వెలుగు నావ

వెలుగు నావ

రచయిత :: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

కాలు మీద కాలేసుకొని చెక్క కుర్చీలో కూర్చొని ఉన్న రంగారెడ్డికి తళుక్కున ఒక ఆలోచన వచ్చింది.కూరగాయల బిజినెస్ మొదలెట్టి ఓ రెండేళ్ళు కష్టపడి బాగా సంపాదించేసి తర్వాత కవలలైన  కొడుకులకు పెళ్ళి చేసేసి వచ్చే కట్నాలతో మెయింటైన్ చేసు కుంటూ ఇలాగే కాలుమీద కాలేసుకు కూర్చోవచ్చు అనుకొని కూరగాయల బిజినెస్ మొదలెట్టాడు.రంగారెడ్డి సోమరిపోతు మరియు తాగుబోతు అవడంతో భార్య కల్పన తన తల్లిదండ్రుల సాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంది.రంగారెడ్డికి సంపాదన లేకపోయినా గొప్పలకేమీ తక్కువకాదు నేననుకుంటే ఏదైనా చేసెయగలననే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎవరి మాటా వినని సీతయ్య లా ప్రవర్తిస్తాడు.కొడుకులను చిన్నప్పటి నుంచి డాక్టర్లను చేస్తానని డంబాలకి పోయి  బైపిసి చదివించాడు.ఆ తర్వాత వాళ్ళకి సరైన గైడన్స్ లేక ,కోచింగ్ లేక నీట్ లో క్వాలిఫై కూడా కాలేదు.ఇంటర్ పూర్తై నాలుగేళ్ళు గడుస్తున్నా నీట్ అనే యుద్ధంలో సైనికులై పోరాడుతూనే ఉన్నారు.ఏం చేద్దాం వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమైపోయింది.డాక్టర్లే కావాలని పట్టుబట్టి ,సంపాదించలేని తండ్రి,బైపిసి తర్వాత డిగ్రీ చేస్తే నామోషీగా ఫీలయ్యే కొడుకులు ఇలాంటి పరిస్థితిలో  కల్పన గుండె దిటువు చేసుకొని బతుకుతూ ఉంది.నేటి సమాజంలో పిల్లలూ,వారి తల్లిదండ్రులు ఎంచుకొనే లక్ష్యాలు అతిశయోక్తి అలంకారానికి మించి ఉంటున్నాయి.పిల్లలను ఏనుగెక్కించాలనుకొనే తల్లిదండ్రులు మావటివాడిలా మచ్చిక చేసుకోలేని పిల్లలు పొంతనలేని నిర్ణయాలతో భవిష్యత్ తారుమారవుతూ ఉంది.అలాంటి పరిస్థితిలో తన భర్త అప్పుతెచ్చి కూరగాయల వ్యాపారం పెట్టాడని కల్పన కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది.కల్పన తల్లిదండ్రులు ఒక వెధవకిచ్చి తమ బిడ్డ గోంతు కోశామని దిగులుతోనే బతుకుతున్నారు.

అందరూ అనుకున్నట్లుగానే కూరగాయల వ్యాపారం దివాలా తీసింది.అప్పుల మూట పెరిగిపోయింది.అప్పుడే పిల్లలిద్దరూ ఏదో ఒక పని చేయకపోతే కష్టమని తలచి ఇంటర్మీడియట్ లో గురువైన మహేంద్ర సార్ దగ్గరికి సలహా కోసం వెళ్ళారు.మహేంద్ర మీ సమస్యకు పరిష్కారం మెడికల్ షాపు నడపడమే.మీరు ముందు బాలాజీ మెడికల్ షాపులో ఆర్నెల్లు పని చేసి వ్యాపార రహస్యాలన్నీ తెలుసుకొని రండి తరువాత మీకు మెడికల్ షాపు పెట్టించే పూచీ నాది అని హామీ ఇచ్చాడు.సంతోషంతో ఇంటికొచ్చి అమ్మకి విషయం చెప్పి మెడికల్ షాపులో చేరిపోయారు ఇద్దరు పిల్లలు.కల్పన దేవుడే మహేంద్ర సార్ రూపంలో వచ్చాడని మనసులో అనుకుంది.ఇంతలో పక్కింటి రాజమ్మ ఒసేయ్ కల్పనా! మీ ఆయన నల్ల కాలవ దగ్గర పడిపోయున్నాడంట ఎళ్ళమ్మా అంది.కల్పన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటోలో హాస్పిటల్ కి తీసుకెళ్ళింది.మధ్యాహ్నం పిల్లలిద్దరూ హాస్పిటల్ దగ్గరికొచ్చారు.కల్పన మీ నాన్న మూడునెలలు మంచానికే పరిమితంరా అనడంతో పిల్లలిద్దరూ “అమ్మా!నాన్నకి ఎంత సేపు తాగుడేనా.చచ్చినా బాగుండమ్మా “అనడంతో కల్పన అలా అనకండిరా ఎంతైనా జన్మనిచ్చిన తండ్రిరా ,తల్లిదండ్రులు చేతకాని వారని చులకన చేయడం కాదు మీ సత్తాతో వాళ్ళని కూడా తలెత్తుకొనేలా చేయాలి అదీ చదువుకున్న నీలాంటోళ్ళకుండాల్సిన పౌరుషం”అని వాళ్ళని ఉత్తేజ పరచింది.ఎలాగైనా మెడికల్ షాపు పెట్టుకొని సంపాదించి అప్పులన్నీ తీర్చేయాలి అనుకుంటూ షాపుకెళ్ళిపోయారు.ఐదు నెలలు గడిచాయి పిల్లలు కష్టపడుతుంటే చూసి రంగారెడ్డిలో కొంత మార్పు వచ్చింది మరో నెలలో మెడికల్ షాపు పెట్టాక నేనూ మీతోనే పని చేస్తానురా అంటూ పిల్లలకు చెప్పాడు.తామొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు హఠాత్తుగా జరగకూడనిది జరిగిపోయింది.పిల్లలు డిప్రెషన్ లోకెళ్ళిపోయారు.పాపం కల్పనకి ఏం చేయాలో పాలుపోవట్లేదు.అసలేం జరిగిందంటే మహేంద్ర సార్ చనిపోయాడు.సహాయం చేసే చెయ్యే విరిగిపోయిందని రంగారెడ్డి కూడా బాధపడి మహేంద్ర సార్ భార్య దగ్గరికి పరామర్శ కోసం కల్పనని తీసుకెళ్ళాడు.అక్కడ దుఃఖంలో మునిగిన మహేంద్ర సార్ భార్య ను కల్పన ఓదార్చి ఇంటికొచ్చే సమయంలో రంగారెడ్డి చేతిలో ఓ కవరు పెట్టి “మా ఆయన మీ కుటుంబం గురించి బాధపడే వాడు,ఈ కవర్లో మీ పిల్లలకు మెడికల్ షాపు పెట్టుకొనేందుకు లైసెన్స్,పర్మిషన్ తోపాటు డిస్ట్రిబ్యూటర్ వివరాలు కూడా ఉన్నాయి.”అనడంతో రంగారెడ్డి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.మహేంద్ర సార్ మహానుభావుడు నెల ముందే చేయాల్సిన పనిని సిద్ధం చేసి ఒక కుటుంబాన్ని ఆదుకున్నాడు.చీకటి సంద్రంలో మునిగిన మమ్మల్ని మెడికల్ షాపు అనే వెలుగు  నావలో ఒడ్డుకు చేర్చాడు.సార్..మీరు మరణించినా మీ సహాయం అమరత్వం పొందింది.మీరు మా దృష్టిలో అమరుడే సార్ అనుకుంటూ ఆయనే ఇక నుంచి మా దైవం అని “మహేంద్ర మెడికల్ షాప్”ను ప్రారంభించి తక్కువ రేటుకే మందులమ్మి మంచి పేరు తెచ్చుకున్నారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!