మళ్ళా మళ్ళా

మళ్ళా మళ్ళా

రచన::మంగు కృష్ణకుమారి

ఎప్పుడూ భక్తులతో కళకళలాడే కొండమీద దేవాలయం.‌ కాస్త కిందన రావి చెట్టు కిందన తన బిచాణా అంతా పరిచేడు పోతురాజు. కొంచెం దూరంలో మల్లుదొర తన వనమూలికలన్నీ
‘పెద్ద పెద్ద గంపల్లో కొన్ని ‘చిన్న చిన్న’ బుట్టల్లో కొన్నీ ఉంచి దిక్కు చూస్తున్నాడు.

అక్కడకి ఆరడుగుల దూరంలో రామశాస్త్రి గారు నుదుటి మీద విభూతి రేకలు ధరించి, తెల్లటి బట్టలతో పంచాంగం చదువుతూ కూచుని ఉన్నారు.

కాషాయరంగు చొక్కా, నల్లటి‌జుట్టూ నల్లటివంటి రంగూ, పోతురాజు పంజరంలో చిలక‌ పక్క చూస్తూ హుషారుగా అరుస్తున్నాడు.

“రండి సారూ రండి. మా సిలక సానా గొప్పది. జోస్యం సెప్పిందంటే తిరుగు లేదు. మీ అబ్బాయికి పెళ్ళి సంబంధం కుదరలేదా?”

“మీ ఇంటికి వాస్తు దోషాలతో బాధ ఉందా?” “మీకు ఏళ్ళతరబడి కడుపు నొప్పి ఉందా?” మీ పిల్లలకి దిష్టి దోషం, అనారోగ్యం ఉన్నాయా?అన్నిటికీ మా చిలక చక్కగా జవాబులు
చెప్తుంది” పోతురాజు కేకలకి అందరూ అతనిపక్కే చూస్తున్నారు.

“అయ్యా, అమ్మా… ‘సిలకే కదా దీనికేటి తెలుసు?’ అనుకోకండి. మా నాన్నమ్మ సెప్పేది. దీని వంశం సానా గొప్పదిట. దీని తాత ముత్తాత సిలక రాములోరి దగ్గర సానా ఏడిసిందిట. ‘అయ్యా, సీతమ్మని ఎత్తుకు పోయేడయ్యా రాచ్చసుడు’ అని.
‘రండి రండి’ ” చీటీల కట్ట పట్టుకొని బిగ్గరగా అరిచేడు.

“ఈయాల దీని జోస్సం ఇంటే, ‘మల్లా మల్లా’ మీరే వస్తారయ్యా” మరో కేక.

“ఏమండీ చూద్దాం అండీ, మనవడికి ఎప్పుడూ కడుపునొప్పే…. చిలక ఏం చెప్తుందో” ఒకావిడ భర్త చొక్కా పట్టుకులాగింది. ఇలాగే ఆత్రతగా చాలామంది వచ్చేరు.

చిలక జోస్యం ప్రకారం కొందరు వనమూలికలు కొనేసేరు. కొందరు రామశాస్త్రి గారి దగ్గరే తాము చేయించాల్సిన పూజలు రాసుకొన్నారు.

కొందరు చిలక తల నిమిరి “ఔనే…. రాములోరిని మీ తాతలు చూసేరుటే” అంటూ తమ చేతులని కళ్ళకి అద్దుకున్నారు.

పోతురాజు హుషారుగా మల్లుదొరకేసి చూసేడు. జీన్స్ ఫేంట్ ల ఆడపిల్లలూ, మగపిల్లలూ చిలక జోస్యం చూపించుకుంటే, ఓ మధ్య వయసు ఆయన మాత్రం పెళ్ళాం చేయి
పట్టుకొని “ఇదంతా ట్రాష్ పద” అంటూ ఉంటే ఆవిడ చెయ్యి వదిలించుకొని మరీ చిలక దగ్గరకి వచ్చి కూచుంది.

వారం తరవాత:

కొందరు వచ్చేరు.
“ఏరా, నీ చిలక నిజాలే చెప్తుందన్నావు? ఇది చెప్పిన మూలికల కషాయం తాగి మావారికి కడుపునొప్పి తగ్గక పోగా తలనొప్పి మొదలయింది” ఒకావిడ.

“మా అబ్బాయికి వీసారాలేదు. నీ చిలక గొప్ప ఇహ ఎవరికీ చెప్పకు” ఒకాయన కేక

“మా ఇంట్లో‌పోయిన ఉంగరం మా ఆవిడ చుట్టాలేఅన్నావు. ఆవిడ చుట్టాలకి తెలిసి నానాతిట్లు తిట్టేరు. మా ఆవిడకీ నాకు మాటల్లేవు నీ చిలకవల్ల” మండిపడుతూ ఒకాయన.

ఇంకో ఇద్దరు కోపాలు ప్రకటించిన తరవాత పోతురాజు పక్కన నిలబడ్డ అతని తండ్రు చిన్నయ్య నవ్వి

‘అమ్మలూ, అయ్యలూ మాఓడు మీరంతా ‘మల్లా మల్లా’ వస్తారన్నాడు కదండీ… అలగే వచ్చేరుగా. ఈళ్ళతాత రాములోరికి సీతమ్మని రాచ్చసుడు
ఎత్తుకు పోయేడని సెప్పేడు గాని లంకకి తీసుకుపోనాడని సెప్పలేదు కదండీ…ఈ సిలక సానా నయం కదండీ! మరోపాలి ఈయాల మా
సిలక జవాబులు ఇనండి, తలనొప్పికి సానా మందులున్నాయి. ఆలి కోపం తగ్గించడానికి కూడా చీటీలో రాసుంటది” అన్నాడు.

అంతే అందరూ మాయం.

***

(మిత్రులారా, చిలక జోస్యాన్ని నమ్మేవాళ్ళని మా ఊళ్ళో చూసేను. చిలక జోస్యంతో పోయిన వస్తువు గురించి రెండు కుటుంబాలు కొన్నాళ్ళు మొహాలు చూసుకోలేదు)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!