మరపు రాని సంఘటన

మరపు రాని సంఘటన
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి కోవూరు 

నేను ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. ఒకసారి ఆఫీస్ పని మీద అమెరికాలోని న్యూయార్క్ సిటీకి మూడున్నర నెలలు వెళ్ళవలసిన పని పడింది. చాల వరకు టూర్ లకు వెళ్ళకుండ తప్పించుకుంటాను. కాని ఈ సారివెళ్ళక తప్పలేదు. నా మూడేళ్ల కొడుకును, స్కూల్ కెళ్ళే పెద్దబ్బాయిని, మా ఆయన్ని వదిలి వెళ్ళాను. ఒక సర్వెంట్ మెయిడ్ ను పెట్టి మా అమ్మని, మా అత్త గారిని వంతుల వారీగా పిల్లల దగ్గర ఉండమని చెప్పి వెళ్ళాను.
అక్కడికి నేను కాకుండా మా ఆఫీస్ అబ్బాయిలు ఇంకా ఒక ఆరు మంది వచ్చారు. కానీ వాళ్లు నాకు హైదరాబాదులో అసలు పరిచయం లేరు. అమ్మాయిని మాత్రం నేను ఒక్కదాన్నే.
అక్కడ స్టూడియో అపార్ట్మెంట్ ఒకటి నాకు స్పెషల్ గా అలాట్ చేశారు. మిగతా అబ్బాయిలందరికీ కలిపి ఒక అపార్ట్ మెంట్ ని అలాట్ చేశారు.  ఆఫీస్ కి అందరము మెట్రోలో వెళ్లి వచ్చేవాళ్ళం.
వెళ్ళిన కొత్తలోనే ఒక ఆదివారం సాయంత్రం ఆ అబ్బాయిలు నా అపార్ట్మెంట్ కొచ్చి “మేడం మీరు ఒక్కరే ఉంటే బోర్ గా ఉండొచ్చు. బయటకెళ్ళి కాఫీ తాగి వద్దాం రండి” అన్నారు.
నిజంగానె నాకు చాల బోర్ గా ఉంది. సరే అని  కాఫీ తాగాలని పించి వాళ్లతో బయటకు కొచ్చి చాల దూరం నడుస్తూ వెళ్ళి వచ్చాము. కాఫీ తాగిన తర్వాత అందరం కలిసి హోటల్ కి వెళ్ళాం. వాళ్లంతా వాళ్ళ అపార్ట్మెంట్ కి వెళ్లిపోయారు.
నేను నా అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ‘కీ’ కొరకు జేబులో చేయి పెట్టి చూసే సరికి కీ లేదు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నేను రోజు వేసుకునే కోటు జేబులో ఎప్పుడూ కీ పెట్టుకునే దానిని. ఆ రోజు ఆ కోట్ కాకుండా వేరేది వేసుకున్నాను. అంటే మా అపార్ట్మెంట్ లో ఉన్న కోటు జేబులో కీ ఉండి పోయింది. అక్కడ డోర్ లాగితె లాక్ పడే సిస్టమ్ ఉండడం వల్ల బయటకు వెళ్ళేటప్పుడు కీ అవసరం ఉండదు కనుక హాయిగా వెళ్ళిపోయాను.
ఇప్పుడు కీ లేదన్న విషయం తెలిసి నా గుండె ఆగినంత పని అయింది. దేశం కాని దేశంలో ఆ రాత్రి ఎక్కడ ఎలా అని అనిపించి చాలా భయమేసింది. మెల్లగా పైన మా కొలీగ్స్ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి కిటికిలోంచి లోపలికి చూశాను. వాళ్లు ఆదివారం కదా! డ్రింక్ పార్టీ చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
వాళ్ళు నన్ను చూసి కొంచెం ఇబ్బంది పడ్డారు. నాకు కూడ వాళ్ళను డిస్టర్బ్ చేసినందుకు చాల ఇబ్బందనిపించింది. వాళ్ళలో ఒకబ్బాయి బయటకు వచ్చి “ఏంటి మేడం ఏమైంది” అని అడిగారు. నేను కీ విషయం చెప్పేసరికి “కింద  రిసెప్షన్ లో ఇంకో కీ ఉంటది. కనుక్కుందాం రండి” అన్నారు.
రిసెప్షన్ కి వెళ్ళి అడిగితే, రిసెప్షన్ లో ఉండే ఇంచార్జ్ అబ్బాయి మధ్యాహ్నం లీవు పెట్టి వెళ్ళిపోయాడట. వేరే కీ గురించి అక్కడున్న వాళ్ళకి ఎవరికీ తెలియదని చెప్పారు.
నాకు ఏం చేయాలో తోచలేదు. నాకు కంగారు ఎక్కువ అయిపోయింది. ఊరు గాని ఊరు కాదు, దేశం కాని దేశంలో ఆ రాత్రికి ఎక్కడ పడుకోవాలి. నాకు తోడుగా ఒక అమ్మాయి కూడా లేదు. అబ్బాయిలందరు నా కన్న చాల చిన్నవాళ్ళే. అయినా ఎందుకో భయం. ఏం చేయాలో తెలియక చాలా బాధపడ్డాను.
నా కంగారు చూసి మా ఆఫీస్ అబ్బాయిలు “మేడం మీరు మా అపార్ట్మెంట్ బెడ్రూంలో  తలుపులు పెట్టుకుని హాయిగా నిశ్చింతగా నిద్రపోండి. మేము మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యము. మీకేమీ భయంలేదు” అని వాళ్ళు చెప్పే సరికి ఇంకా చేసేదేమీలేక సరేనని వాళ్ళ అపార్ట్మెంట్ లో ఒక బెడ్ రూం లోకి పోయి బోల్ట్ పెట్టుకుని ఆ రూమ్ లో ఉన్న బెడ్స్, సామానులు అన్ని డోర్ కి అడ్డంగా పెట్టేసి నేను కూడా బెడ్ పై పడుకోకుండ డోర్ దగ్గర  నేలపై కూర్చుని, నిద్ర పోకుండా ఉండడానికి ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలకొక సారి అలారం వచ్చేలాగా ఫోన్లో పెట్టుకొని డోర్ కి అడ్డంగా కూర్చున్నాను. అలాగా రాత్రంతా జాగారం చేశాను. తెల్లవారే ముందు హాయిగా నిద్ర వచ్చి అలాగే నేల పైన పడుకున్నా. తిరిగి మేలకువ వచ్చి చూసే సరికి ఉదయం పది ఐపోయింది.
అప్పుడు లేచి బయటకొచ్చి చూస్తే పాపం ఆ అబ్బాయిలు నేలపై పడుకుని ఉన్నారు. వాళ్ళలో ఒకరు “ఏంటి మేడం 10 వరకు పడుకున్నారు. మేము ఇప్పటివరకు కాఫీ కూడ తాగలేదు. ఆకలి కూడా అవుతుంది” అన్నారు.
అప్పుడు మళ్లీ రిసెప్షన్ దగ్గరికి వెళ్లి ఆ సరికి అక్కడ ఉన్న ఇంచార్జ్ అబ్బాయి వచ్చేసాడు. కీ తీసుకుని వచ్చి నా రూం తలుపు తెరుచుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. అప్పుడు  పరిచయం లేని ఆ అబ్బాయిలంత తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు.
ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే చాలా భయమేస్తుంది. జన్మలో కూడా ఆ సంఘటన మర్చిపోను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!