ప్రేమలో లోపం ఎవరిది?

ప్రేమలో లోపం ఎవరిది?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

   అది మధ్యాహ్నం సమయం కావడం తో ఎండ బాగా ఉంది. అప్పుడే ప్రకాష్ స్కూటర్ మీంచి ఓ కుక్క అడ్డు వచ్చి పడడంతో విజయవాడకి పొలిమేరలో ఉన్న ఓ ఆసుపత్రికి ఎవరో బాటసారి సాయం తో ఆటో లో వెళ్తున్నాడు. కొంచెం దెబ్బలు బాగానే తగిలాయి. అప్పుడే భార్య లీల కి ఫోన్ చేసి. హా లీలా! స్కూటర్ మీంచి పడ్డాను, హాస్పిటల్ కి వెళ్తున్నా, మళ్లీ కాసేపు ఆగి ఫోన్ చేస్తా అని పెట్టేశాడు. పాపం లీల కి ఎంతో ఆందోళనగా ఉన్నా ఏమీ మాట్లాడక ఉండిపోయింది. కన్నీళ్లు కారుస్తూ గతం లోకి వెళ్ళింది. అది ఓ నాలుగు సంవత్సరాల క్రితం. హైదరాబాద్ లో పెళ్లి చూపులు, పెళ్లి నిశ్చయం అయ్యాకా లీల, ప్రకాష్ ఓ పార్కు లో కలిశారు, సరదాగా. లీల: ఏమండీ, ఎలా ఉన్నారు.
ప్రకాష్: హై ఏమండీ ఏమిటీ, ఏదో ముసలి వాళ్ళలాగా, చక్కగా ప్రకాష్ అను చాలు.
లీల: కాదండీ, మా కుటుంబంలో అలా భర్త ను పేర్లతో పిలవము అంటూ సన్నగా అంది.
ప్రకాష్: అదేం కాదు, పర్లేదు పైగా పేరుతో పిలిస్తే ప్రేమ ఎక్కువ ఉన్నట్టు అన్నాడు.
లీల: సరే అంది అతి కష్టం మీద.
అలా కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. అంతే కాదు పెళ్లికి ఇంకా మూడు నెలలు సమయం ఉండడంతో అప్పుడప్పుడు కలవడం, షాపింగ్లు అవీ ఇవీ అంటూ సమయం ఇట్టే గడచి పోయింది.
పెళ్లి అయ్యాక కొన్నాళ్ళు మిగతా అందరు జంటల్లాగా  ఎంతో ఉల్లాసంగా, హాయిగా గడుస్తూ ఉండేది. ఇద్దరూ ఉద్యోగాలుతో సమయం తెలిసేది కాదు. అలా ఓ ఆరు నెలలు గడచి పోయాయి. ఇంతలో లీల బిడ్డకు జన్మ నిచ్చే అమ్మ గా మారుతుందని తెలియడం, అత్తా, అమ్మా వాళ్ళు కూడా విజయవాడ లోనే ఉండడంతో, చేసే ప్రైవేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి అత్తింటికి రావడం, మరో రెండు నెలలకే ప్రకాష్ కూడా ఉద్యోగం మానేసి, ఇక్కడే విజయవాడలో వ్యాపారం మొదలు పెడతానని వచ్చేయడం జరిగి పోయింది. కాలం దేనికోసం ఆగదు కదా. లీల మాత్రం తను కోరుకోకుండానే అన్ని మార్పులు జరిగి పోతున్నా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. తరువాత బాబు పుట్టడం, వాడి సంరక్షణ లో సహజంగానే ప్రతి స్త్రీ లాగే సమయం తెలీకుండా రోజులు గడచి పోతున్నాయి. ఈ లోగా ప్రకాష్ ప్రవర్తన లో ఎన్నో మార్పులు, తను గమనించనే లేదు. ప్రతీ చిన్న విషయానికి విసుగు, ఏ విషయం మాట మాత్రం పంచుకోక పోవడం, తనకి ఏం కావాలో కనీసం చూడక పోవడం. ఆలోచిస్తే ఏమీ అర్ధం కావడం లేదు. అత్త మామలు స్థితి మంతులు,  మంచివారు కావడం, అమ్మ వాళ్ళు కూడా అదే ఊరు కావడంతో తెలీడం లేదు కానీ తాను ఎక్కడ ఉందో తేలీని పరిస్తితి. ఈ మధ్య ఒకటి రెండు సార్లు చెయ్యి చేసుకునే అంతగా దిగ జారిపోయాడు, కారణం తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేక పోయింది. ఒక్కో రోజు తనతో మాట్లాడాలి అంటేనే చికాకు వచ్చేలా అనిపిస్తోంది. ఎప్పుడు బయటకు వెళ్తాడు, ఎప్పుడు వస్తాడు తెలీదు. తను ఏమీ చెప్పక పోయినా సమయానికి ఉదయం అల్పాహారం, తరువాత భోజనాలు అన్నీ అమర్చాలి. లేదంటే యుద్దమే. అత్త గారు మంచిది కదా, ఆవిడతో చెప్పుకుని బాధ పడేది. లీల కి ఇల్లు తప్ప మరో ప్రపంచం లేకుండా పోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రకాష్ని ఎంతగా ప్రయత్నించి అడిగినా ప్రయోజనం లేకపోయింది. ప్రకాష్ తన పని ముగించు కోవడమే తప్ప ఓ ముద్దు ముచ్చట లేదు. పోనీ బాబు నైనా ప్రేమగా లాలిస్తాడా అంటే అదీ లేదు. అలా అని ప్రకాష్ చెడ్డ వాడు కాదు, ఏ దురలవాట్లు లేవు.  పోనీ ఏదో ఉద్యోగం లేక చేసే వ్యాపారంలో ఏదైనా సమస్య అంటే అదీ కాదు. తన తండ్రి వ్యాపారమే చూస్తున్నాడు. అన్నీ ఆయనే చూసుకుంటారు. ఇక ఓపిక నశించి లీల కూడా నిరుత్సాహంతో మాటకు మాట చెప్పడం నేర్చుకుంది. అలా అయినా మారతాడేమో అని.
లీల ఆలోచనలు అలా ఉంటే ఇక్కడ ఆసుపత్రి కి వెళ్తూ ప్రకాష్ మాత్రం మరోలా ఆలోచిస్తున్నాడు.
కొన్ని రోజుల క్రితం తన స్నేహితుడిని కలిసినప్పుడు ఏంట్రా! చక్కగ ఉద్యోగం అదీ మానేసావ్, మీ నాన్న వ్యాపారం మీద బ్రతకడం ఏమిటీ? అయినా నీ పెళ్ళాం వలనే నీ జీవితం ఇలా తలకిందులు అయింది రా అన్నాడు. దానితో ప్రకాష్ మదిలో విష బీజం మొలకెత్తింది. తను ఏం చేద్దాం అన్నా భార్య వల్ల కలిసిరావడం లేదనీ లేనిపోని అపోహ పెంచుకున్నాడు. అసలు దాని వలనే ఈ ప్రమాదం జరిగింది అనే నీచ ఆలోచన చేస్తున్నాడు. ఉద్యోగం మానొద్దు అని అప్పట్లో లీల ఎంత చెప్పినా వినకుండా వచ్చేసింది తను. వచ్చిన కొత్తలో బుద్దిగా నాన్నకి సాయపడే వాడు. ఈ మధ్య సరిగా అదికూడా చెయ్యడం మానేసి నెపం మాత్రం భార్య మీద వేస్తున్నాడు. అసలు ఆలోచించడం మానేసి తాను బాధ పడుతూ, ఇంట్లో వారినీ ఇబ్బంది పెడుతున్నాడు. ఈ లోగా ఆసుపత్రి రావడం, అక్కడ డాక్టర్ లీల నాన్నగారికి మంచి స్నేహితుడు కావడం తో కాలికి, చేతికి తగిలిన గాయాలకు కుట్లు వేసి, విశ్రాంతి కోసం ఓ గది లో మంచం మీద పడుకో బెడతారు, మత్తుగా ఉంటాడు ప్రకాష్. ఆ డాక్టరే తన మావగారికి ఫోన్ చేస్తే, ఆయన లీలను కూడా తీసుకుని ఆసుపత్రి కి బయలు దేరారు.
కొంత సేపటికి ప్రకాష్ కి మత్తు వదులుతూ చిన్నగా పక్క మంచం మీంచి మాటలు వినబడుతూ ఉంటాయి. ఎవరో ప్రమాదం వలన తీవ్ర గాయాలతో వచ్చినట్టు ఉన్నారు, స్పృహ లో లేడు. అతని వేరే స్నేహితులు ఇద్దరూ మాట్లాడు కుంటున్నారు. వీడికి ఓ సారి ఇలాంటి శాస్తి జరగాలి రా. తెలిసిన వాళ్ళని ఎవరినీ చల్లగా ఉండనీడు. ఏదో తెలిసీ తెలియని జ్ఞానంతో, జాతకాలు తెలుసు, గుడ్డు అనీ లేనిపోనివి చెప్పి సంసారాలు కూల కొడతాడు. మొన్న వీడి స్నేహితుడు ఎవరో ప్రకాష్ టా, వాడికి ఏదో చెప్పి మనసు పాడు చేసాడుట, గొప్పగా చెప్తున్నాడు వెధవ అని తిట్టుకుంటున్నారు.  వీడికి నయమయ్యాకా బుద్ది చెప్దామని అనుకుంటున్నారు. తన పేరు వినే సరికి ప్రకాష్ కొంచెం ఓపిక తెచ్చుకుని తల ఎత్తి చూస్తే, ఆ స్నేహితుడు పనీ పాటా లేకుండా తిరగడం ఒకటి రెండు వ్యసనాలు కూడా ఉన్నాయి అని లీల కాదన్న ఒకప్పటి పెళ్ళికొడుకు అని వీళ్ళ మాటలు ద్వారా తెలిసింది. సిగ్గుతో కృంగిపోయాడు ప్రకాష్. ఇంతలో ఈ రోజు ఉదయం జరిగిన సంఘటన కంటి ముందు మెదిలింది. అమ్మా అని పిలిచాడు ప్రకాష్.
ఏంట్రా అంటూ లోపలి నుంచి వచ్చి అడిగింది వాళ్ళ అమ్మ. చూడు మీ కోడలు ఉద్యోగం వెలగ బెడుతుందిటా, ఇప్పుడు తనకి ఏం తక్కువ జరుగుతోంది అని. పైగా ప్రకాష్ అంటూ నన్ను చులకనగా మాట్లాడుతోంది. ఇంకోసారి ఇలా వాగితే తన్ని, వాళ్ళింటికి పంపెస్తా అని చెప్పి, రుస రుస లాడుతు, టిఫిన్ కూడా చెయ్యకుండా బయటకు వచ్చేసాడు. అప్పుడు కంట తడితో అత్తగారితో చూసారా అత్తయ్య! చేసే వన్నీ ఆయన చేస్తూ, నన్ను తిడుతున్నారు. ఏదో కొంచెం టైమ్ పాస్ కోసం నాన్న కి తెలుసున్న వాళ్ళ స్కూల్కి వెళ్దాం అంటే నానా గొడవ చేస్తున్నారు. కావాలని బలవంతంగా ప్రకాష్ అని పిలిపించుకుని ఇప్పుడు నన్ను అంటున్నారు మీ అబ్బాయి అంది. అవునమ్మా వీడు రోజు రోజుకీ మరీ సన్నాసి లా తయారవుతున్నాడు. మీ మామగారు కూడా సమయం చూసి మాట్లాడతా అన్నారు. కంగారు పడకమ్మా! స్కూల్ లో జాయిన్ అవుదూ గానీ, బాబుని నేను చూసుకుంటా, కొంచెం ఓపిక పట్టు అంది. దానితో కొంచెం ఓదార్పు దొరికి నట్టు అయింది లీలకి. తరువాత కొంత సేపటికి మళ్లీ నిద్రలోకి జారుకున్నడు ప్రకాష్. మరి కొంత సేపటికి స్పృహ వచ్చి చూసే సరికి కాళ్ళ దగ్గర ఏడుస్తూ లీల, చుట్టూ మావగారు, తల్లీ తండ్రి. అత్తగారు మాత్రం బాబుని చూసుకుందుకు ఇంటి దగ్గర ఉన్నారు. లీల ఎంతో మదన పడుతూ అదే పనిగా ఏడుస్తోంది. తప్పంతా తనదే అయినా, లీల మాత్రం ప్రేమ నింపుకుని ఏడుస్తూనే ఉంది.  ఆ క్షణం ఒక్కసారి తను ఎంత దిగిజారి పోయానా అని లోలోపలే సిగ్గుతో చచ్చినంత పని అయింది, ప్రకాష్ కి.  కానీ ఏదో ఆపుకున్నాడు. ఇంతలో డాక్టర్ వచ్చి ఏంలేదు చిన్న దెబ్బలే, మరో గంట ఉండి మీరు ఇంటికి వెల్లిపోవచ్చు అంటారు. దానితో అందరూ మెల్లిగా ఇంటికి వెళ్ళడం, శాంత పడి అవీ ఇవీ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. తను చెప్పే అవసరం లేకుండానే ప్రకాష్ కి అన్ని పరిచర్యలు చేస్తోంది లీల. అందరూ ఉండడం తో ప్రకాష్ కి ఆ రోజు, మరునాడు సాయంత్రం వరకూ లీల తో ఏకాంతంగా మాట్లాడే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది. ముందుగా లీల: సార్రీ అండీ ఇంకేప్పూడ్డు నేను అని ఏకవచనం వ్వాడను, స్కూల్ కి కూడా వెళ్లను, మీరు ఎల్లా చెప్తే అలాగే, అంతా నా వల్లే అంటూ బలవంతంగా మాటలు తెచ్చుకుని అంది.
ప్రకాష్: చూడు లీల నిన్ను బాధ పెడుతున్నది నేను. నువ్వు సారి చెప్తా వేంటి, నన్నే నువ్వు క్షమించాలి అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని జరిగినది అంతా చెప్తాడు. లీల: పొన్లేండి. మీకు విషయం తెలిసింది, ముందు లాగా ఉంటే మనకి అదే చాలు. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి, ఇప్పుడు అవేమీ ఆలోచించకుండా. ప్రకాష్: ఇప్పుడు ఏవండీ కాదు మళ్లీ మునుపటి నీ ప్రకాష్ నే, అలానే పిలు, ఏడి మన బాబు అంటూ దగ్గరకు తీసుకుంటాడు, లీలనీ, బాబునీ. దానితో వారి ఆనందానికి హద్దు లేకుండా, హాయిగా పడుకుంటారు. పట్టిన గ్రహణం విడిచిన పున్నమి రేయిలా అనిపించింది వారికి. అంతా బయట నుంచి ఓరకంట గమనిస్తున్న ప్రకాష్ తల్లీ తండ్రీ కూడా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
అదండీ మన ప్రేమలో లోపం ఎక్కడ ఉంది అనే కథ.
నీతి :: ఎప్పుడూ ఎవరో ఏదో చెప్పారని జీవిత భాగస్వామి మీద అనవసరంగా, అనాలోచితంగా  ద్వేషం పెంచుకో కూడదు. సక్రమంగా మాట్లాడు కుంటే సమస్యలే రావు.

***

You May Also Like

10 thoughts on “ప్రేమలో లోపం ఎవరిది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!