విజయ మాల

విజయ మాల
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: బాలపద్మం

హై! మాల అంటూ పిలిచాడు తరుణ్ భార్యని. హా.. వస్తున్నా అంటూ హాలు లోకి వెళ్ళింది.  ఏమిటీ నీకసలు బుద్ది ఉందా! ఈ బల్ల మీద కాఫీ కప్పు ఏమిటీ! నేను పొద్దున్న తాగింది ఇది, అవునా! లేక ఎవరైనా వచ్చి తాగి వెళ్ళారా ఇంతకు ముందే అంటున్నాడు. ఆ మాటల్లో వ్యగ్యం స్పష్టంగా అర్థమైంది మాలకి. కొంచెం ఒంట్లో బాగోక కప్పు అలా ఉండిపోయింది, ఇప్పుడే తీస్తా అంటూ ఆ ఖాళీ కప్పు తీసి వంటింట్లోకి వెళ్ళింది. ఏం మనిషో అనుమానం తప్ప ఓ మురిపెం లేదు ఏమీ లేదు. అసలు వీడ్ని నేను ప్రేమించి ఎలా పెళ్లి చేసుకున్నానో, కనీసం ఒంట్లో బాగోలేదు అంటే ఏమైంది అని కూడా అడగడా! ఏమైనా అంటే ఆఫీస్ పనిలో టెన్షన్ అంటాడు అనుకుంటూ బాధని లోలోపలే దిగమింగుకుంది. హా! రోజంతా ఖాళీనే కదా, ఇంకా ఒంట్లో బాగోలేదు అంటూ సాకు ఒకటీ, ఏదో ఓ పిల్లడ్ని చూసుకోవడం కూడా పనేనా, ఇప్పుడు అదీ లేదు కదా అంటూ కొంచెం గట్టిగానే గార్ధభ స్వరంతో అన్నాడు, తరుణ్. మాల ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది.  పురుషహంకారం తో నిత్యం రగిలే తరుణ్ భార్యను బానిస అనుకుంటాడు. తను ఏం చేసినా, ఎలా ఉన్నా ప్రశ్నించ కూడదు అనుకుంటాడు. అప్పుడప్పుడు వారాంతం లో స్నేహితులతో పార్టీలు, విందు వినోదాలు తప్ప భార్యని మనసారా పలకరించడు.
ఎంతో ప్రేమను చూపించి అన్ని విధాల తగినవాడు, చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, జీవితం హాయిగా గడపొచ్చు అని భ్రమ పడింది మాల. బాబు పుట్టాక ఉన్న ఉద్యోగం కూడా మానేసి బాబు తోనే లోకం తనకి. ఈ భర్త ఇలా ఎందుకు మారేడో ఎప్పటికీ అర్థం చేసుకోలేక పోయింది. అసలు తన వైపు నుంచి ఏం తప్పు చేసిందనీ, తరుణ్ కి ఏం తక్కువ చేసిందనీ విషయం అర్ధం కావడానికి.
తరుణ్ ని పెళ్లి చేసుకుని తప్పే అయింది అని బాధపడని క్షణం లేదు. ఇప్పుడు బాబు కి ఐదేళ్లు వచ్చాయి. స్కూల్ కి పంపాలి, బంగారు భవిష్యత్ ని ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తరుణ్ వంటి వ్యక్తిత్వం మాత్రం రానీయ కూడదు అని చెప్పి క్రితం ఏడాది పిల్లలు లేక విల విలలాడుతున్న తన అక్క రాగిణి దగ్గర దింపి వచ్చింది. ఈ విషయంలో కూడా తరుణ్ నీ ఇష్టం అన్నాడు తప్ప, ఇక్కడే స్కూల్ లో వేద్దాం అనలేదు. అసలు తను ఏమనుకుంటున్నది చెప్పడు. ఇది మాల కి తను నిశ్చయించుకున్న లక్ష్యం వైపు నడవాడినికి కూడా ఎంతో ఉపయోగ పడింది. రోజూ ఇదే వరస. ఒకే ఇంట్లో ఉంటున్నా దాసి జీవితంలా తను, రాజా నా అన్నట్టు అతను. తనతో తినడం ఇష్టం లేక రాత్రి భోజనం కూడా ఏదో చేశాను అనిపించి, వంట పాత్రలు శుభ్రం చేసుకుని, వంటిల్లు సర్దుకుని వెళ్లి పడుకుంది. అప్పటికే రాజా వారు పడుకున్నారు, హమ్మయ్య అనుకుంది. లేదంటే తనకి కాసేపు మళ్లీ ఓ ఆట వస్తువుని అవ్వాలేమో అనుకుని. ఇలా ఎన్నో రాత్రులు పడుకుని, నిదురకు దూరమై గడిపింది మాల. అయితే అన్నిటినీ మౌనంగా భరిస్తూ, తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తు, మానసికంగా మరింత బలంగా తయారవుతూ వచ్చింది. మరునాడు ఉదయం ఆదివారం కావడం తో తరుణ్ ఎప్పుడూ లాగే ఆలస్యంగా లేవడం, టి వి పెట్టడం, న్యూస్ చూస్తూ ఆశ్చర్య పోవడం జరిగింది. విషయం ఏమిటంటే యూ పి ఎస్ సి వారి గ్రూప్.1 ఫైనల్ ఫలితాలలో రాజమండ్రి కి చెందిన మాల ప్రథమ రాంక్ అని వస్తోంది. ఏమిటీ ఇది తన భార్య ఏనా అని ఆశ్చర్యపోయాడు. అప్పటికే మాల కి చాలా మంది ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలపడంతో మాల చెప్పలేని ఆనందంతో కాదు విజయ గర్వంతో కాదు కాదు, ఈ పురుషహంకార జీవితం నుంచి దూరంగా పారిపోవడానికి చక్కని రాచబాట దొరికింది అని తాను కొలిచే వేంకటేశ్వరునికి పదే పదే నమస్సులు తెలుపుకుంటోంది. తరుణ్ కి మాత్రం రాత్రి తాగింది ఒక్క ఉదుటున దిగిపోయినట్లు అయింది. ఏదో బాగుండదు అన్నట్టు మాలా గుడ్, కంగ్రాట్స్ అన్నాడు – అసలు తను ఎప్పుడు ఈ పరీక్షలు కట్టింది, ఎప్పుడు ప్రిలిమ్స్ అయింది, ఎప్పుడు చదివింది కూడా తెలియని ఈ మగ మారాజు. అయితే మాల అప్పటికే తరుణ్ తో వేరుబడి ఉద్యోగం లో చేరి తన కలల సౌధం వాస్తవంగా నిర్మించుకుని కొడుకును తన తోనే ఉంచుకుని, సమాజం గర్వించేలా తయారు చేయాలని, తను కూడా ప్రశాంతంగా బ్రతకాలని స్థిరంగా నిర్ణయించుకుంది. అదే ఇప్పుడు తరుణ్ కి నిక్కచ్చిగా చెప్పింది కూడా. తరుణ్ కి నోట మాట రాలేదు. తన ఉద్యోగాన్ని, నిర్ణయాన్ని కాదనే ధైర్యం కూడా చెయ్యలేక పోయాడు. అసలు ఇదంతా ఎలా జరిగింది, తనకి ఈ అవకాశం తానే కల్పించాడా లేక పరిస్తితికి కృంగి పోకుండా నిరాశ లో విజయం మెట్లు ఎక్కిందా!? ఈ ప్రశ్నలు తరుణ్ దగ్గరే ఉండి పోయాయి. మాల మాత్రం ఒక సంపూర్ణ మహిళగా, విజయం పొందడానికి ఏదీ అడ్డంకి కాదని నిరూపించి, తరుణ్ కి అందనంత ఎత్తులో నిలుచుంది. అనుకోకుండా మొదటి ఉద్యోగం అక్కా వాళ్ళు ఉన్న ఊరిలోనే రావడం తో మాల మరింత సంతోషంగా. విజయ మాలను అలంకరించుకుని సాగిపోయింది. పరిస్తితులకు తల ఒంచక సాగితే అదే విజయ తీరాలకు చేరుస్తుంది అని ఈ మాల కథ చెబుతోంది. కథ కంచికి, మనం ఇంటికి.

You May Also Like

5 thoughts on “విజయ మాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!