స్వచ్ఛమైన ప్రేమ

స్వచ్ఛమైన ప్రేమ

రచన: ఉమామహేశ్వరి యాళ్ళ

చక్కని పల్లెటూరు. చుట్టూ పంట పొలాలు మధ్య సందడి చేసే ఇళ్ళు. అందరూ ఒకటే కుటుంబంలా కలసిమెలసి మెలుగుతున్నారు. వాళ్ళనలా చూసినవారెవరూ వారు వేరు వేరు కుటుంబాలవారని అనుకోలేరు. ఆ సందడంతా మరింత రెట్టింపు చేస్తూ వచ్చాడు పోస్ట్ మాన్ సుబ్బారావు ఉత్తరాల సంచీతో.

అంతే పెళ్ళీడు పిల్లలంతా చుట్టూ చేరారు. వాళ్ళ వాళ్ళ ఉత్తరాలతో గంతులేస్తూ, సిగ్గుపడుతూ, సంతోషపడుతూ పరిగెత్తారు.

సుబ్బారావు ముందు ధీనంగా చూస్తుంది ఓ అమాయకపు తల్లి సూరమ్మ. సుబ్బారావు ఆమెకి మనియార్డర్ వచ్చిందని చెప్పి వేలిముద్ర వేయించుకుని వచ్చిన డబ్బు ఇచ్చి కదిలాడు. సూరమ్మ కళ్ళలో తెరలు తెరలుగా నీళ్ళు తిరగడంతోపాటు. గతంలోనికి వెళ్ళింది.

అవును లేక లేక పుట్టిన ఒక్కగానొక్క నలుసు వీరేష్ . ఎంతో సంబరపడి కోటి ఆశలతో చదువు చెప్పించి మంచిగా పెంచుకున్నారు. ఎన్నో అందమైన ఆశలు వీరేష్ చుట్టూ అల్లుకున్నారు‌. అంతలో ఒకానొక రోజు. వాళ్ళ గుండెల్లో చిచ్చు పెడుతూ బయటపడిన ఒక నిజం. ఆ తండ్రి గొంతులో గరళంలా మారిన సత్యం. దానికోసమే ఆ ఆలుమగల కోచులాట. అవును ఇలాంటి‌ కొడుకు పుట్టడం మన తప్పు కాదు . లోకంతోపాటు మనమూ కాకుల్లా పొడుచుకు తింటావుండే ,పుట్టుకతో వచ్చిన లోపానికి ఎద్దేవా చేత్తాంటే ఆడు బతికేదెట్టాంట అంటూ భర్త యాదయ్యతో వాదులాడుతుంది సూరమ్మ.

అంతే ఆ గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. ఉంటే వీరేష్ ఉండాలి లేదా యాదయ్య అయినా ఉండాల ఇంట్లో అనే కాడికి పెరిగింది. అంతే ఆ క్షణం. సూరమ్మ తీసుకున్న నిర్ణయం ఈనాడిలా మనతో వారి సంఘటనని గురించి మాట్లాడిస్తుంది‌.

నవ మాసాలు మోసి కని పెంచింది . కన్న మమకారాన్ని వదులుకోలేకపోయింది. భర్త లేకున్నా పరవాలేదు . ఇలాంటి పరిఅ్థితుల్లో కొడుక్కి అండగా నిలవాలని అనుకుంది . అంతే ఆక్షణం భర్తను విడచి, వీరేష్ తో ఈ పల్లెకి వచ్చేసింది. అన్ని పరీక్షలూ చెయించింది. అన్నీ వీరేష్ ప్రకృతికి విరుద్ధమనే తేల్చాయి. మూడవ లింగంగా తెలిపాయి. అది మొదలు పిల్లవానికి ఎన్నెన్నో చెప్పుకొచ్చింది. పట్నం పోయి తనలా ఉన్నవారిని గురించి కలిసి, డాక్టర్లను కలిసి లోపాన్నెలా అధిగమించాలన్న సలహాలను తీసుకుంటూ చదివించుకుంది. ఆ బిడ్డ ఈనాడు అందర్లా రోడ్లలో అడుక్కోవడంలేదు. మంచిగా చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్నాడు. తనని నమ్మి భర్తను కాదని వచ్చిన తల్లికి సర్వస్వం అయ్యాడు. ఇదే కదా తల్లి ప్రేమంటే. ఇదే కదా బిడ్డకి తల్లిదండ్రులపట్ల ఉండాల్సిన మమతన్నా బాధ్యతన్నా.

ఆగండాగండి. చెప్పడం మరచిపోయా’ మన హీరో వీరేష్ ప్రయోజకుడు కాగానే చేసిన మొట్టమొదటి పని తన తల్లిదండ్రులని కలపడమే‌ . తన తండ్రికి కాలం అంతా నేర్పింది. ఇపుడు వీరేష్ అందరిలా ఎవరూలేని అనాధ కాదు. అందరూ హేళన చేసే వ్యక్తి కాదు. అందరిచేతా నింధింపబడినవాడు కాదు. అవును అతడు ఎల్.జి.బి.టి కమ్యూనిటీకి చెందినవాడే. అయినా సంఘంలో గౌరవంగా తల్లిదండ్రుల ప్రేమానురాగాలతో ఉప్పొంగిపోతూ, తన బాధ్యతలకు కట్టుబడి ఉండూన్న ఒక స్వచ్ఛమైన ప్రేమికుడు. తన తల్లిదండ్రులను ఆదరించిన ఆరాధ్యుడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!