రంగుల మయం

రంగుల మయం

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

హింసకు ప్రతిరూపమైన అరుణం కూడా
కష్టజీవుల భుజాన ఎర్రతువాలై
ధైర్యం నింపే సోదరుడవుతుంది…

మూఢనమ్మకపు ముసుగేసిన పసుపు కూడా
క్రిములను నాశనం చేస్తూ అనారోగ్యాన్ని దరి చేరనీయని వంటింటి వైద్యుడవుతుంది…

సాధువులకు సమదుస్తులై నిలిచిన కాషాయం కూడా
త్యాగానికి ప్రతీకయై సాత్వికతను నింపే
సాంప్రదాయమై నిలుస్తుంది…

ఆకాశాన్ని పులుముకున్న ఆకాశ నీలం కూడా
సకల జీవుల గొంతులు తడిపే
వెన్నెల జలదారలై ప్రవహిస్తుంది…

ముక్కంటి కంఠాన గరళమైన నీలం కూడా
చంద్రుని కాంతికి మెరిస్తూ
వజ్రమై ప్రకాశిస్తుంది….

లేఛాయ రంగైన ఊదా కూడా
అందానికి చిహ్నమై నిలిచి
అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుంది….

మొండిగా పరిసరాల వ్యాపించే హరితం కూడా
పునర్జన్మను ప్రసాదించే అమృతమై
అయోమయాన్ని పోగొట్టి ఆశను పెంచుతుంది….

ఇంద్రధనస్సులో లేని
నలుపు అజ్ఞానానికి ప్రతీక అయినా
నల్లబల్లగా మారి జీవితాన్ని ప్రసాదించే
గురువవుతుంది….

తెలుపు శాంతికి నిదర్శనమై నిలిచి
పాలవెలుగులను ప్రపంచాన విరజల్లి
స్వేచ్ఛగా విహరించే కపోతమౌతుంది….!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!