కొబ్బరి మిఠాయి

 కొబ్బరి మిఠాయి

రచయిత: పాండురంగాచారి వడ్ల

ఎన్ని సంవత్సరాలు అయ్యిందో అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళక. చిన్నప్పుడు నాలుగవ తరగతి వరకు అక్కడే వున్న వీధిబడిలో చదివేదాన్ని. అక్కడే ఉంటే నేను సరిగ్గా చదవనని, అమ్మానాన్నలు నన్ను తీసుకెళ్ళి పట్నంలో వేరే బడిలో చేర్పించారు. ఆ తరువాత  ఇంటర్ అనీ, డిగ్రీ అనీ, ఉద్యోగాలనీ ఇక అక్కడికి వెళ్ళడమే లేదు, అపుడపుడు అమ్మమ్మే వచ్చి చూసి వెళ్తుండేది, ఒక్కగానొక్క మనవరాలిని కదా అని. తర్వాత్తర్వాత అమ్మమ్మ రావడం కూడా మెల్లగా తగ్గిపోయింది, ఆర్నెళ్లకో ఏడాదికో అన్నట్లుగా ఉండేది.

ఆ తరువాత మళ్లీ ఇదిగో ఈ రోజు వెళ్ళటమే, నా పెళ్లి పత్రికలు పంచడానికి. ఊర్లోకి కారు వెళుతుండగా నా జ్ఞాపకాలు మెల్లమెల్లగా ఒక్కొక్కటీ గుర్తుకు వస్తున్నాయి. జెండా కట్ట దగ్గర స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి తిన్న చాక్లెట్లు లడ్డూలు, చింత చెట్టు కింద ఆడిన పుల్లల ఆటలు, బడి ముందు మైదానంలో ఆడిన తొక్కుడు బిళ్ళ, నాలుగు రాళ్ల ఆటలూ, బడి ముందు ఉన్న అవ్వ బడ్డి కొట్టు చూడగానే మనసు అక్కడే ఆగిపోయింది.

కారు ఆపమని డ్రైవర్ కి చెప్పి నేను కారు దిగి కొట్టు ముందుకు వెళ్ళాను. నా చిన్నప్పుడు ఉన్న కళ ఇప్పుడు లేదు ఆ కొట్టుకు. అవ్వతో పాటే కొట్టుకు కూడా వయసు మీద పడింది. మట్టి కొట్టుకు పోయి, చెదలు పట్టిన దూలాలు ఇక రేపో మాపో అన్నట్టు ఉన్న పైకప్పు, కూలిన గోడలు. అవ్వని చూసాను, నన్ను చూసి నవ్వింది,ఆ నవ్వులో ప్రాణం లేదు.
“ఏం కావాలమ్మా?” అని అడిగింది. నన్ను గుర్తు పట్టలేదు అనుకుంటా.
“కొబ్బరి మిఠాయి” అన్నాను కళ్ళతోనే యే డబ్బాలో ఉందా అని వెతుక్కుంటూ.
కొబ్బరి మిఠాయి అన్న మాటకే నోట్లో నీళ్ళు ఊరసాగాయి, ఇక నోట్లో వేసుకుంటే లాలాజలం వరదే. చిన్నప్పుడు బడికి వెళ్ళే ముందు, అయిపోయాక ఇక్కడకే వచ్చి కొనుక్కుని తినేదాన్ని. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పిల్లలందరికీ అవ్వ మిఠాయి ఇచ్చేది. ఎంత రుచిగా ఉండేదో, అవ్వ ప్రేమ తాలూకు తీపి జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి.

“కొబ్బరి మిఠాయిలా??!!..” అని ప్రశ్నగా నావైపు చూసింది అవ్వ.

“అవును అవ్వా.. కొబ్బరి మిఠాయి కావాలి. ” అని అడుగుతూనే “అవ్వా నేను పింకీని. నా చిన్నప్పుడు అదిగో ఆ ఇంట్లో అమ్మమ్మ దగ్గర ఉండేదాన్ని కదా.. నీ దగ్గర కొబ్బరి మిఠాయి కొనుక్కునే దాన్ని” అని నేనెవరో అవ్వకు గుర్తు చేశాను.

“అరే.. నువ్వా బిడ్డా.. మస్తు పెద్దగ అయినవు..” అంది చేతులతో నా ముఖాన్ని తడుముతూ. ఆ స్పర్శలో ప్రేమకు చెమర్చిన నా కళ్ళు ఇంకా మిఠాయి వెతుకుతూ ఉన్నాయి.

అవ్వ నా మనసుని చదివినట్లుగా “ఇప్పుడు ఎవరు తింటున్నారు బిడ్డా కొబ్బరి మిఠాయి, పిల్లలందరూ కిండర్ జాయ్ లు అంటా డైరీ మిల్కులు అంటా ఏవేవో కొత్త కొత్త చాక్లెట్లు బిస్కెట్లు ఒచ్చినయ్ గదా.. అవే కొనుక్కుంటున్నారు అని నాకు చేతనైతే చిన్న చాక్లెట్లు మురుకులూ బిస్కెట్లు తెస్తున్నా, లేదంటే లేదు. పిల్లలు కొంటలేరని, కొబ్బరి మిఠాయి తెస్తలేను బిడ్డా.. అయినా అవి ఇపుడు ఎక్కడా దొర్కుతలేవు గూడా.” ఉసూరుమంది ప్రాణం. అవ్వతో కాస్త మాట్లాడి అమ్మమ్మ ఇంటికి వచ్చాను. అమ్మమ్మతో మాట్లాడాక తెలిసింది “ఆ కొట్టు వల్ల అవ్వకు ఏమీ లాభం రావడం లేదనీ, వీధికో కిరాణా దుకాణం అవడంతో అవ్వ దగ్గర కొనేవాళ్లే కరువయ్యారు అనీ, ఏదో అలా కాలం నెట్టుకుని వస్తోందని”.బాధ అనిపించింది. అప్పటికి మనసును సమాధాన పరచుకున్నాను కానీ ఆ బాధ మనసు నుండి పోలేదు.

పెళ్లి అయ్యాక నాగురించి, నా ఇష్టాల గురించి అడిగిన శ్రీవారికి నాకు ఇష్టమైన కొబ్బరి మిఠాయి తో పాటుగా , దానితో ముడిపడి వున్న అవ్వ గురించి కూడా చెప్పాను.

        ******

“ఈ రోజు ఆదివారమే కదండీ, ఆఫీసు కూడా లేదు, ఎక్కడికి వెళ్తున్నారు?” అని నేను అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా పొద్దున అనగా వెళ్ళిన ఈయన మధ్యాహ్నం భోజన సమయం దాటిపోతున్నా ఇంకా రాలేదు అనుకుంటూ మాటిమాటికీ వీధి గుమ్మం వైపే చూస్తున్న నాకు కారు ఆగిన శబ్దం వినిపించింది.

ఆతృతగా మా వారికి ఎదురు వెళ్దాం అనుకున్న నేను ఈరోజు నా పుట్టిన రోజు అని ఆయనకి గుర్తు లేదు అని వచ్చిన కోపం వల్ల బయటకు వెళ్లకుండా సోఫాలోనే కూర్చున్నాను టివి పెట్టుకుని.

బయట చెప్పులు విప్పేసి, ఇంట్లోకి మనుష్యులు వస్తున్నట్లుగా నాకు తెలుస్తున్నా నేను అటు తిరగలేదు.

రెండు క్షణాలకి నా ముందు కనిపిస్తున్న ఒక రూపం చూసి “అవ్వా..!” ఆనందంతో మాటరాని నేను ఒక్క వుదుటున లేచి అవ్వను హత్తుకుపోయాను.

“నీ పుట్టిన రోజంటగా పిల్లా! మీ ఆయన నీకు కొబ్బరి మిఠాయి ఇష్టమనీ, దాంతోపాటు నన్ను కూడా నీకు కానుకగా తీసుకొచ్చాడు. నాకు మరో పనేమీ లేదంట! నీకు తినాలనిపించినప్పుడు కొబ్బరి మిఠాయి చేసి పెట్టడమేనట! బంగారం లాంటి మొగుడొచ్చాడే నీకు! చాలా అదృష్టవంతురాలివి!” అంటూ అవ్వ నా నోటిలో మిఠాయి పెట్టింది.

పుట్టినరోజు ఇంత అపురూపమైన కానుక ఇచ్చిన ఆయనకు కళ్లతోనే కృతజ్ఞతలు చెప్తుంటే, తియ్యని ఆ మిఠాయి కంటే మావారి ప్రేమపూర్వకంగా చూసిన చూపు ఇంకా తియ్యగా అనిపించింది నాకు.

You May Also Like

5 thoughts on “కొబ్బరి మిఠాయి

  1. కొబ్బరి మిఠాయి లాగే మీ కథ కూడా చాలా తియ్యగా వుంది నానీ గారూ! మనసులో మాట గ్రహించిన భర్త, ఆ కోరిక తీర్చిన వైనం వాస్తవంగా చాలా సహజంగా రాశారు. 👌🌷💐🌷

  2. చాలా బాగుంది పాండు, జ్ఞాపకాలను నెమరువేసే మరపురాని కథ. నాకు కూడా అలాంటి కొన్ని జ్ఞాపకాలను గుర్తుకొచ్చాయ్. సూపర్ పాండు

  3. Aadavallaki thondara ekkuva ….vallaki wait chepiste koppadataru….waiting venakala vallaki nachina pani unte egiri gantestaru😀😀… baagundi kobbarimeetai

  4. చాలా బాగుంది…. పాత జ్ఞాపకాలు మనసులో అలా కదిలాయి…….. నేను కూడా ఊహల్లో మా నానమ్మ దగ్గరకి వెళ్లి వచ్చా…👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!