పిరికితనం

పిరికితనం

రచయిత::గాయత్రి భవ్య

కత్తుల శబ్ధం వింటు వారిని చూస్తున్నాను. కత్తి తిప్పడంలో వారి నేర్పు అమోఘంగా ఉంది. వారు ఒకరిపై ఒకరు చేసుకునే దాడిలో నా వైపుగా వచ్చినప్పుడల్లా నా శరీరం వణుకుతుంది. నాకు యుద్ద విద్యలు రావు, కత్తి అంటే నాకు చాలా భయం. రాజ్యంలోని అందరు యువకులు యుద్ద విద్యల్లో ఘనాపాటిలే., మరి నాకు ఈ పిరికితనం ఎలా వచ్చిందో అర్ధం కాలేదు. రోజూ ఉదయం యుద్ద విద్యలు నేర్చుకోవాలనే సంకల్పంతో బయలుదేరతాను. వచ్చాక ఇక్కడ జరిగే శిక్షణ చూసి వణికిపోయి వెనుదిరిగిపోతాను. మిగిలిన విద్యార్ధులు అందరు నన్ను చూసి గేలి చేస్తారు. రోజులాగే నేను వెనుదిరిగి ఇంటివైపు నడిచాను.
**
నాకు దారిలో రాజు గారు వేయిస్తున్న దండోరా వినిపిస్తుంది “మహిపాల రాజ్య ప్రజలారా మహిపాల ప్రభువైన శ్రీశ్రీశ్రీ విక్రమసేనుల వారు ప్రజలకు అత్యవసర మనవి తెలుపుతున్నారు, అది ఏమనగా మన రాజ్యంలోకి ఓ వింత మృగం ప్రవేశించింది. దానిని సంహరించడానికి దాని చేరువలోకి వెళ్ళిన భటులందరు అదృశ్యమైపోతున్నారు. అందువలన దానిని సంహరించేవరకు ప్రజలెవరు రాజ్యంలో తిరగకుండా తమ గృహములలోనే ఉండిపోవాలని రాజుగారి ఆజ్ఞగా తెలియపరచుచున్నారహో” అని ముందుకు వెళ్ళి పోతున్నాడు దండోరా మనిషి. ఆ వార్త విని నాకు చాలా భయం వేసింది, వెనుతిరిగి చూడకుండా ఇంటి వైపు దౌడు తీశాను.
చీకటి పడుతుంది. రాజు గారి ఆజ్ఞతో ప్రజలెవరు బయటికి రావడం లేదు. అప్పుడప్పుడు వీధులలో రక్షక భటులు తిరుగుతున్నారు. రాజ్యంలో వారి అడుగుల శబ్ధం తప్ప అంతా నిశ్శబ్ధమైపోయింది. నేను నిదురపోదామని మంచంపై వాలాను నిదురపట్టడం లేదు. అసలు ఆ మృగం ఎలా ఉంటుంది, దాని సమీపంలోకి వెళ్ళిన వాళ్ళంతా అదృశ్యమై ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ రాజుగారు ఆ మృగాన్ని సంహరించమని నన్ను పంపిస్తే అన్న ఆలోచన వచ్చేసరికి దుప్పటి ముఖం పైకి జరుపుకుని ముడుచుకుని పడుకున్నాను.

******

బయట తలుపు తడుతున్న శబ్ధం వినిపిస్తుంది. నా భయం రెట్టింపై పోయింది. ఆ మృగం నన్ను చంపడానికి వచ్చిందేమోనని. తలుపులు తడుతున్న శబ్ధం ఆగడం లేదు. భయంగా తలుపుల వైపు నడిచాను. తలుపులు తెరవడానికి కూడా చేతులు సహకరించడం లేదు. ఎలాగోలా తలుపులు తెరిచాను. ఎదురుగా రాజ భటులు. వారు ఆ సమయంలో ఎందుకు వచ్చారో అర్ధం కాలేదు.
“రాజాజ్ఞ, ఈ రాజ్యంలో అందరికంటే పిరికివాడివి నువ్వేనంట కదా? నీ వలన రాజ్యానికి ఏం ఉపయోగం లేదు, నిన్ను ఆ మృగం దగ్గర వదిలేయమన్నారు. ఇదిగో ఈ ఖడ్గం అందుకో, దానితో పోరాడి ప్రాణం నిలుపుకుంటావో, దాని దాడిలో ప్రాణాలు పోగోట్టుకుని అదృశ్యమైపోతావో” అని కత్తి నా చేతికి అందిచారు. నా కాళ్ళు వణుకుతున్నాయి. వెళ్ళనని మొండికేద్దాం అంటే రాజాజ్ఞ, కాదంటే తల కోట గుమ్మానికి వెళాడుతుంది. భగవంతుడా అనుకున్నాను. భటులు నా జబ్బలు పుచ్చుకుని ముందుకి లాక్కేళుతున్నారు. నేను దేవునికి మొక్కుతున్నాను, నా చావుని ఇలా ప్రసాదించవద్దని.
రాజ్యానికి దూరంగా తీసుకువచ్చారు నన్ను. వింత వింత అరుపులు వినబడుతున్నాయి నాకు. నన్ను అక్కడ విడిచిపెట్టి భటులు వెనుతిరిగి వెళ్ళిపోయారు. నేను ఎటు కదలకుండా అక్కడే అలా నిలిచిపోయాను. నాకు దూరంగా మిల మిల మెరుస్తూ రెండు కనులు కనిపిస్తున్నాయి. వాటితో పాటు అడుగుల శబ్ధం, వింత అరుపులు. నేను వెనుతిరిగి పరిగెడుతున్నాను. నాకు అడుగుల శబ్ధం దగ్గరవుతుంది. నా తలపైనుంచి ఏదో ముందుకి దూకిన శబ్ధం నా ఎదురుగా వింత మృగం. కనులు చిట్లించి చూశాను, అది మృగం కాదు ఓ మనిషి. అతడు నవ్వుతున్నాడు నన్ను చూసి, “నన్ను చంపేద్దాం అని కత్తి తీసుకుని వచ్చావా పిరికివెధవా? నిన్నేం చేస్తానో చూడు” అని తన చేతిలోని దండాన్ని పైకెత్తాడు. నేను అక్కడ నుండి అదృశ్యమై పోయాను.

*****

నేను మరో లోకానికి వచ్చేసినట్టున్నాను. నా తలపైన ఆకాశంలో ఏవో యంత్రాలు తిరుగుతున్నాయి. గుర్రపు బళ్ళు లేవు, రధాలు లేవు ఏవో విచిత్రమైన యంత్రాలు తిరుగుతున్నాయి. ఇక్కడ మనుషుల వేష భాష అన్నీ వేరుగా ఉన్నాయి. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. అసలు ఇది ఏ రాజ్యమో? ఏ కాలమో కూడా తెలియడం లేదు. ఎవరో కొంత మంది నన్ను చుట్టుముట్టారు. వారి చేతుల్లో వింత ఆకారాల్లో నల్లగా మెరుస్తూ ఏవో వస్తువులు ఉన్నాయి. వారు నా చేతిలోని కత్తిని అందుకుని నా చేతులని దగ్గరకు జరిపి, ఏదో మెరుస్తున్న తాడుతో బంధించారు. ఇప్పుడు ఓ నాలుగు చక్రాలు ఉన్న యంత్రంలో నన్ను ఎక్కించుకుని తీసుకుపోతున్నారు. వారి భాష నాకు అర్ధం కావడం లేదు, నా భాష వారికి అర్ధం కావడం లేదు. నన్ను చిన్న ఖైదులా అనిపిస్తున్న గదిలో పడేశారు. ఎవరెవరో వస్తున్నారు వారి చేతుల్లో ఉన్నవి దీపాలనుకుంటా అప్పుడప్పుడు నన్ను చూసి వెలుగుతున్నాయి. వారిలో వారు ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోతున్నారు. నేను నా భాషలో వారికి చెపుతున్నాను. నా మాట వినడం లేదు. వారు కొంచెం సేపటికి నన్ను బయటకి తీసుకువచ్చారు. ఖైదు నుండి నా చేతికి వేసిన మెరుస్తున్న తాడుని విప్పేశారు. నన్ను వెళ్ళిపో అన్నట్టుగా ముందుకి తోశారు. నేను ముందుకి వచ్చేశాను. ఇక్కడ వారి గృహాలన్ని చాలా విడ్డురంగా ఉన్నాయి. నాకు బెంగ పట్టుకుంది. నేను నా రాజ్యానికి ఎలా వెళ్ళాలి ఎవరు నాకు సహాయం చేస్తారు తెలియడం లేదు. వారి భాష నాకు అవగతమవ్వడం లేదు. నేను ముందుకి వెళుతున్నాను. స్త్రీలు పురుషులు కలిసి వింత వింత యంత్రాలపై తిరుగుతున్నారు. నన్ను ఆదరించి యోగ క్షేమాలు అడిగే నాధుడే కరువయ్యారు, ఇదేమి రాజ్యమో ! ముందుకి వెళుతున్నాను. కొంత మంది జనం గుమిగూడి కనిపిస్తున్నారు. వెళ్ళి చూశాను ఎవరిదో స్త్రీ శవం దుస్తులు లేకుండా పడి ఉంది. అందరు చూస్తున్నారు. నేను ఆ దృశ్యాన్ని చూడలేక ముందుకు వచ్చేశాను. నా ముందు కొంతమంది ఓ మనిషిని తరుముతున్నారు, ఆ మనిషి వీరికి దొరకగానే, నిరాయుధుడైన ఆ మనిషిని కత్తులతో పొడిచి చంపుతున్నారు ఇదేమి న్యాయం ! ఆయుధం లేని వాడి పైన దాడి చేయడం ఈ రాజ్యానికి రాజు లేడేమో?
నేను ముందుకి వెళుతున్నాను, నన్ను కొంతమంది వెంబడిస్తున్నారు. నన్ను చేరుకున్న వాళ్ళు ఏదో అడుగుతున్నారు. నాకు వారి మాటలు అవగతం కాకపోవడం వలన నేను ఏమి చెప్పలేకపోతున్నాను. వారిలో కొంత మంది నన్ను పట్టుకున్నారు, మరి కొంతమంది నా దుస్తులను వెతికారు, చివరికి అందరు కలిసి నా పై దాడిచేసి వెళ్ళిపోయారు. నేను లేచి నడవలేక పోతున్నాను. అలానే నేలపై పడి ఉన్నాను. నాలుగు చక్రాల యంత్రం వచ్చింది. దానిలో నుండి కొంత మంది మనుషులు నన్ను ఆ యంత్రంలోకి తీసుకువెళుతున్నారు, వారి భాష చూపులు నాకు అపాయం కలిగించేవిలా ఉన్నాయి. నన్ను ఓ చదరపు బల్లపై పడుకోబెట్టారు. చిన్నగా రకరకలా ఆకారాలలో అనేక కత్తులు ఉన్నాయి వారి వద్ద. వాటితో నా వెన్నుపూస కింద గాయం చేస్తున్నారు, నాలో పిరికితనం చచ్చిపోయింది బల్ల మీద నుంచి దూకాను.

*****

నా శరీరానికి నేల గట్టిగా తగలడంతో “అమ్మా” అంటూ చుట్టూ చూశాను. నేను మంచం మీద నుండి కింద పడి ఉన్నాను. లేచి తలుపు తీసి చూశాను. నేను మా రాజ్యంలోనే ఉన్నాను. అంటే ఇంతవరకు నేను చూసింది స్వప్నంలో అన్నమాట. అంత భయకరమైన రాజ్యంలో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో, ఇంత సుభిక్షమైన రాజ్యంలో నేను కత్తి యుద్దం నేర్చుకోవాడానికి ఎందుకు భయపడుతున్నాను అనుకున్నాను. ఇప్పుడు నాలో భయం లేదు, పిరికితనం లేదు. ఇంటిలో ఉన్న ఖడ్గాన్ని అందుకుని బయలుదేరాను శిక్షణాలయం వైపుగా. ఇప్పుడు గుండె నిండా ధైర్యంతో అడుగు ముందుకి పడింది, నేను పోరాడగలను అనే భావంతో.

******

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!