మేధావుల చెరసాల

మేధావుల చెరసాల

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

chaitra sri

భటుడు కోటయ్య రాజు గారైన ప్రభశేఖరుడి వెనుకనే వెళ్తున్నాడు. రాజుగారు కాలికేదో తగిలి కింద పడబోయాడు కోటయ్య పట్టుకోబోయాడు.అంతే రాజుగారికి విపరీతమైన కోపం వచ్చింది.నీకెంతపొగరు నన్నే పట్టుకుంటావా అంటూ తిట్లు అందుకున్నాడు. క్షమించమని కోటయ్య వేడుకుంటున్నా వినిపించుకోలేదు. మంత్రిగారు వచ్చి రాజు గారు కోటయ్య మీకు బాల్య మిత్రుడే కదా ఎందుకు అలా తిడతారు అనగానే “హా..అవును కదా కోటి …నా మిత్రుడే. అవునవును” అంటూ వెళ్ళిపోతాడు.
రాజుగారి తిక్క పనులకు మంత్రి, మిత్రుడైన భటుడు కోటయ్యలు వేగలేక పోతారు.విచిత్రంగా ప్రవర్తించే రాజుని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు ఇరువురికి.

వింతైన వాగ్ధానాలిచ్చే రాజును వెనకనుంచి మంత్రి ఆపుతున్నా ఆగని పరిస్థితి.సోదర రాజ్యాలన్నీ మద్యపాన నిషేధం పై దృష్టి పెడితే ప్రభశేఖరుడు మాత్రం మద్యపానాన్ని ఉచితంగా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాడు.మంత్రికి ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఒకరోజు ఇచ్చిన వాగ్ధానాన్ని మరోరోజుకి మరచిపోయే రాజుని భరించలేక పోతున్నాడు.ప్రభశేఖరుడి తండ్రి ప్రభాసూరుడు మంచి రాజ్యపాలన చేయడంతో ప్రజలు ఇంకా ప్రభశేఖరుడి ఆగడాలని భరిస్తున్నారు.అయినా రాజ్యాన్ని నాశనం చేస్తుంటే జనం ఎన్ని రోజులని చూస్తూ ఊరుకుంటారు.మద్యపానాన్ని ఉచితంగా ఇవ్వడం స్త్రీలే కాక విద్యావంతులు,యువత తీవ్రంగా వ్యతిరేకించారు. ఉద్యమాలు చేపట్టడంతో మంత్రిగారు రాజుతో సమావేశం ఏర్పాటుచేసి “ప్రభశేఖరా..మీరు ప్రవేశ పెట్టిన ఉచిత మద్యపాన పథకం ప్రజల మనసులను గాయపరచింది. కావున మీరు దానిని రద్దు చేయాలని ఉద్యమబాట పట్టారు “అని మంత్రి అనడంతో రాజు “ఏం మాట్లాడుతున్నారు  మంత్రివర్యా నాకు మద్యపానం అంటేనే అసహ్యం నేను ఉచిత మద్యపాన పథకాన్ని ప్రవేశపెట్టానని నింద వేయకండి అంటూ చేతిలో సురాబాండాన్నుంచుకొని మధిరను సేవిస్తూ మాట్లాడుతుంటే మంత్రికి ఈ అయోమయ, అమాయకత్వానికి, మూర్ఖత్వానికి అందర్నీ బలి చేయకూడదని తలచి “అవునవును ఇది రాజు గారి పథకం కాదు ఎవరో పుకారు పుట్టించారని సభలో మద్యపాన నిషేధాన్ని ప్రకటించారు. రాజు” మంత్రీ.! ఇప్పుడు నేను ఓ కొత్త పథకం ప్రకటిస్తున్నాను. మన రాజ్యంలో క్షురకులందరికీ జీతం ఇవ్వాలని నా నిర్ణయం అనడంతో మంత్రిగారు ఆశ్చర్యంతో రాజా అందరికీ జీతాలివ్వాలంటే మన పేద రాజ్యానికి కుదిరే పని కాదు.వారికి ఎలా ఇవ్వమంటారో కూడా మీ అపురూప బుద్ధి కుశలతతో సెలవియ్యండి అనడంతో ప్రభశేఖరుడు బంగారపు ముద్ద నా మెదడనుకుంటూ తన మట్టి బుర్రని తడిమి తడిమి “ఏముంది క్షౌరం చేసిన ఆ వెంట్రుకలని విదేశాలకి విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో జీతాలిచ్చేస్తే సరి “అన్నాడు.దూర దృష్టిగల మంత్రి “రాజా ఏమిటీ వైపరిత్యం ..అన్ని వెంట్రుకలు అమ్మడం సాధ్యమేనా. ఏమిటీ మూర్ఖపు నిర్ణయాలు” అని అనడంతో ప్రభశేఖరుడు కోపంతో మంత్రిని బంధించమని ఆజ్ఞాపించి జీతాలివ్వడానికి గానూ మన రాజ్యంలోని ప్రతి ఒక్కరూ మూడునెలలకోసారి గుండు గీయించుకోవాలనే చట్టాన్ని తెస్తున్నాను”అనడంతో మంత్రి “ఓరి భగవంతుడా ..ఈ రాజ్యాన్ని కాపాడేవారే లేరా అనుకుంటూ ఉండగా చెరసాలకి తరలించబడ్డాడు.చెరసాలకి వెళ్ళిన మంత్రి “ఇది మూర్ఖుల రాజ్యం… మేధావుల చెరసాల”అంటూ నిట్టూర్చుతూ ఆనాటి ప్రభసూరుడి పరిపాలనని తలుచుకుంటూ జైలు జీవితం గడిపాడు.ప్రజలు ఏమి చేయాలో పాలుపోక అయోమయంలో బతుకునీడ్చుతూ తాయిలాలకు , సోమరితనానికి అలవాటు పడి బతునీడ్చక తప్పలేదు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!