మార్గదర్శనం

మార్గదర్శనం

రచన ::  సావిత్రి కోవూరు

ఆఫీస్ నుండి వచ్చిన చలపతిరావు, భార్య సుమిత్ర ఇచ్చిన కాఫీ తాగుతూ “శ్రీహర్ష ఇంకా రాలేదా” అన్నాడు.

“లేదండీ ఈ మధ్య చాలా ఆలస్యంగా వస్తున్నాడు.
వచ్చినప్పటి నుండి సెల్లు పట్టుకొని కూర్చుంటాడు. చదువు పూర్తిగా పక్కన పెట్టాడు. ఇలాగైతే వాడు ఇంటర్ గట్టెక్కినట్టే” అన్నది.

“నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. వీడు సెకండియర్ కి వచ్చినాక చదువు పైన పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. మొన్న మార్కెట్  కు వెళ్ళినప్పుడు, ఎవరో అమ్మాయిని బండి పై కూర్చోబెట్టుకొని వెళుతూ కనిపించాడు. వాడికి బండి ఇవ్వద్దంటే వినవు. వీడు ఇట్లాగే తిరిగితే హాస్టల్లో వేయడం బెస్ట్. మన మాట వినే లాగా లేడు” అన్నాడు చలపతిరావు.

“నేను ఏమి ఇవ్వలేదండి. వాడు ఎప్పుడో తీసుకుని  బ్యాగులో పెట్టేసుకుంటాడు. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది” అన్నది సుమిత్ర.

ఇంతలో స్కూటరు శబ్దం వినిపించేసరికి “వచ్చినట్టున్నాడు కొంచెం గట్టిగా అడగండి. ఆలస్యం చేస్తే చేయి దాటి పోతాడు” అన్నది

“సరేలే నేను చూసుకుంటాను నీవేమి ఆలోచించకు” అన్నాడు.

గేటు తీసుకుని మార్కెట్ దగ్గర తండ్రికి కనిపించిన అమ్మాయితో కలిసి శ్రీహర్ష లోపలికి వచ్చాడు.

“ఎవ్వర్రా ఈ అమ్మాయి”

“నాన్న ఈ అమ్మాయి నా క్లాస్మేట్ దివ్య. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. మీకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను” అన్నాడు శ్రీహర్ష.

“సరే నాన్నా. మరి చదువు”

“పెళ్ళి తర్వాత అయినా చదువుకుంటాను”

“ఏమమ్మా! మీరు ఎక్కడ ఉంటారు? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వాళ్లకి చెప్పావా ఈ సంగతి” అన్నారు చలపతిరావు.

“మేము చిక్కడపల్లిలో ఉంటాము అంకుల్. మా నాన్న బిల్డర్. మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మా సంగతి మా అమ్మ నాన్నకు నేనేమి చెప్పలేదు. చెబితే వాళ్ళు ఒప్పుకోరంకుల్” అన్నది దివ్య.

“మేము కూడ ఒప్పుకోకపోతే, మీ అమ్మ వాళ్లు ఒప్పుకోకపోతే ఏంచేస్తారు”

“అదేంటి అంకుల్ అలా మాట్లాడుతారు. శ్రీహర్ష అడిగితే, మీరు ఏది కాదనరని చెప్పాడు. మీరు, మా అమ్మ నాన్న వాళ్లు కూడ ఒప్పుకోకపోతే మా ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు. ఎలాగైనా పెళ్లి చేసుకుంటాం”

“ఏరా నీవేమి మాట్లాడవేంటి”

“నా మాట కూడా అదే నాన్న మేము చాలా రోజుల నుండి ప్రేమించుకుంటున్నాం. మమ్మల్ని ఎవరు విడదీయలేరు. మీరు కాదంటే కూడా మేము ఎలాగైనా పెళ్లి చేసుకుంటాము” అన్నాడు శ్రీహర్ష

“చూడమ్మా ఇప్పటి వరకు వాడు అడిగినవి బట్టలు, పుస్తకాలు, పిక్నిక్ లు, ఎక్సర్షన్ లాంటి చిన్న చిన్నవి. కాని ఇప్పుడు మీ ఇద్దరి జీవితాలకు, రెండు కుటుంబాలకు సంబంధించిన పెద్ద విషయం. మీరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు సరే. మీ పెళ్లి అయిన తర్వాత నేను కాని, మీ అమ్మ వాళ్లు గాని డబ్బు సహాయం చేయరను కోండి. మరి  మీరు ఇంటర్ కూడా కంప్లీట్ చేయలేదు. పీజీలు చేసిన వాళ్లు కూడ ఉద్యోగాల్లేక చిన్న చిన్న పనులు చేస్తు గడుపుతున్నారు. మీ చదువుకు ఉద్యోగాలు అయితే రావు. మరి తిండికి, బట్టలకు, ఇంటి అద్దె ఇలాంటి వాటికి డబ్బులు ఎలా వస్తాయి”

“మేము ఏదైనా పని చేసుకుని బ్రతుకుతాం అంకుల్”

“కూలీ పనులు తప్ప ఇంకేం పనులు రావు మీ చదువులకి. శ్రీహర్ష ఆటో నడపడమో, కూలికి వెళ్ళో తెచ్చిన డబ్బులతోనో ఎలా బ్రతుకుతారు. రేపు మీకు పిల్లలు పుడితే కనీసం పాల డబ్బాలు కైనా పైసలు కావాలి కదా! అప్పుడు పైసలు సరిపోక ఇద్దరు పోట్లాడుకొని మా దగ్గరకు వచ్చినా మేము రానివ్వము. ఇప్పుడు హాయిగా ఏసీ గదులలో, పట్టు పరుపు పైన, పడుకునే మీరు, అప్పుడు కటిక నేలపైన పడుకో గలుగుతారా? ఇప్పుడు కార్లలో తిరిగే మీరు కాలినడకన తిరుగ గలుగుతారా? ఇవన్నీ ఆలోచించుకోండి., ఐదేళ్లు పిచ్చి తిరుగుళ్ళు తిరగకుండా, మంచిగా చదువు కుంటే, మీ డిగ్రీ కంప్లీట్ అవుతుంది. అప్పుడు  మీ కాళ్లపైన మీరు నిలబడి పెళ్లి చేసుకుంటానంటే నిరభ్యంతరంగా ఒప్పుకుంటాను” అన్నాడు చలపతిరావు.

“నాన్నా మేము పెళ్లి అయినాక చదువుకుంటాము” అన్నాడు శ్రీహర్ష.

“నా మాట వినకుండ మీరు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇంట్లో ఉండడానికి కూడా ఒప్పుకోను. చదువెలా చదువుకుంటారు. ఎంతో మందికి చదువుకోవాలని కోరికున్నా అవకాశాలు లేక బాధపడుతున్నారు. మీకన్ని అవకాశాలు ఉండి చదువుకునే కాలాన్ని వృధా చేస్తున్నారు. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ దారి మీరు చూసుకోండి. తర్వాత మీ ఇష్టం. మూడు రోజులు ఆలోచించుకుని మీ నిర్ణయం చెప్పండి. ఏమ్మా సరేనా ఇప్పటికీ ఇంటికెళ్ళు. హర్ష ఆ అమ్మాయిని ఇంటిదగ్గర దింపి రా” అన్నాడు చలపతిరావు.

“అదేంటండి మళ్లీ సారికి పెళ్లి మాట ఎత్తకుండ బాగా చీవాట్లు పెడతారు అనుకున్నాను. ఏమిటండీ ఇదంతా వాళ్ళ వయసు ఏంటి? వాళ్ళేంటి ఈ ప్రేమించుకోవడం ఏమిటి? నాకు వీళ్ల మాటలు వింటుంటే ఇద్దరిని చెడామడా తిట్టాలి అనిపించింది. నిండా ఇరవై ఏళ్లు లేవు. వీళ్ళకి ఇప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందా?”అన్నది సుమిత్ర.

“నేను తిట్టడానికి ఏముంది తిట్టొచ్చు. కానీ పరిపక్వత లేని మనుసులు గాయపడి ఏమన్న చేసుకుంటే మనకే కదా నష్టం. ఇప్పుడు వీళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు.వీళ్ళకి గారాబాలు ఎక్కువై ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి” అన్నాడు.

మరుసటి రోజే కాలేజీలో టి.సి. తీసుకుని హైదరాబాద్ కు దూరంగా రెసిడెన్షియల్ కాలేజీలో జాయిన్ చేసి వచ్చాడు శ్రీహర్షను చలపతిరావు. వచ్చేటప్పుడు “నాన్న  ఏది మీ ఇష్టానికి వ్యతిరేకంగా జరగదు. కానీ ఇది పెళ్లి చేసుకునే వయస్సు కాదు. నీవు బాగా కష్టపడి చదువుకో. చేతికి డిగ్రీ వచ్చినాక మంచి ఉద్యోగం వచ్చినంక నీకు ఇష్టమైనట్టుగానే అన్ని జరుగుతాయి. అప్పటి వరకు ఆ అమ్మాయిని మరిచిపోయి బుద్దిగా చదువుకో”అన్నారు

“సరే నాన్నా నేను బాగా చదువుకుంటాను. మీరు మాట తప్పకూడదు” అన్నాడు హర్ష

“సరే” అని మాటిచ్చి ఇంటికొచ్చారు చలపతిరావు.

మరుసటి రోజు ఉదయమే మళ్ళీ వచ్చింది దివ్య. “నేను బాగా ఆలోచించాను అంకుల్. మేము ఎలాగైనా బ్రతక గలము శ్రీహర్షని పిలవండి. మేం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాము. నేను శ్రీహర్ష లేకుండా బ్రతకలేను” అన్నది

“ఇలా వచ్చి కూర్చో సుమిత్రా కొంచెం కాఫీ ఇవ్వు ఈ అమ్మాయికి చాల దూరం నుండి వచ్చింది. అలసి పోయుంటది”

“లేదంకుల్ నాకు కాఫీ అలవాటు లేదు. శ్రీహర్ష లేడా అంకుల్?”

“వాడు వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ఉండి చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం వెతుక్కుని నీ కొరకు వస్తాడట. ఇప్పుడు పెళ్లి చేసుకుని దివ్యను కష్ట పెట్టలేను. తనని కూడా బాగా చదువుకోమని చెప్పండి” అన్నాడు. హర్ష దగ్గర ఫోన్ లేదు. వాడిని కలుసుకోవాలని ప్రయత్నం చేసినా వృధా. నీవు కూడా ఈ నాలుగేళ్ళు మంచిగా చదువుకో. మీరు అనుకున్ళట్టే అన్ని జరుగుతాయి” అన్నారు.

ఈ మాటలు విన్న దివ్య కళ్లు తుడుచుకుంటూ వేగంగా వెళ్ళిపోయింది.

“ఏంటండీ ఆ అమ్మాయి అంత ఆవేశంగా వెళుతుంది. ఏమన్నా చేసుకుంటదేమో వెళ్లి చూడండి. వెళ్లండి తొందరగా” అన్నది సుమిత్ర.

“మనం ఇప్పుడూ ఏ మాట మాట్లాడినా వాళ్లకు నచ్చదు. కొన్ని సినిమాలలో హై స్కూల్స్ లోనే ప్రేమలు, పెళ్లి చేసుకోవడాలు చూపెడితే, పిల్లలు ఇలాగే తయారవుతారు. ఇంకా ప్రేమ పెళ్ళిళ్ళకు వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేసినట్టుగా చూపెడతారు. దాని వల్ల ఏమి బోధించ తలుచు కుంటారో, వాళ్ళకే తెలియాలి. ఇంకా అవన్నీ చూసి వీళ్ళు ఇలా తయారవుతున్నారు. వాళ్లది ఆవేశమే తప్ప ఆలోచన ఉండదు. అందుకే మన వాడికి చదువు అయిన తరువాత ఆ అమ్మాయి తోనే పెళ్లి చేస్తానని నమ్మకం కలిగించి హాస్టల్  కి పంపించిన. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేసుకుంటుందో. నేను వెళతాను” అని చలపతిరావు దివ్యను వెంబడించారు.

దివ్య నేరుగా పార్క్ కెళ్ళి రెండు గంటలు అక్కడే కూర్చన్నది. తర్వాత రైల్వే స్టేషన్ కు వెళ్లి చాల సేపు అక్కడ బెంచీ పైన కూర్చుంది. తర్వాత దూరంగా రైలు రావడం గమనించి మెల్లగా పట్టాల మీదకు వచ్చింది. వెంటనే చలపతిరావు ఆ అమ్మాయిని చెయ్యి పట్టి లాగి పైకి తీసుకొచ్చి “ఏమ్మా నీవు పుట్టినప్పటినుండి మురిపెంగా చూసుకుని, అపురూపంగా పెంచుకుని, నీవే వాళ్ళ లోకమనుకొని, నీ గురించి ఎన్నెన్నో కలలు కన్న నీ తల్లిదండ్రుల గురించి ఆలోచించావా. నీ భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగ చేయాలని ఊహించు కొని, నీకు ఒక్క రోజు జ్వరం వస్తే విలవిల్లాడే తల్లిదండ్రులు, ఒక్కపూట నీవు తినకపోతే ఆవేదన చెందే ఆ తల్లిదండ్రులు, పద్దెనిదేళ్ళు కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న తల్లిదండ్రుల కంటే, కొన్ని నెలలు స్నేహం చేసిన అబ్బాయి ఎక్కువ అయ్యాడా? ఆ అబ్బాయి కొరకు నీవు ప్రాణాలు తీసుకుంటే నీ పైనే ప్రాణాలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులు ఏమైపోవాలి. వాళ్ల గురించి ఆలోచించు. నీవు లేకుండా వాళ్లు బతుకుతారా? ఇంత స్వార్థం ఎందుకు మీ యువతకు. ఒక్క అయిదు నిమిషాలు ఇంటికి రావడం లేట్ అయితే ఏమి జరిగిందో అనుకొని ఏవేవో ఊహించుకొని అలమటించే తల్లిదండ్రులు, నీవు రైలు కింద పడి చనిపోతే ఎలా బతుకుతారు అనుకున్నావు. ఇప్పుడు ఇంటికెళ్ళి ఒకసారి వాళ్ల పరిస్థితి చూడు నీకే తెలుస్తుంది. నీవు ఎంత తప్పు చేయబోయావో. పద మీ ఇంటికొచ్చి దిగబెడతాను” అని ఆ అమ్మాయిని స్కూటర్పై ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు.

వీళ్ళు వెళ్ళేసరికి తల్లి ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. తండ్రి ఊరంతా వెతికి వెతికి, కూతురు కనబడక పిచ్చివాడిలా కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చుని ఏడుస్తున్నాడు.

అప్పుడే దివ్య,చలపతిరావుతో కలసి రావడం చూసిన “బంధువు ఎవరో అదిగో వచ్చింది దివ్య” అనేసరికి దివ్య తండ్రి రాజారావు గబగబా గేటు దగ్గరకు వచ్చి బిగ్గరగా పట్టుకుని “ఎక్కడికి వెళ్ళావమ్మా ఇంత సేపు” అంటూ చేయి పట్టుకుని భార్య దగ్గరకు తీసుకెళ్ళి “ఇదిగో అమ్మాయి క్షేమంగా వచ్చేసింది చూడు లలిత.  మనమ్మాయికి ఏం కాలేదు, అనేసరికి కళ్ళు తెరిచిన తల్లి దివ్యను దగ్గరగా పట్టుకుని ఎక్కడికి వెళ్లావు తల్లీ. నీకేమైందోనని ఎంత తల్లడిల్లిపోయానో ఆ భగవంతుడికే తెలుసు. నీకేమయినా అయితే మేము ఎలా బతుకుతాం” అంటూ ఏడవడం మొదలు పెట్టింది.

భార్యతో రాజరావు “దేవుడు లాగా ఆయనెవరో మన అమ్మాయిని మనకు క్షేమంగా అప్పగించారు. ఈ కాలంలో ఆడపిల్ల బయటకెళ్ళిందంటె ఏ పాపిష్టి కళ్ళు పడతాయో అని బయపడే కాలమొచ్చింది.  భగవంతుడి దయవల్ల క్షేమంగా ఇంటికి వచ్చింది” అని, చలపతిరావు వైపు తిరిగి “చాలా చాలా థాంక్స్ అండి మా అమ్మాయిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చారు. పొద్దుననగా వెళ్ళిన పిల్ల రాత్రి వరకు రాకపోయేసరికి ఏ ఆక్సిడెంట్ అయిన జరిగిందేమో, లేక ఏ దుండగులైన కిడ్నాప్మ్ చేశారేమోనని రకరకాల ఊహలతో చాలా భయపడ్డాము” అన్నాడు.

తల్లిదండ్రులను ఆ పరిస్థితిలో చూసిన దివ్య తాను ఎంత తప్పు చేయబోయిందో అర్థమైంది. తనను అంకుల్  ఆపక పోయుంటే, ఈ పాటికి తన ప్రాణాలు పోయేవి. తన తల్లిదండ్రులు ఎంత క్షోభ అనుభవించే వాళ్ళో ఊహించుకుని భయంతో తల్లడిల్లిపోయింది. ఇక జన్మలో అలాంటి ఆలోచన రానీయకూడదని, తల్లిదండ్రులను ఇంకెప్పుడు బాధ పెట్టకూడదని, బాగా చదువుకుని తన కాళ్ళపై తాను నిలబడిన తర్వాత అమ్మా వాళ్ళ నొప్పించి
శ్రీహర్షని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!