పొరబాటు

పొరబాటు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

ఉదయ తమ గేటేడ్ కమ్యూనిటీలో ఇంటి ముందరె ఉన్న పార్క్ వెళ్ళేసరికి సరిత, దివ్య మాట్లాడుకుంటూ కనిపించారు. వాళ్ల దగ్గరికి ఉదయ వెళ్ళగానే సరిత “ఏమైంది ఉదయ, మొన్న సంతలో పిలుస్తుంటే పలకకుండా వెళ్లిపోయావు” అన్నది. “నేనా నేను ఈ మధ్యన సంతకు రావటం లేదు. మా నాన్నగారే తెస్తున్నారు కూరలు” అన్నది ఉదయ. “నీవు ఆ రోజు వచ్చావు మర్చిపోయావేమో. నేను చూశాను నిన్ను. నేను పిలుస్తుంటే పలకకుండా వెళ్ళిపోయావు” అన్నది సరిత. “అవునే ఈ మధ్య ఉదయకు పొగరు ఎక్కువై పోయింది. మొన్న నేను కూడా శిల్పారామంలో చూసి దగ్గరికి వెళ్దాం అనుకునే లోపల స్పీడ్ గా వెళ్ళి పోయింది. అమెరికాకు వెళ్ళుతున్నానని గర్వమెక్కువ అయింది” అన్నది దివ్య ముసి ముసి గా నవ్వుతూ.”మీరు ఎందుకట్లా అనుకుంటున్నారో నాకు తెలియదు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో” అన్నది ఉదయ. “ఎందుకంటే మొన్న మా అమ్మకి బస్టాప్లో కనబడి కూడా పలకరించ లేదట. మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మతో బాగానే మాట్లాడుతావు కదా. మరి బస్ స్టాప్ లో కనిపించినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. మా అమ్మ చాల బాధపడింది” అన్నది సరిత.
“నాకు బస్టాప్ లో ఆంటీ కనిపించలేదు. అసలు నేను ఈమధ్య ఎక్కడికి వెళ్ళలేదు. నేను శిల్పారామం కూడా వెళ్లలేదు ఈ మధ్యన. మరి దివ్యకు ఎలా కనిపించానో ఏమో నాకు అర్థం అవ్వట్లేదు. అవును అసలు నువ్వు శిల్పారామం ఏ రోజు వెళ్ళావో కరెక్ట్ గా చెప్పు నాకు” అన్నది ఉదయ. “పోయిన శనివారం రోజు నేను మా అమ్మతో కలిసి శిల్పారామం వచ్చాను. నీవు కూడా వచ్చావు. నన్ను చూసి కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయావు. నాకు చాలా కోపం వచ్చింది నీతో అస్సలు మాట్లాడ కూడదు అనుకున్నాను. మా అమ్మ కూడా ‘ఎందుకలా చేస్తోంది ఆ అమ్మాయి అన్నది’ “అన్నది దివ్య. “ఓహో ఇప్పుడు అర్థమైంది నాకు. మీరు ఎందుకు అలా అంటున్నారో. మా చెల్లి ఇన్ని రోజులు చెన్నై లో ఉండేది. ఈ మధ్యనే హైదరాబాద్ కి వచ్చింది. తన వెళ్లినట్టుంది సంతకు నేను చూడలేదు. తనను చూసి నువ్వు పొరపాటు పడి, నేనే అనుకొని ఉంటావు. అదే విధంగా దివ్య వాళ్ళ అమ్మ కూడా మా చెల్లిని చూసి నేను అనుకోని పొరపాటు పడి ఉంటారు” అన్నది నవ్వుతూ ఉదయ.”తప్పు కప్పిపుచ్చుకునేందుకు నీవు కథలు చెప్తున్నావా” అన్నారు ఇద్దరు ఒకేసారి. “లేదు, నేను నిజమే చెప్తున్న. మామూలుగా చూస్తే మా చెల్లి సంధ్య నేను అచ్చుగుద్దినట్టు ఏముండము. కానీ కొత్త వాళ్ళకి మేము ఒకేలా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి మీకు కూడా అలాగే అనిపించింది అంటే వింతగా ఉంది” అన్నది ఉదయ. అమ్మ బాబోయ్ ఇన్ని రోజులు నీతో స్నేహం చేసిన నేనే పోల్చుకో లేదంటే అంత దగ్గర పోలికలున్నాయన్నమాట. నేను అందుకే పొరపడ్డట్టున్నాను” అన్నది దివ్య. “నీవు పొరబడటం ఏంటి తల్లి. మేమిద్దరం ఒకరిమే అనుకుని కంప్యూటర్ కూడ పొరబడింది” అన్నది ఉదయ.”ఏంటి వింతగా ఉందే మీ కథ ఎప్పుడు ఎక్కడ పొరపడింది కంప్యూటర్” అన్నది సరిత.
పాస్పోర్ట్ కొరకు నేను అప్లై చేశాను. నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది. నేను ఆల్రెడీ తీసుకున్నానని వచ్చింది. నేను పాస్పోర్ట్ తీసుకోలేదు బాబు అంటే వాళ్ళు నమ్మరు. లేదు ఆరునెలల క్రితం మీకు పాస్పోర్ట్ పంపించాము. మళ్లీ మళ్లీ అప్లై చేస్తే అదో పెద్ద నేరం అవుతుంది. అన్నాడు అక్కడి ఆఫీసర్. మీకు పాస్పోర్ట్ ఆరు నెలల క్రితమే పంపిస్తే నేను మళ్లీ ఎందుకు అప్లై చేస్తాను. నేను ఇప్పుడే అప్లై చేశాను. ఇదే మొదటిసారి ఇక్కడికి రావడమని చెప్పాను. కానీ ఆ ఆఫీసర్ నమ్మలేదు”, “మీరు మళ్ళీ మళ్ళీ పాస్పోర్ట్ తీసుకోవడం ఎంత పెద్ద నేరమో తెలుసా. ఏదో మొదటిసారని వదిలి పెడుతున్నాను మర్యాదగా వెళ్ళండి” అన్నాడు.
“మాకు కంప్యూటర్ లో కూడా మీ ఫోటోతో సహా ఫీడ్ అయ్యింది. మేము మీ పైన కంప్లైంట్ చేస్తే చాల ఇబ్బందులలో పడతారు జాగ్రత్త” అన్నాడు. నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది. మా చెల్లి ఆరు నెలల క్రితం పాస్పోర్ట్ తీసుకున్న విషయం జ్ఞాపకం వచ్చి “మా చెల్లెలు ఆరు నెలల క్రితం పాస్పోర్ట్ తీసుకున్నది. తను కూడా నాలాగే ఉంటుంది. మీరు పొరబడినట్లున్నారు” అని అతనికి అర్థమయ్యేలాగ చెప్పాను. అయినా అతను “నేనంటే పొరపడతాను కానీ కంప్యూటర్ పొరపడదు కదా” అన్నాడు.”సరే నేను మీకు ప్రూఫ్ చూపిస్తానని మా చెల్లి, మా అమ్మానాన్నలతో నేను దిగిన ఫోటోలు చూపించాను. అయినా అతను ఒప్పుకోక పోయేసరికి మా చెల్లిని బ్రతిమాలి పాస్పోర్ట్ తో సహా పాస్పోర్ట్ ఆఫీస్ కి తీసుకెళ్ళి డైరెక్ట్ గా చూపితే గాని వాళ్లు నమ్మలేదు. మామూలుగా చూస్తే మేము మరీ ఒకేలా అచ్చుగుద్దినట్టు ఉండము. కానీ చాలామంది పొరబడుతుంటారు. అంతెందుకు కంప్యూటరే పొరపడింది అంటే మీరు పొరపాటు పడటంలో తప్పులేదు” అని ఉదయ ముగించింది. “అమ్మ బాబోయ్ మీది చాలా పెద్ద కథే ఉంది. అంటుండగానే ఉదయ చెల్లెలు సంధ్య అక్కడికి వచ్చింది. సంధ్యను చూసి దివ్య, సరిత ఇద్దరు ఆశ్చర్యపోయారు. సంధ్య “అక్కా మొన్న శిల్పారామంలో ఈ అమ్మాయి ఎందుకో నన్ను అదే పనిగా చూస్తుంటే నాకు కొంచెం ఇబ్బందనిపించి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాను. ఈ మధ్య లిఫ్ట్ దగ్గర కూడా ఇద్దరు ముగ్గురు నన్ను చూసి పరిచయమున్నట్టు నవ్వుతున్నారు. నాకు ఎందుకో అర్థం కావట్లేదు. అంటే వాళ్లంతా నీకు తెలిసిన వాళ్ళన్నమాట. ఇక ఇప్పటి నుండి ఎవరు నవ్వినా, ఎవరు పలుకరించినా నేను కూడా పరిచయం ఉన్నట్టే నవ్వెస్తాను” అన్నది సంధ్య. ఆ పని చెయ్ తల్లీ, లేకపోతే వీళ్లంతా నాకు పొగరు ఎక్కువ అయిందని వాళ్లతో మాట్లాడట్లేద అనుకుంటున్నారు” అన్నది ఉదయ. ఉదయ మాటలకు అందరూ నవ్వేశారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!