నమ్మకం

నమ్మకం

రచన : : అనురాధ మురుగము బూజు

ప్రసన్న కొడుకు ఆదిత్య కోసం ఎదురు చూస్తోంది, రాత్రి 11 అవుతున్నా రాలేదు. కాసేపు నడుము వాలుద్దాము అని పడుకుని కళ్ళు మూసుకుంది. గడచిన జీవితం కళ్ళ ముందు కదిలింది ప్రసన్నకు.
ఇంటిలో పెద్దకూతురు అవడంతో తండ్రి ఇంటర్ దాక చదివించి, ఇంటిలో ఒక రెండు సంవత్సరాలు చేతివృత్తులు నేర్పించి మా ఇంటి స్థోమతకు తగ్గట్టు పెళ్లి చేసాడు.
ఇంటిలో మిగిలిన ఇద్దరూ తమ్ముళ్లు అయినా ఆడపిల్ల అని అలా చేసాడని, పెళ్లి అయ్యాక అర్థం అయింది. నా భర్త ప్రసాద్ పెద్దగా మాట్లాడే మనిషి కాదు. ఎందుకంటే అత్త మామ ఇద్దరూ తన చిన్నప్పుడే పోవడంతో బంధువులు సహాయం చేయకపోవడంతో ఉన్న ఇంటిలోనే వుంటూ కాస్తో కూస్తో చదువుకొని, కండక్టర్ గా పని చేసేవాడు. రాత్రిళ్ళు కూడా కష్టపడి మాకు తగట్టు ఒక ఇల్లు కట్టుకున్నాం.
తొలి కాన్పులోనే ఆదిత్య పుట్టడంతో చాలు అనుకున్నాం. ఒకవేళ పాప పుట్టింటే అని అడిగాను నేను.
ఎవరయినా ఒకటే ప్రసన్న, మన ఆదాయాన్ని బట్టి పిల్లలు, అనవసరం గా కనేసి వాళ్ళ బాగోగులు చూడలేనప్పుడు మనకెందుకు చెప్పు. ఒక్కరు చాలు అని చెప్పాడు.
ఒక్క నిమిషం దేవుడిలా కనిపించాడు. అలాగే వుండే వాడు కూడా, ఉన్నంతలో మా నాన్నకు కూడా సహాయం చేసేవాడు. ఒక్కోసారి పండుగకు బట్టలు కొనిచ్చేవాడు. నన్ను డిగ్రీ కూడా చదివించాడు. ఉద్యోగం చేస్తాను అంటే, చదువు జ్ఞానం ఇస్తుంది ప్రసన్న, బతకటానికి భరోసా ఇస్తుంది అని చెప్పేవాడు.
చాలా మంచి మనిషి కదా, అందుకే దేవుడు కి కూడ నచ్చాడు అనుకుంటా, బస్సు ఆక్సిడెంట్ రూపంలో మాకు దూరం చేసాడు.
హాస్పిటల్ లో ఉండగా బతుకుతాడని చాలా ఆశ పడ్డాను, ఒకటే చెప్పాడు “జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురయ్యినా, ఒడిదుడుకులు వచ్చిన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, నిన్నటి రోజుని వదిలేసి, ఉదయించే సూర్యుడి కోసం అడుగులు వెయ్యాలని “, నిజమే ఆ నమ్మకమే నన్ను ఈరోజుకి నడిపిస్తోంది.
ఇంకో పక్క ఫోన్ రింగ్ అవుతూ ఆగిపోయింది, చూస్తే ఆదిత్య అప్పటికే రెండు సార్లు కాల్ చేసాడు.
వెళ్లి తలుపు తీసాను, “చెప్పాను కదమ్మా…… మిడిల్ లాక్ వేసుకొమ్మని”, నిన్ను ఇలా నిద్రలేపటం నాకు నచ్చదు అన్నాడు ఆదిత్య.
పర్లేదు ఆది, ఏమైనా తింటావా? అని అడిగింది ప్రసన్న. నిన్ను కూడా తినమని చెప్పాను, నాకోసం ఎదురుచూడకుండా అన్నాడు ఆదిత్య. తిన్నాలే కానీ, ఈ పాలు తాగు అని ఇచ్చింది.
తాగుతూ తల్లి వైపు చూసాడు ఆదిత్య.
ఏమ్మా? ఏమి కావాలి? అని అడిగాడు ఆదిత్య.
ఏమి వద్దు ఆది, నువ్వు అచ్చం మీ నాన్న లాగే చేస్తుంటావు అన్ని పనులు అని చెప్పింది ప్రసన్న.
నవ్వేసి వెళ్ళిపోయాడు ఆదిత్య.
మళ్ళీ పడుకున్నా అవే ఆలోచనలు, ఆది “B. Tech” సెకండ్ ఇయర్ చదువుతుడ గా ప్రసాద్ వెళ్ళిపోయాడు. ఆదిత్య బాగా చదివినా ప్రసాద్ కి వచ్చే పెన్షన్ డబ్బులతో ఇల్లు గడవటం కష్టం అయింది, ఆది ఫీజులు, ఇంటా బయట కొన్ని సమస్యలు రావడంతో ఇంటిలో అల్లికలు, బుట్టలు కూడా అల్లేదాన్ని, ప్రసాద్ కి రీప్లేస్ మెంట్ అని నాకు అనౌన్సర్ గా ఉద్యోగం ఇచ్చారు.
అంతేకాకుండా ఆది చదువుకుంటూ తండ్రిలాగా ట్యూషన్స్ చెప్పుకుంటూ, ఇంకా తనకు తెలిసిన పనులు చేస్తూ, మొత్తానికి ఇంటిని ఇద్దరమూ కలిసి లాక్కొస్తున్నాం.
ఆది చదువు పూర్తి అయ్యి, పై చదువులు కూడా చదువుతూ, ఇంకోపక్క సెటిల్ అవ్వాలని ఒక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే వున్నాడు.
“ఆక్సిడెంట్ లో ఒక వ్యక్తి చనిపోతే, మనిషి చనిపోవటం కాదు, ఒక కుటుంబం వీధిన పడటం” అని నాకు ఆదికి త్వరగా అర్థం అయ్యింది.
గత రెండు సంవత్సరాలు గా పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కుదరటం లేదు. ఆదిలో అసహనం వున్నా నాకు చూపించటం లేదు.
వాడి బాధ అర్థం చేసుకొని, ఊరడించిన ఈ మధ్య ఫలితం కనిపించటం లేదు.
ఏదో యాంత్రికంగా ఉంటున్నామా? అనిపిస్తోంది ఈమధ్య…………
ఈ ఆలోచనలలో ఎప్పుడు తెల్లవారిందో తెలియదు కానీ, ఆది లేచి బయటికి వెళ్ళాడు. ఆదివారం కావడంతో నాకు కాస్త సెలవు వుంటుంది. వంట త్వరగా చేసి ఆది కోసం చూస్తున్నాను.
పన్నెండు కే విసుగ్గా వచ్చి, డోర్ వేసుకున్నాడు. మనసు ఎందుకో కీడు శంకిస్తోంది, వెళ్లి పిలిచాను, కాసేపటికి నిదానంగా వచ్చాడు.
ఈ మధ్య వాడి రూంలో హానికరం అయ్యే ఏ వస్తువులు ఉంచటం లేదు, చివరికి నా బీరువాకి కూడా తాళం వేసుకుంటున్నాను. అర్థం అయ్యింది అనుకుంటా మీకు.
చదువు పూర్తి అయ్యి నరెండు సంవత్సరాలనుండి అవుతుంటే వాడు డిప్రెషన్ కి లోను అవుతున్నాడు. డిప్రెషన్ లోనుండి బయటకు తేవటానికి ఈ మధ్య బయటికి కూడా వెళుతున్నాం.
ఈ మధ్య ఇతరులతో పోల్చుకుంటున్నాడు. వద్దని వారించాను. తన తండ్రి చివరి మాటలు గుర్తు చేశాను. విని కాస్త కుదురు పడినా, పోటీ ప్రపంచంలో ఇబ్బంది పడుతున్నాడు.
ధైర్యం కోసం మా వీధిలో తెలిసిన సాయిబు దగ్గరికి తీసుకెళ్లాను, ఆయన కాసేపు బాగా మాట్లాడి ఒక చిన్న “అంత్రం ( తాయత్తు) “ కట్టాడు.
చూడు ఆది, ఇది ఉన్నంత కాలం నీకు ఏమి కాదు అని చెప్పి పంపించాడు.
ఇంటికొచ్చాక ఎందుకమ్మా మూఢనమ్మకాలు నమ్ముతావు, నా మీద నమ్మకం లేదా? అని అడిగాడు ఆది.
ప్రసన్న నవ్వుతూ “అలా ఏమి కాదు ఆది, ఊరికే అటువంటివి మనిషికి చెడు కలుగనీయవు”, అని చెప్పింది.
తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు ఆది, చదువుకి తగ్గ ఉద్యోగం కోసం కాకపోయినా, ఏదో ఒకటి అని ప్రయత్నం చేస్తున్నాడు. విసిగిపోతున్నాడు.
చాలా కంపెనీ లల్లో ఇంటర్వ్యూ స్ అటెండ్ అయ్యాను అమ్మా, ఎవరూ యాక్సెప్ట్ చెయ్యట్లేదు అని భోరున ఏడ్చేశాడు ఒకరోజు ఆది.
వాళ్ళకే నీతో పనిచేసేంత అర్హత లేదనుకో ఆది, నీ తెలివితేటలు, ఆలోచనలతో కొత్త ప్రయత్నం ఏదయినా చెయ్యి, నేనున్నాను కదా, నాన్న పెన్షన్, నా శాలరీ, నీకు వచ్చేడబ్బులు, ఇంకా ఇంటి మీద లోన్ తీసుకుందాం, ఏదో ఒకటి చెయ్యి ఆది అని చెప్పింది ప్రసన్న.
ఇంకా కొన్ని ఇన్స్పైరింగ్ మాటలు కూడా చెప్పింది, జీవితం అంటేనే నమ్మకం తో ప్రయాణం చెయ్యాలి అని చెప్పింది.
చెత్త సామెతలు వద్దమ్మా, “నీతి కథలు వినటానికి బాగుంటుంది, సామెతలు చెప్పుకోవటానికి బాగుంటుంది” అంతే అని లోపలికి వెళ్ళిపోయాడు ఆదిత్య.
బాగా విసిగిపోయిన ఆదిత్య తల్లి ఊహించినట్లే “చనిపోవాలని” అనుకున్నాడు, తండ్రి పెన్షన్, తల్లి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం తో జీవితం సరిపోతుంది. అనుకున్నాడు. “బ్రతికి తల్లికి భారం కాకూడదు”, ఎంత ఉన్నత చదువులు చదివినా, ఉద్యోగం లేని జీవితం వ్యర్థం, అమ్మ నాన్న గురించి ఎంత చెప్పినా, అప్పటికి ఆశ కలిగిన, నా అసమర్ధత నన్ను చూసి నవ్వుతోంది అనుకున్నాడు ఆదిత్య.
రూమ్ అంతా వెతికాడు, ప్రసన్న ఆది బాత్రూమ్ లో కనీసం ఫినాయిల్ కూడా పెట్టలేదు, చావటానికి ఏ వస్తువు లేదు. మెల్లగా చప్పుడు చేయకుండా తల్లి బీరువా లో చీర తీసుకుందామని చూడగా తల్లి తన మీద ఎంత జాగ్రత్తలు తీసుకుందో అర్థం అయిన, తల్లిని సుఖపెట్టలేని జీవితం వద్దనుకున్నాడు ఆదిత్య.
మరుసటి రోజు పనులన్నీ పూర్తి చేసుకొని ఆలోచించించిన తన నిర్ణయం లో మార్పు రాలేదు ఆదిత్యకు. చావటానికి ఊరిలో వున్న చెరువు వద్దకు వెళ్ళాడు. అందరూ వెళ్ళిపోయాక దూకటానికి నిర్ణయించుకున్నాడు.
తల్లి ప్రేమ, ఆప్యాయత గుర్తు వస్తున్న, తల్లిదండ్రుల కష్టాలు కళ్ల ముందు కదలాడటంతో దూకేముందరగా చేతికి వున్న తాయిత్తు చూసుకొని, తల్లి మూఢనమ్మకాన్ని తీసి విసిరికొట్టాడు. అది కిందపడి విరిగిపోయింది.
అందులో నుండి ఒక చిన్న రాగిరేకు చుట్టికనిపించింది ఆదిత్యకు, వెళ్లి తీసుకొని ఓపెన్ చేసాడు. అందులో చిన్న లేఖ వుంది చదవడం మొదలుపెట్టాడు.
చూడు బాబు “ జీవితంలో కష్టాలు సహజం, నిన్న, ఈరోజు నీది కాకపోవచ్చు కానీ రేపు మాత్రం ఖచ్చితంగా నీదే అవుతుంది”, సూరస్తమయం తరువాత ఖచ్చితంగా సూర్యోదయం అవుతుంది. “నమ్మకమే జీవితం, ఇది లేని రోజు బ్రతికి వున్నా చచ్చిన వారితో సమానం”, అని వుంది.
ఒక్క నిమిషం ఆదిత్యకు ఆ సాయిబు గుర్తు వచ్చాడు. నిన్ను, నువ్వు వద్దు అనుకున్న రోజు, ఇది తీసేయ్ అని చెప్పాడు.
ఆరోజు ఎందుకు అలా చెప్పాడో అర్థం అయ్యింది. ఛీ ఎంత పెద్ద పొరపాటు చేయబోయాను, మా నాన్నలో వున్న ధైర్యం కొంచెం కూడా లేకుండా పోయింది. ఎవరూ లేకపోయినా నాన్న నన్ను ఎంత బాగా పెంచాడు. అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటోంది. తన మాటలు చాదస్తం లా చూసాను. అమ్మ ముందు జాగ్రత్త చెయ్యకపోయింటే, దేవుడా ఎంత పెద్ద పొరపాటు చేసి, నా తల్లికి తీరని శోకాన్ని మిగిల్చే వాడిని అనుకుంటూ ఇంటికి వచ్చాడు .
తల్లికి అనుమానం రాకుండా మాసలుకున్నాడు. మరుసటి రోజు ఇంటికి వచ్చేసరికి ప్రసన్న కొడుకు కోసం ఎదురు చూస్తోంది.
ఆదిత్య ఇంటికి రాగానే ఆదిత్యకు వచ్చిన లెటర్ ఇచ్చింది, ఓపెన్ చేసి చూసి ఎగిరి గంతేసాడు ఆదిత్య. తన ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని, దానికి అమౌంట్ పే చేసి, కంపెనీ పేరెంట్ హక్కులు తీసుకుంటున్నారని తెలిసి సంతోషం తో తల్లికి వివరించాడు.
ప్రసన్న కూడా సంతోషించింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు చేసావు ఆది? అని అడిగింది.
లాస్ట్ ఇయర్ చేసాను కానీ, సబ్మిట్ చేసినప్పుడు నాకే నమ్మకం లేదమ్మా, ఆరోజు నువ్వు ఆశీర్వదించిన ప్రాజెక్ట్, నేనే కన్సిడర్ చేయలేదు, అంటూ తల్లి కాళ్ళ మీద పడ్డాడు ఆదిత్య.
సరే ఆది, ఇప్పుడు అర్థం అయిందా? జీవితం లో ప్రతి మనిషి తన మీద తాను నమ్మకం పెట్టుకోవాలి అని చెప్పింది ప్రసన్న.
సారీ అమ్మా, అని హత్తుకున్నాడు ఆదిత్య.

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!