తీరాన జ్ఞాపకాల జావళి

తీరాన జ్ఞాపకాల జావళి

 

నిను హత్తుకున్న బిగి కౌగిలిలో

తొలిప్రేమ కబుర్లాడుతూ వీక్షించిన

ప్రశాంతమైన సూర్యోదయం…

మనసు తీరాన చెరగని ఙ్ఞాపకమే..!

 

నీ అడుగులో అడుగేస్తూ నిను

అనుసరిస్తున్న పాదాల అచ్చులే

చిన్నారి పాపలా నే చేసిన చిలిపి అల్లరి..

మనసు తీరపు ఙ్ఞాపకమే …!

 

లేత ఎండకే కందిన నా 

మోమును అల్లరిగా ముధ్ధాడిన 

నీ చిలిపి నవ్వు కొంటెతనం..

మనసు తీరపు మధుర ఙ్ఞాపకం …!

 

సంద్రపు కెరటాలతో ఉరకలువేస్తూ

ఉడుకెక్కిన నీ వెచ్చని శ్వాసను

నా శ్వాసకు జతకలిపిన ఆ క్షణాలు..

మనసు తీరపు మాయని ఙ్ఞాపకాలు..!

 

ఇసుకతెన్నెలపై సేదతీరుతూ 

నా యదపై వాలిన నీ యద

సవ్వడి చెప్పిన వలపు ముచ్చట్లు..

మనసు తీరపు తరగని ఙ్ఞాపకాలు..!

 

సందె  వేళ..రవి చంద్రుల

కలియికలో నీలి నింగి మురిసే వేళ 

చేతిలోన చెయ్యేసి చేసిన బాసలే ..

మనసు తీరపు మరువలేని ఙ్ఞాపకాలు…!

 

 నీ శ్వాసనే బహుమతిచ్చిన 

మన ప్రేమలో నా

మనసు తీరాన ..

తియ్యని జ్ఞాపకాల జావళిలే…!

                                                    రచన: విజయ మలవతు

You May Also Like

2 thoughts on “తీరాన జ్ఞాపకాల జావళి

Leave a Reply to Lakshmi Prasad Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!