నీ జతనై

నీ జతనై

రచయిత :: సిరి


నాకు ముందే అసహనంగా ఉంది. దానికి తోడు నా పక్కన సీట్లో అతను గుచ్చి గుచ్చి చూస్తుంటే! అతని చూపులకు ఇంకా చిరాకు వచ్చేస్తుంది. తిరిగి నాలుగు అక్షింతలు వేద్దామని అనుకుని అసలే హాస్పిటల్ అని ఆగిపోయాను. స్కాన్ చేయుంచుకోవడానికి అన్నయ్యా, వదిన స్కానింగ్ చేసే గదిలోకి వెళ్లారు. అసలు నాకు హాస్పిటల్ అంటేనే చిరాకు. తప్పక రావాల్సి వచ్చింది. కొన్ని కొన్ని పరిస్థితుల్లో తప్పదు. మనకి ఇష్టం లేకపోయినా పరిస్థితులు మూలంగా ఆ పని చేయక తప్పదు.

మా వదిన కి నాలుగో నెల. మా అన్నయ్యా, వదినా, నేను ముగ్గురం వచ్చాము. అన్నయ్యకి బయట పని వుందంటేను

మా వదిన ఇంటికి  వెళ్ళేటప్పుడు ఒక్కటే అవుతుంది అని

నన్ను రమ్మంటే నేను వచ్చాను. వేరే ఎవరి కోసం అయినా అయితే అస్సలు వచ్చేదాన్ని కాదు. మా వదిన కోసం కాబట్టి వచ్చాను. నాకు మా వదిన అంటే చాలా ఇష్టం. అమ్మతో చెప్పలేనివి కూడా వదినతో చెప్పుకుంటాను ఏ విషయం అయినా సరే!!

నా ఆలోచనలలో నేనుండగా నా పక్కన సీట్లో అతను

“ఏవండీ” పిలిచాడు. ‘ఏంటి రా?’ అనేద్దాం అనుకుని కోపం తమయించుకుని “ఏంటి?” అన్నాను. ఎంత  చిరాకు చూపించాలో అంత చూపిస్తూ.

‘ఏమి లేదు’ అన్నట్టు అడ్డంగా తల ఊపాడు. బహుశా! నాకు కోపం, చిరాకు అతనికి తెలుస్తుంది ఏమో!!

స్కానింగ్ గది వైపు చూసాను మా అన్నయ్య వాళ్ళ కోసం. అప్పుడే బయటకి వస్తున్నారు. ‘హమ్మయ్యా!’ అనుకుని అటు వైపే చూస్తున్నాను. చిరాకుగా ఉన్న నా ముఖం లో ప్రశాంతత వచ్చింది. దానికి కారణం మా వదిన వాళ్ళతో పాటు ఒక అతను. బ్లాక్ టీ షర్ట్, బ్లూ జీన్ మెడలో స్టేతస్కోప్, చేతిమీద ఆఫ్రాన్ వేసుకుని అలా నడుస్తూ వస్తుంటే! సినిమాల్లో చూపించినట్టుగా అతను తప్ప చుట్టూ అంతా బ్లర్ గా కనిపిస్తుంది. నా కోసం నాప్రిన్స్ ఛార్మ్ నడిచి వస్తున్నట్టే అనిపించింది. గడ్డం కింద చెయ్యి పెట్టుకుని అలాగే చూస్తూ వున్నాను. ఇలా ఎప్పుడూ లేదు నాకు.

ఇప్పుడే ఇలా ఎందుకో?

మా వదిన వాళ్ళు పిలుస్తున్నారు. అవేమి పట్టించుకోవట్లేదు నేను. అతను నా వైపు ‘పిచ్చా’ అన్నట్టు చూస్తున్నాడు. మా అన్నయ్య నా తల మీద మొట్టాడు.

నొప్పి తగిలేసరికి “అమ్మా!” అరిచి కోపంగా చూశాను అన్నయ్య వైపు. “పిచ్చి పెట్టిందా నీకు? తింగరిదానా ఏ లోకంలో ఉన్నావ్?” అడిగిన అన్నయ్య వైపు ఉరిమి చూశాను. నా ప్రిన్స్ ఛార్మ్ ముందు నన్ను అవమాస్తున్నాడు.

తనెమనుకుంటాడో అని అతని వైపు ఒకసారి చూసి వడివడిగా బయటకి నడిచాను. అప్పటికే మా వాళ్ళు నవ్వుతున్నారు నన్ను చూసి.

అప్పటి వరకు కోపంగా వున్నాను. కార్లో కూర్చుని నవ్వుకున్నాను. మా అన్నయ్య ని తిట్టుకున్నాను. వీడు నా పరువంతా తీసేశాడు. ఎవరు అతను? ఎప్పుడూ చూడలేదు. అన్నయ్య వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అన్నయ్య వాళ్ళకి తెలుసా అతను? అనుకోగానే నా మనసు గాల్లో తేలిపోయింది. మళ్ళీ  ‘తను డాక్టర్ కదా! అలా తెలుసేమో!’ అనుకోగానే గాలి తీసిన బెలూన్ లా అయిపోయింది నా పరిస్థితి.

అప్పుడే ముందు సీట్లో కూర్చున్నాడు. మా అన్నయ్య అనుకున్నా. మా వదిన నాతో పాటే వెనక కూర్చుంది. నాకు ముందు కూర్చోవడం ఇష్టం. మా వదిన కోసం వెనుక కూర్చున్నాను.

ఇంతకు ముందు అన్నయ్య నన్ను పిచ్చి అన్న విషయం గుర్తు వచ్చి “రేయ్ నన్నే పిచ్చి అంటావా!” వాడి భుజం మీద కొట్టాను. అక్కడ ఉంది అన్నయ్య కాదు. నా ప్రిన్స్ ఛార్మ్.

అతను వెనక్కి తిరగ్గానే తెలిసింది నాకు. నా కళ్ళు పెద్దవి అయ్యాయి. కంగారుగా గోర్లు తినేస్తున్నాను. మా వదిన కూడా ఆశ్చర్య పోయింది.

“సా…. సారీ! అన్నయ్య అనుకుని” నా నోట్లో నుంచి మాట రావట్లేదు.  అతను ఏమి మాట్లాడలేదు. నాకు భయం వేసింది. నా గురించి తప్పుగా అనుకుంటాడేమో అని!!

ఇంటికి వెళ్లే వరకు దించిన తల ఎత్తలేదు నేను. ఇంటికి వెళ్ళగానే మా వదినని కూడా పట్టించుకోలేదు. చకచకా లోపలికి వెళ్ళిపోయాను. దాదాపు పరిగెత్తినట్టుగా. అతను కూడా లోపలికి వచ్చాడు. అమ్మతో మాట్లాడుతున్నాడు.

నా గదిలోకి మాటలు వినిపిస్తున్నాయి కొంచెం కొంచెంగా.

నేనూ హాల్లోకి వద్దాం అనుకున్నాను. కానీ! కార్లో జరిగిన సంఘటన నన్ను వెళ్ళనివ్వకుండా ఆపింది.

ఆ రోజంతా నా ప్రిన్స్ ఛార్మ్నే తలుచుకుంటూ గడిపేశాను. తర్వాత రోజు మా అమ్మ చెప్పిన న్యూస్కి నాగుండె టప్పున పేలింది. నాకు పెళ్ళి కుదిరింది అని. నా కళ్ళలో నీళ్ళు టపటపా రాలాయి.

నన్ను చూసుకోవడానికి వారం ముందు ఒక కుటుంబం వచ్చింది. అతను రాలేదు. వాళ్ళకి నేను నచ్చాను. నన్ను అడిగారు అమ్మా, నాన్న ” మీ ఇష్టం” అనేశాను. అతని ఫోటో ఇచ్చారు నాకు. నేను అది చూడలేదు. ఎక్కడో పడిపోయింది. ఆ విషయం చెప్తే అమ్మ తిడుతుంది అని చూశాను అని చెప్పేశాను. ఇప్పుడు పెళ్ళికి అబ్బాయికి కూడా ఇష్టమే అంట. నా నెత్తిన పెద్ద పిడుగు పడినట్టు అయింది నా పరిస్థితి. ఏమి చేస్తాం చేసుకున్నదేగా అనుభవించక తప్పట్లేదు!! పోనీ అతని గురించి చెప్పేద్దాం అంటే అతని ముఖం తప్పా! ఏమి తెలియదు నాకు. అతనికి నేనంటే ఇష్టమా అంటే అదీ తెలియదు. నూతిలో

పడ్డ ఎలుకలా అయింది నా పరిస్థితి. పెళ్ళి చేసుకోవడం తప్పా ఏమి చేయలేని పరిస్థితి.

పెళ్ళి కొడుకుతో మాట్లాడి పెళ్ళి ఆపించేద్దాం అనుకున్నాను. నా దరిద్రం కొద్దీ వారం అబ్బాయి అమ్మాయి పెళ్ళికి ముందు కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు అంట. పెళ్ళి కూతుర్ని చేశారు అని నన్ను బయటకు కూడా వెళ్ళనివ్వలేదు. ఏమి చెయ్యాలో దిక్కు తోచని పరిస్థితి నాది. ఒకానొక సమయంలో పారిపోతానేమో! అనిపించింది నాకే. అంతలో అమ్మా, నాన్నా, అన్నయ్యా, మా వదిన గుర్తుకు వచ్చారు. అన్నీ మావదిన తో చెప్పే నేను. నాకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పలేక పోయాను. బాధ నాకు నేస్తం అయింది.

మరుసటి రోజు పెళ్ళి అనగా ఏడుస్తూ నిద్ర పోయాను.

మా వదిన బ్రతిమాలింది “ఏమైంది రా! నీకు పెళ్ళి ఇష్టం లేదా?”

“అలాంటిది ఏమీ లేదు వదిన. మీ అందర్నీ విడిచి వెళ్లాలంటే! బాధగా ఉంది” అన్నాను. అదీ నిజమే నా ప్రిన్స్ ఛార్మ్ నేను ఎప్పటికీ కలవలేము అనేది ఒక కారణం అయితే, మా వాళ్ళందర్ని వదిలి పెట్టాలి అనేది ఇంకో కారణం.

నిద్రలో ఉన్న నాకు “సాక్షి … సాక్షి” ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. కళ్ళు నులుముకుని చూశా. ఎదురుగా నా ప్రిన్స్ ఛార్మ్. నా కళ్ళు మెరిశాయి. ” ఇదంతా కలే అయి ఉంటుంది. నువ్వు నా ముందుకు రావు. నా కలలో తప్ప” అన్నాను.

“రాక్షసి నేనే నిజంగా నా వైపు చూడు” నా ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.

ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవి అయ్యాయి. “ను… నువ్వు”…

“సా… సారీ మీరు ఇక్కడ” అన్నాను.

” ఆ పిచ్చి ప్రశ్న ఏంటీ?  పెళ్ళి కొడుకు నేనే కదా!” అన్నాడు.

“నిజమా!” నా కళ్ళలో కోటి కాంతులు.

“హా… అంటే నేనని నీకు తెలియదా?” అడిగాడు.

‘ఉహూ’ అడ్డంగా తల ఊపి ఇప్పటి వరకు నేను అనుభవించిన దుఃఖాన్ని తన ముందు వెళ్ళగక్కాను.

” సారీ బంగారం” నన్ను గట్టిగా హత్తుకున్నాడు.

“అయ్యో మీరు సారీ చెప్పడం ఏంటి? మీరు ఎప్పుడు ఇలా తగ్గకూడదుగు. అదీ నా ముందు అస్సలు తగ్గకూడదు” తన చుట్టూ చేతులు వేశాను.

“ఇంతకీ మీ పేరు?” కాస్త దూరం జరిగాను.

” పేరు కూడా తెలియదా?”

” ఉహూ”

” నందన్”

“మీ పేరు చాలా బాగుంది.  అంటే ఆ రోజు హాస్పిటల్కి నన్ను కావాలని తీసుకు వచ్చారా? ” అడిగాను.

“హ్మ్మ్ నా కోసమే!” నవ్వాడు. ఎంత బాగుందో ఆ నవ్వు.

” డాక్టర్ కదా! మీరు”

” హ్మ్మ్.. ప్రశ్నలు తప్ప ఇంకేమి లేవా?”

అతని కళ్ళలో చిలిపిదనం తెలుస్తుంది.  సిగ్గు ముంచుకు వచ్చింది నాకు.

“మీరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి. ఎవరు అయినా చూస్తే బాగోదు” వెళ్ళను అంటున్నా బలవంతంగా బయటకి పంపేసి, నా ప్రిన్స్ ఛార్మ్ గురించి… అదే నా నందన్ గురించి కలలు కంటూ… కలల లోకంలో విహరిస్తున్నాను రాబోయే మా భవిష్యత్తుని తలుచుకుంటూ!!

***

You May Also Like

7 thoughts on “నీ జతనై

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!