ఉగాది కవితలు

ఉగాది కవితలు

ఉషస్సుల ఉగాది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

వేదాల చోరుడు సోదకుడు
హరి చేత హరించబడి
బ్రహ్మ సృష్టికి శ్రీకారం చుట్టిన సుదినం
శాలివాహనుడు పట్టాభిషిక్తుడై
శకం ఆరంభించిన సుదినం
నక్షత్ర గమన ఆది ఉగాది
ఆయనాల ఆరంభం యుగాది
మన వత్సర ప్రారంభం సంవత్సరాది
పేరేదైనా తెలుగు సంస్కృతికి దర్పణం
వికారి చేదు శార్వరి కారం
ప్లవ వగరు శుభకృత్ తీపి
నేర్పుఓర్పులను పులుపు ఉప్పుతో
కలిపిన షడ్రుచుల సవ్యంజనం
సేవించిన అనుభూతి
ప్రతి నిత్యం మననం చేసుకుందాం
పంచాంగ పద్దతి తెలుగు సంప్రదాయాలు
సదా పాటిస్తూ ఉగాది ఉషస్సులు
సతతము ఆస్వాదిద్దాం
శుభకృత్ సార్థక నామధేయురాలగు గాక!

**************************************************

రసాస్వాదనం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మక్కువ. అరుణకుమారి

వసంత ఋతువున తొలి మాసం
తొలి తిథి
యుగానికి ఆది యుగాది
సృష్టి ఆరంభానికి అది పునాది
ఉత్తర,దక్షిణాయనాల సమ్మిళిత సంవత్సరాది
సృష్టికర్త విధాతను భజించే పుణ్యతిథి
షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం
కాయం కాలమార్పులకు తట్టుకునే సాధనం
తిధి, వార , నక్షత్ర , యోగ , కరణ పంచాంగ శ్రవణం
శుభాశుభ ఫలితాల మిశ్రమణం
ఉగాది పండుగ ఆచరణం
ఉగాది షడ్రుచులు
ప్రతి మదిలో మెదిలే భావానుభవాల ప్రతీకలు
సుఖ , దుఃఖాల కలబోతలు
ఆనందం కల్గించు మధురమైన మమకారం
ఎక్కవైతే అవుతుంది అదే అంధకారం
విసుగు కల్గించు పులుపుదనం
నేర్పుగా వ్యవహరిస్తే కాదా ఆనందాల సొబగుదనం
చుర్రున మండించే కారం తగ్గిస్తే
అదే బంధాలను పెంచే సహకారం
ఉత్సాహం నింపి, విశ్వాసం పెంచే
లవణం కాదా మనిషిలో సుగుణం
పెను సవాళ్ళును ఎదుర్కొనే
పొగరుదనం వగరుదనం
దుంఖానికి పరాకాష్ట అయిన
చేదు అనుభవాలను అధిగమిస్తేనే
అవుతుంది జీవితం
మధుర ఫలాల రసాస్వాదనం
శుభకృతు వత్సరం
సకల శుభాలను అందించి
మనసున హర్షం వర్షించి
జగతిని పులకాంకితం కావించి
సేదదీర్చాలని స్వాగతిద్దాం!

**************************************************

స్వాగతం ఉగాది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : ఎన్.రాజేష్

చైత్ర శుద్ధ పాడ్యమిన
నీ ఆగమనం..
ప్రతిఇంట ఉగాది పర్వదినం..
వెల్లి విరియాలి మా అందరి
ఇంట సంతోషం!
ఆకులురాలేవేసవికాలం,
వసంతుని ఆగమనం,
పలుకుతున్నాం ఆహ్వానం.
స్వాగత తోరణాలతో
పలుకుతున్నాం స్వాగతం.
సష్య శ్యామలమయ దేశ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ నీకు స్వాగతం..
ఈ శుభకృత్
నామవత్సరమంతా
శుభములునొసగాలనిఆకాంక్షతో స్వాగతం.
వెచ్చనివేసవిలోవచ్చే
కమ్మని ఉగాదికి స్వాగతం.,
ఆనందంపంచసంతోషంపెంచ
తెలుపుతున్నాం నీకు సుస్వాగతం!

**************************************************

నూతన సంవత్సరమా స్వాగతం!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

కోకిల కుహు కుహూ గానాలతో
చైత్రమాసపు నులువెచ్చని ఉషస్సుతో
షడ్రుచుల ఉగాది పచ్చడితో
షడ్రుచుల సమ్మేళనం జీవితం…
అనే ఆంతర్యాన్ని అందరికీ తెలిసేలా చేస్తూ
కొత్త చిగురులు తొడుగుతూ
భావి తరాలకు నవ కాంతులు పంచేలా,
అనుబంధాలను కొత్తగా అలకంరించుకునేలా,
సుఖ సంతోషాలను మానవ లోకానికి
అందించాలని ఆకాంక్షిస్తూ
కొత్త సంవత్సరం ఉండాలని కోరుకుంటూ…
కొంగొత్త ఆశలను పల్లకిలో మోసుకొస్తున్న
ఓ తెలుగు నూతన సంవత్సరమా
పలుకుతున్నాం నీకు ఘన స్వాగతం!!
**************************************************

ఆగమన వసంతంలో!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొత్తపల్లిఉదయబాబు

ఉగాది ఆగమన వసంతంలో
ప్రకృతి కాంత ఉలికిపడి
చైతన్య పానుపుపై ఒళ్ళు విరుచుకుంటుంది
అప్పటివరకూ పరుచుకున్న మేలిముసుగు జడత్వం
వేప పూల తొలి పరిమళపు శ్వాసకు
వేనవేలుగా పగిలి పగిలి పిగిలిపోతుంది
కంటిపడవ తెరచాప విచ్చుకోగానే
చూపుల వేకువపై గున్నమావి ‘పచ్చదనం’
పట్టు తివాచీయై పరుచుకున్న అనుభూతి!
గతపు సుడిగుండాల ‘చింత’అంతా
కొంగ్రొత్త ‘విచారపు ఫలాన్ని ఆస్వాదిస్తూ
వింతగా పలాయన మంత్రపఠనం పఠిస్తుంది!
వసంతం సంధించిన ‘చెఱకు’వింటి బాణం
అంతరంగ కేంద్రానికి లక్ష్యమై
తనువంతా సుమధురామృతకలశమౌతుంది!
ఒక్కొక్క సోపానపు అధిరోహణంలో
జీవనమాధుర్యపు అనుభూతుల ‘తీపి’
జ్ఞాపకాల కావ్యానికి తొలిపీఠిక అవుతుంది!
అనురాగపు ఆత్మీయానుబంధాల
కుటుంబసౌధపు గవాక్షాన
మమ’కారపు’ మాధుర్యంతో
సమాజ సహజీవనం పులకిస్తుంది!
ఉదాత్త మానవజన్మకు ‘ఉగాది పచ్చడి’ ప్రసాదమై పరిపూర్ణత సిద్ధిస్తుంది!!

**************************************************

నూతనోత్తేజము
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

కొత్త అను పదములోనే
కలదు ఉత్తేజము…
గత బాధల గాధలు
సమసిపోవునను ఉత్సాహమదియేమో…!

వసంతగాలులు తనువును తాకగా
ఉల్లము ఝల్లనె ఉత్సాహంతో
హాయిని గొలిపే ప్రకృతి శోభతో
పరవశమాయెను ప్రతి మనసు…!

క్రొత్తరాగమున కోయిల కూయగా
సుమసౌరభాలతో
మత్తుగాలిని మోసుకొచ్చే
వచ్చెనదిగో నవవత్సరము
తెచ్చెనదిగో జీవితానందము…!

కొత్త కోరికలు శారికలవగా
నూతన ఆశలు సుమమాలికలవగా
మనసు మురిసి పాడెను
మత్తకోకిల రాగము
పల్లవిగా మొదలాయే
నవవసంత పదము…!

షడ్రుచుల పచ్చడి చవిచూడ
మనసు ఉవ్విళ్లూరె
పంచాంగ శ్రవణము వినవలెనను కుతూహలము జతగూడె
కవి సమ్మేళనములలోని కవితాగానము
ఆస్వాదించ ఉరకలు వేసె!!!

**************************************************

ప్రకృతి విన్నపం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:రాధ ఓడూరి

నేనో
ప్రకృతి కాంతను
ఆరుఋతువుల కాల చక్రంతో
మీ ముంగిట్లోకి వాలుతున్నాను

మామిడి పూతల మధురిమలు
షడ్రుచుల సమ్మేళనంలో ఒకటై
కోకిల గానాలతో
నా మేను పులికరించేలా
పంచాంగ శ్రవణంతో
నను జోలపాడి
నను శాశ్వతంగా నిద్ర పుచ్చుతారేమో

అవును…!
నా బిడ్డలైన
వృక్షజాతులని నాశనం చేసి
దాని పై రియలెస్టేట్లు
ఫ్యాక్టరీలు
నిర్మించి

నాలో భాగమైన
హిమాలయాలను
సముద్రుడిని సైతం
కలుషితం చేసే సామర్థ్యం
మీ మానవజాతికి మాత్రమే ఉంది

నేనందించే
స్వచ్ఛమైన ప్రాణవాయువును
కలుషితం చేసి
ప్రకృతి విపత్తు అంటారా

అందుకే…!
మీలో
నను
నాశనం చేసే గుణాలను రూపుమాపి
శుభాలనొసగే
శుభకృత్ ని
మనసారా  ఆహ్వానించండి
ఈ ప్రకృతి కాంతను
పచ్చని కాంతలా ఉంచండి

**************************************************

మళ్ళీ వచ్చింది కొత్తసంవత్సరం!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దోసపాటి వేంకటరామచంద్రరావు.

మళ్ళీ వచ్చింది కొత్తసంవత్సరం!
కొత్తదనమేమిటి తెస్తుందో మరి!
పేరేమో “శుభకృత్”సంవత్సరమట!
సార్ధకంచేసుకుంటుందేమో చూడాలి!
ఆకాశన్నంటే ధరలు
కరెంటుకోతలతో ఉక్కబోతలు
ఆమనిలో ఆగని ఊష్ణగాలులు
కోయిలకూతలు మనసును కదిలించడంలేదు
మావిచిగురుకోసం ఊరంతాగాలింపే
వేపపూతకు వైరస్ంటుకుందటా!
అయినా పర్వాలేదు వాడొచ్చట!
ఉగాదిపచ్చడి చేసుకోకుండా ఉంటామా?
ఆదాయవ్యయాలు తెలుసుకోవాలికదా!
అవమానం రాజపూజితం ఎలాగున్నాయో?
కందాయఫలాలు కమ్మగా ఉంటాయేమో?
కవిసమ్మేళనాలు వెళ్ళే ఓపికుండాలికదా!
అయినా మా ఆశలు ఆశయాలు నెరవేరాలని
శుభాకాంక్షలు తెలుపుకుంటాములే!
మళ్ళీకొత్తసంవత్సరము వస్తుందికదా!

**************************************************

శుభాకాంక్షలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీమతి నందగిరి రామశేషు

కొన్ని యుగముల కలయిక మన్వంతరము కాగా యుగములు విభజింపబడె కొన్ని సంవత్సరాలుగా
నక్షత్ర గమన పరిభ్రమణమే సంవత్సరమనగా
ఈ చక్రభ్రమణ కాలమే ప్రతి సంవత్సరం ఉగాదిగా

కొన్ని వత్సరాల కాలము మనిషి జీవితము
నవరసాల, షడ్రుచుల కలయికే జీవనము
ఉంటే సమతౌల్యత అంతా ఆనందమయము
లేకుంటే మనిషి బ్రతుకు కాగలదు దుఃఖమయము

పులుపు, ఉప్పు, చేదు, వగరు, తీపి, కారము
శృంగారం, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయానకము, భీభత్సం, అద్భుతము, శాంతము
జీవితం ఈ షడ్రుచులు, నవరసాల సమ్మేళనము

ఉగాది నాడు షడ్రుచులు కలిసిన భక్ష్యము
తెలియచెప్పును మన భవిష్యత్ ఆచరణము
సుఖము, దుఃఖము, ఆనందము, విషాదము
అన్నింటినీ భావించాలి జీవతంలో సమానము

స్వాగతిద్దాం ఆనందమయ నూతనవత్సరమును
అలరిద్దాం అందరినీ మనసారా శుభాకాంక్షలతోను

**************************************************

నవ వసంతం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పిల్లి.హజరత్తయ్య

చీకట్లు కమ్ముకున్న బతుకుల్లో
చిరు కాంతులను వెదజల్లేలా
కొంగొత్త ఆశయాలకు
అంకురార్పణ గావించాలి..!

వాడిపోతున్న అనుబంధాలకు
కొత్త ఊపిరి పోసేలా
మమతానురాగాలను పూయించి
శాశ్వతమైన బంధాలుగా మార్చాలి..!

వెలవెల బోతున్న ప్రకృతి
శోభాయమానంగా శోభిల్లేలా
మార్పుకు శ్రీకారం చుట్టి
నవవసంతానికి నాంది పలకాలి..!

కష్టాల కొలిమి కాలుతున్న
సర్వ శుభాలు చేకూరేలా
సంయమనం పాటించి
జీవితాన్ని సార్థకం చేసుకోవాలి..!

ఒడలిపోయిన దేహాలు
ఉజ్జ్వలంగా వెలుగొందేలా
సంతోషాల సత్తువనిచ్చి
మనసును ఉగాది ఉషస్సులతో నింపుకోవాలి..!

**************************************************

వగరు పొగరైన నవ ఉగాది వత్సరం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

నూతన యుగాదే ఉగస్య ఆది
నవీన స్వేచ్ఛా భావానికి పునాది
వసంత కోయిల రాగాల ఆనంది
పసందైన అనుభూతుల మయమైనది

కష్ట సుఖాల మిళితమే జీవితమున్నది
వగరు పొగరు తో వత్సరము సాగమన్నది
తీపి జ్ఞాపకాలే అనుభవ సారమన్నది
మంచి చెడుల నెంచి అడుగేయమన్నది

ధన దాహం తో మిడిసిపాటు వద్దన్నది
ఐశ్వర్యము స్థిరమన్న వాస్తవం వీడమన్నది
మంచితనమే నీ వెంట వస్తుందన్నది
షడ్రుచుల పచ్చడిలో అంతర్లీన సందేశమున్నది

కొత్త సవాళ్ళతో నేర్పుగా వ్యవహరించమన్నది
ఆనందోత్సాహాల జీవితమే నిత్య నూతనమన్నది
అందరి శాంతి శ్రేయస్సులే కోరమన్నది
విసుగు విరామం తో సహనం కోల్పోవద్దన్నది

లేలేత మామిడి తోరణాలే అందమన్నది
శ్రావ్య మయిన సన్నాయి రాగాలే హాయన్నది
రంగవల్లులతో ఊరు వాడా హరివిల్లయినది
ఉగాది సంబరాలతో తిమిరాన్ని తోలమన్నది
అరుణోదయ నవరాగంతో స్వాగతం పలకమన్నది

**************************************************

యుగాది ఆగమనం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎన్.లహరి

వసంత ఋతువు ఆగమనంతో
తొలి సంధ్యవేళ లేత మావిచిగురు తిని
కోకిల భూపాల రాగం ఆలపిస్తున్న వేళ
తెలుగుభాష తియ్యదనం నింపుకుని
ప్రతి కొమ్మ కోటి రాగాలు పాడుతున్న వేళ
పొలిమేర నుండి లేలేత కొమ్మల పువ్వుల పరిమళం
పూజగది వైపు వస్తున్న వేళ
నా శుభజీవన ఆశల పునాదులతో
వానవిల్లు తోరణాలతో
పసుపు కుంకుమల గడపలు కళకళ లాడేవేళ
ఆచార సంప్రదాయాల పంచాంగ శ్రవణాల
నిత్య నూతన మంగళ వాయిద్యాలు మోగుతున్న వేళ
వేప పూత విరుల చీరకట్టిన పచ్చని చెట్ల
పావడతో(పాపిటి బిళ్ళతో) ధరణి తల్లి షడ్రుచుల
అమృతభాండాన్ని తీసుకొస్తున్న వేళ
అంతులేని ఆనందాల హేళ
గత సంవత్సరపు ఎండుటాకులు రాల్చి
చిగురాకుల గుబుర్లు నూతన సంవత్సర ఆశల్ని మోసుకొస్తున్న వేళ
మామిడి చిగురు మాగాణి చుట్టుకుని
క్రొంగొత్త వర్ణాలు పులుముకుని
మనోహర గీతాలాపనతో వస్తున్న
శుభకృత వసంత కన్యా స్వాగతం….
సుస్వాగతం శోభయానం
యుగాది ఆగమనం

**************************************************

శుభకృతి శుభాకాంక్షలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జీ వీ నాయుడు.

వచ్చింది వచ్చింది ఉగాది పండుగా
తెచ్చింది తెచ్చింది షడ్రుచులు  దండిగా
తెలుగు సంవత్సరానికి
స్వాగతం పలుకగా
ఊరూవాడా సంబరాలు
జరుపుకునేలా గొప్పగా
పంచాంగశ్రవణం కనులు విందుగా అచ్చ తెలుగునా
పటించారు పండితులు
వాడవాడలా ఉత్సాహంగా
కోరుకుందాము అందరం
శుభకృతిని శుభకరంగా
వేడుకుందాం దేవదేవతలను
శుభం జరగాలని మెండుగా..
సాహితీ కుటుంబ సభ్యులు అందరికి
శుభకృతి శుభాకాంక్షలు నిండుగా..
**************************************************

ఉగాది పండుగ!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎం.వి.చంద్రశేఖరరావు.

ఉగాదిపండుగ వచ్చింది,
ఎంతో సందడి తెచ్చింది!
గడపకు పసుపురాసేసి,
గుమ్మానికి మామిడితోరణం కట్టేసి,
అభ్యంగనస్నానం చేసేసి,
నూతన వస్త్రాలను ధరించేసి,
ఉగాదిని ఆహ్వానిద్దాం, రండీ!
పంచాంగ శ్రవణం,
రాశీ ఫలం తెల్సుకొని,
సంవత్సరమంతా,
ఆనందంగా గడిచేలా ప్రణాలికలు వేద్దాం!

జీవితమంటే కొంచెం పులుపు,కొంచెం చేదు,
కొంచం తీపి, ఆ షడ్రుచులసంగమం,
మనజీవన ప్రతీక, ఉగాదిపచ్చడిని, ఆస్వాదిద్దాం రండీ!

ఆరోగ్యానికి ఆరోగ్యం,
భాగ్యానికి భాగ్యం ఇచ్చే
భారతీయ పండుగలకు,
సంప్రదాయాలకు జేజేలు!

**************************************************

తెలుగు వారి ప్రత్యేకం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: లోడె రాములు

ఉగాది పండగ ఊరంతా సందడి విష్ణుమూర్తికి ప్రీతికరం ఉగాది
సృష్టి ఆరంభం ఈరోజే జరిగింది
ఈరోజే శాలివాహనుడి పట్టాభిషేకం
పండగ లేవైనా తెస్తాయి చైతన్యం
నూతన భావాలు నూతనోత్తేజం
ఉవ్వెత్తున లేచే కెరటం
శుభాలను చేకూర్చే శుభకృతం ఆకురాల్చింది శిశిరం
చిగురులు తొడిగింది వసంతం ప్రకృతి శోభాయమానంగా తయారై
కోకిలలను ఆహ్వానించి కచేరీలు.. మామిడి తోరణాలతో,
నూతన వస్త్రాలతో, పూజలు
పంచభక్ష పరమాన్నాం నైవేద్యం
ఉగాది పచ్చడి సర్వరోగ నివారణ మధురం,
ఆమ్లం, లవణం,కారం, చేదు,కాషాయం ఆరు రుచుల సమ్మేళనం తెలుగు వారి ప్రత్యేకం

**************************************************

ఉగాది పచ్చడి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బృందావనం సత్యసాయి

మా మడి చేలో
మామిడి పళ్ళను,
కొంత రాలిన
చింత కాయలను,
తెల్లటి చెరుకుల
ఎర్రటి బెల్లం,
రుచికే హారం
చల్లర కారం,
కొయ్యవె పాప
వెయ్యగ వేప,
ఉప్పుచాలులే
నిప్పు యేలనే?
అన్నీ కలియగ,
ఆరు రుచులతో
నూరు కాలాలు
వర్ధిల్లమని ఆశీసులందగా
పిన్నా పెద్దా, ముసలీ ముతకా,
యెల్లరు కలసి తినండహో..
ఉగాది పచ్చడి

**************************************************

శుభములు నిచ్చు శుభకృత్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్

వసంతఋతువున చైత్రమాస ఆరంభంలో కోయిలల కుహు కుహు అనే మధుర స్వరాలతో
విప్పారిన వేప పువ్వుల
లేలేత ఆకుపచ్చని మామిడి పిందెలతో
ప్రకృతి మాత పచ్చదనంతో
ప్రజలంతా ఆహ్లాదకరంగా
ఆనందంగా, సుఖసంతోషాలతో ఉండాలని
గతకాలపు కరోనా సృష్టించిన కరోనా కరాళ నృత్యమునుంచి  తప్పక
విముక్తి కలుగుతుందని
సమాజాన  యుద్ధ వాతావరణం పోయి ప్రజలంతా శాంతి, సౌఖ్యాలతోఉంటారని
మానవులు మాధవులు గా
ప్రేమతత్వమే లోక కల్యాణానికి మూలమని
తెలుసుకుని ఐకమత్యంగా
ఉండాలని శుభకృత్ లో
సుఖ సంతోషాలు కలగాలని ఆశిద్దాం. ఆహ్వానిద్దాం….!!
**************************************************

ఉగాది పండుగ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: క్రాంతి కుమార్

మోడు వారిన జీవితాల్లో నవీన సిరులు
కోయిల శ్రావ్యమైన స్వరం సంగీతంలో కురిపిస్తూ…
చీకటిలో మగ్గుతున్న అలసిన కనులకు
పచ్చని చెట్ల చిగురాకు వసంతాలను అందిస్తూ…
సమస్త మానవాళికి ప్రకృతి ఇచ్చే వరాలతో
జీవితాలను ఆనందమయం చేసుకోవాలని బోధిస్తూ…
జీవన యాత్రలో అలసిన ఆశయాలకు
క్రొత్త గమ్యాలనుభవిష్యత్ కలలకు జతచేస్తూ…
షడ్రుచుల సమ్మేళన రుచుల మాధుర్యాన్ని
జీవన వేదాంత శాస్త్రంతో అనుసరించాలని చెప్తూ…
సుఖసంతోషాలతో…
ఆనందంగా జీవించాలని…
సమస్త మానవాళికి…
దీవెనలు ప్రసాదిస్తూ…
భవిష్యత్తు కలలకు…
అభయ హస్తం ఇస్తూ…
చిరు నవ్వులు చిందిస్తూ…
వచ్చేసింది ఈ యుగాది..‌

**************************************************

షడ్రుచులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన.సుజాత కోకిల

శుభకృత్ నామ సంవత్సరం వచ్చింది.
కొత్త కొత్త ఆనందాలను తెచ్చింది.
ఇంటింటా ఉగాది సందడి చేసింది.
అందరి మనసుల్లో ఆనందాలు నిండినవి.
చైత్రమాసం వచ్చే పెండ్లి బాజాలు మ్రోగే
కోయిల రాగాలతో కొత్త చిగురులు తొడుగెే
పసుపు కుంకుమలతో గడపలకి లక్ష్మీకళ వచ్చె,
మామిడి తోరణాలతో గుమ్మాలకెే అందం వచ్చె,
జీవితమoటే ఒకే తీరు కాదని,
జీవితమంటెే షడ్రుచుల జీవితమని,
అది తెలుసుకోవడమే మనకు మంచిదని
రాశిఫలాలను తెలుసుకునే ఉగాదని,
కలగలిపిన జీవితమే ఒక మదురమని,
ఎన్నో వసంతాలు వచ్చిపోతుంటాయని,
సీతారాముల కల్యాణమే లోక కల్యాణమని!
పున్నమి వెనకాలెే అమావాస్య వస్తుందని
కష్టం వెనకాలనే సుఖం వస్తుందని ,
కష్ట సుఖాలను ఒకే తీరుగా చూస్తూ-
ముందుకు సాగిపోవడమే జీవిత లక్ష్యం.

**************************************************

షడ్రుచుల ఉగాది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

పచ్చని తోరణాలతో
మావి చిగుళ్ళతో
మామిడి కొమ్మల పందిళ్లలో
ఊరేగే రాముని కొలిచే ఉగాది

షడ్రుచుల మేళవింపుతో
సప్తవర్ణాల కలయికతో
మేళతాళాలతో
బాజా భజంత్రీల సమ్మేళనంతో

ఊరూరా సందళ్ళు
ఆనందాల పరవళ్లు
ఇంటింటా శుభ పందిళ్లు
శుభకృత్ ఉగాది సందళ్ళు

పిండివంటలతో విందులు
పరవశంతో ఆనంద చిందులు
పిల్లా పాపాలతో ప్రతి ఇంటా కనువిందులు
నవవసంత రాగల ఆహ్లాద ముంగిళ్ళు

ఆహా తెలుగు వాళ్ల అదృష్టమే ఈ చైత్రమాసపు తొలిపొద్దు
ఆహా నూతన తెలుగు సంవత్సర సందడే ఈ ఉగాది
శుభమైన శుభాల సందళ్లే ఈ ఉగాది
మరచిపోని మరువలేని అనుభూతే ఈ ఉగాది

**************************************************

చైత్రమాస పరవళ్ళు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

చిరుమామిళ్ళు నోట నీళ్ళూరిస్తూ
ఏటి గాలి ఎదను తడుతూ
ఓటి పోయిన మనసులన్నిట
ఉత్తేజం నింపి వీస్తుంది….

కష్ట సుఖములు తెలిసినోడు
అన్ని రుచులూ ఛవి చూస్తూ
కొత్త సంవత్సర కౌగిలికై
పరితపిస్తూ ఉంటాడు…

నల్ల బడ్డ మట్టి మనిషి బతుకుల
నూతన తేజం నింపుటకు వచ్చిన శుభ కృత్
సున్నితంగా మసలుకొంటూ చెమట దారను మరచేలా కలలు సాకారం చేస్తుంది…

కోపం ప్రకోపం జ్వలించే
జనత హృదిలో వసంతం పండి
చైత్రమాస పరవళ్ళలో తడిసిన
కోయిలమ్మ పాటలలో ముంచెత్తుతుంది..!

**************************************************

ఇష్ట దేవతారాధన చేయాలి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కాటేగారు పాండురంగ విఠల్

శాస్త్రబద్ధంగా పర్వదినన్నాని జరుపుకోవాలి
హైందవ సంస్కృతిని భావితరాలకందించాలి
సనాతన ధర్మాన్ని నిష్ట దీక్షతో పాటించాలి
“ధర్మసింధు” పంచ విధులను నిర్వర్తించాలి
ఉషోదయాన్నే తైలాభ్యంగనం ఆచరించాలి
నవ వత్సర పురుషుని స్త్రోత్రం పఠించాలి
పండుగనాడు ఉగాది పచ్చడి సేవించాలి
పంతులు ద్వార పంచాంగ శ్రవణం చేయాలి
ఉగాదికి పూర్ణ కుంబాన్ని దానంగా ఇవ్వాలి
ఆధ్యాత్మికతను సాంస్కృతికతను పరిరక్షించాలి
ఋషులు వేదాలు చెప్పిన మార్గమనుసరించాలి
దైవపూజతో నూతన వత్సరాన్ని ఆరంభించాలి
ప్రకృతి సంరక్షణ కొరకు కంకణం కట్టుకోవాలి
వసంత ఋతువును సాదరంగా ఆహ్వానించాలి
గ్రహ రాశి నక్షత్ర తిథి ఫలాలను తెలుసుకోవాలి
గురువు పురోహితులు పెద్దలను కలవాలి
ఇంద్రధ్వజ బ్రహ్మధ్వజములను ప్రతిష్టించాలి
ఉగాదినాడు ఇష్టదేవతారాధనను చేయాలి

**************************************************

తొలి మాసం..!!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎల్ గంగాధర్

తెలుగు వారి తొలి మాసం వసంతం
వసంత మాసమున తొలి మాసం చైత్రం
చైత్ర పాడ్యమనగానే ఉగాది
ఉగ’ ననగానే నక్షత్ర గమనం
ప్రభవ ఆయువు మొదలైన దినం
ఉత్తర దక్షిణ ఆయనమనే సంవత్సరం
యుగమనే సంవత్సరాది యుగాది
వసంతాలకు విడదీయరాని బంధం అనుబంధం ప్రకృతి బంధం
అన్ని ఋతువుకు ఉషస్సు స్వాగతం
మూడు కాలాలకు ఉషాదేవి మాతృమూర్తి
చైత్ర శుక్ల పాడ్యమే సృష్టికి తొలి రోజు అదే వసంతమాసపు ఉగాది

**************************************************

ఆశలు రేపే ఉగాది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కార్తీక్ దుబ్బాక

ఉగాది ప్రతి సంవత్సరం వచ్చే ఉషోదయం,
శుభకృతినామ ఉగాది ఈ సంవత్సరం,
శుభాలుకలగాలనికోరుకుంటా
నాలో ఆశలు,”రేపే ఉగాది”
జీవితాలలో విజయం కాంక్సిస్తూ,
నూతన భవిష్యత్తుకి ఆశలపందిరి వేయాలని,
ఉగాది ఊసులు, జీవితంలో పరవళ్లు తొక్కాలని,
నోరూరించే ఉగాది పచ్చడి రుచి చూడాలని,
కొత్త కోరికలు నాలో కలగాలని,
షడ్రుషుల కలపోతే ఉగాది అని
జీవితం సుఖదుఃఖాల అనుభవ సారమని,
ఆనందాలు ప్రతి ఇంట్లో పండాలని,
తోరణాల కల గుమ్మంలో పచ్చగా ఉండాలని,
సంవత్సరమంతా సంతోషంగా గడపాలని,
జీవితచక్రం,జోతిష్యశ్రవణం వినాలని,
తెలుగు వారందరికి ఉండాలని
చైత్ర శుద్ధ మాస పాడ్యమి పర్వదినాన
శుభకృత నామ ఉగాదికి పలుకుదాం,స్వాగతం అందరం

**************************************************

సర్వ శుభాలు చేకూర్చే శ్రీ శుభకృత్!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత.పి.వి.ఎల్

ప్రశాంత వదనంతో ఏతెంచావా
నూతన వత్సరమా !..
కోకిల కూజితాలతో. ..
సకల వర్ణ శోభిత పుష్పాభిషేకంతో
పంచాంగ శ్రావణ ఆశావహ దృక్పధంతో
షడ్రుచుల ఉగాది పచ్చడితో
కళ్లింతలు చేసుకుని. ..
ఆహ్లాదానందాలతో
ఆత్రంగా ఎదురుచూస్తున్నాం..
నీ చెలిమితో చేసిన
సంవత్సర కాలం
మా జీవిత పుస్తకంలో అందమైన పుటలా..
మిగిలిపోవాలని ఆశిస్తున్నాం..
నిత్యం ఎగరడమే కాదు అప్పుడప్పుడూ
పడిపోతూ ఉండటమే జీవితమని గత ఏడాది చూపించావు..
తీపి కాకుండా
చేదు నాలుకకు తగులుతుంటే
అదో అనుభూతి అని నిరూపించావు..
నల్లేరు మీద బండి నడకేకాదు
పల్లాల్లోకి జారిపోతున్నా అదో గుణపాఠమని తెలియజేశావు,
ఉగాది పచ్చడి చెప్పేది కూడా అదే
చీకటి వెలుగుల్లో
కాంతి పుంజం వైపే చూపుసారించమన్న
ఆశావహధృక్పథం..పంచాంగశ్రవణం
కర్ణ కఠోర శబ్దాలకు అలవాటైన చెవులకు
కోకిల కూజితమో సాంత్వన
ఉగాది అంటే మనసుకు
కొత్త ఆనందం
శరీరానికి సరికొత్త ఉత్సాహమే!
గడిచిన సంవత్సరాల్లో కల్లా
శ్రీశుభకృత్ తలమానికంగా నిలిచిపోవాలి..
సర్వ శుభాలు చేకూర్చాలి!!

**************************************************

ఆగమనాభిలాష
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సత్య కామఋషి

వికారి విదిల్చి పోయిన
సకల విఘ్న వికారాలను
తొలగించి తుడిచివేయగ..
ప్లవ శార్వరీలు మదించి
మిగిల్చి పోయిన శోకాలను
కరిగించి హరించివేయగా…
ఆనందోత్సాహాల హరివిల్లుల
మాటున మెల్లగ ఉదయించిన..
నవోదయ ఆశాకిరణ భానుతేజమై.,
మనోల్లాస మకరంద మాధురీ
సుమ సుగంధ శుభ సంతకాలతో..
దిగ్విజయ గీతికా రసజావళీలతో..
శుభకృతుని శుభ ఆగమనం..
సకలాభీష్ట మనోవాంచితార్ధ
సిద్ధ్యర్ధం, సర్వజగత్వాంచితం.!
బెల్లపు ఊటల ఊరి వేపపూతల
చేదుసారమే తియ్యనవ్వగా…
చింత చిగురుల వగరు కరుగగా..
తెలుగు వెలుగులు నవయుగాది,
వరాల జల్లుల కల్పతరువై..,
సమస్త జనవాహినీ ముఖాలంకృత
మేలినగవుల సుమసోయగమై..
వర్ధిల్లి వికసించాలని..నా ఆకాంక్ష…

**************************************************

శుభ రవళి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారు మంచి వాణి ప్రభా కరి

వసంత ఆగమనం శ్రీ వినాయక
శ్రీవేంకటేశ్వర శ్రీ లక్ష్మి శ్రీ వాణి
శ్రీ మారుతి కృప అందరికీ ఉండాలి
మాన వాళికి శుభము
సౌభాగ్యము ఇచ్చే శుభ కృతి
కోసం ఎదురు చూపుల లో
ఎన్నో మృదు రవళి నాదము
సౌర కుటుంబ సంచారము జ్యోతిష్య శాస్త్ర శుభ విన్యాసాలు జను లందరికీ
ఆనందపు ఝల్లు లు
వేపపుల సుగంధాలు, మా ముడి చింత పులుపు, చెరకు అరటి మధుర ము మమకారం
షట్ రుచుల సమ్మిళితం ఆరోగ్య ఆనందామృత శుభ కృతి రవళి
మూడు కాలాలు, అరు ఋతువులు అరువది
నాల్గు కళలు మానవ స్ఫూర్తి
ఐకమత్యం జ్ఞాన ప్రజ్ఞాన్ మే కీర్తి.

**************************************************

వగరు పొగరైన నవ ఉగాది వత్సరం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దొడ్డపనేని శ్రీ విద్య

నూతన యుగాదే ఉగస్య ఆది
నవీన స్వేచ్ఛా భావానికి పునాది
వసంత కోయిల రాగాల ఆనంది
పసందైన అనుభూతుల మయమైనది

కష్ట సుఖాల మిళితమే జీవితమున్నది
వగరు పొగరు తో వత్సరము సాగమన్నది
తీపి జ్ఞాపకాలే అనుభవ సారమన్నది
మంచి చెడుల నెంచి అడుగేయమన్నది

ధన దాహం తో మిడిసిపాటు వద్దన్నది
ఐశ్వర్యము స్థిరమన్న వాస్తవం వీడమన్నది
మంచితనమే నీ వెంట వస్తుందన్నది
షడ్రుచుల పచ్చడిలో అంతర్లీన సందేశమున్నది

కొత్త సవాళ్ళతో నేర్పుగా వ్యవహరించమన్నది
ఆనందోత్సాహాల జీవితమే నిత్య నూతనమన్నది
అందరి శాంతి శ్రేయస్సులే కోరమన్నది
విసుగు విరామం తో సహనం కోల్పోవద్దన్నది

లేలేత మామిడి తోరణాలే అందమన్నది
శ్రావ్య మయిన సన్నాయి రాగాలే హాయన్నది
రంగవల్లులతో ఊరు వాడా హరివిల్లయినది
ఉగాది సంబరాలతో తిమిరాన్ని తోలమన్నది
అరుణోదయ నవరాగంతో స్వాగతం పలకమన్నది

**************************************************

యుగాది ఆగమనం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఎన్.లహరి

వసంత ఋతువు ఆగమనంతో
తొలి సంధ్యవేళ లేత మావిచిగురు తిని
కోకిల భూపాల రాగం ఆలపిస్తున్న వేళ
తెలుగుభాష తియ్యదనం నింపుకుని
ప్రతి కొమ్మ కోటి రాగాలు పాడుతున్న వేళ
పొలిమేర నుండి లేలేత కొమ్మల పువ్వుల పరిమళం
పూజగది వైపు వస్తున్న వేళ
నా శుభజీవన ఆశల పునాదులతో
వానవిల్లు తోరణాలతో
పసుపు కుంకుమల గడపలు కళకళ లాడేవేళ
ఆచార సంప్రదాయాల పంచాంగ శ్రవణాల
నిత్య నూతన మంగళ వాయిద్యాలు మోగుతున్న వేళ
వేప పూత విరుల చీరకట్టిన పచ్చని చెట్ల
పావడతో(పాపిటి బిళ్ళతో) ధరణి తల్లి షడ్రుచుల
అమృతభాండాన్ని తీసుకొస్తున్న వేళ
అంతులేని ఆనందాల హేళ
గత సంవత్సరపు ఎండుటాకులు రాల్చి
చిగురాకుల గుబుర్లు నూతన సంవత్సర ఆశల్ని మోసుకొస్తున్న వేళ
మామిడి చిగురు మాగాణి చుట్టుకుని
క్రొంగొత్త వర్ణాలు పులుముకుని
మనోహర గీతాలాపనతో వస్తున్న
శుభకృత వసంత కన్యా స్వాగతం….
సుస్వాగతం శోభయానం
యుగాది ఆగమనం

**************************************************

శుభకృతి శుభాకాంక్షలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: జీ వీ నాయుడు

వచ్చింది వచ్చింది ఉగాది పండుగా
తెచ్చింది తెచ్చింది షడ్రుచులు  దండిగా
తెలుగు సంవత్సరానికి
స్వాగతం పలుకగా
ఊరూవాడా సంబరాలు
జరుపుకునేలా గొప్పగా
పంచాంగశ్రవణం కనులు విందుగా అచ్చ తెలుగునా
పటించారు పండితులు
వాడవాడలా ఉత్సాహంగా
కోరుకుందాము అందరం
శుభకృతిని శుభకరంగా
వేడుకుందాం దేవదేవతలను
శుభం జరగాలని మెండుగా..
సాహితీ కుటుంబ సభ్యులు అందరికి
శుభకృతి శుభాకాంక్షలు నిండుగా..

**************************************************

ఉగాది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: డా.జె.చలం

ఈ ఉగాది నవాయుగానికే  ఆది
సంబరాల పండుగలకు నాంది
ఉత్సాహఉల్లాసభరితం
తరతరాల ఈ సంప్రదాయం.
మామిడి,వేప,తోరణాల గుమ్మం
కరోనాను  పారద్రోలిన సంబరం
పాడి పంటలు పసిడి కాంతులు
ప్రతి ఇంటా ఆనందహేల.
శుభకృత్ నామంలో ఉంది శుభం.
భీకర రణంలో చిక్కుకున్న విశ్వానికి
ఈ ఉగాది పలుకుతుందా స్వస్తి.
సర్వమానవ సౌబ్రాతృత్వమే మన ఆకాంక్ష.

**************************************************

తెలుగు వారి పండుగ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : యాంబాకం

తెలుగు వారి తొలి పండుగ
తెలుగు వారి సాంప్రదాయల
పండుగ!
తెలుగు సంస్కృతులు ఉట్టి
పడేలా తెలిపే పండుగ
తెలుగు మాసాల తో తిరిగే
పండుగ!
తెలుగు  ఋతువు లను
తేచ్చే పండుగ
తెలుగు అట పాటల ను
కూసే పండుగ!
తెలుగు ఆడపడుచు ల
అలంకరణ చూపే పండగ
తెలుగు గ్రామ శక్తుల కొలిచే
పండుగ!
తెలుగు వారి హృదయాల్లో
నిలచపోవు తొలి పండుగ
తెలుగు వారి కొత్త దంపతు
ల పరిచయ పండుగ!
తెలుగు వారి సాంప్రదాయ
సారెల పండుగ
తెలుగు ఆరు రుచులను
కలిపి తినిపించే పండుగ!
తెలుగు వారి జీవిత వర్ణా
లను తెలియచెప్పేపండుగ
తెలుగు వారి ఆశాజ్యోతుల
కాంక్షల పండుగ!
తెలుగు వారి పచ్చదనాన్ని
చిగురులు వేసే పండుగ
తెలుగు వారి పాడిపంటలు
పొంగించే పండుగ!
తెలుగు వారి గాధలను తె
లిపే పండుగ
తెలుగు వారి భాష లెస్స అ
ని తెలిపే పండుగ “తెలుగు
వారి పండగ”
“ఈ మన “ఉగాది” పండగ”

**************************************************

కాలం-మనం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన :యువశ్రీ బీర

కోయిల పాటలతో విచ్చేస్తూ వసంతం…
తెలుగు లోగిళ్ళలో ఊయలూగుతూ ఉగాది…
జీవన రుచులను చవిజూసే ఆచారమిది…
ఆప్యాయతానురాగాలు నిండైన ఉగాది…
ఆచార సాంప్రదాయాలు తొణికిసలాడు ఉగాది…
తెలుగువారు పాడుకునే నవవసంత గానమే ఈ ఉగాది…
షడ్రుచులప్రాయాల సారమే ఉగాది..
బాల్యమెంతో తీయనిది… జ్ఞాపకాలను నెమరేస్తుంటే తీగపాకమై ఊరిస్తుంది…
ఊహలలో ఊగిసలాడే యవ్వన ప్రాయం…
వగరూపులుపుల సారం…
మధ్య వయస్సు అల్లుతుంది
మమకారాల బంధం…
ఈ వయసుకు ఆచితూచి అన్యోన్యతనే ఉప్పందిస్తే…
జరగవుకదా అనర్ధాలు…
ఆశానిరాశల పోరాటంలో అలసి…
వృద్దాప్యమే చేదంటూ
ఒణికిపోతుంటారు…
షడ్రుచుల సారమే జీవిత పయనమని…
ఈర్షాద్వేషాల పాళ్ళను శూన్యంచేస్తే…
మమతానురాగాలు పెంచి…
ఆర్ధికలావాదేవీలు అదిగమిస్తే…
జీవితాలలో ఉషస్సులు నింపుతుంది ఉగాది…

**************************************************

ఉగాది విలాసాలు-విధులు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కొల్లూరు వెంకటరమణమూర్తి

కోటి ఆశలు చిగురించే కొత్త సంవత్సరం
కొత్తదనాల కొత్త బెల్లం కొత్త చింతపండు
కొత్త మామిడి కాయలు కొత్త వేపపువ్వు
కొత్తగా అనిపిస్తుంటాది ప్రతీ సంవత్సరం!
వసంతాగమనంతో ప్రకృతి పులకింత
కోకిలమ్మ మథురస్వరాలు మన చెంత
ఆనందోత్సాహాలతో మనందరి కేరింత
ఉగాది పచ్చడి యిచ్చే భాగ్యం మరింత!
బంధుమిత్రుల సమాగాలు, కవి సమ్మేళనాలు,
నూతన వస్త్రధారణలు‌, పంచాంగ శ్రవణాలు,
దేవాలయ దర్శనాలు, ఆర్భాటపు వేడుకలు,
స్వర్ణరజితాదుల కొనుగోళ్ళు, పిండి వంటలు!
పొందగలగాలంటే అవన్నీ కలకాలం
నిర్వర్తించాలి ఈ క్రింది విధులు మనం!
పండుగల పరమార్ధాన్నెరిగి మసలవలె
మానవత్వంతో దీనులను ఆదుకొనవలె
ప్రకృతి ప్రసాదాల పరిరక్షణ చేస్తుండవలె
విశ్వశాంతికై ప్రయత్నాలు చేస్తుండవలె!

**************************************************

ఉగాది విశిష్టత
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : సుశీల రమేష్

జడ ప్రాయమైన జగత్తులో
చైతన్యాన్ని రగిలించి
మానవాళిలో నూతన ఆశయాలను
అంకురింపచేసే శుభ దినం
ఉగాది పండుగ దినం.
సంప్రదాయానుసారంగా
రైతులను గౌరవించే దినం
ఆకురాలే కాలమున వసంతుని
రాకతోఆమని పులకితమవుతుంది.
ఉగ అనగా నక్షత్ర గమనం
ఆది అనగా మొదలు,
ఉత్తరాయణం దక్షిణాయణం
అనబడే ద్వయ సంయుతం
యుగం సంవత్సరం కాగా
యుగానికి ఆది యుగాది అయింది.
ప్రసాదంగా స్వీకరించే షడ్రుచుల
మేళవింపు లో తీపి ఆనందానికి ప్రతీక,
ఉప్పు ఉత్సాహం రుచికి సంకేతం,
చేదు బాధకలిగించే అనుభవాలకు గుర్తు, పులుపు
నేర్పుగా వ్యవహరించమంటుంది.
వగరు కొత్త సవాళ్లను అధిగమించ మంటుంది, ఈ విధమున చేసినట్టి
ఉగాది పచ్చడి ని బట్టి కొత్త సంవత్సరం భవిష్యత్తు
దాగి ఉంటుందనేది పెద్దల మాట.

**************************************************

కొత్త ఆశలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: చెరుకు శైలజ

కొత్త సంవత్సరం
కొత్త ఆశలు
కొత్త బట్టలు
శుభ కృత నామ సంవత్సరం
శుభాన్ని తేవాలని
ఆరు రుచుల ఉగాది పచ్చడి
కష్ట సుఖాలను తెలియజేసే
తీపి, వగరు, చేదు, ఉప్పు, కారం, పులుపుల కలయిక
జీవితములో వచ్చే ఎగుడు దిగుడలకు సూచిక
కష్టానికి కుంగి పోక
సుఖానికి పొంగి పోక
రెండింటితో  సమన్వయముగా
నడుచుకుంటు
సాగిపో ముందుకు
నవ యుగాది పండుగ
వసంత మాసపు కోకిల గానలతో
దేవాలయాలు పంచాంగ శ్రవణాలతో
అందరికి  ఆనందాన్ని  కలిగించే
తెలుగు నూతన సంవత్సర వేడుక
తెలుగు వారి సంస్క్రతికి వేదిక

**************************************************

ఉగాది ఉషస్సు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రేపాక రఘునందన్

కొత్త సంవత్సరం ప్రతి ఇంటా
మంగళతోరణం కావాలి
నవ ఉషస్సు కాంతులు
నవచైతన్య దీపికలై రావాలి….
ఉద్వేగాలు పోవాలి
హృదయాలు కలవాలి
వసంత ఋతువు అధరాలపై
శుభకృతు నామ సంవత్సర
గీతాలాపన…
ప్రకృతి రేఖా చిత్రం పై
నవ అందాల  అభినయం
కోయిల గాన కచేరీలో
ఋతురాజు వసంతుడికై
ఆకర్షణ బంధంలో అలరారే
అద్భుత గళ సమ్మేళనం….
మల్లెల మనస్సులు
ఉద్వేగ భరితాలై
మామిడి పిందెలు చిరుమువ్వలై
నిశ్శబ్దంగా ధ్వనిస్తూ
వేప పూలతో మంతనాలు మొదలెట్టాయి…..
మంచు బిందువులు
మత్తులో మైమరచి
గులాబీలను హత్తుకుంటుంటే
తామరలు సిగ్గుతో తలలు వంచాయి…..
నఖక్షతాలు, దంతక్షతాలతో
మామిడి కాయలు
మైమరచి పోతుంటే మకరందాహ్వానాలందుకుని
గండుతుమ్మెదలు రసస్వాదన
చేస్తున్నాయి…
కష్టసుఖాలు, కలిమిలేములు
ఆశలు, అడియాశలు
కలలు, కన్నీళ్ల
అనుభూతి దొంతరలు
షడ్రుచుల సమ్మేళన పాత్రలో
సేదదీరుతున్నాయి….
అందాల ప్రకృతి యవనికపై
అనుభూతుల ఆకృతులు
చిరస్మరణీయమై మనస్సుల్లో
మరపురాని శిలాక్షరాలైనాయి
కాలమానం, గ్రహసంచారం,
భారతీయ జీవన వైవిధ్యం
పండుగలకు ముఖ్యం
ఆరోగ్య పరిరక్షణకు నిండైన కవచం
ఈ ఉగాది పర్వదినం..
**************************************************

పండుగలు ఆనందాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వేముల ప్రేమలత

శుభ కృతు నామ సంవత్సరమంట
షడ్రుచుల పర్వ దినమంట
శుభోదయాలు, శుభ సాయంత్రాలే కాదు
పండుగ నాడు కూడా పలకరింపులు లేవు
మూగ సందేశాలే నెట్టింట
కాదు కాదు ఇది కాదు పండుగంటే!
పండుగలు ఆనందాలకు నిలయాలు
ఆత్మీయతకు ఆలవాలాలు
మన   సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మలు
మన వారసులకు మన సంస్కృతి గొప్పదనాన్ని చాటి చెప్పేలా పండుగను జరుపుకుందాం
యుగ అనగా  నక్షత్ర గమనం
నక్షత్ర గమనానికి ఆది ఉగాది
సృష్టి  ప్రారంభమైన దినమే ఉగాది
మామిడి పూతలు
కోయిల కుహూ కుహూ గానాలు
ముంగిట్లో అందమైన రంగవల్లులు
గుమ్మాలకు మామిడి తోరణాలు
పసుపు గడపలు, పట్టు పరికిణీలతో
నట్టింట్లో తిరుగాడే అమ్మాయిలు
పిండి వంటలతో ఘుమ ఘుమ లాడే వంటిల్లు
తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు
షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం
సాయంత్రం గుళ్ళో పంచాంగ శ్రవణం తెల్పును మనకు తీపి చేదు కలిసిందే జీవితమని
కష్టాలు సుఖాలు , కన్నీళ్లు ఆనందాలు
అన్ని సమంగా తీసుకోమని ఉగాది సందేశం
ఈ శుభకృతు నామ సంవత్సరం
జనులందరికీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని
ప్రసాదించాలని కోరుతూ
తెలుపుదాం ఉగాది శుభాకాంక్షలు.

**************************************************

ఉగాది దీవిస్తుంది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:  చింతా రాంబాబు

తెలుగువారింట
కొత్త శోభను తెచ్చే
తెలుగు పండుగ ఉగాది
వసంతం వచ్చి
ప్రకృతిని పచ్చగా చేసి
కోయిలచే కమ్మని పాటలు
పాడించెను ఉగాది
నిండైన తెలుగుదనం
షడ్రుచులు పచ్చడి
ఉగాది పండుగ సొంతం
భాదలను మరచి
గతాన్ని గమనించి
రాగ ద్వేషాలను త్యజించి
ప్రేమానురాగాలు పెంచుకొని
మానవత్వాన్ని బ్రతికిస్తూ
అడుగు ముందుకు వేయమని
శుభాలే ఉంటాయంటూ
దీవిస్తుంది ఈ ఉగాది
మనందరినీ…

**************************************************

శుభాలనిచ్చే  శుభకృత్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మాధవి బైటారు “దేవి తనయ”

కొత్త ఆశలు, కోటి కలలతో నూతన సంవత్సరంలోకి అడుగిడుతున్న శుభ వేళ
పేరులోనే శుభాలను కలిగిన శుభ కృత్ ఉగాది
చెరిపేను నిన్నటి చేదు జ్ఞాపకాలని
తెచ్చేను ఆనందాల హరివిల్లుని
ప్రతి మోము మెరవాలి కోటి కాంతులతో
ప్రతీ ఇల్లు తడవాలి సంతోషాల జల్లులలో
శిశిరం వెనుక వచ్చే పచ్చని వసంతం
కష్టం వెనుక సుఖం , బాధ వెనుక సంతోషం ఖచ్చితం అని లోకానికి తెలిపే
షడ్రుచుల ఉగాది పచ్చడి
జీవితం సుఖ దుఃఖాల మేలు కలయిక అని నుడివే
మనసున అసూయా ద్వేషాలు తుడిపేసి ప్రేమానురాగాలు నింపితే
లోకమే వర్ధిల్లు శ్రీరామ రాజ్యమై

**************************************************

ఆహ్వానం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ఉగాది లక్ష్మికిదే మనపూర్వక  ఆహ్వానం
ఉదయ కాంతుల వెలుగులకు మా ఆహ్వానం
కొత్త చిగురుల సోయగాలకు ఇదే ఆహ్వానం
కోకిల కుహూ రాగాలతో పలికింది ఆహ్వానం

షడ్రుచులను ఆశ్వాదించుటుకు స్వాగతం
సరికొత్త ఆనందానికి ఇదే మా స్వాగతం
వాతావరణంలో కలిగే మార్పులకు స్వాగతం
మదిలో మెదిలే భావానికి చెప్పేము స్వాగతం

శుభాలను కురిపిస్తే ఈ ఏడాదికి వందనం
కష్టాలను తొలగించే సంవత్సరానికి వందనం
శుబాశుభాలతో ఎదురీదాల్సిన రోజుకీ వందనం
మది గాయాల్ని మరిపించే కొత్తదనానికి వందనం

మామిడి తోరణాలను గుమ్మానికి అలంకరిద్దాం
ఉగాది పచ్చడి విందును ఆరగిద్దాం
నియమ నిబంధనలు పాటిద్దాం
జీవితాన్ని తృప్తిగా గడిపేద్దాం

కొత్త చిగుర్లతో ఉన్న చెట్లను చూద్దాం
లేలేత భానుడి కిరణాల అందం చూద్దాం
కాలు పెడితే కందిపోయె భూమాత సోయగం చూద్దాం
అలోచనలకు స్వస్తి చెప్పి, ఆనందాన్ని పొందుదాం

**************************************************

మధుమాసపు వసంతం చైత్రం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పద్మావతి పి

అంబరమే గర్వించింది శుభతరుణమని పర్వత పంక్తుల ఒడిలో
బంగరు కాంతులు వెదజల్లే వెలుగుల సంధ్యారాగం..
వాసంతుని పిల్లగాలుల
విరుపుల తెమ్మెరలలో  ప్రకృతి కన్నియ పరవశం..
కమలాకరుని స్పర్శతో
కరములు కైమోడ్పులై
ప్రణమిల్లిన అంబుజం..
గున్న మామిళ్ళ గుబురలలో
శుభ తరుణమని కోయిల సన్నాయి రాగాలు పలికింది..
గత కాలంలో బాధల స్మృతులు ఎన్నున్నా,
సంఘర్షణలతో, నిరాశా నిస్పృహలతో జీవించినా
ఆశల ఆకాంక్షలతో నిరంతరం పోరాటం సాగించినా
శుభకృతు నామ సంవత్సర ఆగమన శుభతరుణంలో
ఎండిన మోడులా మారిన
క్రొత్తగా కొంగ్రొత్తగా
చిగురించిన ఆశలు
పల్లవులై మరల మరల
మల్లెల పరిమళాలే వెదజల్లుతాయని ఆశిస్తూ..
శుభకృతు వసంత శోభలను ఆహ్వానిస్తూ
కరములు(చేతులు) కైమోడ్చి మదినే అర్పించిన శుభతరుణ నవోదయం..

**************************************************

ఉగాది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:k. లక్ష్మీ శైలజ

ఆనందాల తియ్యదనం
కష్టనష్టాల కారం
విమర్శల పులుపు
నిరాశల వగరు
అవమానాల చేదు
భావోద్వేగాల ఉప్పదనం
షడ్రుచుల సమ్మేళనం
ఉగాది పచ్చడి సేవనం
సర్వారిష్టాల తొలగింపు..
హితవు పలికే పంచాంగ శ్రవణం
ఆదాయం పెంచుకొని
అవమానం తగ్గించుకొని
కోయిల గానంలా జీవితం సాగించాలని..
తెలుగు సంవత్సరాన్ని స్వాగతించే
పండుగ యూగాది

**************************************************

నవశకాన్ని పలకరిద్దాం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శింగరాజు శ్రీనివాసరావు

ఆమని అడుగిడినా కోయిల కూయలేదు
వసంతం వచ్చినా చిరుపూతలు కనరాలేదు
చైత్రం ఏతెంచినా మామిడమ్మ మాటలేదు
తరువు బిడ్డల గొంతులు కోసి కూల్చారని
ఉగాది తల్లి అవని మీద అలిగినదేమో
పండుగ వాతావరణం మందకొడిగా సాగుతున్నది
దేశాల మధ్య కమ్మిన యుద్ధమేఘాలు
సగటు జీవికి ధరల మంటల సెగ పెడుతున్నాయి
ఆశలే ఊపిరిగా బ్రతికే ఆశాజీవులం మేము
కిందపడినా బంతిలా లేచే ధీరులం
శోభాయమాన శుభకృతును ఉత్సాహంగా
రంగవల్లులు దిద్ది మరీ ఆహ్వానిస్తున్నాం
అడవితల్లికి దండమెట్టి తరువు తోడును పెంచుకుందాం
నీటిబొట్ఠును ఒడిసిపట్టి చెరువమ్మను కాచుకుందాం
నవశకాన్ని నిర్మిస్తూ కొత్త ఉగాదిని పలకరిద్దాం
ఆమని కోయిల రాగాలతో భవితను దిద్దుకుందాం

**************************************************

ఉగాది పద్యాలు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:పి.వి.వి.యన్.రాజకుమారి

తే.గీ.
చైత్ర మాసపు సొగసులు ధాత్రి కిచ్చె
వరములు. సిరుల నొసగెను ప్రకృతి శోభ
కొత్త చివురుల రుచులను కోరి వచ్చి
కోయిలలు పాట పాడెను కూర్మి తోడ

కం.
పక్షులు కువకువ లాడుచు
బక్షములు ముదముగ నెగురుచు నింగిన్
జక్షువుల కింపు నొసగెను
వృక్షములన్నియు హరితపు వేడుక
జూపెన్

కం.
వచ్చెను వసంత కాలము
విచ్చెను పూవులు ముదముగ ప్రేమను  బంచన్
దెచ్చెను కోకిల గానము
ముచ్చట తీరగ చిలుకలు ముంగిట యాడున్

కం.
ఉగము గమనమును దెల్పును
యుగాది సృష్టికిది యాది యునికిని
దెల్పున్
నగవులొలుకుచును జీవులు
చిగురులు తొడిగిన తరువుల చిత్రము జూసెన్

తే.గీ.
శుభము లిచ్చును ప్రజలకు శుభకృత ము వ
సంత ఋతువు నాగమముతో శోభ వచ్చు
పుడమి యంతను పరవశ మొంది వేడు
కాయె ప్రకృతి మానవునికిచ్చు కానుక యిది

కం
వత్సర ఫలితము లన్నియు
నుత్సాహముతో భవితకు నూతము నిచ్చున్
యుత్సవ మాయెను జగతికి
వత్సర మంతను విజయము వైభవ మొందున్

**************************************************

ఈ తత్త్వానే బోధిస్తుంది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:పులిగడ్డ శ్రీరామచంద్రమూర్తి

కలిమి – లేమి
సుఖం – దుఃఖం
లాభం – నష్టం
ఇవి నిత్య జీవితంలో
చవి చూచే ద్వందాలు…
తీపి – చేదు
ఉప్పు – కారం
పులుపు – వగరు
ఇవి నిత్య భోజనం లో
రుచి చూచే ద్వందాలు…
అన్నీ కలబోసినదే జీవనం
అన్నీ కలగలిపినదే భోజనం
సుఖాన పొంగక
దుఃఖాన కుంగక
సమభావంతో
జీవనగమనం
సాగించ మనేదే ఈ ఉగాది.
ఈ తత్త్వాన్నే బోధిస్తుంది
మనదర్మం యుగాదిగా.

**************************************************

స్వాగతం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: లతాకృష్ణ ( లతా రామకృష్ణ)

చైతన్య కాంతులతో వస్తున్నాయి చైత్ర రథాలు
వసంతకాలపు ప్రకృతిని వికసింపజేస్తూ
తరువుల, విరుల సొగసైన నాట్యం చూస్తూ
ఇంపైన కోయిల కుహుకుహులను ఆలకిస్తూ
మదిని దోచే మల్లెల సౌరభాలు
నలు దిశలా వ్యాపింపచేస్తూ
మనసైన మామిళ్ళ మకరందాలను పంచుతూ
షడ్రుచుల ఉగాది పచ్చడి సేవన
కొత్త విజయాలకు నాంది పలుకుతుందని
ఆ విజయాలతో శాంతి, సామరస్యం నెలకొని
ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుందని.
గతించిన సంవత్సరాల  గరళానికి
గడువు తీరిందని
గగనాన్ని చుంబించే శుభాల అలలు వెల్లువలై
పలుకుతున్నాయి స్వాగతం శోభాయమానంగా
శుభవార్తల శుభకృత్ నామ సంవత్సరానికి.

**************************************************

మరో ఉగాది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: రాజశేఖరుని శ్రీ శివ లక్ష్మి

కాలం కొమ్మకు మారాకు వేసింది
గతం లిఖించిన మహాప్రస్థానలన్నీ
అనుభవాల గూట్లో పదిలపరచి
మరో ప్రస్థానానికి తెరతీసింది
నిన్నలలో తీపెంతో చేదెంతో
మనస్సు మూలల్లో బాదెంతో బరువెంతో
సాధించిన వెన్నో వేధించిన వెన్నో
పదిల పరుచుకున్న జ్ఞాపకాలెన్నో
విదిలించుకునే వేదనలు ఎన్నో
ఏ రోజుకారోజు
కొత్త పాటల కోకిలయింది జీవితం
రేపటి కోసం మిగిల్చుకున్న ఆశలు
నిన్నని సాదరంగా సాగనంపితే
సంకల్పాల శుభ కృతిలో
కొత్త ఆకృతి దాల్చుకున్న ఆశయాలు
వస్తే రానీ
కష్టమో నష్టమో
సుఖమో దుఃఖమో
మరణమో జననమో
పదునెక్కే ఆశయాల పదరంగం ఇది
మారుతున్న కాలాల మధు రాగం ఇది
అలుపులేని పాట అవుతానో
వెనక నడుచు పాదాల బాటవుతానో
తీర్పు కాలానిదే
గెలుపు ఓర్పు హృదయానిదే

**************************************************

మరో ఉగాది
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: కార్తీక్ నేతి

నిన్నటి ప్లవనామ సంవత్సరం నుండి
శుబక్రుతి లోకి ఆడుగుపెడుతున్నాము,
తీపి, పులుపు, వగరు కలగలిసిన
ప్రకృతి ప్రసాదముతో
నూతన సంవస్తర నికి మొదలు పెట్టె పర్వదినం
పచ్చధనం చిగురించే  వసంత రుతువు ఆగమనం,
గడిచిన సంవత్సరం ఆటు పోట్లతో చేసాము ప్రయాణం, ఆకలి, దప్పికలు ఉండకోడదని
ఆ జగత్మతాకు నివేదిస్తు,
సమస్త ప్రాణ కోటికి శుభాలు  కలగాలని కోరుకుంటూ,
మెరుగైన మానవ సంబంధాలతో సమాజం మంచివైపు నడిచేందుకు
ప్రతి ఒక్కరం పాటుపడుతూ,
కాలం శుభాశుభ మిశ్రమంతో సాగుతుందని వాస్తవాన్ని నమ్ముతు,
ఈసారి అంత శుభాకృతంగ  సాగుతుందని విశ్వశిస్తూ,
ఆశాభావంతో, ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకొని బావిష్యత్తుని స్వాగతిస్తూ
మంచి, చెడునీ తట్టుకుంటూ నూతన జీవితాన్ని మొదలుపెడదాము,
ఈ శుభాకృతు నామసంవత్సరంలో
అందరి కాంక్షలు నిరవేరాలి ,
అష్ట ఐశ్వర్యాలు , మెరుగైన ఆరోగ్యం అందరికి కలగాలి.

**************************************************

ఆనంద ఫలం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:  ఎం. వి. ఉమాదేవి

కోయిలమ్మ కూడా కొమ్మల్లో
కుదురుకున్నాకే కూస్తుంది
శిశిరవేదన తొలిగాకే తరువు కాపుకు సిద్ధమౌతుంది
నయగారాలతో నక్షత్రదారుల గమనం యుగాలుగా..
విసుగులేని విశ్వ చైతన్యం
ఋతువుల్లో కొత్త పూర్ణతను నింపి
ప్రాణుల మనుగడకి హరితపతాకం ఊపుతుంది
ఒడిదుడుకుల వత్సరాల్ని వెనక్కినెట్టి…
మధుమాస కన్య పూర్ణకుంభ స్వాగతం
వాసంతికా వేడుకల వైభవం
నవ వధూవరుల కన్నుల్లో కాంతి
సంప్రదాయం సంస్కృతి పద్ధతుల పాటింపు
దాన యోగము పర్వదినాల పరమసంకల్పం
పదునుదేలిన పావన రవికిరణాల స్పర్శ
రోగనిదానం, స్వస్థత కలిగించే
వెచ్చని భరోసా వెన్నంటిన సూత్రం !!
కావాలి శుభకృతు యొక్క జయదీవెనలు !!
సాగాలి సత్పురుషుల ఆదర్శకర మార్గాలు !
మనో కుడ్యం పైన చేదుజ్ఞాపకాల చిత్తరువు
వేగమే తొలగించి వేదనలకి వీడ్కోలుతో..
సుందరవనాల శుభోదయాలకు
శుభలగ్నంతో స్వాగతం చెప్పండి !!
అనంతరం సాధనకూ శ్రమకూ
ఆనందఫలాలు అందుకోగలరు!!

You May Also Like

2 thoughts on “ఉగాది కవితలు

  1. అద్భుతం… అందరి రచనలు ఒక దగ్గర రావడం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!