మనసు పలికే

మనసు పలికే

రచన : సుశీల రమేష్.M

జీవిత ప్రయాణంలో ఎవరికి ఎవరు ఏమవుతారు తెలియదు.ప్రేమ ప్రయాణంలో మనసు మనసు మమేకం అయినప్పుడు ఆ జీవితం ఆనందదాయకం అవుతుంది.
రైలు ప్రయాణం లో ఎంతోమందిని చూస్తుంటాం. కొంతమంది స్నేహితులవుతారు. కొంతమంది సుఖ దుఃఖాలు పంచుకుంటారు. కొంతమంది విడిపోతారు, కొంతమంది జంటలుగా కొత్త జీవితాలను ప్రారంభిస్తారు.

సాగర్ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సెలవు తీసుకుని సొంత ఊరికి వచ్చి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళుతున్నాడు. విజయవాడ రైల్వే స్టేషన్ లో తను ప్రయాణించే రైలు కోసం వేచి చూస్తున్నాడు.

నరసాపురం నుండి రైలు వచ్చి ఆగింది విజయవాడలో. సాగర్ రైలు ఎక్కబోతుండగా లోపలినుండి చూడచక్కని చీరకట్టులో తెలుగింటి
పడుచులా చెక్కిన శిల్పం లాంటి అమ్మాయి చిన్న బాబు తో దిగుతుంది.

ఆ అమ్మాయిని చూసిన సాగర్ మనసు తనకు తెలియకుండానే చేజారి పోయింది కానీ అమ్మాయి పక్కన బాబు ని చూసి నీరుగారిపోయింది.

రైలు ఎక్కి వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు. కిటికీలోనుండి ఆ అమ్మాయి చిన్న బాబు వాంటింగ్ చేసుకున్నాడు కాబోలు కడుతుంది.
శుభ్రంగా కడిగి తీసుకొచ్చి సాగర్ ఎదురు సీట్ లో కూర్చుంది ఆ అమ్మాయి. బాబు మమ్మీ అంటూ ఇంకొక ఆమె దగ్గరికి వెళ్లాడు. ఓహో అయితే బాబు ఆమె కొడకా అనుకున్నాడు మనసులో సాగర్.

అక్కడే నా పక్కన కూర్చున్న పెద్దావిడ బాబు వాళ్ళ అమ్మతో మాట కలిపింది. ఏమ్మా ఇందాక నుంచి చూస్తున్నాను బాబు ను పట్టించుకోవేంటి అని పెద్దావిడ అడుగుతుండ గానే మళ్లీ రైలు ప్రయాణం మొదలైంది.

ఏదో ఆలోచిస్తున్న బాబు తల్లి ఆ ఏమైంది బాబు కు అంటూ అడిగింది.. ఏంటమ్మా ఆ పరధ్యానం
బాబు వాంటింగ్ చేసుకున్నాడు అదిగో ఆ అమ్మాయి అనగానే నా పేరు స్రవంతి అంటీ అన్నది. తీసుకెళ్లి కడిగింది. అని చెప్పింది పెద్దావిడ.

థాంక్యూస్రవంతి అని చెప్పింది బాబు తల్లి చిత్ర. అది సరే కానీ మిమ్మల్ని అక్క అని పిలుస్తాను అన్నది స్రవంతి. దానిదేముంది పిలువు అన్నది చిత్ర.
నువ్వెందుకు వచ్చినప్పటి నుండి పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నావు అని అడిగింది స్రవంతి.

స్రవంతి పేరు బాగుంది అందంతో పాటు సాయం చేసే గుణం అందరితో కలిసిపోయే మనస్తత్వం అనుకుంటున్నాడు సాగర్ మనసులో.

ఏం చెప్పను స్రవంతి కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అంటారు. నేను ఎంబీఏ చేశాను బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను. పెళ్లి అయిన దగ్గర నుండి మా ఇంట్లో నాకు స్వతంత్రం లేదు. ఏది కొనాలన్నా ఏమి వండాలి అన్నా, ఏం చేయాలన్నా అమ్మని అడుగు అంటాడు నా భర్త రవి. అంతగా అమ్మని ఇష్టపడేవాడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం. అందుకే నా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకో నా మనసు బాధగా పరధ్యానంగా ఉంది అది ఎందుకు అర్థం కావడం లేదు అని చెప్పింది చిత్ర.

చూడు చిత్రక్క పెళ్లవగానే కోడలు గా పెత్తనం చెలాయించాలను కోవడం తప్పు, నీ భర్త తన తల్లి ని అడిగి తెలుసుకో అన్నాడంటే ఆవిడకి ఇంటి పనుల్లో అవగాహన అనుభవం ఉన్నాయి కాబట్టి. అంతేగాని నువ్వు తెలివి తక్కువ దానివి అని నిన్ను తక్కువ చేసి చూడడం లేదు. నువ్వు ఈరోజు కోడలివి, రేపటి అత్తవి, నువ్వు నీ అత్త దగ్గర నేర్చుకున్నట్టే రేపు నీ కోడలు నీ దగ్గర నేర్చుకుంటుంది.

” చదువుకు తగ్గ సంస్కారం ఆలోచనకు తగ్గ అవగాహన ఓర్పు సహనం ఉండడం లేదు ఈ రోజుల్లో చాలా మందికి.”

“సూటి పోటి మాటలతో, అర్థంలేని అనుమానాలతో, చిన్నాపెద్ద మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు పెళ్లైన ఆడవాళ్ళు.”

నీ మనసు ఎందుకో బాధగా ఉంది అన్నావు కదా అంటే నీ భర్తను వదిలి రావడం నీ మనసుకు ఇష్టం లేదు. కానీ నీ పంతాన్ని నెగ్గించుకోవాలని వచ్చేసావు. అని అడిగింది స్రవంతి. ఏమో స్రవంతి
నువ్వు చెప్తుంటే నాకు అంతా అయోమయంగా ఉంది నిజంగా నన్ను పల్లెత్తు మాట అనలేదు మా ఇంట్లో అని చెప్పింది చిత్ర.

చిత్ర ఎందుకమ్మా అంత అయోమయంగా ఆలోచిస్తావు, స్రవంతి చెప్పింది నిజం, చిన్నదానివైనా చక్కగా చెప్పావు స్రవంతి. నాకు ఇంకో కొడుకు ఉండి ఉంటే నిన్ను కోడలిగా చేసుకునేదాన్ని అంటుంది పెద్దావిడ.

చూడు చిత్ర నీ అత్తగారి ఇంట్లో నీ అత్తయ్య నీకు ఉత్తమ స్నేహితురాలు ఆవిడ మనసు గెలవాలి నువ్వు కోడలిగా. నీ మాటల్ని బట్టి నిన్ను సంసార బాధ్యతలు నేర్చుకో మంటున్నాడు నీ భర్త. అత్తను అమ్మగా నువ్వు భావిస్తే చిన్నతనం ఏమీ లేదు ఆవిడను అడిగి తెలుసుకున్నంత మాత్రాన అని. చెప్పింది పెద్దావిడ.

అంటి నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎంత ఫులిష్ గా బిహేవ్ చేశానో, ఇప్పుడే మా వారికి కాల్ చేసి క్షమించమని అడుగుతాను. అంటుంది చిత్ర. అక్కా ఒక విషయం చెప్పనా నా ఊహ నిజం అయితే నీ భర్త ఇక్కడే ఉండి ఉంటాడు కావాలంటే కాల్ చేసినప్పుడు అడుగు అంటుంది స్రవంతి.

కాల్ చేసింది చిత్ర తన భర్తకు.

ఏవండీ నన్ను క్షమించండి. నేనే తొందరపడి అనరాని మాటలు అనేసాను మిమ్మల్ని మీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను అంటూ చిత్ర ఏడుస్తూ చెప్తుంది. ఊరుకో చిత్ర ఏడవద్దు కన్నీళ్లు తుడుచుకో అంటాడు రవి. ఆ శబ్దం ఏంటండీ అని అడుగుతుంది చిత్ర. సోరీ చిత్ర
నేను ఇక్కడే రైల్లో ఉన్నాను. అంటూ చిత్ర వాళ్ళ దగ్గరికి వస్తాడు రవి. నిన్ను అనుమానించి రాలేదు చిత్ర బాబుతో ఒక్కదానివే ఎలా వెళ్తావు అని భయంతో వచ్చాను అంటాడు రవి. లేదండీ తప్పు నాదే నన్ను మన్నించండి అంటుంది చిత్ర.

అమ్మాయి చిత్ర మన్నించగలిగేది, మనసు ఇవ్వగలిగేది భరించగలిగే ది భర్తే తల్లీ, భర్త మనసెరిగి నడుచుకోవడమే భార్య కర్తవ్యం. అంటుంది పెద్దావిడ. థాంక్యూ ఆంటీ, థాంక్యూ స్రవంతి, చిన్నదానివైనా నాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పావు నా కళ్ళు తెరిపించావు అంటూ రవి ని అందరికీ పరిచయం చేసింది చిత్ర.

ఈ మాటల్లో పడి బాబును పట్టించుకోలేదు. ఎక్కడున్నాడు అంటూ వెతుకుతుంటే సాగర్ ఒడిలో నిద్రపోతున్నాడు. అయ్యో అని చిత్ర బాబును చిత్ర తీసుకో బోతుంటే , పరవాలేదు సిస్టర్ కదిపితే బాబు లేస్తాడేమో అంటాడు సాగర్.

అవును స్రవంతి నువ్వు ఎలా కనిపెట్టావు రవి ఇక్కడే వున్నట్టు అని అడిగింది పెద్దావిడ. అదా ఆంటీ చిత్ర అక్క ఇక్కడే ఉంది కానీ మనసు ఇక్కడ లేదు, ఈగో తో వచ్చేసింది కానీ, ఇంట్లోనే కాసేపు ఆలోచించుకో లేకపోయింది.

” ఎప్పుడైతే రెండు మనసులు మమేకం అవుతాయో అప్పుడు దగ్గరున్న దూరంగా ఉన్నా ఒక మనసు ఇంకో మనసు కోసం తపిస్తుంది.”

అలాంటప్పుడు మనిషి ఇక్కడ ఉన్నా తన ఆలోచనలు మాత్రం అవతలి మనసుతో మాటలు కలుపుతుంది.

నేను చెప్పింది అబద్ధం అయితే రవి గారిని అడగండి ఆంటీ అంటుంది స్రవంతి. ఎస్ స్రవంతి చెప్పింది నిజం, నేను ఈ రైలు ఎక్కేంతవరకు నా మనసు మనసులో లేదు అంటాడు రవి.

అది సరే స్రవంతి నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగింది పెద్దావిడ . ఆంటీ నేను బీటెక్ చేశాను జాబ్ వచ్చింది. జాయిన్ అవ్వడానికి హైదరాబాద్ వెళుతున్నాను అంటుంది స్రవంతి.
ఏదేమైనా స్రవంతి ఎంత చక్కగా చెప్పావు చిత్ర కు మనసు నొప్పించకుండా అంటుంది పెద్దావిడ. అది ఆంటీ మాది ఉమ్మడి కుటుంబం నాన్నగారు చెప్పే మాటలు నేను గమనించే దాన్ని అందుకే చెప్పగలిగాను. నాన్నగారు ఇంటి పెద్దగా మా ఇంట్లో ఏ సమస్య వచ్చినా కూడా ఎవరి మనసు నొప్పించకుండా హుందాగా చెప్పేవారు ప్రతి విషయాన్ని అని చెప్పింది స్రవంతి.

అంతా ఒకరు ఫోన్ నెంబర్లు మరొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. మాటల్లోనే తెల్లవారుజామున నాంపల్లి చేరుకుంది రైలు. అందరూ మళ్ళీ కలుద్ధామంటూ చెబుతూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. సాగర్ మాత్రం తన మనసులో మాట స్రవంతికి చెప్పలేకపోయాను అంటూ బాధపడుతున్నాడు.

ఒక సంవత్సరం తర్వాత పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతుంది, చిత్ర రవి దంపతులు పెద్దావిడ కుటుంబం, పెళ్లి కి వచ్చారు.
నూతన వధూవరులను చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ జంట మరెవరో కాదు స్రవంతి సాగర్. పెళ్లి బాగా జరిగింది. భోజనాలు చేశాక, అవును స్రవంతి నువ్వు సాగర్ ని ప్రేమించావా అని అడిగింది పెద్దావిడ. ప్రేమించాను కానీ చెప్పలేదు ఆంటీ, అతని వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియక..
ఎదురుగా అమ్మాయి కూర్చుంటే ఎన్ని వెకిలి వేషాలు వేస్తారు ఈ రోజుల్లో అబ్బాయిలు. కానీ సాగర్ రూపమే కాదు బిహేవియర్, బాధ్యత కూడా నాకు నచ్చింది. ఆ రోజు మనం మాటల్లో పడి బాబును పట్టించుకోలేదు, కానీ సాగర్ బాబు ని ఎత్తుకొని నిద్రపుచ్చిన తీరు నా మనసుని దాటి పోలేదు , అప్పుడే అనుకున్నాను పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అబ్బాయిని చేసుకోవాలని. సాగర్ ప్రేమించాడు కానీ చెప్పలేదు. నేను చెప్పిన తర్వాతే చెప్పాడు నాతో అని చెప్పింది స్రవంతి. వచ్చినవారంతా వెళ్లిపోయారు.

నాలుగు రోజుల తర్వాత రైలు ప్రయాణం లో ఫస్ట్ క్లాస్ఏ సి భోగిలో
పెళ్లయిన సాగర్ స్రవంతి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. స్రవంతి నీకు ఎలా తెలిసింది నేను నిన్ను ప్రేమిస్తున్నానని అని అడుగుతాడు సాగర్. మీ కళ్ళలో ఆరాధనా భావం నా మనసును తట్టి లేపింది. ఇన్నేళ్లు
ప్రేమకు దూరంగా ఉన్నా నా మనసు నీ మనసుతో ఆ రోజే మమేకం అయ్యింది. కానీ మీరు ఏం మాట్లాడక పోయేసరికి నేను మిన్నకుండి పోయాను.
రైలు ప్రయాణంలో మనసులోని ప్రేమ పదనిసలు మొదలయ్యాయి ఆరోజే అందుకే రైలు దిగిన తర్వాత
అందరూ వెళ్ళాక నేను వెనుకకు వచ్చి నా మనసు పలికే మాటల సంగతి మీకు చెప్పాను అంటూ సాగర్ గుండెలో ఒదిగిపోయింది స్రవంతి.

***సమాప్తం***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!