పిల్లల నవ్వులే మాత్రలు   

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
పిల్లల నవ్వులే మాత్రలు   
రచన:: లోడె రాములు

“అమ్మమ్మా..! మా ఇంటికి రా..!”
“ఎందుకమ్మా..! పొద్దున్నుండి మీతోనే ఉన్నను కదా..!”
“అదంతా.. మాకు తెల్వద్.. రావాలంతే..”
“ఇప్పుడు ఇంటికి వచ్చి, ఏమి చెయ్యాలమ్మా..”
“ఊ.. రాకపోతే చూడూ..”
“నిన్న వచ్చిన,బోనాలు ఉన్నాయని మీ పిన్ని ఇంటికి.. ఈ రోజు మీరొచ్చారు బోనాల పండగ చూశాం.. పొద్దుమూకి మా ఇంటికి పోతాం.. మళ్లి వారం వస్తా అక్కీ..”
“లే.. లే… లేదు.. ఇప్పుడే మాతో పాటు రా.. అంతే..”అని ఇద్దరు మనవరాళ్లు, ముక్త కంఠంతో పట్టు పట్టేసరికి, కాదనలేక
“సరే..సరే..పోయేటప్పుడు వస్తాంలే”
పట్టుబడితే విడవరు. తుపాకులు.. అని మనసులో అనుకుంది అరుణ.
అరుణ సామాన్య గృహిణి, తనకు ఇద్దరు బిడ్డలు..పెద్ద బిడ్డ నివేదిత కు
ఇద్దరు పాపలు.. అరుణ వారిని ముద్దుగా తుపాకులు అని పిలుచుకుంటుంది.” ఆదివారం బోనాలు పండగ రండి అమ్మా” అని చిన్న బిడ్డ చందన ,మామ గారు ఫోన్ చేసి చెప్పారు.

ఆషాడ మాసం తెలంగాణలో బోనాలు పెద్ద పండుగ.. గత సంవత్సరం కరోనా మహమ్మారి ఏ పండగలను చేసుకోనివ్వలేదు.. ఒకటవ గాలి, రెండో గాలి, అని వచ్చి ఇంటింటికి ఏదోవిదంగా నష్టాలపాలు.. చేసింది.. ఇప్పటికీ కోలుకోని సంస్థలు, కుటుంబాలు కోకొల్లలు.. ఏదో శాస్త్రజ్ఞుల
దయ,ప్రభుత్వాల చొరవ ఫలితంగా టీకాలు తీసుకొన్నందుకు ,లాక్డౌన్ పాటించి నందుకు తగ్గుముఖం పట్టింది ..
అయినా ఇంకా మూడో గాలి కూడా ఉందని అంటున్నారు..ఈ జనానికేమో ఆకలి ఎక్కువాయే.. రెక్కాడితే గాని డొక్కాడని
బతుకులు కోట్లలో ఉన్నాయి ..
సరదాలు,సంబరాలు,అన్నీ కావాలి ..ఇక ఏడాదిన్నర నుండి సదువులు లేక పిల్లలు ఉన్నది కాస్త మరచి..మళ్లీ మొదటికి వచ్చి
మొండిగా తయారయ్యారు.
అంతా మాములు కావడానికి ఇంకెంత టైం పడ్తదో చెప్పేటోళ్లు లేరు …

సాయంత్రం చిన్న బిడ్డ చందనకు,అల్లుడు నవీన్ కు
వస్తాం..బిడ్డా..అని అందరి వద్ద సెలవు తీసుకొని,సరూర్ నగర్ పెద్ద బిడ్డ ఇంటి దగ్గరకు రాగానే ..
పిల్లలిద్దరూ అల్లుకొని ,వారి సంతోషమే సంతోషం..
పెద్ద బిడ్డ తమ సొంత ఇల్లు ఇరుకుగా ఉంది.,పిల్లలకు స్వేచ్చగా ఉంటుందని,ఈ మద్యే కొత్త గా
ఇల్లు మారారు..అప్పటి నుండి వారి ఆనందానికి హద్దులు లేవు..వారికి ప్రత్యేక రూమ్,సెల్ఫ్,బీరువా,
వాష్ రూమ్ ఫ్రీగా ఆడుకోవడానికి బాల్కనీ …
ఇంటికి వచ్చిన అమ్మమ్మ అరుణ చేయి పట్టుకొని..ఇంటి అణువణువును పరిచయం చేస్తూ..ఇది మాది..ఇది చెల్లెది,అని ఇల్లంతా తిప్పి తిప్పి చూపించిన తర్వాత వారి మనసులు కుదుట పడ్డాయి…
“ఓసి..మీ ఇల్లు బంగారం కానూ…
ఇందుకేనా,ఏదో దాచిపెట్టినట్లు,
పట్టు బట్టి రా..అమ్మమ్మా.. అని ,ఇల్లంతా తిప్పి అలసట తెప్పించారు కదమ్మా…”
“ఆ..అందుకే..మొన్న తాత క్కూడా చూపించినం ..”అని నవ్వులు..
వారి సంతోషం చూసి కడుపు నిండి పోయింది ..
“ఇంకా ..పోతాం బిడ్డా…”
“ఆ..ఏమొద్దు ,వారం రోజులుండాలి
ఇక్కడే..”
“వారం ఉంటే మీ తాత కు ఇబ్బంది”
“ఏం కాదు..ఉండాలి అంతే…”అని చేతిలోని సంచిని తీసుకొని దాపెట్టుకొన్నారు ..
చాన్నాళ్ల తర్వాత పిల్లలతో
కాలక్షేపం ..తన అనారోగ్యం ఎప్పుడో మరచి పోయింది..
రెగ్యులర్ టాబ్లెట్స్ వేసుకోవడం గుర్తుకే వస్తలేదు….మానసిక ఆరోగ్యానికి పిల్లల నవ్వులే మాత్రలు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!