ్మకం ఉంది కదా తను ఏ కారణం లేకుండా అలా చేయదు అసలు ఏమైందో అడుగుదాం మీరు కంగారు పడకండి….” అని లక్ష్మి గారు ఆయన ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తుండగానే మహిమ లోపలికి వస్తుంది….
“అమ్మ మహి ఏంటి ఇదంతా…. నువ్వు గుడిలో ఎవర్నో మీ అమ్మానాన్నలు అని చెప్పి పూజ చేపించావని నాన్న గారు చెబుతున్నారు…. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఆలోచనల్లో కంగారుపడుతున్నారు…అసలు ఏమైంది నువ్వు పరాయివాళ్ళని ఎవర్నో మీ అమ్మనాన్నలు గా చెప్పడం ఏంటి” అంటూ చాలా సున్నితంగా అడుగుతారు
“అమ్మ వాళ్ళు పరాయి వాళ్ళు కాదు మా అమ్మానాన్నలే అమ్మా ”
“మహి ఏం మాట్లాడుతున్నావ్”అంటూ లక్ష్మి గారు కాస్త కోపంగానే అంటారు…మహిమ లక్ష్మి గారిని తండ్రి పక్కన కూర్చోబెట్టి
“అమ్మా! మా అమ్మనాన్నలే అంటే నాలానే ఉన్న మరో అమ్మాయి తల్లిదండ్రులు..మీలానే ఎంతో ప్రేమగా,  గారాబంగా చూసుకున్న తల్లిదండ్రులు.. అమ్మ మీ సందేహం నాకు అర్థమైంది మరి నాతల్లిదండ్రులు అని చెబుతున్నాను అనేనా.. అసలు వాళ్ల ఏంటి, ఇదంతా ఏంటి అనే కదా….
అమ్మా! నాకు వాళ్ళకి వారం రోజుల క్రితం పరిచయం జరిగింది… ఒకరోజు నేను గుడికి వెళ్ళానా అక్కడ దర్శనం తర్వాత ప్రశాంతంగా కళ్లు మూసుకుని కూర్చుంటే వెంటనే ఒక ఆవిడ వచ్చి నన్ను గట్టిగా పట్టుకుని కళ్ళనిండా నీళ్ళతో ”
ఎలా ఉన్నావ్ అమ్మ శశి…” అంటూ గట్టిగా హత్తుకొని నన్ను వదలకుండా అలానే పట్టుకొని పక్కనున్న వ్యక్తి తో ” ఏవండీ చూశారా మన శశి నాకోసం వచ్చింది…ఈ అమ్మ కోసం వచ్చేసింది..చూడండి నేను చెప్పాను కదా నా బంగారం నన్ను విడిచి ఎక్కడికి వెళ్లిదని ఇప్పుడు చూసారా.. నమ్ముతారా..” అని తన ధోరణిలో తను చెప్పుకుంటూ వెళ్తుంది.. నాకేం అర్థం కాక నీలానే అయోమయ స్థితిలో పడిపోయా.. వెంటనే పక్కనే ఉన్న వ్యక్తిని చూడగానే చిన్నగా
” మరేం లేదమ్మా.. నిన్ను చూసి తన కూతురుని అనుకుంటుంది తప్పుగా అనుకోకు “అని చెప్పగానే ఏంటిదంతా గందరగోళంగా ఉంది అనుకుంటూ వెంటనే ఇదేమైనా ప్రాంక్ ఏమో అనుకున్నా కానీ మరు క్షణమే ఆవిడ కళ్ళలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమను చూసి నా ఆలోచన తప్పని అర్థమైంది అప్పుడు ఆ పరిస్థితుల్లో ఆమెకు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదని తప్పక నేనే ఒప్పుకోవాల్సి వచ్చింది
“అవునమ్మా నేనే…నీకోసమే వచ్చా ఎలా ఉన్నావ్ అమ్మా! ” అని అడిగా
” ఏమండీ! చూశారా మన శశి నన్ను అడుగుతుంది బాగున్నావా అని… ఎంత పెద్దది అయింది ….మీరు ఇక్కడే దాన్ని పట్టుకొని ఉండండీ మళ్ళీ ఎక్కడికైనా పారిపోతుంది..నేను ఆ దేవుడికి దండం పెట్టుకొని వస్తా” అంటూ చిన్న పిల్లల నన్ను ఆ వ్యక్తి చేతిలో పెట్టి ఆమె దేవుడికి నమస్కారం పెట్టుకోవడానికి వెళ్ళింది అమ్మ…
నా అయొమయం గమనించిన ఆ వ్యక్తి
“అమ్మ నీ పేరు???”
“నా పేరు మహిమ అంకుల్”
” క్షమించమ్మా….తను నా భార్య చిత్ర.. నా ఒక్కగానొక్క కూతురు ఈమధ్య మేము అందుకోలేనంత దూరాలకి  వెళ్ళిపోయింది…ఆ సంఘటన ఆ తల్లి హృదయం అంగీకరించ లేకపొతుంది ఇప్పుడు కూడా మా శశి అనుకునే నీతో అలా మాట్లాడింది..
శశి కూడా కొంచెం అటు ఇటు నీలానే ఉంది ..
మొదట నేను ఆశ్చర్యపోయాను కానీ నా కళ్ళ ముందే నా చేతులతో నా బిడ్డ దహనసంస్కారాలు చేసిన తర్వాత కూడా ఒక క్షణం నా కూతురేనేమోనని ఆశ్చర్యపోయాను అటువంటిది కూతురు పోయిన బాధలో ఈ ప్రపంచంలోనే లేకుండా బతుకుతున్న పిచ్చిది నిన్ను తన కూతురు అనుకోవడంలో తప్పు ఉందని నాకు కనిపించలేదు…
అమ్మా మహిమ! నీకు ఇబ్బంది కలిగి ఉంటే నన్ను క్షమించు తల్లి ”
” అయ్యో అంకుల్.. అలా అనకండి మీరు నా తండ్రి వయసు వారు మీరు నన్ను క్షమించండి అని అడగటం ఏంటి మీ పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను మీరు నన్ను  ఆశీర్వదించాలే తప్పా.. క్షమించమని అడగకూడదు.. అసలు ఏమైంది అంకుల్ శశికి ”
” శశి మా ఒక్కగానొక్క కూతురమ్మా ….ఎంతో గారాబం గా అల్లారు ముద్దుగా పెంచాము తన తల్లికి తానే సర్వస్వం…ఎంతో సరదాగా ఉండేవాళ్ళం.. శశి ఉన్నట్టుండి ఒక రోజు హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది…వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లగానే ఏవేవో టెస్ట్లు చేస్తున్నారు…అప్పుటిదాకా నవ్వుతూ ఉన్న పిల్లకి ఏమైందో.. ఎందుకు పడిపోయిందో అని ఒకటే భయం డాక్టర్ గారు చెప్పిన విషయానికి అక్కడిక్కడే కాలం స్తంభించిపోయినట్లు అయిపోయింది….చిన్నప్పటినుంచి హార్ట్ లో హోల్ ఉందని మరో రెండు రోజుల్లో ఆ ట్రాన్స్ప్లాంటేషన్ జరగకపోతే తను మాకు దక్కదనే విషయాన్ని చెప్పి వెళ్లిపోయారు….నాకేం చేయాలో అర్ధం కాలేదు తనకు సరిపడ హార్ట్ కోసం ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగాము మాకు డబ్బులకు కొదవ లేదు కానీ సమయానికి నా కూతురుని బ్రతికించుకొలేక పోయాము ….తనకి సెట్ అయ్యే గుండె దొరకకపోవడంతో నా శశి నా కళ్ళముందే మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది ఆ క్షణం నుండే అమ్మ నా చిత్ర ఇలా అయిపోయింది …
ఉన్న ఒక్క కూతురు వెళ్ళిపోయింది…ఇప్పటికీ తను ఉన్నట్లు చేస్తూ శశి మళ్ళీ వస్తుంది అని చెబుతూ ఉంటుంది…
తన ఆరోగ్య క్షీణించిపోతుంది ఇప్పుడు చిత్రను చూస్తుంటే భయమేస్తుంది అమ్మ ..కానీ నిన్ను చూసిన తరువాతే తన కళ్ళలో శశిని చూసినప్పుడు కలిగే  ఆనందం కనిపించింది…నా చిత్ర మళ్లీ మామూలు స్థితికి రాగలుగుతుంది అన్న నమ్మకం వచ్చింది….మహిమ నీకు అభ్యంతరం లేకపోతే అప్పుడప్పుడు ఇలా కనిపించి తన కూతురిలా కనిపించగలవా ఈ లోకంలో నాకు అది ,దానికి నేను తప్పా మాకు ఎవరూ లేరు “అంటూ బాధ గొంతు ని ఆపేయగా అలా నిలబడి పోతారు
“నాన్న!అలా అనకండి..అమ్మ ఆరోగ్యం కుదుటపరిచే బాధ్యత నాది…నా తల్లి ఆరోగ్యం నేను కాకుండా మరెవరు చూసుకోగలరు” అని నవ్వుతూ చెప్పగానే “మహిమ…ఇంత త్వరగా అర్థం చేసుకుంటావని అనుకోలేదు…నీ రుణం ఎలా తీర్చుకోవాలో తోచటంలేదు తల్లి”

@@@@

ఇదమ్మా జరిగింది….ఆ రోజు అలా జరిగిన తరువాత
ఇప్పుడిప్పుడే చిత్ర అమ్మ ఆరోగ్యం నిలకడగావుంటుంది….తన మానసిక స్థితి  మెరుగుపరచడం కోసమే ఆ తల్లిదండ్రులకు వాళ్ళ బిడ్డగా వెళ్లాను ఆక్షణంలో నేను చేసింది తప్పనిపించలేదు అమ్మా.. ఎందుకంటే నాన్న, నువ్వు నాకు ఎప్పుడు నేర్పించలేదు తప్పు చేయడం… ఈ విషయం మీకు చెబుదాం అనుకున్నాను కానీ మీరేమంటారోనన్న చిన్న సంశయంతో ఆగిపోయా…
మోహనరావు గారు మహిమ దగ్గరగా వచ్చి
“నువ్వు చేసింది ముమ్మాటికీ తప్పు కాదురా…ఇందులో మేము అనుకోవడానికి ఏముంది …నా చిట్టితల్లి ఎప్పుడూ బంగారమే…ఇంకో తల్లికి పునర్జన్మ ఇచ్చావురా నువ్వు ” అయోమయ మోము ఆనందంగా మారగా ఆనందబాష్పాలతో మహిమ నుదుటిన మద్దుపెట్టుకుంటారు..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!