గుండెల్లో రైళ్ళు

గుండెల్లో రైళ్ళు

రచన :: మంగు కృష్ణకుమారి

ధాత్రికి కాళ్ళు చేతులూ వణుకుతున్నాయి. ప్రమోద్ ఆన్‌లైన్
ఆఫీస్ పనిలో ఉన్నాడు. ఇల్లు పిన్ డ్రాప్
సైలెన్స్ గా ఉండాలి. మాణిక్యమ్మ ఇడ్లీకి పప్పు నూక నానపెట్టమంది.

పెళ్ళయి నెల కూడా అవలేదు. అత్తగారు,‌
మామగారు సిటీకి దూరంగా ఉన్న ఫామ్ దగ్గర ఉన్న చిన్న ఇంట్లోకి
తాత్కాలికంగా షిఫ్ట్ అయిపోయేరు. దగ్గర ఉంటే కానీ, హెరిటేజ్ పంటలు పండించలేరు. మర్నాడే మాణిక్యమ్మ
బాత్ రూమ్ లో పడ్డాది. కాలుబెణికి, కట్టు కట్టుకొని మంచం
ఎక్కింది.

ధాత్రికి ఏ డబ్బాలో ఏముందో కూడా తెలీదు. డబ్బాలు తీసినా కందిపప్పేదో, మినప్పప్పు ఏదో పోల్చలేదు. కళ్ళలో నీళ్ళు తిరిగేయి. గబగబా
తోచిన నూక నీళ్ళలో‌ పోసేసింది.

“అమ్మాయ్, తాతగారికీ నాకు కాఫీ తెస్తావా?” మాణిక్యమ్మ ఓకేక వేసింది. ధాత్రి గబగబా తోచినట్టు కాఫీ కలిపి తెచ్చింది. ఒక గుక్క తాగి ఆవిడ మొహం చిట్లించింది.
“ఇదేమిటి? బ్రూ పొడి వేసేవు. ఫిల్టర్ డికాషన్ వెయ్యలేదా?”
ధాత్రి జవాబు చెప్పకుండా చూస్తోంది.

“సరే, టిఫిన్ చేసేవా?” అంది. “బ్రెడ్ రోస్ట్ చేసీనా?” అంది ధాత్రి భయపడుతూ.
“బ్రెడ్ టిఫిన్ ఏమిటే? లక్షణంగా, పూరీ కూరా చేయవచ్చుగా” మాణిక్యమ్మ
హుకుం. ధాత్రి నేల చూపు చూస్తుంటే పురుషోత్తంగారు “పోనీ ఉప్మా చేసీ అమ్మాయ్” అన్నారు.

ధాత్రి కాళ్ళు ఈడ్చుకుంటూ వంటింట్లోకి వచ్చింది. యూట్యూబ్ లో ఉప్మా ఎలా చేస్తారో చూసి తోచినట్టు చేసి, పెద్దవాళ్ళు ఇద్దరికీ రెండు ప్లేట్లలో పెట్టి ఇచ్చింది.

మాణిక్యమ్మ మొహంలో మళ్ళా మార్పు. “ఇదేమిటి? అసలు ఉడకలేదే?అయ్యో బొంబాయి రవ్వ వేయలేదే నువ్వు ఇడ్లీ నూక పోసేవు. ఎలా తినాలి?”

ధాత్రి మళ్ళా మౌనం.
“ఏమే పెళ్ళికి ముందు మీ మేనత్త నంగనాచి నీకు ఆవకాయలు పెట్టడం వచ్చు అంది. రాని వంటపని లేదంది. గుత్తి వంకాయ నువ్వు చేసినట్టు ఎవరూ చేయలేరంది. నీకు చూస్తే కాఫీ పెట్టడం కూడా రాదు” మాణిక్యమ్మ గట్టిగా అరుస్తూ ఉంటే ఆమె కోడలు వసంత లోపలకివచ్చింది. “ఎలాఉన్నారత్తయ్యా?”
అంటూ. మాణిక్యమ్మ మొత్తం ఏకరువు పెట్టింది.
వసంత నిర్ఘాంతపోయి చూసేసరికి ధాత్రి వెక్కివెక్కి ఏడుస్తూ అక్కడనించీ వెళిపోయింది. వసంత వంటింట్లో చూస్తే అంట్లగిన్నెలు ఏవీ సింక్ లో వేయలేదు. ఒక గిన్నెలో పెసరపప్పు ఇంకో గిన్నెలో బొంబాయి రవ్వ నానపెట్టి ఉన్నాయి. అవీ సరిగ్గా నీళ్ళు పోయక పొడిపొడిగా ఉన్నాయి.

కోడలి సత్తా బోధపడిపోయింది.
“ఇహ తను ప్రైవేట్ క్లాసులు అమ్మాయికి పెట్టాలి కాబోలు” అనుకుంటూ నిట్టూర్చింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!