ఒకే దెబ్బకు రెండు పిట్టలు

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

ఒకే దెబ్బకు రెండు పిట్టలు

రచన:చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

అనగనగా ఓ రాజు.ఆ రాజుకి సంతానం లేక చెయ్యని యాగము లేదు, తిరగని గుడి లేదు.ఒకసారి సంతాన యాగం చేస్తూ ఉండగా హఠాత్తుగా వచ్చిన సుడిగాలికి యాగశాల నిప్పంటుకుంది.రాజ పురోహితులు ఏదో కీడు సంభవించబోతుందని జాగ్రత్తగా ఉండాలని రాజుకు సూచించారు.మంటలను అదుపుచేశాక యాగం దివ్యంగా జరిగింది.నెల తిరగకుండానే మహారాణి గర్భవతియై సంతోషాన్ని నింపింది.మూడోనెలలో రాజుకి ముఖంపై కుడిబుగ్గపై ఏదో ఒక చిన్న గుల్ల ఏర్పడింది.వైద్యులు ఏమీకాదులే అని చెప్పడంతో తేలిగ్గా తీసుకున్నాడు రాజు.నెలనెలకి ఆ గుల్ల పెరగడం చూసి ఆందోళన చెందిన రాజు రాజ వైద్యుని పిలిచి పరిష్కారం చెప్పమనగా రాజవైద్యుడు రాజా ఇది నీకు ఎవరో పెట్టిన శాపఫలితంగా కనపడుతూ ఉంది.వైద్యశాస్త్రంలో ఎక్కడా ఇటువంటి పెరిగే గుల్ల లేదు.ఇది పెద్ద వ్రణంగా మారితే ప్రాణానికే ప్రమాదమంటూ భయపెట్టేశాడు.రాజు “వైద్య శిఖామణీ ..మీరే చేతులెత్తేస్తే నాకింకెవరు దిక్కు.నన్ను రక్షించే వారే లేరా “అనుకుంటూ రాజు విచారం వ్యక్తం చేయగా రాజ వైద్యుడు ఓ సలహా ఇచ్చాడు.మీది శాపమో అనారోగ్యమో కనుక్కోవడానికి ఒక పరీక్ష పెడతాను అనారోగ్యమే అయితే నేనే చికిత్స చేస్తాను” అన్నాడు.దానికి రాజు అలాగే స్వామీ అంటూ ఆయన చెప్పినట్లే పరీక్షకు సిద్ధమయ్యాడు.వైద్యుడు తులసీదళాన్ని గాయంపై ఉంచి మంత్రం ఉచ్ఛరిస్తూ శాప నిర్థారణ పరీక్ష చేశాడు.అది శాపం కాదని అనారోగ్యమే అని తేలడంతో రాజు ఊపిరిపీల్చుకున్నాడు.ఆస్థాన పురోహితుడు వచ్చి రాణి గారి గర్భం నిలిచిన కాలాన్ని బట్టి జ్యోతిష్యం చూడగా ఆ శిశువు జన్మిస్తే రాజుకి మరణం సంభవిస్తుందని చెప్పాడు.రాజు తీవ్ర ఆందోళనతో మంచం పట్టాడు.ఇదంతా చూస్తూనే ఉన్న మంత్రి”రాజా…ఆందోళన వద్దు.ఇది శత్రు రాజు కుట్రలా అనిపిస్తూ ఉంది.ఈ రాజ వైద్యుడు,పురోహితులు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయడానికే ఇలా చేశారని నా అనుమానం.మొన్నీ మధ్యే కదా రాజవైద్యుడు మీరూ నేను వద్దంటున్నా ఆకు పసరు తాగాలని బలవంతంగా మీచే తాగించారు.దాని ఫలితమే ఇదంతా అని నా అనుమానం”అంటూ ధైర్యం చెప్పి వెళ్ళాడు.శత్రు రాజులు ,మిత్ర రాజులూ ఇరువురూ పరామర్శలకు వచ్చి రాజ దర్భారులో ఉంటూ రాజుకి సహాయం చేస్తున్నారు.ఓ వైపు వైద్యం ఆపక పోయినా వ్రణం పెరుగుతూనే ఉంది.రాజు లోపల ధైర్యంగా ఉంటూనే భయపడుతున్నట్లు నటిస్తున్నాడు.

పురుడు పోసుకొనే సమయం ఆసన్నమై రాణిగారు కేకలు పెట్టడం ప్రారంభించారు.రాజుగారు మరణిస్తారేమోనని అందరూ భయపడుతున్నారు.శత్రురాజు తన సేనానిని దాసీ వేషంలో రాజు దగ్గరికి పంపి వ్రణాన్ని చిదిమేలా చేశాడు.ఒక కన్నేసి ఉంచిన రాజు ఆ దాసీ రూపంలోని సేనానిని హతమార్చి ఏమీ తెలియనట్లుగా శత్రురాజు దగ్గరికెళ్ళి ప్రాణాలు పొయ్యేలా ఉన్నాయి నన్ను కాపాడమని వేడుకోగా శత్రు రాజు నవ్వుతూ “రాజా…నీ మంచితనమే నీ ప్రాణాలపైకి తెచ్చింది.ఒకే దెబ్బకు రెండు పిట్టలు.అక్కడ నీకు పుట్టబోయే సంతానాన్ని కూడా నీ మిత్రరాజు కాదు కాదు నా మిత్రరాజు చంపేయబోతున్నాడు.తర్వాత ఈ రాజ్యమంతా నా వశమౌతుంది”అంటూ సింహాసనాన్ని అధిరోహించబోగా రాజు “ఆగాగు ..మిత్రమా..నా వ్రణానికి విరుగుడు లభించింది.ఎలాగంటే ఆ వ్రణాన్ని నీ సేనాని నెత్తుటి ధారతో కడిగేశా.నిజమే..! ఒకే దెబ్బకు రెండు పిట్టలు.అక్కడ నా మిత్ర రాజు కాదు కాదు నీ మిత్ర రాజు మరణించాడు.ఇక్కడ నా చేతిలో నువ్వూ మరణించబోతున్నావు అంటూ శత్రురాజు తల నరికేశాడు.అదే సమయంలో మహారాణి పండంటి శిశువును జన్మించింది.రాజు మంత్రి దగ్గరికెళ్ళి”మంత్రివర్యా..మీ బుద్ధి కుశలత అమోఘం.మీరు వారి ప్రణాళిక పసిగట్టి మన రాజ్యాన్ని రక్షించారు.”అంటూ మంత్రి చేతులను పట్టుకుని సింహాసనాన్ని అధిష్టించి పూర్వవైభవం ఉట్టి పడేలా పాలించాడు.
**************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!