నడత – భవిత

నడత – భవిత

రచన: సత్య కామఋషి ‘ రుద్ర ‘

మత్తు మత్తు..ఏదో తెలియని గమ్మత్తు.!
గమ్మత్తైన మత్తుకి చిక్కి, నిషా తలకెక్కి,
తెలసీ తెలియకనే, తనకు తానుగ చిత్తు.!

తోచిందేదో చేసేయమంటు త్వరపెడతది..
ఉచితానుచితములు ఆలోచించకంటది..
తప్పొప్పుల తక్కెడ పక్కుకు పెట్టమంటది..
పర్యవసానాలను పట్టించుకోకంటది..!

అది జోయుమీదున్న ఆ వయసు పాపమో,
విరిసీ విరియని మనసుల పారవశ్యమో,
మనసు దూకుడు కట్టడి చేయలేని, క్షణికపు
మోహావేశమో..పరవశమో..విధివశమో..!

మందో విందో, చిందో పొందో, మరేదో పసందో,
దారి తప్పించే ఏ చెడు సహవాసమో.,
జగాన్ని మరిపించే ఏ వ్యామోహ మంత్రమో,
తగని వ్యాపకమో,వ్యసనమో,అత్యనుమోదమో

పెడద్రోవ పట్టిన జీవితాల గతులు తారుమారు..
చేజారేటి బంగరు భవితల బ్రతుకులు బేజారు..
దారి తప్పిన యువతకు ఏ దిక్కతోచని తీరు..
కన్నవారి గంపెడు ఆశలు అమాంతంగ ఆవిరై,
కన్న కలలన్నీ కల్లలై, అలసి అవిసే గుండె జోరు…

యువతరమా మేలుకో..తలకెక్కిన పాశ్చాత్య
పనికిమాలిన మత్తును వదిలించుకో..అందొచ్చే
ఏ అవకాశాన్ని, తిరిగి దక్కని ఏ నిముషాన్నీ,
చేజారనీయకు..భవితను మసకబారనివ్వకు..
సరైన దారులనెన్నుకో..బంగారు భవితనందుకో.!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!