జీవన (యంత్రం ) యాత్ర

జీవన (యంత్రం ) యాత్ర

రచయిత ::వడలి లక్ష్మీనాథ్

చుట్టూ నీలి రంగు తెరలు, బీప్ బీప్ మనే శబ్దాలు.చుట్టూ భయానక వాతావరణం. ఎమర్జెన్సీలో ఉన్న శ్వేత మినహా, మిగిలిన రోగులందరూ ప్రాణాలతో పోరాడుతున్నారు.
రెండు రోజుల ముందు నుండి వైద్యం చేస్తున్న డాక్టర్, శ్వేతను చూడడానికి వచ్చారు.
బయట శ్వేత భర్త భాస్కర్ కి కంగారుగా వుంది….డాక్టర్ ఏమంటారోనని.

శ్వేతను పరీక్షించిన డాక్టర్ బయటకు వచ్చి “కంగారు పడవలసిన అవసరం లేదు. ఆవిడ మందులకు బాగా రెస్పాండ్ అవుతున్నారు. ప్రస్తుతం బాగానే ఉ1న్నారు…..ఈ రోజు ఇంటికి పంపిస్తాను…..కానీ, ఆవిడని కనిపెట్టుకొని ఎప్పుడూ ఒక మనిషి ఉండాలి…..తలకి బాగా దెబ్బ తగిలింది కదా..ఏ మాత్రం రోగి ప్రవర్తనలో తేడా ఉన్నా, వెంటనే ఆసుపత్రికి తీసుకొని రావాలి.” అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోవడముతో భాస్కర్ ఆలోచనలో పడ్డాడు.
ఇప్పుడు అసలే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఏ చుట్టాలు ఇంటికి వచ్చే పరిస్థితి లేదు….పక్క వాళ్ళు కూడా పలికే పరిస్థితి లేదు…..అలాగని ఉద్యోగానికి సెలవు పెట్టి ఉండే పరిస్థితి కాదు.
“సార్, మిమ్మల్ని మీ పేషంట్ పిలుస్తున్నారు ” పిలుపుతో ఉలిక్కిపడ్డాడు భాస్కర్.

లోపలికెళ్ళిన భాస్కర్ తో శ్వేత, “భాస్కర్! నేను ఇంటికి వచ్చినా, ఎక్కువ పని చెయ్యలేననిపిస్తోంది. మంగికి కబురు చెయ్యి ” అంది.

“సరే” నని శ్వేతకి ధైర్యం చెప్పి, అన్ని బిల్లులు కట్టి శ్వేతను తీసుకొని ఇంటికి బయలుదేరాడు భాస్కర్. శ్వేత కారు వెనుక సీటులో పడుకుని వుంది.

భాస్కర్ మనస్సులో పది రోజుల కింద జరిగిన విషయాలు గిర్రున తిరుగుతున్నాయి.

ఆ రోజు ఉదయం భాస్కర్ పేపర్ చదువుకుంటున్నాడు…..అప్పుడే మంగి ఇంటికి వచ్చింది.

“మంగి! నీకు కబురు చేసింది, మళ్ళీ పనిలోకి రమ్మని చెప్పడానికి, ఇప్పుడు కొంచం కరోనా కేసులు తగ్గాయి కదా!” అంది శ్వేత.

“నేనెప్పుడైనా రానన్నానా, చెప్పమ్మా ఇప్పుడే పని మొదలెట్టనా” అంది మంగి.

“మొదలెడుదువు గానీ…నీకు ఇదివరకటంత జీతము ఇవ్వలేను” అంది శ్వేత.
“అదేం మాటమ్మా…మా మావకి కూడా పని దొరకక ఇబ్బందిగా వుంది.. ఆలోచించండమ్మా” అంది మంగి.

“ఇదివరకు నువ్వు చేసేంత పని కూడా ఇప్పుడు లేదు ……..ఇప్పుడు ఇంట్లో అన్ని పనులకు యంత్రాలు కొన్నాము …..అంత జీతము అవసరం లేదు”అంది శ్వేత.
మంగి ముఖం చిన్న బుచ్చుకొని చూస్తోంది.

“నువ్విలా ఒప్పుకోవనే నీకు కబురు చెయ్యనన్నాను….మీ అయ్యగారు మంగి మనని నమ్ముకొని ఉంది…. అనడముతో నిన్ను పిలిచాను. మరి నీ ఇష్టం” చెప్పింది శ్వేత.

“సరే చెప్పండి ఏమి పని చెయ్యాలి? ఎంత జీతం ఇస్తారో….. ఎన్నో నెలలుగా చేస్తున్నాను…
నేను మిమ్మల్ని కాదనలేను” అంది మంగి.

“ముందు నువ్వు చేయాల్సిన పని చెప్తాను చూడు. ఇది గిన్నెలు తోముకొనే యంత్రము..

ఆ సింక్ లో ఉన్న గిన్నెలన్నీ నీళ్లతో శుభ్రపరచి, వాటి, వాటికని తయారు చేసిన ప్రత్యేకమైన స్థానంలో వాటిని సర్దాలి …..పాల గిన్నెలు, జిడ్డు మూకుడు లాంటివి శుభ్రంగా పీచుతో తోమి, వాటికి
సరిపడా ఈ ప్రత్యేకమైన సబ్బు వేసి ఆన్ చేస్తే అదే గిన్నెలు తోముతుంది. అంతా అయ్యాకా ఎక్కడివక్కడ సర్దడమే”నోరు తెరచి చూస్తోంది మంగి.

“వారానికి ఒక రోజు దాని ఫిల్టర్లు అన్నీ తీసి శుభ్రం చెయ్యాలి” వింటోంది మంగి.

“ఇది బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ ….ఇందులో బట్టలు వేయాలంటే రంగు బట్టలు, తెల్లబట్టలు విడదీయాలి……షర్ట్ కాలర్లకి, మురికి వున్న చోట సబ్బు పెట్టి, ఒక సారి బ్రష్ కొట్టి ఇందులో వేయాలి. జాకెట్టు హుక్కులు అన్నీ పెట్టి వెయ్యాలి, జేబు రుమాళ్ళు లాంటి చిన్న బట్టలు ఈ సంచిలో వేసి అందులో వెయ్యాలి. అది ఉతకడము అయిపోయాకా, అయ్యిందని చెబుతుంది ….. అప్పుడు తీసి ఆరవెయ్యాలి.

ఆ మెషిన్ లో లాగే దీనిలో ఫిల్టర్లు తీసి శుభ్రం చెయ్యాలి…వారానికోసారి డ్రం వాష్ పెట్టాలి.
ఇదిగో ఇది ఇల్లు తుడిచే మెషిన్.

ఈ యంత్రం ఇల్లంతా తిరిగి, దానిపని అదే చేస్తుంది…..ఇంట్లో నేల మీద పిల్లల బొమ్మలు, పుస్తకాలు దీనికి అడ్డంగా లేకుండా చూడాలి. ఇంట్లో ఫర్నీచర్ దీనికి తిరగడానికి వీలుగా సర్దాలి. ఇది ఇల్లు ఊడిచాకా దానిలోని దుమ్ము తీసేసి, ఇదిగో ఈ డబ్బాలో నీళ్లు పోసి పెడితే ఇల్లు గుడ్డతో పెట్టి తుడుస్తుంది. ఇవీ పనులు…..అన్నీ యంత్రాలే చేస్తాయి. ఇవన్నీ అమెరికా వాళ్ళు వాడే యంత్రాలు”

“అన్నీ యంత్రాలు అన్న కాడికి నేనెందుకమ్మా” అంది మంగి.
“వాటిని పని చేసేటట్టు చెయ్యాలి…ఇప్పుడు నువ్వు సూపెర్వైసోర్ అన్నమాట …నీకు ప్రమోషన్” నవ్వుతోంది శ్వేత.

“ప్రమోటన్ అంటారు జీతం తక్కువగా అంటున్నారు…..నాకూ అర్ధం కాలేదమ్మా” అంది మంగి.

“ముందే చెబుతున్నాను…. మంగి అన్ని యంత్రాలు కలిపి రెండు లక్షల పైమాటే….వస్తువు పాడవకుండా జాగ్రత్తగా పని చెయ్యాలి” అంది శ్వేత.

మంగి మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయింది.
” అలా నిలబడితె, ఎలా? మాట్లాడు” అంది శ్వేత.

“అమ్మా …. పై కప్పు వర్షానికి కురుస్తోంది. ఒక్క లక్ష రూపాయలు అప్పుగా ఇస్తే ……అప్పు తీరేదాకా మీ ఇల్లు వదలనని అడిగితే, కరోనా సమయం
…..మాకే డబ్బులకి ఇబ్బంది అని చెప్పారు”
క్వశ్చన్ మార్క్ ముఖంతో అడిగింది మంగి.

“ఈ ఎక్సట్రాలే నాకు నచ్చవు….ఇవన్నీ అప్పు మీద తెచ్చాను……….నీకు నచ్చితే పని చెయ్యి లేకపోతే వద్దులే” అంది శ్వేత .

“జీతం చెప్పరమ్మగారు…ఇవన్నీ చెప్తున్నారు” అంది మంగి.
“ఇప్పుడు ఇదివరకటిలా నువ్వు చేసే పనేమీ ఉండదు…..అంత జీతం ఇవ్వలేను….సగం జీతం ఇస్తాను….ఇష్టమైతేనే చెయ్యి…..నాకు నడుము నొప్పి అని నిన్ను అడగడం, లేకపోతే నేనే చేసుకొనేదాన్ని” అంది శ్వేత.

“సరే! మీ మాట కాదనను. ఒక వారం చూస్తాను….నాకూ ఈ మెషిన్ తో చేతనైతదో లేదో. జీతం సంగతి ఇంకొక సారి ఆలోచించండమ్మా” అంది మంగి.

“మళ్ళీ అదేమి మాట, ఇలా రెండు లక్షల పైన ఖరీదైన యంత్రాలు ఇచ్చి పని చేయమంటే నీలుగు తున్నావు” అంది.

“సర్లెండమ్మా! మీరు చెప్పినట్టే చేసి చూస్తా…..మా అసొంటి చదువు రాని మొరటు వాళ్ళకి, ఈ అమెరికా యంత్రాలతో పని అని భయ పడుతున్నానమ్మా” అంది మంగి.

“భయపడాల్సిన పనేమీలేదు …నేను నీకు చూపిస్తా గా” అంది శ్వేత.

వారం రోజుల తరువాత….

“అమ్మ! మీరు మొత్తం జీతం ఇచ్చినా, నేను చెయ్యనమ్మా” చెప్పింది మంగి.

“అదేమిటి? నీకు పని సులువుగా ఉందిగా” అంది శ్వేత.

“నేను గంటలో చేసే పని, నాలుగు గంటల పైన
పడుతోంది…..గిన్నెలని సగం శుభ్రం చేసి సర్ది పెట్టే టైమ్ లో నేను మొత్తంపని చేయగలను..పైపెచ్చు తమరు ఆ గిన్నెలు చూడు ఎంత బాగున్నాయి. అంటారు.
కాలర్లు రుద్దీ కష్టపడ్డాకా, ఆ మెషిన్ లో బట్టలు చూపించి …..
ఈ బట్టలు చూడు ఎంత మెరిసిపోతున్నాయి. అంటారు.
ఆ ఇల్లు ఊడిచే మెషిన్ కయితే వెంట వెంట తిరిగి పనిదానినయిపోయాను…..పైగా మీరు ..
నువ్వెప్పుడైనా ఇలా ఇల్లు తుడిచావా అంటూ మాటలు…సగం పని నేనే చేస్తున్నాను…. మొత్తం పని చేసిన రోజు కూడా నా పనిని మీరు ఇలా మెచ్చుకోలేదు” అంది మంగి బుంగ మూతి పెట్టుకొని.

“అయ్యో దాని కోసం మానెస్తావుటే…మంగి…మరీ నువ్వు చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు. వాటితో నీకు పోలికేంటి” నవ్వుతోంది శ్వేత.

“వాటితో నాకు పోలికెక్కడమ్మా…..నేను మనిషిని…నాకూ ఎలాంటి సబ్బు పొడి ఇచ్చినా ….ఎలాంటి వస్తువు ఇచ్చినా, పని
చేస్తాను….పైపెచ్చు సబ్బుపొడి పొదుపుగా వాడాలని చెపుతారు. చీపురు పాడైందని చెబితే, ఇంకొక వారం వాడు అంటారు. బ్రష్ ఎక్కువ పెట్టావు ….బట్టలు చినిగి పోయాయి అంటారు… సబ్బు నాని పోయిందని ఇలా చాలా చెప్పేవారు…ఇన్ని డబ్బులు పెట్టి, కొని, మళ్ళీ వాటికి మంచి సబ్బు పొడులు కొని…అవే అన్నీ చేస్తుంది అంటున్నారు…..దానికి పని చేయాలంటే మళ్ళీ మనిషి కావాలి కదా ! ఆ మనిషికి మటుకు మీరు ఏమీ ఇవ్వరు….నాతో కాదమ్మా…లెక్క కట్టి జీతం ఇవ్వండి ” అంది మంగి.

“నువ్విన్ని మాటలు నేర్చాకా, నీతో నాకూ పని వద్దు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో…..మళ్ళీ ఏ అవసరమైనా నా దగ్గరకు రాకు”అంటూ పంపించేసింది శ్వేత.

ఆలోచనలో ఉండగానే ఇల్లు వచ్చేసింది. భాస్కర్ కారు దిగి లోపలికి వెళ్లేటప్పటికి, ఆ నోట ఈ నోట శ్వేత పడిపోయిన విషయం తెలుసుకున్న మంగి గుమ్మం ముందు కూర్చొని ఉంది.

కారులో ఉన్న శ్వేతని పలకరిస్తూ “అమ్మా మీకు దెబ్బ తాకగానే కబురు చేయొద్దా….వెంటనే వచ్చేదాన్ని కదా!” అంది మంగి.

శ్వేతకి కళ్ల నిండా నీళ్లు నిండిపోయాయి….
“నీకు అవసరానికి అప్పుగా ఇచ్చి కూడా ఆదుకో లేకపోయాను, మంగి…. నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇలా వచ్చావు” అంది.

“అమ్మా మా అవసరాలు ఎప్పుడూ ఉంటాయి…..మీ లాంటి వాళ్ళ అవసరానికి కూడా ఆదుకోకపోతే ఎలా? మనుషులం కదమ్మా….యంత్రాలం కాదు కదా !” అంటూ చేయందించింది మంగి.

శ్వేత , మంగి సాయంతో నెమ్మదిగా నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!