మరపురాని రోజులు

మరపురాని రోజులు

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: యాంబాకం

ప్రియాతి ప్రియమైన మా మాస్టర్ కు అనేక వందనములతో వ్రాయు “ప్రేమలేఖ” సార్..! మాకు మీరు నేర్పిన పాఠాలు, చెప్పిన మాటలు ఇప్పటికి మా గుండెలో నిలిచి పోయాయి సార్. సార్ మీ దగ్గర స్టూడెంట్గా ఉన్నా ఆ ఐదు సంవత్సరాలు ఒక మైకంలో ఒక ప్రేమ లోకంలో మమ్ములను ఉంచారు. మీరు అందరిలో నన్ను “ఓరే యాంబాకం” అని పిలుస్తుంటే నామనస్సు లేడి పిల్లలా చెంగ్, చెంగ్ అంటూ ఎగిరేది. మీరు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి నాకు క్యారేజ్ తెపోరా…అని చెప్పేటప్పుడు నేను హరికృష్ణ ఒకరికి ఒకరం పోటీపడి పరుగెత్తే వాళ్ళం మీకు క్యారేజ్ తేవడం మాకు భలే సరదాగా గా ఉండేది సార్.. మీరు ఇంటి నుంచి బజారుకి వచ్చినప్పుడు మీరు అలా పంచెను ఒక అంచు చేతిలో పట్టుకొని నడుస్తూ పోతుంటే కనిపించిన దూరం నుంచి మీకోసం పరుగున వచ్చి నమస్తే సార్ అన్నప్పుడు ఏమిరా! యాంబాకం అని భుజం తట్టినప్పుడు నాకు వెయ్యి ఏనుగుల బలం ఉన్న భీముడననిపించేది. మీరు పాఠాలు చెప్పుతుంటే ఎంత సేపు ఐనా వినాలనిపించేది, మీరు 5వ.తరగతిలో చెప్పిన సమం వర్షపాతం, గరిబినాభి, స్థానం గురించి, ఇప్పటికి గుర్తు, జీర్ణక్రియ, 2వ. తరగతిలోని జడివాన, ఒకటోవ తరగతిలో అమ్మ, ఆవు, ఇవేకాక నిద్రలేవగానే దేవునికి నమస్కారించి బొగ్గు పొడి, ఉప్పు వేసి పండ్లు పొడి ఎలా తయారు చేయాలో, కళ్ళును శుభ్రపరుచు కోవటం గురించి డబ్బులు ఉండీ లో వేసుకోవడం, ఉదయం బడికి శుభ్రంగా రావడం పాఠాలు చదివే మార్గం మాకు చూపడం, ప్రతి సాయంత్రం ఆటలు ఆడించటం పాటలు పోటీలు పెట్టడం సెలవులకు ముందు జరిగే వార్షికోత్సవంలో మాకు వేషాలు వేయించడం ఒకసారి నా చేత “అమ్మ కడుపు నొప్పి” అన్న నాటకం వేయించి మా గ్రూప్ కు మొదటి బహుమతి కూడా ఇప్పించారు. మాకు మీలాంటి మాస్టర్ దొరకడం నిజంగా పుణ్య ఫలం మేము ధన్యులం, మీరు పిల్లలందరిని టూర్ తీసుకొని మన ఊరి పక్కనే ఉన్న దుర్గం కోన చూపించిన మధుర జ్ఞాపకాలు మాకు హృదయాలలో అలలులా మెదలుతూనే ఉంది.
మాకు దేవుడు ఇచ్చిన వరం మా వీధిబడి చదువులు మీతో గడవటం మాకు గర్వంగా ఉంది. మీరు అప్పుడు అంటూ ఉండే వారు మీరు ప్రయోజకులు అవుతారురా! అని మమ్ములందరినీ మంచి మనస్సుతో దీవించేవారు అందుకే ఈ రోజు మీ దీవెనలతో “లాయర్” ఐ గర్వంగా మిమ్ములనే పూజిస్తున్నాను. మా మాస్టర్ ఇప్పుడు ఉంటే నా భుజం కాదు అతని హృదయానికి హత్తు కొనే వారు. మా మాస్టర్ ఏ స్వర్గంలో ఉన్నా మా స్టూడెంట్ లందరిని దీవిస్తూనే ఉంటాడని నా మనసు చెబుతుంది. ఆరోజు మీ దగ్గరకి స్టూడెంట్ గా వచ్చినప్పుడు మీరు ఎంత వయస్సు లో ఉన్నారో ఇప్పుడు నేను ఆ వయసుకు వచ్చేసాను సార్. జీవితం ఎంత గొప్పది. భూమి గుండ్రంగా ఉంది తిరిగి అక్కడకే వస్తుంది అన్న సామెత లా ఉంది కదా! సార్..! మన స్కూల్ ల్లో ఉదయం మీరు అందరికన్న ముందుగా వచ్చేవారు. మాచేత గేటు తాళం తీయించేవారు. అది మేము ఏమైనా మిస్ అవుతామేమో అని త్వరగా వచ్చేవారము. బడిని తరగతులను శుభ్రం చేయించేవారు గ్రౌండ్ ను చిమ్మించి జెండా ఎగరేసి ప్రార్థనలు చెప్పించి అందరిని క్రమశిక్షణతో క్లాస్ రూములోకి పంపే వారు. తప్పుచేసిన వారిని హితవు చెప్పి కొందరికి గోడ కుర్చీ వేయించే వారు. మాతో ఒకరిగా క్లోజ్ గా ఉండేవారు. అందుకే మీరంటే మాకు అపారమైన గౌరవం విశ్వాసం నమ్మకం ఉండేది. ఒక సారి ఒక పాఠం చెప్పుతుండగా నేను పక్కనే ఉన్న కాశీమ్ తో మాట్లాడు తుండగా మీరు కోపంతో ఓరే  యాంబాకం! అని అరిచారు, గుండె ఆగినంత పని అయింది. ఇప్పుడు నేను చెప్పే పాఠం ఏందో చెప్పు అని కోపంగా మీరు అరచినప్పుడు నాకు నిక్కర్ ల్లో తడిసిపోయింది. మీరు మా బడికి ఒక దైవంలా వచ్చారు. మా పక్కింటి రమేష్ బాబు, రవిబాబు, చంద్ర, మునెమ్మ, సన్యాసి, రాంబాబు ఇలా మా వీధిలో ఉన్న పిల్లలంతా కాళీగా ఉన్నప్పుడు. మీ గురించే చెప్పుకొనే వారం, ఆదివారం మీ ఇంటికి రావాలనిపించేది. మా మనసులో మా ఆలోచనలో మీరే కనిపించేవారు. చివరగా మా అమ్మమ్మ వచ్చి మీకు తాంబూలం విప్పించి. నా TC తీసుకొని మీ పాదాలకు మొక్కి నా వీధిబడిని విడిచిన ఆ రోజు నా హృదయం బద్దలై పోయింది. మా మాస్టర్ తో బంధం ఎడబాటు అవుతుందని ఆరోజు ఈ రోజని ఊహించలా మాస్టర్ మీరు ఏస్వర్గం లో ఉన్నా! మరోసారి మాకు మాస్టర్ గా పుట్టాలన్నదే మా ఆకాంక్ష. మళ్ళీ మీతో ఆ కపటంలేని జీవితం ఒక్క సారి చూడాలని ఉంది. అందుకే మీకోసం ఈ నా ప్రేమలేఖ. చనిపోయిన వారు దేవుడంటారు అందుకే మీరు ఎక్కడున్నా ఈ లేఖను చదివి నన్ను దీవిస్తారని ఆశిస్తూ.!

మీ ప్రియమైన స్టూడెంట్
యాంబాకం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!