మోసం

మోసం

రచన: సుశీల రమేష్.M

లోకం పోకడ చాలా మారింది. అవసరానికి ఆదుకునే వాళ్ళు కొందరయితే, మోసం చేయడానికే అవసరాన్ని సృష్టించే వారు మరికొందరు. ఏది ఏమైనప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండడం ఉత్తమం. బహుశా ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితులు.

తనూజ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్ గా చేస్తుంది. చదువు ఇల్లు, ఇప్పుడు ఉద్యోగం తప్ప మరే ఇతర విషయాల గురించి పెద్దగా పట్టించుకోదు. నువ్వు మ్యాట్రిమోనీ లో పేరు నమోదు చేయించుకుంటావా లేకపోతే మన బంధువుల్లో ఎవరినైనా చూడమంటావా అని చాలా రోజుల నుండి తన తల్లి తనను కోరుతుంది. ఇక తప్పదంటూ తన పేరును ప్రసిద్ధిచెందిన మ్యాట్రిమోనీ లో నమోదు చేయించుకుంది తనూజ.

నాలుగు రోజుల తర్వాత తనూజ మొబైల్ కు కొత్త నంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ రిసీవ్ చేసి హలో ఎవరండీ అని అడిగింది తనూజ.
హాయ్ అండి నా పేరు వర్ధన్ , నేను ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా చేస్తున్నాను. మ్యాట్రిమోనీ లో మీ ప్రొఫైల్ నాకు నచ్చింది. మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు 30 సంవత్సరాలు అంటే నేను నమ్మలేదు ప్లీజ్ అబద్ధం అని చెప్పండి అని అన్నాడు వర్ధన్.

ఇంకేం ఉంది ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టేసాడు. ఆ మాటలు తనూజాకు బాగా నచ్చేశాయి. ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. మాటల ప్రవాహం చాటింగ్ వరద మొదలైంది.

అలా కొన్ని రోజులు గడిచాక వర్దన్ వద్ద నుండి ఫోన్ వచ్చింది. తనూజా ను వర్ధన్ తనూ అని పిలుస్తున్నాడు.

తనూ నా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయ్యింది అనగానే కంగారులో నేను నా వ్యాలెట్ మరిచి హడావిడిగా హాస్పిటల్ కి వచ్చాను.తీరా ఇక్కడికి వచ్చాక హాస్పిటల్ బిల్లు కట్టడానికి డబ్బులు లేవని గమనించి నీకు కాల్ చేస్తున్నాను. బిల్ లక్షన్నర అయ్యింది. ఇప్పుడు నువ్వు పంపితే నేను ఇంటికి వెళ్లగానే నీకు తిరిగి పంపించేస్తాను అని ఎంతో గాబరా పడిపోతూ అడిగాడు వర్ధన్.

మానవత్వం ఉన్న మంచి మనిషి అని నమ్మిన తనూజ, అయ్యో ఇంత రిక్వెస్ట్ చేయాలా అవసరం లేదంటూ మనీ ట్రాన్స్ఫర్ చేసింది తనూజ.

ఇక ఆరోజు నుండి ఏదో ఒక సాకు చెప్పి తనూజ దగ్గర నాలుగు లక్షల వరకు డబ్బులు తీసుకున్నాడు
వర్ధన్. తను ఆకలిగా ఉంది రమ్మంటావా అని మెసేజ్ పెట్టాడు వర్ధన్.

అబ్బా వర్ధన్ నీది ఏ రకమైన ఆకలో నాకు తెలుసు గాని పెళ్ళి అయ్యేంత వరకు అలాంటివి ఏమి వద్దు. అంటుంది తనూజ.

సరే మేడం ఒక్క ముద్దన్న పెట్టు అంటూ చిన్న పిల్లాడే లాగా బుంగ మూతి పెట్టి అడిగేవాడు వర్ధన్.
మా మంచి వర్ధన్ గుడ్ బాయ్ నేను వద్దంటే ఇక అడగడు అంటూ మనసులో మురిసిపోయేది తనూజ.

కొన్ని రోజుల తర్వాత ఒకరోజు వర్దన్ ని డబ్బు అడిగింది తనూజ.
అదేంటి తనూ నేనేం పారిపోను నీ దగ్గర ఉన్నా ఒకటే నా దగ్గర ఉన్నా ఒకటే అంటూ మరో రెండు కల్ల బొల్లికబుర్లు చెప్పి తప్పించుకున్నాడువర్ధన్.

యాక్సిడెంట్ జరిగిన రోజే డబ్బు తిరిగి పంపేస్తాను, అన్న వర్ధన్ మూడు నెలలైనా డబ్బు తిరిగి ఇవ్వలేదు అనే ఆలోచన కూడా రాలేదు తనూజ కి, పూర్తిగా వర్ధన్ మాయమాటల్లో పడిపోయింది .

క్రమంగా వర్ధన్ మాటలు తగ్గించేశాడు తనూజ తో, ఎందుకు అని అడిగితే మా వాళ్ళకి నువ్వు నచ్చలేదని తెలివిగా తప్పించుకున్నాడు వర్ధన్. ఆ రోజు నుండి వర్ధన్ ‌ కి ఫోన్ చేద్దామంటే స్విచ్ ఆఫ్ వస్తుంది.

అనుమానం వచ్చిన తనుజ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది వర్ధన్ మీద కంప్లైంట్ చేద్దామని. అక్కడ పోలీస్ స్టేషన్లో నోటీస్ బోర్డులో వర్ధన్ ఫోటో చూసి కంగు తింది తనూజ.

పోలీసులు చెప్పిన వర్ధన్ వివరాలను బట్టి తను మోసపోయానని గ్రహించి ఇంకా ఎంత ప్రయత్నం చేసినా తన డబ్బు తనకు తిరిగి రాదని గ్రహించింది. కంప్లైంట్ ఇవ్వకుండానే వెనక్కి తిరిగి వచ్చింది. మళ్ళీ కొత్త చిక్కులు ఎందుకని.

మాయమాటలతో మైమరపించి , అదే ప్రేమ అని నన్ను నమ్మించింది నా డబ్బు కోసమా? ఎంత మోసం!
ఇలా కూడా ప్రేమిస్తారా? ….
ఇంకా నయం నా జాగ్రత్తలో నేనున్నాను ముందడుగు వేయలేదు లేకపోతే ఈరోజు నేను నా మొహాన్ని నా తల్లిదండ్రులకు చూపించలేక పోయేదాన్ని అంటూ ఇంటికి వెళ్లిపోయింది తనూజ.

ఈ రోజుల్లో వర్ధన్ లాంటి మోసగాళ్లు, మేక వన్నె పులులు చాలానే ఉన్నాయి. మోసం చేయడమే వారి నైజం.

అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!