ప్రేమ – పేరంటం

ప్రేమ – పేరంటం

కరోనా కాలమాయే…
పుణ్య పర్వదినమాయే ..!

ముద్దైన ఇంతికేమో తగని
చాదస్తమాయే…వ్రతమేదో
చేయగా తలంచెనాయే..!

ఇంటికి ఇంటికీ నడుమన
రాకపోకలే బొత్తిగా కరువాయే..
ఇచ్చు తాంబూలమందుకొనగ,
పేరంటాండ్రే రాకపోతిరాయే..!

నా ముద్దుల ఇంతి మోము
చిన్నబోయెనాయే..చిన్నగా
చెక్కిళ్లు ఎరుపెక్కెనాయే..
నా మనసు ఝల్లుమనెనాయే.!

కంచి పట్టు చీర చక్కంగా జుట్టి,
మీసాల ముంజేతికి గాజుల
గలగలలను జతగట్టి.. కుంకుమ
బొట్టు నుదుటన నిండుగ బెట్టి..,

మూతికున్న మగసిరిని పైటకొంగు
ముసుగు మాటున దాచిపెట్టి,
రాని వయ్యారాన్ని నడకకు అంటగట్టి,
మాయా శశిరేఖ పోలిన పాదాలను
నా పడతి ముందు చాచిపెట్టగా.,

పసుపును అద్దుతూ..అనుమానంగా
ఎవరంటూ ఒక్కసారిగా మేలుముసుగు
తప్పించి చూచి…ఘొల్లుమంటూ పడిపడి
కడుపుబ్బ నవ్వెనే నా మనసైన పూబంతి.,
నా అవస్ధను జూచి.. తన బాధనంతా మరచి.,
ఆత్మీయంగా హత్తుకొనెనే తనకై నా ప్రేమ తెలిసి.!

      రచన :: సత్య కామఋషి ‘రుద్ర’

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!