మనసులోని మాట

(అంశం::”ఆ చీకటి వెనకాల”)

మనసులోని మాట

రచయిత :: మంగు కృష్ణకుమారి

రేవతి మనసులో మాట

రామేశ్వరం గారు మానాన్న కన్నాసంపన్నులు. కట్నం ఇచ్చి పెళ్ళి కాదు‌కదా, సాధారణమయిన ఖర్చులతో కూడా పెళ్ళి చేసే శక్తి మా నాన్నకి
లేదు. ఎవరో ఒకరు వలచి వరించిందికి, నేను పెద్ద అందగత్తెని కాకపోగా, సామాన్యంగా కి కాస్త తక్కువ. చామన చాయగా పొట్టిగా ఉంటాను. చదువు అంతంతపాటి. కథల
పుస్తకాలు ఓహ్ తెగ చదువుతాను.

పెళ్ళి సంబంధాలు వెతికే శాస్త్రి గారు మా అమ్మకి అమూల్యమయిన సలహా ఇచ్చేరు. ‘లక్షణంగా మీ రేవతిని రామేశ్వరం గారికి ఇచ్చి చేయకూడదూ! ఆయనమళ్ళా పెళ్ళి చేసుకుందాం
అనుకుంటున్నారు”

మా అమ్మ అనుమానంగా “వయసు తేడా పదిహేనేళ్ళ‌ పయినే కదా? ఒక కొడుకున్నాడుగా” అంది.

“ఆఁ మగాడికి వయసేమిటమ్మా! పాడీ, పంటలూ ఇల్లూ తోటలూ, బంగారం, మీ‌ పిల్లే మహారాణీ అవుతుంది. కొడుకుదేముంది? గొట్టికాయ వెధవ. వాడిని వాళ్ళ నాన్నే చూసుకుంటాడు”
అని తేల్చేసాడు.

అమ్మ ప్రలోభంలో‌‌ పడిపోయింది. నాన్నని ఒప్పించడం కష్టం అవలేదు. నా ఇష్టానిష్టాలతో ఎవరికీ పనిలేదు.

నెల తిరగకుండా రామేశ్వరం గారి ఇల్లాలిగా వాళ్ళింట్లో కుడికాలు పెట్టేను. ఆయన పిన్నిగారుట, ఓ వారం రోజులు ఉన్నారు. నాకు అన్నీ చెప్పి “జాగ్రత్తమ్మా, ఆడవాళ్ళకి భర్తా, ఇల్లూ సంసారం మంచి నడవడీ అత్యంత ముఖ్యం. మనది ఇటు చిన్న ఊరు కాదు, అటు పెద్ద ఊరూ కాదు. ఇరుగు పొరుగులతో మంచిగా ఉండాలి. ఇల్లాలే ఇంటి దీపం సుమా” అని నీతులూ జీవిత సత్యాలు బోధించి మరీ వెళ్ళేరు.

చాలామంది అనుకున్నట్టు నాకు నాభర్తతో సమస్యలేం‌ రాలేదు. చెప్పుకోలేని సమస్య రవితో వచ్చింది. శాస్త్రి గారు ‘గొట్టికాయ వెధవ’ అని తేల్చేసిన సవితి కొడుకు. గొట్టికాయగాడు
మాత్రం కాదు. వాడిని చూస్తే చచ్చేంత భయం నాకు.‌‌ వాడి వయసు పదిహేడేళ్ళే. అదోలా చూస్తాడు. అదీ ఎవరూ లేనప్పుడే.

ఈయన పంటల కాలంలో రాత్రి పొలం దగ్గరే ఉంటారు. ఒక్కోసారి ఎరువులు, విత్తనాలు లాటి అవసరాలకి సిటీ వెళుతూ ఉంటారు. నేను ఒక్కదాన్ని అయితే ఇంట్లో నిర్భయంగా ఉండేదాన్ని. ఈ గట్టికాయ గాడు ఇంట్లోనే ఉంటాడు. హుషారుగా ఈల వేస్తూ వెకిలి పాటలు గట్టిగా పాడతాడు. ఒక్క డ్రాయర్ వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఉంటాడు. నాకు ఒళ్ళు సిగ్గుతో చచ్చిపోతూ ఉంటుంది.

నేను నా గది తలుపులు వేసుకొనే ఉంటాను. అయినా సరే వణుకు వస్తూ ఉంటుంది. చీకటి పడిందంటే మరీ భయం. కారణం నాకూ తెలీదు. గది బయట ఏదో‌ ఒక చప్పుడు అవుతూ ఉంటుంది. ‌‌ఒకసారి‌ కిటికీలోంచి చూసేను. రవి వెళిపోతున్నాడు. భయంతో దుప్పటి తలమీంచి కప్పేసుకున్నాను. నాకు ఈబాధ వదిలితే, తిరుపతి వస్తానని మొక్కేను కూడా.

ఒకసారి ఈయన ఊర్లో లేరు. ఆ మర్నాడు వస్తారని చెప్పేరు. రవి సడెన్ గావచ్చేడు. “రేవతీ, జున్ను ఉన్నాదా? అయిపోయిందా? అదోలా చూస్తూ అన్నాడు.

రవి మనసులో మాట

అమ్మ నాకు గురుతే లేదు. సడన్ గా నాన్న రెండో పెళ్ళి చేసుకున్నాడు. చాలా ఇబ్బందిగా అనిపించింది. మా నాన్న భార్య ( ఏమిటో నాకు వరస కలపాలనిపించటం‌ లేదు) చామన చాయ అయినా ఒకరకం అందగత్తె. నా కన్నా మరీ పెద్దదేంకాదు. ఏదోలా ఉండేది ఆమెని చూస్తే.

చీకటి‌ పడితే ఆవిడ ఏం చేస్తోందో, చూడాలని తహతహ ఎక్కువగా ఉంటున్నాది. మా ఫ్రండ్స్ తో వేసుకున్న జోక్స్ ఆవిడతో నవ్వుతూ చెప్పాలని ఆవిడ కూడా నన్ను అలాగే చూడాలని ఆశగా
ఉంటున్నాది. ‌పెద్ద జడతో ఇంట్లో తిరుగుతూ ఉంటే, ఆ జడ పట్టుకొని లాగాలని అనిపించేది. నాన్న లేకపోతే ఎలాఉంటుందో చూడాలని తన గదిలోకి తొంగి చూసేను. చీకటి. లైట్ వేసుకోదు. పైపెచ్చు దుప్పటి ముసుగు వేసుకొనేది.

ఏమిటీ? ఏదో నాన్నని ప్రేమించ పెళ్ళి చేసుకున్నట్టు పోజ్ లు కొడుతోంది. కోపం వచ్చింది. నేనంటే ఏమిటో చెప్పాలని డిసైడ్ అయేను. నాన్న లేడు. కోరుండి అన్నాను.
” రేవతీ, జున్ను ఉన్నాదా? అయిపోయిందా?” అని.

రామేశ్వరం మనసులో మాట

చీకటి. నా భార్య చనిపోయిన దగ్గరనించీ నా బతుకు చీకటే. రవి లేకపొతే నాకు వెలుగే లేదు. ఎంతమంది చెప్పినా రెండోపెళ్లి అంటే నేను ఒప్పుకోలేదు. రవికి సవితితల్లిని ఎలా తేను? మా పిన్ని సాయంతో రవిని పెంచేను. హుషారయిన పిల్లడు. నా కంటి దీపం, ఇంటి వెలుగూ రవే. రవి కాస్త పెద్దయేడు.‌ అప్పుడు చూసేను రేవతిని. అమాయకమయిన మొహం. కటిక పేదరికం. వాళ్ళ నాన్నే స్వయంగా రేవతిని చేసుకొమని అడిగేడు. నేను ఊఁ అనేసాను. రేవతితో జీవితం నేను భయపడ్డట్డు లేదు. చాలా హుందాగా ఉండేది.

నేను రాత్రి ఉండనంటే మాత్రం చాలా బెంగగా ఉండేది. అది చూసి నేను చాలా గర్వపడేవాడిని. నా భార్య నన్ను వదిలి ఉండలేదని. ఒకసారి గమనించేను రవి మా గదిముందర తచ్చాడుతున్నాడు. వీడికేం పని ఇక్కడ? అప్పుడు గమనించడం మొదలెట్టేను. రవి, రేవతి ఎలా ఉన్నారు? అని. ఎందుకో సహజంగా లేరని మొదటిసారిగా అనిపించింది.

రవి గదిలో చూసేను. నా కళ్ళు నేను నమ్మలేకపొయేను. ఎంత చెత్తఫొటోల ఆల్బమ్ లో, ఇంకవాడి కంప్యూటర్ లో…… ఛీఛీ. నా కొడుకుని ఇలా పెంచేనా నేను. ‘కూతురు చెడు అయితే మాత తప్పు’ అంటారే? మరి ‘కొడుకు చెడు అయితే తండ్రి తప్పు’ అని ఎందుకనరు? ఎవరూ అనకపోయినా నాకు తెలుసు నా తప్పేంటో.

ఆ బెంగతో పని మీద ఊరు వెళ్ళినా ఉండలేక వచ్చేసాను. లోపలకి వచ్చేను. రవి గొంతు వినిపిస్తోంది. “రేవతీ, జున్ను ఉన్నాదా? అయిపోయిందా?” అని. రేవతి వెర్రి చూపు చూస్తూ “మీ నాన్న వచ్చిన తరవాత నాతో మాటాడు. అంతవరకూ వద్దు” అనేసి అక్కడనించీ గబగబా వెళిపోయింది. ఇద్దరూ నన్ను చూడలేదు. ఇదేం తెలీనట్టు లోపలకికి వెళ్ళేను. రవి కొంచెం తొట్రుపడి
తలదించుకొని వెళిపోయేడు.

రవికి సవితి తల్లివస్తుందనే భయంతో పెళ్ళి మానేసిన నేను, నా భార్యకి ‘సవితి కొడుకు’ అన్న సమస్యని ఇచ్చేను. ఈ బంధాలు ఇంతేనా? పరిష్కారం చూపాలి.

నన్ను చూసి రేవతి మొహం వెలిగిపోయింది. ఆ వెలుగు కారణం ఇప్పుడు నాకు స్పష్టంగా బోధపడింది. తప్పు నేనుచేసేను కాబట్టి, దిద్దుకొనే బాధ్యత నాదే! “రవీ నీకు మంచి కాలేజ్‌ లో సీట్ వచ్చింది. హాష్టల్ లో కూడా సీట్ వచ్చింది. రేపే వెళదాం. నిన్ను జాయిన్ చేసి నేనుమళ్ళా వస్తాను” చెప్పేను. రవి దిగ్గున చూసేడు. “ఎందుకురా, బెంగా? నేను వారానికి ఒకసారి వస్తూనే ఉంటాను. హాలీడేస్‌కి నువ్వు వస్తావు. నువ్వు పెద్ద ఇంజనీరువి అయితే చూడాలని ఉంది నాన్నా” అన్నాను.

రవి బుర్ర ఎత్తలేదు. “అలాగే నాన్నా” అని మాత్రం అన్నాడు. మర్నాడు అనుకున్నట్టే తీసికెళ్ళి హాష్టల్ లో జాయిన్ చేసి వాడికి చాలా నీతులు, నీతుల్లా కాకుండా మామూలు మాటల్లా
చెప్పేను. జీవితం చాలా పెద్దదని, సరదాలు, కలలూ అన్నీ సెటిల్ అయిన తరవాత తీర్చుకోవచ్చని బోధపరిచి వచ్చేసాను.

రామేశ్వరం పిన్నిగారి మాట

రామేశం కబురూ. “పిన్నీ నీ కోడలు ఒట్టి మనిషి కాదు. కాస్త సాయానికి రాగలవా?” అని. ఎంత ఓపిక లేకపోయినా, మానీగలనా? రామేశ్వరం బంగారం లాటివాడు. రేవతి కడుపు పండుతున్నాదంటే ఎలా మానేస్తాను? ఓహ్. రేవతిని, నేలమీద ఉంచటం లేదు. రేవతి కూడా మిసమిసలాడుతూ, మొగుడితో, ఎంతో ఆపేక్షగా మసలుకుంటున్నాది. దాని ఆరోగ్యం బాగుందని నేను మళ్ళా మనవడిని ఎత్తుకుందుకి వస్తానని వెళిపోయేను.

రేవతి కొడుకుని ఎత్తుకొని వచ్చింది. రవి సెలవలకి వచ్చేడు. ఏడాది కాలం అందరిలో మార్పు తెచ్చింది. రవికి ఎమ్ సెట్ లో చాలా మంచి రేంక్ వచ్చింది.
రామేశ్వరం బారసాల ఘనంగా చేసేడు. మాతృత్వపు అందంతో రేవతి నిండుగా పీటలమీద కూచుంది.
“ఏమండీ, పెద్దాడు రవి కదా, చిన్నాడికి ‘చంద్రం’ అని పేరు పెడదామా?” అంది.
రవి కళ్ళు నీళ్ళచెలమలు అయేయి.

పీటలమీద నించి ఇద్దరూ లేవగానే “చిన్నమ్మా, తమ్ముడిని ఎత్తుకొనేదా?” అని చేతులు చాపేడు. రేవతి వెలిగిపోతూ బాబుని రవి చేతిలో ఉంచి, “జాగ్రత్త నాన్నా, వీడు చేతులు
విసిరీడం నేర్చేసాడు” అంది.

మనసులోని చీకట్లు వెనకపడి వెలుగులు ఇంట్లోకి వచ్చిన ఆనందంతో, రామేశ్వరం భార్యనీ, కొడుకులనీ తృప్తిగా చూసుకుంటూ ఉంటే అత్తగారు ప్రసాదం తెచ్చి అందరికీ పంచింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!