చాముండి … చీర షాపింగ్

చాముండి … చీర షాపింగ్

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

పండుగ సీజన్ మొదలయ్యింది. ప్రతి షాప్ లోనూ వ్యాపారాలు ఊపు అందుకున్నాయి. ఆడవారి మనసు ఉత్సాహంతో ఉరకలు వేస్తోంది.

ఇరుగు పొరుగు వాళ్లు చెప్పే షాపింగ్ మాటలను సీరియస్ గా తీసుకున్న చాముండి, ఎలాగైనా పండక్కి చీర, మ్యాచింగ్ గాజులు, బొట్టు బిళ్లలు అన్నీ కొనుక్కోవాలని తెగ ఉవ్వీళ్లురుపొయింది.

లాక్ డౌన్ తర్వాత అసలు బయటకు వెళ్లింది లేదు. అలా బయటకు వెళ్లి, ఒక చీర కొనుక్కుని వద్దామండి అంటూ గోముగా అడిగిన చాముండి మాటను తోసిపుచ్చలేక సరే అన్నాడు ఆమే భర్త సదాశివం.

ఎగిరి గంతు వెయ్యాలన్న ఆమె కోరికను బలవంతాన అదిమి పెట్టుకుని, రెట్టింపు ఉత్సాహంతో ఎదురింటి పంకజాన్ని పిలిచి, పాలవాడు వస్తే పాలు పోయించుకో ఒదినా… నేను షాపింగ్ కి వెళుతున్నాను చీరలు కొనుక్కోవాలి అని అరుస్తూ చెప్పింది. చీరలు పదాన్ని ఒత్తి పలుకుతూ.

ఆమెతో షాపింగ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిన ఆమె భర్త మాత్రం, ఆమెకు ఎదురుచెప్ప లేక ఆమెతో పాటు ముందుకు కదిలాడు.

వారి వీధిలో ఉన్న ఒక షాప్ ముందు బండిని నిలుపగా, గుడ్లురిమి చూసింది చాముండి భర్త వైపు.

చేసేది ఏమి లేక, ఎ. టి. యమ్ లో డబ్బులు డ్రా చేసి మరి మార్కెట్ వైపు పోనిఛ్ఛాడు బండి. పాపం ఆ అభాగ్యుడు.

చూసి చూసి, జనం ఒక మాదిరిగా ఉన్న కొట్టు వైపు చూసి, బండి ఆపమన్నట్టుగా సైగ చేసింది. బతుకు జీవుడా అనుకుంటూ, బండి ఒక పక్కగా పార్క్ చేసి, ఆమెను అనుసరించాడు.

ఆమెను చూసిన ఒక అతను ఎం కావాలి మేడమ్ అంటూ ప్రశ్న సంధించాడు.

వీడెవడో బలి అయిపోయాడు అనుకుంటూ చాముండి వైపు చూశాడు సదాశివం.

ఆ షాప్ వాడు ఇచ్చే మర్యాదకు పొంగిపోయి, లేటెస్ట్ మోడల్ చీరలు కావాలి అంది.

ఉత్సాహంతో ఆ షాప్ అతను, మా దగ్గర అన్నీ లేటెస్ట్ మోడెల్సే మేడమ్, మీకు నచ్చే విధంగా ఉంటాయి అని నమ్మకంగా పలికాడు.

సంతోషంలో మునిగి ఉన్న పంకజం చుట్టూ కలియచూసింది.

హుందాగా ఒక చైర్ లో కూర్చుంది. ఈమె హుందాతనానికి తగ్గాట్టుగా ఖరీదు గల చీరలు చూపించాడు అతను.

10 రకాల చీరలు చూసిన చాముండి, ఖరీదు అడిగింది.

10000 మేడమ్…లేటెస్ట్ డిజైన్. చెప్పాడు షాప్ అతను.

బిత్తరపోయింది చాముండి. ఆసలే ఈ కరోనా పుణ్యమా అని చాలా రోజుల నుండి ఉద్యోగం కూడా లేని సదాశివం వైపు బెలగా చూసింది.

అతను మాత్రం, ఈ ఘట్టం ఇప్పుడే తెమలదు అనుకోని, పక్కనే పడీ ఉన్న న్యూస్ పేపర్లో తలదూర్చాడు.

ఇంకా చేసేది ఏమి లేక, అమ్మో అంత రేటు ఎందుకు? అయినా అనుకుంటాం కానీ, అంత రేటు పేట్టి కొనుక్కుని ఆ బట్ట కట్టలేము, బీరువాలో పడేసి ఉంచడమే అంటూ ఇంకో సేల్స్ గర్ల్ వైపు చూసి నవ్వింది.

చిర్రెత్తిన షాప్ అతను, మీకు ఎంత రేటులో కావాలి మేడమ్ అన్నాడు.

హా, పెద్ద రేటులు మనకొద్దు. ఏదో రోజు వారి వాడిక కోసం అంతే … గుడ్డ మన్నిక ఉంటే చాలు. అలాగని చూడగానే చీప్ గా ఉండకూడదు. అంటూ ఆగింది.

విసుగుని ముఖంలో దాచాలని విఫల ప్రయత్నం చేస్తున్న షాప్ అతను మళ్లీ విఫలమయ్యాడు.

ఆ కొండలాంటి చీర గుట్టను ఒక పక్కకు తోసి, ఇంకో చీరల కొండకు శ్రీకారం చుట్టాడు.

ఈ రంగులో ఆ డిజైన్ ఉందా? ఆ డిజైన్ లో ఈ రంగు ఉందా? ఇది ఉతికితే కలర్ ఉంటుందా? పోతుందా? దీనిలో లైట్ కలర్ ఉందా? దీనికి మెరూన్ బోర్డర్ ఉందేమో చూడండి అంటూ చాలా డిగ్నిఫైడ్ గా ఆరా తీస్తూ ఉంది.

మేడమ్, మీరు ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకోండి మేడమ్. నాకు డ్యూటీ దిగే టైం అయ్యింది అన్నాడు విసుగ్గా.

ఇదేం ట్రీట్ మెంట్. కస్టమర్లతో ఇలాగేనా మాట్లాడేది, ఓర్పు ఉండకపోతే ఎలా? అంటూ గయ్యిమంది.

నోట మాట రాని అతను, అది కాదు మేడమ్, మద్యాహ్నము నుంచి చూస్తున్నారు. రాత్రి అయ్యింది. రెండు చీరలు నచ్చలేదు అంటే ఎలా అన్నాడు లేని ఓపిక తెచ్చుకుంటూ.

నాకు నప్పే రంగులు లేవు మీ షాపులో ఏమి చెయ్యను? సరేలే.. అంటూ కాంప్రమైజ్ అయ్యి, ఒక చీర తీసుకుంది.

ఇంటికి చేరేసరికి రాత్రి 10 గంటలు.

పొద్దున మిగిలిన ఆ కూరలు, చప్పని చారుతో ఆ రోజు ముగిసింది.

ఉదయం కళ్లు తెరిచేసరికి, మాటలు వినపడి లేచి చూసిన సదాశివానికి నోట మాట రాలేదు.

చాముండి… ఆ షాప్ అతను నిన్ను మోసం చేశాడు. ఆ చీర అంత రేటు పలకదు. ఆదీ కాక, ఆ మోడల్ లో ఎన్నో రంగులు ఉన్నాయి. నీకు చూపించ లేదేమో అంటూ పంకజం.

హ..ఈరోజే వెళ్లి, వాడి అంతుచూస్తాను. ఇంకో చీర కూడా కొనాలిగా.. ఎలాగూ… అంటుంటే…సదాశివానికి నోట మాట రాలేదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!