కనిపించే దేవుళ్ళు

కనిపించే దేవుళ్ళు

రచన::పి. వి. యన్. కృష్ణవేణి

రఘు ఫోన్ రింగ్ అవుతుంటే, లిఫ్ట్ చేశాను.

అవతలి నుంచీ మేడమ్ మీరా!!!! డాక్టర్ గారు లేరా!!! అంటూ హడావుడిగా వినిపించింది ఓ స్వరం.

నేను ఈవిడకు ముందే తెలుసా!!! మేడమ్ అని సంభోధిస్తొంది ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండానే.. అనుకున్నాను.

వెంటనే.  … హెలో మేడమ్, మీరు సీత కదా!! అంటే హీరోహీన్ సిగ్గుపడుతూ మీకెలా తెలుసు??? అంటుంది

డాక్టర్ గారు చెప్పారు… ఆరోజు.. ఆరోజు మా పాప బర్త్ డే అంటూ ఫ్లాష్ బాక్ చెప్తుంది.

ఆ సన్నివేశంతో హీరో మీద ప్రేమ పెరిగిపోతుంది ఆ సీత గారికి. ఇప్పుడు ఈ ఫోన్ కాల్ తో నేను కూడా అలా రియాక్ట్ అవ్వాలా అనేది నా అనుమానం…

స్నానం చేస్తున్నాడు, ఒక పావుగంట ఆగి చెయ్యండి అని చెప్పి ఫోన్ పేట్టేశాను.

రఘు ఏంటి నీకు హాస్పిటల్ లో లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ అనుకుంటాను అంటూ నవ్వాను.

జరిగింది చెప్పాను. ఏమి లేదులే….. ఈ రోజు వాళ్లకు అపాయింట్మెంట్ ఇచ్చాను అన్నాడు.

టైం అవుతోంది అంటూ టిఫెన్ చేసి బయలుదేరాడు. నాకు బాగా బోర్ కొడుతోంది రఘు… అన్నాను.

నవ్వి ఊరుకున్నాడు. ఇంకేమి చెయ్యలేక…

మామూలుగా అయితే ఈ టైంకి నేను కూడా రఘుతో కలసి, బయలుదేరి వెళ్లాలి. కానీ, బయట కరోనా వల్ల, కడుపులో బేబీకి ఏమైనా ఆపద వస్తుందేమో… అందునా నేను కూడా ఓ ఫిజికల్ డాక్టర్నే అవ్వటం వల్ల అనేకమంది రోగులని కలవవలసి వస్తుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.

కానీ, ఎప్పటి వరకూ ఈ పరిస్థితి. ఏమో… చూడాలి

కంటికి చూపు అందం
మనసుకు అదుపు అవసరం

కోరికలు ఎప్పుడూ గుర్రాలే అవుతాయి
కానీ వాటికి కళ్ళేం వేయాలి మనం

పరిమితి కలిగిన ఆశలు
మనసున ఉన్నవి వేల కోటలు

అనుభంధం ముఖ్యం
చేరుకునే లక్ష్యం పదిలం

నా ఆలోచనలతో బుర్ర వేడి ఎక్కిపోతోంది. ఇలాగే ఉంటే లాభం లేదు అనిపించింది.

లేచి టీ పెట్టుకున్నాను. బయట చిన్నగా వాన చినుకులు మొదలయ్యాయి. వేడి వేడిగా టీ, బిస్కెట్ తెచ్చుకున్నాను. టీ. వీ పెట్టుకున్నాను. యాధాలాపంగా చానెల్ మారుస్తూ ఉన్నాను.

ఆశలు ఉన్నాయి ఎన్నో రకాలు
చేస్తాయి మనల్ని అవే బానిసలు

ప్రేమలో ఉండే అనుభవం
అనుభవాన్ని ఆస్వాదించడం

ప్రణయం పంచి ఇవ్వడం
ప్రేమను తిరిగి పొందడం

రూపు తెలియని ఓ చిన్న జీవికై
ఎదురుచూపులు, ఆ పసికందుకై
పడిగాపులు…ఊహల పల్లకీలో
భవిష్యత్ పై మరెన్నో ప్రణాళికలు.

జీవితమే ఒక గొప్ప అనుభవం…

ఏదో ధ్యాసలో టి.వి చూస్తున్న నన్ను ఒక సినిమా ఆకట్టుకుంది. ఏదో డాక్టర్లకు సంబంధించిన సినిమా అది. పసి పిల్లల మిస్సింగ్ కేసులో వాల్టెర్ అనే పోలీసు అధికారి చేసే దర్యాప్తు పైన ఈ కథా సారాంశం అల్లుకుని ఉంటుంది. చాలా బాగుంది సినిమా  …

ఏ వ్యవస్థలో అయినా స్వార్థపరులు, నీతి పరులు, కష్ట జీవులు, ఆశా పరులు ఉంటారన్నది నిజం. బుద్దెరిగి ప్రవర్తించడమే మనిషి లక్షణం.

ఏది ఏమైనా… నా మనసు మాత్రం అలజడికి గురైంది. ఇప్పటి వరకు భాద్యత కలిగిన ఒక డాక్టర్ ని కావచ్చు. కానీ, మనిషిగా పుట్టి, మరో సరికొత్త జీవిని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించడం అనేది ఇతర ఏ వృత్తిలకు తీసిపోని ఒక అపురూపమైన భావన అని నాకు ఇప్పుడు తెలుస్తోంది.

అపురూపమైన నా మది భావన

పదిలంగా దాచుకోవలసిన ఆ అనుభవం

తెలియని ఆనందం కలిగిస్తోంది

నా మనసు పులకించి పోతోంది

నా ఆలోచనలలో నేను ఉండగానే నాకు చిన్నగా
పెయిన్స్ రావటం మొదలయినాయి. కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా 7 నెల కూడా నిండలేదు అని ఆలోచిస్తూ ఉన్న నేను కళ్లు విప్పెసరికి హాస్పిటల్ బెడ్ పైన ఉన్నాను.

నేను కళ్లు విప్పటం చూసిన అమ్మ, పక్కనే ఉన్న రఘు నా దగ్గరకు వచ్చారు. దూరంగా ఉన్న నాన్న నావైపే చూస్తున్నారు.

నేను పైకి లేవటానికి ప్రయత్నిస్తున్నాను. కదలలేని పరిస్తితి. నా కళ్లు వర్షించటానికి సిద్దంగా ఉన్నాయి. ఒంట్లో ఓపిక లేదు, గుండెల్లో భాదగా ఉంది. నాకు ఏమైందో తెలియటం లేదు.

ఆమ్మ నన్ను పట్టుకుని, దిగులు పడకు… నీకు, నీ పాపకు ఏమీ జరగలేదు.  బాగా నీరసంగా ఉన్నావు. డెలివెరీ చేసేద్దాము అంటున్నారు డాక్టర్లు. నువ్వు కాంషీయస్లోకి వస్తే, ఆపరేషన్ చేస్తారు అని వివరంగా చెప్పింది.

రఘు కూడా దగ్గరగా వచ్చీ, నా భుజం తట్టాడు.

సంవత్సరం క్రితం కూడా ఇదే హాస్పిటల్లో మంచి  ఆక్టివ్ డాక్టర్ అనే పేరు తెచ్చుకున్న నేను, డీహైడ్రేషన్ వల్ల ఇలా పేషెంట్ని అయ్యాను. నా మనసు భాదతో మూలిగింది.

నేను స్పృహలోకి రావడం తెలిసి, గైనకాలజిస్టు సుమ వచ్చీ, నన్ను టెస్టు చేసి, లోపల బేబీకి ఆపద కలగకుండా, డెలివరీ చెయ్యటమే మంచిది అని నిర్ధారణ చేసింది.

ఆ రోజు, నేను జీవితంలో ఎప్పటికి మరచిపోలేనేమో!!!! ఒక డాక్టర్ గా ఉన్న నాకే మనిషి పుట్టుక చూసి చాలా ముచ్చటేసింది. అబ్బురంగా అనిపించింది.

నా శరీరంలో ఇంకో శరీరం భాగమైంది

నా కలల రూపం ఉదరంలో ఇమిడి ఉంది

గుర్తు తెలియని ప్రాణికై మెదడు నిండింది

నా ఊపిరి తనకు ప్రాణం పోసింది

ఆ పసి ప్రాణి ఆకలి నాది అయ్యింది

ఈ జగత్తు మొత్తం నాకు అద్భుతంగా తోచింది

ఆక్కడంతా హడావిడి వాతావరణం నెలకొని ఉంది. నర్స్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గది దాటి వేరే ప్రపంచం ఊహాకి కూడా అందట్లేదు. నా మనసులో ఆలోచనలు అక్కడే ఆగిపోయాయి.

ఇంతలో సుమ రానే వచ్చింది. ఏమీ కాదు. అంటూ కళ్ళతోనే ధైర్యాన్ని చెప్పింది. ఎవరు ఎంత గొప్ప స్తితిలో ఉన్నా, ఎదుటివారి కష్టాన్ని అర్దం చేసుకున్న వాళ్లే… నిజమైన గొప్ప వాళ్లు.

స్నేహం విలువ, ప్రాణం విలువ తెలిసిన సుమ చేతిలో నేను ఉండగా, నాకు చింత ఏలా అనుకుంటూ రిలాక్స్ అయ్యాను.

ఏ మాయ చేసేను ఆ దైవం

ఎంత ప్రేమతో నిండెను నా హృదయం

నన్ను మాయలో పదవేసేనా క్షణం

ఇది నిజంగా నాకు లభించిన ఓ వరం

అలా ఆలోచిస్తూ బయటకు చూసిన నాకు ఆమ్మ, నాన్న, రఘు, శ్యామ్ ( మా అన్న) కనిపించారు.

కన్నప్రేమ నా కష్టాన్ని చూసి చలిస్తోంది

భాద్యతతో కూడిన ప్రేమ మౌనంగా విలపిస్తోంది

తోడు పంచుకున్న ప్రేమ కొత్త జీవితం కోరుకుంటోంది

కలసి పెరిగిన ప్రేమ నా రాకకై ఎదురు చూస్తోంది

నా మేలు కోరే ప్రేమ హృదయం చుట్టూ అల్లుకుంటోంది

భరోసా తానై నిలచెనాప్రేమ, ఆప్యాయతను మదిలో నింపింది

వృత్తి ధర్మంగా మరో జీవితాన్ని మాకు పరిచయం చేస్తోంది

నా చూపుకు విలువ వచ్చేను

నా మనసుకు హాయి చిక్కెను

నా మది కోరిక నెరవెరెను

నా తపం ఫలము నాకు దక్కేను

ఇదిగో హేమ, నీ బేబీ అంటూ సుమ పాపని నాకు చూపించింది.

లెలేత సూర్య కిరణాలు అల్లుకున్నట్ట్లగా ఆ రంగు

అలసిసొలసి పడుకున్నట్ట్లుగా మూసుకున్న ఆ చిన్ని కళ్ళు

కల్మషాలు తెలియని, కల్లాకపటం ఎరుగని ఓ బొసినవ్వు

మూసిఉంచిన గుప్పిట్లో నా కోసం మోసుకు వచ్చిన వరాలు ఎన్నో

చాలా అద్భుతం ఈ సృష్టి. అనుకుంటూ ఉండగానే… నాకు మత్తు ఆవహించింది. హాయిగా నిద్రలోకి జారుకున్నాను.

ఒక పూట మొత్తం నిద్రపోయిన నేను, రాత్రి నిద్ర లేచాను. అదిగో ఆమ్మ నిద్ర లేచింది. ఇంకా అమ్మాకూతురు రాత్రంతా జాగారం చెయ్యండి.

పగలు పుట్టిన పిల్ల కదా!!! రాత్రంతా మేలుకుని ఉంటుంది అంటూ పాపని నా పక్కన పడుకో పెట్టింది. ఇంతలో రఘు కూడా క్యారెజ్ తీసుకుని వచ్చాడు.

చాలా సేపు, పాపతో గడిపిన తర్వాత, అదృష్టం బాగుంది కాబట్టి పిల్ల ఆరోగ్యంగా పుట్టింది. నెల తక్కువ పిల్ల అయినా, తగిన బరువుతో ఆరోగ్యంతో జన్మించింది. లేదంటే… ఈపాటికి ఏ బాక్స్ లోనో పెట్టాలి అనేవారు.

ఇప్పటికైనా సమయానుకూలంగా ఏదో ఒకటి తింటూ, టైంకి భోజనం చేస్తూ ఉండు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే, నీ పిల్లలకు బలం అంటూ నవ్వింది అమ్మ.

ఇంతలో బయట నుంచి ఏవో అరుపులు. అటు వైపు చూశాము. మా మాటలకు అడ్డుకట్ట పడింది.

ఆ అరుపులు వినబడుతున్నాయి.

“రెండు రోజుల నుంచి చేస్తున్నారు వైద్యం, అంతా నార్మల్ గానే ఉంది అని చెప్పారు. ఇప్పుడేమో చనిపోయాడు అంటున్నారు. నిండా 40 ఏళ్ళు కూడా దాటని వాడు, ఏ సమస్యతో చనిపోయాడో మీకు తెలియదా!!! మా కుటుంబం మొత్తం రోడ్డున పడాలి. అతగాడు చనిపోతే…” అంటూ ఓ  ఆడ గొంతు రోదిస్తోంది.

మల్టీ స్పెషాలటీ హాస్పిటల్ అవ్వటం వల్ల, ఎంత ఆశపడి వచ్చారో… అతని క్షేమం కోసం.

ఒకరికి అలా…

ఇంకొకరికి ఇలా….

అది కేవలం రాత…

అది తెలుసుకోవాలి మనమంతా…

తరువాత కొన్ని రోజులకు తెలిసింది ఏమిటంటే..

ఆ రోజు వైద్యుడు ధనానికి ఆశపడి, రెండు రోజులుగా శవానికి వైద్యం చేసాడుట. ఆ వార్త తెలిసిన తర్వాత, అమ్మో… సుమ కూడా వాడిలాగా ఆలోచించి ఉంటే… ఎంత ఆ వృత్తిలోనే ఉన్నా కూడా… ఆ ఆపద సమయంలో… మేము ఏమీ చెయ్యలేక పోయే వాళ్ళం. అదే మాట రఘుతో ఆంటే.. ఎక్కువ ఆలోచించి, ఆరోగ్యం పాడు చేసుకోకు. ఏది జరిగినా మన మంచికే.. అనుకో అన్నాడు.

మేము చేసే వృత్తి మీద నాకు చాలా గౌరవం పెరిగింది.

వైద్యో నారాయణా హరి

వైద్యుడే ఆ నారాయణుడు

డబ్బుకై కారాదు యముడు

వృత్తికై జీవితం అర్పించిన ఘనుడు

ప్రేమ కురిపించే ఉత్తముడు

కారాదు స్వార్ధానికై మూర్ఖుడు

ధర్మానికి కట్టుబడి ఉండే ఓ ప్రేమికుడు

రోగుల గుండెల్లో అతడు ఒక  దేవుడు

కదిలే దేవుళ్లే ఆ వైద్యులు

ఆ దైవ బలంతో ఎన్నో అద్భుతాలను సాధించాలని ఆశిస్తూ…. రఘుని హాస్పిటల్ కు సాగనంపాను.

నేను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్న, నందనవనం లాంటి నా క్లీనిక్ లోకి అడుగు పెట్టాను. నా బుజ్జి పాప అపూర్వ తో సహా…. అపూర్వ ని ఎత్తుకుని..

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!