మొర

మొర

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : సావిత్రి కోవూరు

నా ప్రియాతి ప్రియమైన ఓ దేవా, ఓ సర్వాత్మ, నీకు ఇలాంటి లేఖను రాయవలసి వచ్చినందుకు నేనేంతో బాధపడుతున్నాను. కానీ వ్రాయక తప్పటం లేదు. నాకు ఐదు సంవత్సరాల ప్రాయంలో నీ కొండకు వచ్చినప్పటినుండి నీపై భక్తితో మనసు పారేసుకున్నాను. అంత చిన్న పాపగా ఉన్నప్పుడే శనివారం రోజు తలార స్నానం చేసి మడికి ఆరేసుకున్న గౌనును ధరించి అమ్మ ఇచ్చిన డబ్బులు జమచేసి నీకై కొబ్బరికాయ తెచ్చేదాన్ని. నీ గది శుభ్రం చేసి, ముగ్గులు పెట్టి, సుప్రభాతంతో నిన్ను మేలుకొలిపే దాన్ని. ధూప దీప నైవేద్యాలతో నిన్ను ఆరాదించే దాన్ని. తిరుపతి నుండి తెచ్చుకున్న పుస్తకంలో ఉన్న శ్లోకాలు స్తోత్రాలు అన్ని నేను గానం చేయడమే కాకుండా ఇంట్లో ఉన్న నాతోటి పిల్లలందరినీ ఒక్క దగ్గర చేర్చి వాళ్ళందరికీ శ్లోకాలు, సుప్రభాతాలు నేర్పించి భక్తి భావం కలిగించేదాన్ని. శనివారం రోజు అంత చిన్న వయసు నుండి ఒక పూటనే భోజనం చేసి, మనసును నీ యందు లగ్నం చేసేదాన్ని. దాని ఫలితమే నేమో నేను కోరుకున్న మంచి భర్తను, ముత్యాల్లాంటి పిల్లలను ప్రసాదించడమే కాకుండ ఆర్థికంగా ఏ ఇబ్బంది లేకుండా మంచి జీవితాన్ని ప్రసాదించావు.
ఇంత ఇచ్చిన వాడివి నాకు మనశ్శాంతి లేకుండా ఇన్ని పరీక్షలు ఎందుకయ్యా!. నేను తెలిసి ఈ జన్మలో ఏమి పాపం చేయలేదని అనుకుంటున్నాను. చేసినా ఆ పాపానికి శిక్ష నాకే ఉండాలి. కానీ నా పెళ్లయిన నాటినుండి నా భర్త ఆస్త్మాతో ఆయాసంతో ఎంత బాధననుభవించాడో నీకు తెలుసు. 30 సంవత్సరాలు బాధ పడుతు నిద్ర లేని రాత్రులు గడుపు ఆయనకు, ఆయనను ఆ విధంగా చూడలేని నాకు నరకాన్ని చూపించావు. ఆ తర్వాత అయినా కరుణిస్తావనుకుంటే, పెద్ద గీత ముందర చిన్న గీతలాగా అంతకుమించిన నరకం స్వరపేటిక క్యాన్సర్ మహమ్మారిని అంటగట్టావు. దాని నుండి నానా కష్టాలు పడి విముక్తి పొందినా! నా భర్త గంభీరమైన స్వరమును కోల్పోయి అస్పష్టంగా మాట్లాడే నా భర్త మాటను చూసే దౌర్భాగ్యాన్ని అంటగట్టావు. ఆ పరీక్షకు కూడా ఆ మనిషి ధైర్యంగా నిలబడి నన్ను ఓదార్చడమే కాకుండా తనను తాను ఓదార్చుకునే పరిస్థితి తెచ్చావు. అయినా మనిషి ఆరోగ్యంగా ఉన్నాడులే అని తృప్తి పడుతుంటే అది చాలదన్నట్టు ఈ మధ్యన గుండె నొప్పిని కూడా ప్రసాదించి స్టంట్ వేయించావు. ఇంకా నీ పరీక్షలు ఎన్ని రోజులు. ఇప్పటికైనా నా ప్రాణానికి ప్రాణమైన నా భర్తకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. నా భర్తకు పెట్టే పరీక్షలు చూస్తూ ఏమీ చేయలేని నిస్సహాయతతో నరకాన్ని చవి చూస్తున్నాను. ఆయన చీమకు కూడా హాని చేయని, ఏ దురలవాట్లు లేని సౌమ్యుడు. ఇది నేను అనడం కాదు, ఆయనను గురించి తెలిసిన వారంతా అనే మాట. ఇది నీ పాదాల మీద ఒట్టేసి చెప్తున్నాను. స్వామి ఇప్పటికైనా ఈ పరీక్షలన్నీ ఆపి ఆ ప్రాణిని ప్రశాంతంగా బ్రతకనిస్తేనే నాకు ప్రశాంతత లభిస్తుంది. ఇప్పటికీ మా పెళ్లి అయ్యి 40 సంవత్సరాలు దాటినవి. కానీ పెళ్లయినప్పటి నుండి ఆరోగ్యపరంగా మేము ఆనందంగా ఉన్నది ఒక్కరోజు కూడా లేదని నీకు తెలుసు కదా! కనుక రేపు నీ కొండకు వస్తున్నాను మొర పెట్టుకోవడానికి. ఇప్పటి నుండి అయినా నీ దయ చూపి మా ఆయనకు ఆరోగ్యాన్ని ప్రసాదించి మేము సంతోషంగా, ప్రశాంతంగా గడిపే అవకాశం ఇస్తావని ఆశిస్తూన్న.

ఇట్లు.
నీ పాదాలనే నమ్మిన ప్రాణి
సావిత్రి కోవూరు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!