మా గోదావరి

మా గోదావరి

రచన: శ్రీదేవి విన్నకోట

నాకు అత్యంత ఇష్టమైన మా ఊరు రాజమండ్రి, కొద్దికాలం క్రితమే రాజమహేంద్రవరం అని మార్చారు.
(చాలా కాలం క్రితం కూడా ఇదే పేరు ఉండేది)
రాజమండ్రి నేను పుట్టిన పెరిగిన ఊరు. అలాగే మా అత్తవారి ఊరు కూడా, నాకు అన్నీ రాజమండ్రి నే. మా ఊర్లో నాకు అత్యంత ఇష్టమైనది అంటే గోదావరినే, తిండి తినడం అయినా మర్చిపోతానేమో కానీ ఒకరోజు గోదావరిని చూడకుండా ఉండలేను. నాకు గోదావరి అంటే అంత పిచ్చి.

మా ఇంటికి రెండు మూడు నిమిషాల నడక దూరంలోనే ఉంటుంది మా అందమైన పరవళ్ళు తొక్కే గోదారమ్మ తల్లి. రోజు అలా కోటిలింగాల రేవుకు వెళ్లి  కోటి లింగేశ్వరుడ్ని   దర్శించుకుని మా గోదావరి పొడవునా ఉన్న ఆలయాల్ని  చూస్తూ ఉంటే అసలు ఆకలి దాహం ఏమీ గుర్తు రావు అంత అందంగా ఉంటుంది. ఒక్కో రేవుకి ఒక్కో దేవుని పేరు. పుష్కర్ ఘాట్, శంకర్ ఘాట్, గౌతమీ ఘాట్, దుర్గమ్మ ఘాట్, చింతాలమ్మ ఘాట్, మార్కండేయ స్వామి గుడి ఇంకా చాలా ఉన్నాయి. మా ఊర్లో గౌతమీ ఘాట్ దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్, అయ్యప్ప స్వామి గుడి, సరస్వతి అమ్మవారి గుడి  గోదావరికి జతగా ఈ ఆలయాల్ని చూస్తుంటే మనసుకి ఆనందంగా ఉత్సాహంగా చాలా బావుంటుంది. పండగ పర్వదినాల్లో కార్తీకమాసంలో గోదావరి ని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు,

అసలు రాజమండ్రిని తలచుకోగానే ఓ పవిత్రమైన భావన కలుగుతుంది.చాలా కళలకు చాలామంది కళాకారులకు వీరేశలింగం పంతులు గారి లాంటి చరిత్రకారులకు, సినిమా వారికి, కథకులకు పుట్టినిల్లు మా గోదావరి తీరం. కోటగుమ్మం సెంటర్కి ఉన్న మంచి పేరు. మా ఊర్లో దేవి చౌక్లో ప్రతి సంవత్సరం అమ్మవారి దసరా ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. నగరం నడిబొడ్డు న ఉండే గౌతమీ గ్రంధాలయం, ఎన్నో వందల సంవత్సరాల నాటి పుస్తకాలు తాళ పత్రాలు కూడా ఒక నిధిలా కాపాడుతున్నారు.. ఈ గ్రంథాలయంలో లెక్కలేనన్ని పాఠశాలలు, చదువుకోవాలనుకున్నోళ్ళకి బోల్డన్ని కళాశాలలు యువతకు వెలుగు దారి చూపిస్తాయి, ఇంకా మా రాజమండ్రి లో దొరికే రోజ్ మిల్క్, గురించి స్పెషల్ గా చెప్పాలి మీకు, మా ఊర్లో దొరికే లాంటి రోజ్ మిల్క్ మరెక్కడా దొరకదు అంటే అతిశయోక్తి కాదు అంటారు ఒక్కసారి తాగిన వాళ్లంతా. ఆక్టోస్ కూడా మా ఊరి స్పెషల్ కూల్ డ్రింక్, మరెక్కడా దొరకదు.

కార్తీకమాసపు తెల్లవారుజాము దీపపు వెలుగుల్లో గోదావరి సౌందర్యం వర్ణించడానికి మాటలు సరిపోవు. నాలుగు కిలోమీటర్ల పొడవు ఉండే గోదావరి కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జి.ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి.దగ్గరలోనే సర్ ఆర్ధర్ కాటన్ దొర నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్. రాజమండ్రి కి అతి దగ్గరలో ఉండే కడియం నర్సరీల పూల సోయగాలు ఎప్పుడూ ఏదో ఒక షూటింగులతో బిజీగా ఉండే గోదావరి తీరాలు. ఇసుక తిన్నెలు గోదావరి చెంత వెన్నెల రాత్రులు అప్పుడప్పుడు సంవత్సరంలో రెండు మూడు నెలలు వచ్చి నోరూరించే పులస చేపలు, పక్కనే ఆత్రేయపురం పూతరేకులు. ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా జీవించే మా గోదారోళ్ళ మమకారాలు.వాటితో పాటు కూసింత వెటకారాలు. ఇక్కడి మనుషులకు ఇసుమంతైనా నటించడం తెలియని అమాయకత్వాలు. అచ్చం వరద గోదారి లాగే పొంగిపొరలి పోయే మా ప్రేమానురాగాలు అబ్బో ఇంకా ఎన్నో ఎన్నెన్నో సోయగాలు మా గోదావరి ఇంట. పచ్చని వరి పంట పొలాలు.  ఆకాశానికి నిచ్చెన లేసే కొబ్బరి చెట్లు అరటి చెట్లు, బంతులు చామంతులు, గులాబీలు. వాహ్  ఏమీ అందం, మళ్లీ నాకు మరో జన్మంటూ ఉన్నా సరే ఈ గోదావరి తీరాన ఈ రాజమహేంద్ర నగరంలోనే మళ్లీ మళ్లీ అలాగే నేను ఎప్పటిలాగే  పుట్టాలని మళ్లీ ఇక్కడే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం

వేదంలా… రాజరాజ నరేంద్రుడు కాకతీయులు తెజమున్న మేటి దొరలు రెడ్డిరాజులు
గజపతులు నర పతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు వేదంలా …

శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషుఎలోకానాం
స్తితి మావహంచ విహితాం
స్త్రీ పుమ్సయోగోద్భావాంతే
వేదత్రయ మూర్తయ స్త్రిపురుషా సంపూజితా వస్సురైర్భూయా సుహుపురుషోత్తమం
భుజభవ శ్రికంధరాశ్రేయసే

ఆది కవిత నన్నయ్య వ్రాసేనిచ్చట
శ్రీనాధ కవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము

వేదంలా …..దిట్టమైన శిల్పాల దేవళాలు కట్టు కథలు చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగం లా మిగిలినొక్కడు చాలు.

ఈ పాట ఆంధ్రకేసరి సినిమాలోని నాకు అత్యంత ఇష్టమైన పాట. మన గోదావరి గురించి బాలసుబ్రమణ్యం గారు అత్యద్భుతంగా శ్రావ్యంగా పాడిన పాట, ఇప్పుడు కూడా ఈ పాట వింటుంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో, ఇంకా గోదావరి సినిమా లోని ఉప్పొంగేలే గోదావరి, ఊగిందిలే చేలోవరి అనే పాట కూడా చాలా బాగుంటుంది. అది కూడా బాలసుబ్రమణ్యం గారు పాడారు, మీకు వీలైతే వినండి, ఎంత బావుందో రాసిన వారి, పాడిన వారి, గొప్పతనం మీకే అర్థమవుతుంది.ఇంకా మా నగరం గురించి చాలా చెప్పొచ్చు, నాకు తెలిసినంతవరకు చెప్పాను, ఇంకా చెప్పాలంటే నిడివి ఎక్కువ అయిపోతుంది కూడా అందుకే మరోసారి ఇంకా చాలా తెలుసుకుని చెప్తాను ఇప్పటికి సెలవు,

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!