ప్రేమ ఎంత మధురం

ప్రేమ ఎంత మధురం

రచన: తిరుపతి కృష్ణవేణి

శృతి, కీర్తి మంచి స్నేహితులు, పైగా కొంత కాలంగా రూమ్ మేట్స్ కూడా! ఇద్దరూ, సాప్ట్ వేర్ ఉద్యోగులే! ఆ రోజు సెలవు దినం కావటం వలన కీర్తి వచ్చే రాఖీ పౌర్ణమి పండుగ నాటికి కావలసిన సరుకులు, వస్తువులు, రాఖీలు తీసుకొని వస్తానని చెప్పి బజారుకు వెళ్ళింది.
శృతి టీవీ చూస్తూ ఆ వచ్చే పాటలకు అనుకూలంగా రాగాలు తీస్తూ ఇల్లంతా సర్దుకుంటూ వుంది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది!.
కీర్తి షాపింగ్ ముగించుకుని త్వరగానే వచ్చిందే ? అనుకుంటూ, ఏంటే?
అంత త్వరగా వచ్చావు?అప్పుడే నీ షాపింగ్ పూర్తి అయ్యిందా ? అంటూ తలుపు తెరిచి, ఒక్కసారిగా నిర్ఘాంత పోయి అలానే చూస్తూ, వుండి పోయింది. హలో! మేడమ్! కీర్తి లేదా? అన్న పిలుపుతో తేరుకొని తడబడుతూ కంగారుగా, హా! వుందండీ! కాదు, కాదు లేదండీ! ఇప్పుడే బయటకు వెల్లింది. మీరెవరు? వచ్చే టైమ్ అయింది. కూర్చుంటారా? అని తడబడుతున్న మాటలతో ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది శ్రుతి. అబ్బే లేదండి? నేను మళ్ళీ వస్తాను. అంటూ అక్కడి నుండి బయలు దేరాడు.
ఆ యువకుడు వెళ్తుంటే అలానే చూస్తూ వుండి పోయింది శ్రుతి. ఏమిటి! అలా ప్రవర్తించాను. నాకు తెలియకుండానే , ఆ వ్యక్తి ముఖంలోకి అలా చూస్తుండి పోయాను. అలా చూడటం సభ్యత కాదు అని తెలిసినా, ఆ ముఖంలో కనపడుతున్న ఆకర్షణకు,ఎందుకో! తల తిప్పుకోలేక పోయాను. అతను ఏమనుకున్నాడో ఏమో ? అని మనసులోనే నొచ్చుకుంది శ్రుతి. చేస్తున్న పనిని కూడా మరచి పోయి అతని ఆలోచనలలోనే మునిగి పోయింది.
ఎంత అందంగా వున్నాడో ? అనుకొని,బయట ఎంతో మంది యువకులను చూస్తూనే ఉంటాను! కానీ ఎవరూ నన్ను ఇంతగా ఆకట్టుకున్న వారు లేరు.? ఎంత వద్దనుకున్నా తన రూపం, తన ఆలోచనలతోనే మది నిండి పోయింది.

ఆ యువకుడు బహుశా కీర్తికి స్నేహితుడు అనుకుంటా? ముఖంపై చిరునవ్వు, పెద్ద పెద్ద కళ్ళు, రింగుల జుట్టు, మంచి అందగాడు, ఆజానుబాహుడుకూడా!
ఏమిటి ఈ ఆలోచనలు? ఎప్పుడూ ఎవరి గురించి ఇంతలా ఆలోచించలేదు.! అతను ఎవరో! ఏమిటో? తెలియకుండా ఇలా ఆలోచించటం కరక్టు కాదు. ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో?
ఏమైనా కీర్తి అదృష్టవంతురాలు, కీర్తికి ఏమి అవుతాడో? ఏమో? మొత్తానికి మంచి స్నేహితుడు దొరికాడు. అని అనుకొని, తన ఆలోచనలకి స్వస్తి పలికి పనిలో నిమగ్నమైంది శ్రుతి.ఇంతలో బజారు నుండి ఇంటికి వచ్చిన కీర్తి వస్తూనే
ఏంటే శ్రుతి? అన్నయ్య వచ్చి వెళ్ళాడట, ఏమన్నాడే?
నీకు చెప్పలేదు. కదూ! అతను మా అన్నయ్య కార్తీక్.
శ్రుతి మనసులో ఆనంద పడుతూ ఓహో!ఆయన మీ అన్నయ్యా ? ఎప్పుడూ చూడలేదు కదే?అందుకే గుర్తు పట్టలేక పోయాను, అంది శ్రుతి. అమెరికాలో చదువు పూర్తి చేసుకొని ఈ మధ్యనే ఇండియాకు వచ్చాడులే ? ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నంలో వున్నాడు.
అని తన అన్నయ్య వివరాలు చెప్పింది కీర్తి.
శృతికి ఎంత వద్దని వారించినా తన మనసు మాట వినటం లేదు. కళ్ళు మూసినా తెరిచినా కీర్తి వాళ్ళ అన్నయ్య రూపమే కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. పైగా కీర్తి అన్నయ్య అని తెలిసాక మరి కాస్త ఆలోచనలు ఎక్కువ అయ్యాయి.
అలా నాలుగైదు రోజులు గడిసాయి. రాఖీ పౌర్ణమి రానే వచ్చింది.
షాపుల ముందు జనం బారులు కడుతున్నారు. మహిళలు యువతులు పిల్లలతో నగరమంతా, సందడిగా ఉంది.
కావసిన సామాగ్రి అంతా ముందే రెడీ చేసుకున్న కీర్తి,శ్రుతి రూంలోకి వచ్చి ఏమి చేస్తున్నావే?రేపు రాఖీ పౌర్ణమి కదా ! మా ఇంటికి వెళ్ళి అన్నయ్యకు రాఖీ కట్టి వద్దాము. ఏమైనా పనులు వుంటే ఈ రోజే పూర్తి చేసుకో ! సరేనా! రేపు రానంటే కుదరదు. ఇద్దరం వెళ్ళి రాఖీ కట్టి వద్దాము. అన్నయ్య చాలా సంతోషిస్తాడు. అన్నది కీర్తీ. ఎందుకో కీర్తి మాటలు శృతికి ఏ మాత్రం రుచించలేదు.
ఈకార్యక్రమానికి ఎదైనా చెప్పి తప్పించు కోవడం మంచిది. లేదంటే కొంప మునుగుతుంది. నా ఆశలన్నీ అడియాశలు గానే మిగిలి పోతాయి. అని మనసులోనే అనుకొని ఎలా తప్పించు కోవాలా? అని తన ఆలోచనలకి పదునుపెట్టింది. మియాపూర్ లో వున్న మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి తమ్ముడికి రాఖీ కట్టి రావాలే! ఈరోజు వెళ్ళి రేపు వుదయమే వస్తానే! నువ్వు రడీగా వుండు, నేను వచ్చిన వెంటనే వెళదాము అంది శ్రుతి.
హమ్మయ్య ఇప్పటి వరకు ఎలాగో తప్పించు కున్నాను. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు. అనుకొని పిన్ని వాళ్ళ ఇంటికి బయలు దేరింది.అలా వెళ్లిన శ్రుతి, కీర్తికి చెప్పినట్లు తెల్లవారి రాలేక పోయింది. ఆ మరుసటి రోజు ఉదయమే నేరుగా కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళి, రాలేక పోయినందుకు సారీ చెప్పింది. అలాగే కీర్తి, వాళ్ళ అన్నయ్య కార్తీక్ ను శృతికి పరిచయం చేసింది. సాయంకాలం వరకు అక్కడే కబుర్లు చెప్పుకొని, కీర్తి, శృతి లు తిరిగి తమ రూంకి చేరుకున్నారు. అలా మొదలైన స్నేహం రోజురోజుకు బలపడసాగింది.శ్రుతి బాగా డబ్బున్న అమ్మాయి. ఒక్కగానొక్క కూతురు అవటం వలన తల్లి దండ్రులు చాలా గారాబంగా పెంచారు. అలా అని ఎప్పుడూ గర్వాన్ని ప్రదర్శించదు. అందరితో ఎంతో స్నేహంగా ఉంటుంది. చాలా సున్నిత మనస్కురాలు పెద్దల యెడల అణుకువ, గౌరవభావం కలిగి వుంటుంది.
అలాగే కీర్తిది ఓ మధ్య తరగతి కుటుంబం ! మంచి నడవడిక,సౌమ్యత, తెలివి తేటలు కలిగిన అమ్మాయి.కీర్తి అన్నయ్య కార్తీక్ కూడా చాలా తెలివైన, చురుకైన వాడు. చెల్లెలు కీర్తిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. అందరితో స్నేహ పూర్వకంగా సరదాగా మాట్లాడుతూ వుంటాడు. కీర్తి నాన్న ఆనందరావు గారు ఓ ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. అమ్మ వందన పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఇంట్లోనే ఉంటుంది. ఆస్తి పాస్తులు లేక పోయినా తమ పిల్లలే తమ ఆస్తులు అని ఎంతో గర్వంగా చెప్పుకుంటూవుంటుంది. కులమతాల పట్టింపులు డబ్బు, హోదా వీటన్నిటి కన్నా మనిషికి మంచి తనం, మానవత్వ విలువలే, ముఖ్యమని ఆమె గట్టి నమ్మకం !
అందుకే ఆ కుటుంబం అంటే శృతికి ఎంతో గౌరవ భావం ఏర్పడింది.కాలం గడిచే కొద్దీ శృతికి కార్తీక్ తో ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మార సాగింది.కార్తీక్ లేని జీవితాన్ని ఊహించలేక పోతూంది.
తన మనసులోని ప్రేమను ఎలా వ్యక్త పరచాలి? అసలే ఇంట్లో కులమతాల పట్టింపులుఎక్కువ?
కాలము ఎంత మారినా, సమాజంలో మాత్రం మార్పు అన్నదే, రావటం లేదు.? చదువు సంస్కారం వున్న తల్లి దండ్రులే, తమ పిల్లల ఇష్టా, ఇష్టాలను పట్టించుకోవడం లేదు. ఈ కారణంగానే ఎంతో మంది యువ జంటలు బలి అయిపోతున్నారు.
మరి కొంత మంది, తల్లిదండ్రుల వత్తిళ్లకు తలఒగ్గి ఇష్టం లేని పెళ్ళిల్లు చేసుకుని మౌనంగా కుమిలిపోతున్నారు. ఎప్పుడు మారుతుందో! ఈ సమాజం?
తన తల్లి దండ్రులు కూడా అదే కోవకి చెందిన వారు. కార్తీక్ తో తన పెళ్ళికి ఒప్పుకోరు? శ్రుతి ఆలోచనలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి.అసలు కార్తీక్ మనసులో ఏముందో ? మా మధ్య ప్రేమా, పెళ్ళిళ్ల విషయాల గురించిన చర్చలు ఇప్పుడు జరగలేదు. మంచి స్నేహితులుగా ఉంటున్నాము.
కార్తీక్ మనసులో ఏముందో అడుగుదాం!అనుకుంటే తన స్పందన ఎలా వుంటుందో? తెలియదు?ఇంత కాలం చేసిన స్నేహానికి దూరమై పోతానేమో ! అని అనుకొని తన ప్రేమను మనసులోనే దాచుకుంటూ వస్తూంది,శ్రుతి. ఈ రోజు ఎలాగైనా కార్తీక్ తో మాట్లాడాలి. అనుకొని ఉదయాన్నే లేచి త్వర త్వరగా రెడీ అయి కీర్తి వాళ్ళ ఇంటికి బయలు దేరింది శ్రుతి. ఇంతలో కీర్తి దగ్గరనుండి ఫోన్!
మీ ఇంటికే వస్తున్నానే ! అని చెప్పుదామని ఎంతో సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసిందిశృతి.
ఇంతలో కీర్తి చెప్పిన విషయం విన్న శ్రుతి ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఎంత పొరపాటు చేసాను?
ముందే కార్తీక్ తో మాట్లాడి వుంటే బాగుండేదేమో? అయి పోయింది, అంతా అయి పోయింది.
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమో? అని అనుకొని మనసులోనే గుండెలవిసిపోయెలా రోధించింది శ్రుతి.రోజులు భారంగా గడుస్తున్నాయి. ఆ రోజు నుండి శృతికి నిద్రాహారాలు లేవు. ఇన్ని రోజులు తన మధిలోని ప్రేమను ఎవరికి చెప్పుకోలేక పోయింది. ఇప్పుడూ, గుండెలోని బాధను ఎవరికి చెప్పుకోలేని పరిస్ఠితి! కీర్తికి ఫోన్ చెయ్యటం కూడ మానేసింది. కీర్తి కూడా పెళ్ళి పనుల హడావుడిలో పడి పోయినట్లుంది. పెళ్ళి దగ్గర పడుతున్న కొద్దీ శ్రుతి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నట్లుగాఉన్నాయి. ఇక చేసేది ఏమీ లేదు.
ఈ జీవితం ఇక ఇంతేనేమో! అని మనసులో అనుకుంటూ, ఉండగా, ఫోన్ రింగ్ అవుతూంది…కానీ శృతికి ఫోన్ లిఫ్ట్ చేయాలి అనిపించలేదు. మనసు అసలు బాగోలేదు. ఎవరితోనూ మాట్లాడాలని లేదు. కానీ ఫోన్ అదే పనిగా రింగ్ అవుతూండటంతో విసుగ్గా వెళ్ళి ఫోన్ తీసింది. కీర్తి దగ్గర నుండి ఫోన్!
హాఁ! ఏమి చెప్పుతుందిలే?. పెళ్ళికి రమ్మని చెప్పుతుంది.
దానికేం తెలుసు? నా బాధ! అనుకుంటూ, ఫోన్ లిఫ్ట్ చేసింది. ఫోన్ లో కీర్తి చెప్పిన విషయం విన్న తర్వాత శృతి మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది. లోలోపలే!ఎంతో ఆనందాన్ని ఆణుచుకుంటూ , పైకి మాత్రం అయ్యో! అలా, ఎలా జరిగిందే? అంది.అంతా నా మంచికే జరిగినట్లు వుంది. ఇక ఆలస్యం చేయకుండా,
రేపు ఎలాగైనా కార్తీక్ ను కలవాలి అనుకుంది.
కార్తీక్ కు ఫోన్ చేసింది. ఇద్దరూ కలిసి అనుకున్న ప్రదేశానికి చేరుకున్నారు. కార్తీక్, పెళ్ళిఆగిపోవటం వెనుక జరిగిన విషయాలు అన్నీ శృతికి తెలియ చేశాడు. పెళ్లి కూతురు “తాను మరో వ్యక్తిని ప్రేమించించానని” తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని తన మనసులో విషయాన్ని తెలియజేసింది!
ఆమె ప్రేమను గౌరవించి , నాకే,”ఈ పెళ్లి ఇష్టంలేనట్టుగా చెప్పి” తప్పించాను. అని శృతికి వివరించాడు కార్తీక్.
విషయం తెలుసుకున్న శ్రుతికి కార్తిక్ పై ఉన్న గౌరవ భావం మరింతగా పెరిగింది.
ఇద్దరూ, ఒకరి అభిప్రాయాలు ఒకరు, తెలుసుకొని మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఒకరిపై ఒకరికి వున్న ప్రేమను తెలియచేసుకున్నారు. వచ్చిన చిక్కల్లా శ్రుతి తల్లి దండ్రుల తోనే!
పోనీలే!కార్తిక్ తో అయినా విషయం చెప్పగలిగాను. ఇంత కాలంగా ఎంతో మౌన వేదన అనుభవించాను. ఇప్పుడు నా మనసు ఎంతో తేలికగా వుంది ప్రేమించిన వారితో ఆ ప్రేమ ఫలిస్తే ఎంత మధురంగాఉంటుందో ఇప్పుడే తెలిసింది.
నిజంగా ప్రేమ ఎంత మధురం.!
త్వరలోనే పెద్దలని కూడా ఒప్పించి వాళ్ళ ఆశీర్వాధం తోనే పెళ్ళి చేసుకుందాం అనుకొని ఎంతో సంతోషంలో ముణిగి పోయారు శృతికార్తిక్ లు .

(సమాప్తం )
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!