మానవత్వం

మానవత్వం

రచన :: నామని సుజనాదేవి

విమానంలో చెక్ లన్నీ పూర్తీ చేసుకుని బయట పడేసరికి తల ప్రాణం తోక కొచ్చింది రమణకు . ఫ్లైట్ దాదాపు నెల రోజుల ముందరే బుక్ చేసుకున్నాడు హెచ్ వన్ వీసా స్టాంపింగ్ కోసం. కానీ తీరా దిగాక ఈ కరోనా భూతం తీవ్ర రూపం దాల్చిన సంగతి తెల్సింది. అయిదేళ్ళ తర్వాత మాత్రు భూమిలో అడుగు పెట్టగానే ఆమట్టిని తాకినందు కేమో మనస్సు పులకించింది. ఒక్కసారి కళ్ళు మూసి చల్లగాలి గుండెల నిండా పీల్చుకున్నాడు. ఆప్యాయంగా కింద నేలను తాకాడు.
‘నా జన్మ భూమి ఏంతో అందమైన దేశము …నా ఇల్లు అంతకన్నా చక్కని ప్రదేశము.. నాసామిరంగా… ’ పాట మనస్సులో మెదిలింది.
వాష్ రూమ్ కెళ్ళి పెట్టుకున్న మాస్క్ తీసి మూత ఉన్న డస్ట్ బిన్ లో వేసి కొత్తది తీసి పెట్టుకున్నాడు. అన్ని పరీక్షలు ముగించు కున్నాడు కాబట్టి రిలాక్స్ అయి కాబ్ లో శంషా బాద్ నుండి రైల్వేస్టేషన్ చేరుకున్నాడు. వచ్చేప్పుడే సెల్ లో తానూ క్షేమంగా చేరినట్లు ఇటు అమ్మా నాన్న కి అటు అమెరికాలోని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు.
అయినా అతని మనస్సు గందరగోళంగా ఉంది. భార్యకు ఇంకా వీసా గడువు ఉంది కాని తనకు లేకపోవడం వల్ల తప్పనిసరై ఇలా వచ్చాడు. రిటర్న్ ఫ్లైట్ కూడా దీనితో పాటే బుక్ చేసాడు మరో పది రోజుల్లో . ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తెల్లవారి వీసా స్టాంపింగ్ తేదీ పెట్టుకున్నాడు. ఆ తర్వాత నాలుగు రోజుల్లో తిరిగి వెళ్ళిపోవడమే. అమ్మా వాళ్ళు మరో నాలుగు రోజులు ఉండమని బలవంతం చేస్తున్నారు కాని తనకు సమయం లేదు. అసలే భార్య రవళి కి ఇప్పుడు ఎనిమిది నెలలు నిండాయి. మరో నెల రోజుల్లో డాక్టర్స్ టైం ఇచ్చారు డెలివరీకి. తనతో పాటు రవళి అమ్మ, నాన్న ను తీసుకుని వెళదామని అందరికీ టికెట్స్ బుక్ చేసాడు. ఆలోచనల్లోనే రైల్వే స్టేషన్ కి చేరుకున్నాడు.
అక్కడ అప్పటికే కరోనా భయం వల్ల రష్ చాలా తక్కువ ఉంది. ఎందుకైనా మంచిదని చేతులకు గ్లౌసేస్ కూడా వేసుకున్నాడు. రైలు ఎక్కి కూర్చున్నాడు. తమ ఊరు వెళ్ళాలంటే రైలు దిగాక బస్ కూడా ఎక్కాలి. నిజానికి నాన్న, అమ్మ వాళ్ళు రైల్వే స్టేషన్ కి వస్తామన్నారు. కాని ఇంత దూరం నుండి వాళ్ళు ఖాళీ గా తనను తీసుకుపోవడానికి రావడం , అసలే పరిస్థితులు ప్రయాణానికి అనుకూలంగా లేనప్పుడు ఎందుకని తనే వద్దన్నాడు. పైగా నాన్నది మందుల షాపు,కిరాణం షాపు . ఈ సమయం లో చాలా అవసరం. అందుకనే తను వద్దన్నాడు.
రైల్లో నుండి దిగగానే ప్లాట్ ఫాం మీద చాలా మంది బిచ్చగాళ్ళు అసలు ఎ మాత్రం శుచీ సుబ్రం లేక అలా కింద ప్లాట్ ఫాం పై నిద్రపోతూ , కూర్చుని కనిపించారు. వాళ్ళు ముక్కుకు అడ్డుగా ఏమీ మాస్క్ కట్టుకోలేదు. వాళ్ళు చేతులు శుభ్రం కాదు కదా ఏవీ శుబ్రంగా లేవు. బాధని పించింది. అప్పుడప్పుడే పోలీసులు అక్కడికి వచ్చి వారికి అవగాహాన్ కలిగిస్తున్నట్లున్నారు. మొదటి నుండి సమాజ సేవలో ముందుండే రమణ తనతో పాటు ఉన్న నాలుగైదు మాస్క్ లు అక్కడున్న వారికి ఇచ్చి ఒక్కటి ఎక్ట్రా మాత్రం ఉంచుకుని బయటకు వచ్చాడు.
బస్ లో ఎక్కి ఊర్లో దిగగానే నాన్న వాళ్ళు కార్లో వచ్చి రిసీవ్ చేసుకున్నారు.
అందరినీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. బయట పరిస్థితి బాలేదని హడావుడిగా ఇంటికి వెళ్లి పోయారు. ఇంట్లో ఇన్ని ఏళ్ల తర్వాత వచ్చాడని అప్పటికే వచ్చి ఉన్న బంధువులు అందరూ ఆప్యాయంగా పలకరించారు.
ఆ రోజు చాలా ఆనందంగా గడిచిపోయింది. ఆ రాత్రే కరోనా భూతం మహమ్మారిలా అందర్నీ కబలిస్తోందని, అన్ని దేశాలు అతలా కుతలం అయిపోతున్నాయని, విదేశాల నుండి వచ్చిన వాళ్ళు స్వచ్చందంగా వచ్చి పరీక్షలు చేయించుకుని క్వారంటైన్ లో ఉండాలని అనౌన్స్ చేసారు.
‘ఆల్లు అలాగే అంటారు లేరా…. నువ్వు అన్ని పరీక్షలు చేయించుకునే వచ్చావుగా… నువ్వేమీ వేళ్ళకు అన్నాడు తండ్రి వీరేశం.
‘వద్దు నాన్నా… అది పద్ధతి కాదు …. అంటూ ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే అంబులెన్స్ లో వచ్చిన వాళ్ళు సాంపిల్ తీస్కేలుతూ ఇంటికి స్టాంపింగ్ చేసి , చేతిపై స్టాంపింగ్ వేసి, తప్పక క్వారంటైన్ లో ఉండాలని ఇంట్లోనే ఎలా ఐసోలేషన్ లో ఉండాలో, కుటుంబ సభ్యులు కూడా ఎలా దూరం ఉండాలో, సమాజంతో వాళ్ళెవరూ కలవవద్దని చెప్పి వెళ్లి పోయారు.
వారం గడిచింది. ప్రతిరోజూ ఇంటికి డాక్టర్లు, మున్సిపాలిటీ వాళ్ళు, రాజకీయ నాయకులు ఇలా వస్తూ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూనే ఉన్నారు.
సడెన్ గా ఆ రోజు వచ్చిన డాక్టర్ అతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి మొత్తం కుటుంబాన్ని , వారిని కలసిన బంధువులందరినీ పరీక్షలకు పిల్చాడు. అసలు ఒక్కసారి నిర్ఘాంత పోయారంతా.
‘ఎం పాపం చేసామని దేవుడు మనకీ శిక్ష వేశాడా భగవంతుడు…. నా బిడ్డ ..రాక రాక వస్తే ఇలా జరిగింది ఏమిటీ…. ఎన్ని పూజలు చేసాను….దేవుడా…’ నెత్తి నోరూ బాదుకుంది రమణ తల్లి సునంద.
‘నాకు అర్ధం అయ్యింది… దేవుడు ఈ శిక్ష మనకు ఎందుకు వేసాడో నాకు అర్ధం అయింది. నేను పాపిష్టి వాడిని. కరోనా మహమ్మారి ప్రబలిన బలహీన క్షణాన్ని ఆసరాగా తీసుకుని , పది రూపాయలుండే మాస్క్ లు ధరలు పెంచి యాభై , డెభై , వంద లకు అవసరాన్ని బట్టి అమ్మాను. నిత్యావసర వస్తువులను ధరలు పెంచి రెట్టింపు ధరలకు అమ్మాను. తల్లి తండ్రులు చేసిన పుణ్యం వారి పిల్లలకు వస్తుంది అంటారు. మేము చేసిన పాపం వాడికి ఇలా చుట్టూ కుంటుందని అనుకోలేదు…. దేవుడా..నేను తప్పు చేసాను….నన్ను క్షమించు తండ్రీ….’తల బాదుకున్నాడు తండ్రి.
ఈ లోగా రమణకు ఫోన్ వచ్చింది. భార్యకు అక్కడ పురిటి నొప్పులు వస్తున్నాయని. అతని మనసు నీరయ్యింది. అప్పటికే వీరేల్లాల్సిన ఫ్లైట్ కాన్సిల్ అయ్యింది.
అందరూ డాక్టర్ దగ్గర ఐసోలేషన్ వార్డ్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. తను చేసిన పాపానికి ప్రాయాశ్చిత్తంగా తన షాప్ లో పనిచేసేవారితో నిత్యావసర వస్తువులు, మాస్క్ లు ఉచితంగా మురికి వాడల్లో పంచేలా ఆదేశాలిచ్చాడు వీరేశం.
నాలుగురోజుల్లో కరోనా బారి నుండి బయటపడిన వారిగా అందరూ క్షేమంగా ఇల్లు చేరారు. అక్కడ అతని భార్యకు , రమణ ఫ్రెండ్ వాళ్ళ కుటుంబాలు సహాయం చేసి పండంటి బిడ్డకు జన్మ నిచ్చింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్ చేసారు.
‘దేవుడు మన పాపాల్ని క్షమించాడు….నువ్వు చేసిన సమాజ సేవా కార్యక్రమాలకు మెచ్చి నీ కుటుంబానికి వెంటనే సహాయం అందజేశాడు…. దేవుడు కరుణామయుడు… ఈ లోకాన్ని కూడా కరోనా బారి నుండి తప్పక రక్షిస్తాడు….’ రెండు చేతులు పైకెత్తిదేవుడికి సర్వస్య శరణాగతి చేస్తూ తల్లి తండ్రి అన్న మాటలకు దేవుడి గదికి ఉన్న గంటల తలుపుకు ఉన్న గంటలు గాలికి మృదుమధురంగా ‘తధాస్తు…శుభం’ అన్నట్లు మోగాయి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!