ఎదురింటి మేడ మీద

(అంశము::”కొసమెరుపు కథలు”)

ఎదురింటి మేడ మీద

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

ఆదివారం, అర్ధరాత్రి. టైం 12 గంటలు కాదు కానీ, 11 దాటింది. అప్పటి వరకూ అత్త వాళ్ళతో కబుర్లు చెప్పి పడుకోవడానికి బయటకు వచ్చాను.

వేసవి కాలం అవటం చేత, అందరికీ మంచాలు బయటే వేసారు. పడుకుని కూడా చాలా ముచ్చట్లు చెప్పుకున్నాము. చాలా సేపటికి అందరూ నిద్రలోకి జారుకున్నారు.

నేను కూడా ఆ రోజే బందరు నుంచీ విజయవాడకు ప్రయాణం చేసి రావటం వల్ల, అలసట గా ఉంది. నాన్నే మో నన్ను అత్త వాళ్ళ ఇంట్లో దింపి, తను బందరు వెళ్లిపోయారు. ఇంటికి చేరుకున్నారో, లేదో!!! అనుకుంటూ  దుప్పటి కప్పుకుని, ఆలోచనలో ఉన్నాను.

నా కళ్లు ఎదురుకుండా డాబా పైన ఒక గది పై పడ్డాయి. ఆ గది తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. అందులో నుంచీ ఒక ఆకారం, ముందుకు రాసాగింది. కొంచెం పొడవుగా, పొడవాటి జుట్టును విరబొసుకుని, పొడవాటి బట్టలతో (అది చీర మాత్రం కాదు), నెమ్మదిగా ముందుకు వచ్చింది.

వెనకనే, ఇంకో ఆకారం సన్నగా, నాజుకుగా, కొంచెం చిన్నగా, అది కూడా పొడవాటి గౌను అనుకుంటా, ధరించి ముందుకు రాసాగింది. పిల్ల దెయ్యం, తల్లి దెయ్యము అనుకుంటాను. కొంచెం ముందుకు కదిలి, ఒక చోట కుర్చూని మాట్లాడుకొసాగాయి.

అమ్మో, నా గురించేనా!!!!!

పక్కనే ఉన్న మా అత్తయ్య వాళ్ళ అమ్మాయిని లేపి,  ఎదురుకుండా మేడమీద ఎవరంటారు? అని అడిగాను.

మంచి నిద్రలో ఉందేమో,  అబ్బా ఎవరు ఉంటారు?  వాళ్ళ ఇంట్లో వాళ్లే ఉంటారు అంది విసుగ్గా..

ఇంకా ఎవరూ నిద్రలేచేలా లేరు. కళ్ళు గట్టిగా మూసుకుని దుప్పటి తల మీద కప్పుకొని నిద్ర పోవడానికి ప్రయత్నించాను.

వెంటనే అమ్మ గుర్తొచ్చి ఏడుపొచ్చింది. అలా ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. ఆ రాత్రి అంతా, ఆ గది వైపు చూస్తూ అలా గడిచిపోయింది భయంభయంగా.

సూర్యు కిరణాలు నా కళ్ళమీద పడడంతో కళ్లు విప్పి చూశాను. ఎదురుకుండా ఆ మేడ పైన తలుపులు తీసే ఉన్నాయి.

ఈ కథలో కొస మెరుపు చదవండి…

నా ఎదురుకుండా ఆ తల్లి కూతురు నిజంగానే ఉన్నారు.  నడివయసు తల్లి,  కాలేజీ చదివే అమ్మాయి. ఇద్దరూ నైటీలు వేసుకునే ఉన్నారు. జుట్టు కి చిన్న హెల్ప్ కి పెట్టి మొత్తం వదిలేశారు.  రాత్రి అదే నాకు జుట్టు విరబోసుకుని నట్టు కనబడింది.

నేను వాళ్ళిద్దర్నీ చూసి రాత్రి దెయ్యాలు అనుకున్నాను.

అవును మరి అప్పుడు నా వయసు ఏడు  సంవత్సరాలు. మాది పల్లెటూరు కావడం  చేత, మా అమ్మ ఎప్పుడు నైటీ వేసుకోలేదు. అందుకే అలా పెద్దవాళ్లు కూడా నైటీ వేసుకుంటారని అప్పట్లో నాకు తెలియదు మరి.  అదీకాక మా అమ్మను విడిచి ఎప్పుడు కూడా ఎక్కడ నిద్ర చేసింది లేదు..

అలా రాత్రి భయపడిన విషయం మా అత్తయ్య వాళ్లకు చెప్తే,  అందరూ ఒకటే నవ్వులు.

నేను మాత్రం చిన్నబుచ్చుకుని,  నాకు అమ్మ కావాలి అంటూ అలిగి ఒక మూల కూర్చున్నాను. మా అత్తయ్య వచ్చి బతిమిలాడి నాకు టిఫిన్ పెట్టింది.

సర్లేండి ఇప్పుడు ఆ అమ్మలాగే నేను కూడా రాత్రిపూట తిరుగుతూనే ఉంటాను.  నన్ను చూసి ఎంత మంది చిన్న పిల్లలు భయపడుతున్నారో ఏమో!!!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!