ఫోనోపాఖ్యానం

ఫోనోపాఖ్యానం

“బాధపడకు ఏం చేస్తాం చెప్పు”

“నీదే కాదు మా పరిస్థితి అంతే”

“అవును ఒక్కొక్కటిగా మనల్ని దూరం చేసేస్తోంది”

“మనల్ని మరచిపోతున్నారు కూడా”

“భవిష్యత్తు తల్చుకుంటే భయంగా ఉంది”

“ఇంకేం భవిష్యత్తు? అంతా శూన్యం”

ఏడుపు ముఖాలు పెట్టుకున్నాయి క్యాలెండరు, వాచ్, కెమెరా, రేడియోలు.

“సెల్ ఫోన్ వచ్చాక అన్నీ అందులోనే దూర్చేశారు. మనకంటూ ప్రత్యేక సాధనాలే లేకుండాపోయాయి” అని నిట్టూర్చింది కాలిక్యులేటర్. 

“నన్ను ఎన్ని వేలు, లక్షలు పెట్టి కొనేవారో… ఇప్పుడు ప్రతి ఒక్కరు టిక్కు టిక్కుమంటూ ఫొటోస్ తీయడమే” అని బుంగమూతి పెట్టింది కెమెరా.

 “నన్ను ఎంత భద్రంగా చూసుకునేవారో” గత వైభవాన్ని తల్చుకుని ఉస్సురుమంది వీడియో కెమెరా.

 వీరి మాటలన్నీ విన్న సెల్ ఫోన్ “మిత్రులారా నేను రెండు మాటలు మాట్లాడొచ్చా” అని వినయంగా అడిగింది. 

అన్నీ కూడా “సరే” నని తలాడించాయి. 

    “నిజం చెప్పాలంటే మీ అందరూ కలిపితేనే నేను. మీరంతా లేకుంటే నాకిదంతా దక్కేది  కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో నేనున్నానంటే అందుకు మీరంతా కూడా కారణం. ప్రతి చోటుకు మీరంతా ఒకేసారి వెళ్ళలేరు. కాబట్టి మీరందరిని నాలో ఇముడ్చుకున్నాను. అంతేగాని మిమ్మల్ని నామ రూపాలు లేకుండా చేయాలని మాత్రం కాదు.” అని మనసు విప్పింది సెల్ ఫోన్.

“కానీ నీ వల్ల మమ్మల్ని ఎవ్వరు ఉపయోగించట్లేదు” అక్కసు వెళ్ళగక్కింది కెమెరా.

“అయ్యో సోదరా సెల్ ఫోన్ కొనాలనుకునే ప్రతి ఒక్కరు మొదట అడిగేది మిమ్మల్నే. కెమెరా బాగుంటేనే సెల్ కొనేది.” అని జవాబిచ్చి శాంతపరిచింది. 

“మరి నా సంగతి” వీడియో కెమెరా ప్రశ్నకి

 “అన్నయ్య గతంలో నువ్వు ఏ కొందరికో సొంతం, కానీ ఇప్పుడు అందరి వాడివయ్యావు. నువ్వే కాదు మ్యూజిక్ ప్లేయర్, మాప్స్, కంపాస్ అన్నీ కూడా. క్యాలెండరు ఒకప్పుడు ఇంట్లోనే ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి చోటా ఉంటోంది.. మరిన్ని సేవలు అందిస్తోంది, మీరందరు కూడా అడ్వాన్స్ టెక్నాలజీతో అదరగొడుతున్నారు ” అని ముగించింది సెల్ ఫోన్. 

ఈ సమాధానాలతో సంతృప్తి చెందిన కెమెరా, క్యాలెండరు మిగతావన్నీ సెల్ ఫోన్ ను తప్పు పట్టినందుకు క్షమించమని అడిగాయి. 

“మనమంతా మానవ సేవలో వున్నాము. ఈ క్షమాపణలు గట్రా వద్దు మిత్రులారా” అన్న సెల్ ఫోన్.. 

“మరి ఈ సంతోష సమయంలో ఒక సెల్ఫీ తీసుకుందామా” అంది.

 అనడమే ఆలస్యం కెమెరా క్లిక్ మనిపించింది.

రచన:: శ్రీమతి మంజీత కుమార్

You May Also Like

3 thoughts on “ఫోనోపాఖ్యానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!