సరదా కావాలా ?

సరదా కావాలా ?

రచయిత :: మంగు కృష్ణకుమారి


హఠాత్తుగా హార్ట్ ఎటాక్ తో పోయేడు అచ్చతరావు.  భార్య రాగిణి తెలివితప్పి పడిపోయింది.  కూతురు దగ్గర్లోనే ఉంటుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం. అన్న అమెరికా నించీ వచ్చిన దాకా చాలా జాగ్రత్తగా తల్లిని చూసుకుంది. అన్న వచ్చినా అంత్య క్రియలకి, కర్మకాండలకీ సకల సహాయాలు చేసింది.  పదో రోజు సంప్రదాయాలు పాటించాలని రాగిణికే నమ్మకాలు పట్టింపులు లేవు. అయినా ఆమె వియ్యపురాలు ఒప్పుకోని కారణాన మెళ్ళో సూత్రాలు, మట్టెలు తీసేసి తనని కొడుకు చూసిన తరవాతే ఇంట్లో తిరిగింది. అసలు దుఖం రాగిణికి ఎదర ఉందని ఆమెకి తెలీలేదు. అందరూ వెళిపోయేరు.  అన్నతమ్ముడు రమ్మంటే నాలుగు రోజులు వెళ్ళి వచ్చింది.  కళ్ళల్లో క్షణం క్షణం అచ్చుత్ కనిపిస్తున్నాడు. ఆ బాధకి తోడు మరో బాధ ఎదురయింది. ఇన్నాళ్ళు ఒక ముత్తయుదువు హోదాతో ఎపార్ట్మెంట్లో తిరిగింది. కాళ్ళకి పసుపు రాసి, బొట్టుపెట్టి తాంబూలాలు అందరూ ఇచ్చి పుచ్చుకొనేవారు.  మొదట్లో దుఖంతో పోల్చుకోలేకపోయింది. సంవత్సరీకాలు కూడా అయిపోయేయి.

రాగిణి మెల్లిగా మనుషుల్లో పడదాం అని ప్రయత్నిస్తున్నాది. పెద్ద పెట్టున నోము చేసుకుంటూ వదినగారు తనకి కబురయినా పెట్టలేదు.

రాగిణి బాధపడిందని తెలిసి “ఇది కైలాస గౌరి నోమండీ. తనకి బొట్టుఎలా పెడతాను?” అందిట. మనవడిని ఉయ్యాల్లో వేస్తూ,  కింద పోర్షన్ ఆవిడ మాటవరసగా రమ్మనే అంది.  కానీ దూరంగా కుర్చీ వేసి కూచోమంది.  ఎందులోనూ రాగిణి చెయ్యి పడకుండా చూసుకుంది. ఇహ శ్రావణ మాసం పూర్తిగా రాగిణికి నిరాశే. ఒక్కళ్ళు వాయనం ఇవ్వలేదు. రమ్మనలేదు. ‌సమాజం ఎప్పుడూ ఇలాగే ఉంది.  రాగిణికి ఇప్పుడు తగిలింది కాబట్టి బాధపడ్డం మొదలెట్టింది.

కూతురు చూడ్డానికి వచ్చి అంది. “అమ్మా, నువ్వు ఏమీ అనుకోకపోతే, దేనికి ప్రతీ పేరంటానికి ఎగబడతావుట? నాన్న బతికి ఉన్నపుడు దక్కిన మర్యాదలు ఇప్పుడూ దక్కుతాయా? మన సమాజం నియమాలు కదా ఇవన్నీ? ఎందుకు బోధపరచుకోవూ”

“అది కాదే రోజులు మారేయి. మా ఎపార్టమెంట్ లో స్త్రీవాదులం అని చెప్పుకుంటారు కొందరు. మాకే పట్టింపులూ లేవంటారు ఎందరో? కనీసం వాళ్ళయినా ఓ హారతి పళ్ళెం పట్టుకొమనరు.  బాధకాదా?”

“కబుర్లు చెప్పినంత తేలిక కాదు ఆచరించడం. అయినా నీకు ఏ సెంటిమెంట్ లేనప్పుడు ఈ సరదాలు దేనికమ్మా? ఇవీ సెంటిమెంటల్ ఆచారాలే కదా? ఒకటి అక్కర లేదు. ఒకటి కావాలీనా. ఈ మాట నేను కాదు మా అత్తగారు అన్నారు.

ఈ సరదాలు వదులుకో… కాలక్షేపానికి స్వచ్ఛంద సంస్థల్లో చేరు.  ఎవరికయినా ఉచితంగా చదువులు చెప్పు.  నోములు, వ్రతాలు వీటిల్లో పాల్గోవాలనే సరదాలు చంపుకో”ఛెళ్ళున తగిలినట్టయినా రాగిణి ఆలోచనలో పడింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!