చిలిపి తగాదా   

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
 చిలిపి తగాదా   
రచన::కమల ముక్కు (కమల’శ్రీ’)
 “అమ్మమ్మా… అమ్మమ్మా…” అంటూ పనుల్లో ఉన్న మాధవమ్మ కొంగు పట్టుకు లాగింది పదేళ్ల మానస.“ఏంటమ్మా…!” పని చేస్తూనే పలికింది మాధవమ్మ.
“అమ్మమ్మా నువ్వు అర్జెంటు గా ఇంటికి రా.” అంది మానస.“ఇంటికా ఎందుకమ్మా.ఈవేళ పండగ కదా బోలెడన్ని పనులు ఉన్నాయి చేయడానికి. తర్వాత వస్తాలే తల్లీ. ముందైతే నువ్వెల్లి కొత్త బట్టలు వేసుకో.” అంటూ పూజ కావల్సిన పండ్లు కడిగి ఓ పళ్ళెం లో పెడుతూ సమాధానం ఇచ్చింది మాధవమ్మ.

“అబ్బా! అమ్మమ్మా నువ్విప్పుడు నాతో వస్తావా లేదా?.” మొండిగా అడిగింది మానస.

“మానసా! చెప్తే వినాలి. నాకు చాలా పనులు ఉన్నాయి. నువ్వు బుద్ధి గా ఉంటే సరే సరీ. లేదంటే ఒక్కటి తగిలిస్తా.” అంది మందలింపుగా.

“ఏంటీ కొడతావా.” అంటూ బుంగమూతి పెట్టి స్థంభానికి ఆనుకుని చేత్తో గీతలు గీస్తూ నిలబడింది మానస

తన పనులన్నీ పూర్తి చేసి అటుగా వెళ్తున్న మాధవమ్మ స్థంభాన్ని పట్టుకుని నిలబడిన మానసని చూసి “మానసా! ఇంకా ఇక్కడే నిలబడ్డావా?.” అంది మాధవమ్మ.

“హుమ్ అమ్మమ్మా నువ్వు నాతో మా ఇంటికి వస్తావా రావా?!.” అంది కళ్లమ్మట నీరు వస్తుండగా.

“అయ్యో! తల్లీ ఏడుస్తున్నావా. పదా వెళ్దాం.” అంది మాధవమ్మ.

“హాయ్ … వస్తావా అమ్మమ్మా. సరే పదా.” సంబరంగా అని ఆమె చేయి పట్టుకొని ముందుకు కదిలింది మానస. ఐదు నిమిషాల్లోనే పక్క వీధిలో ఉన్న మానస ఇంటికి చేరుకున్నారు.

“హా ఇప్పుడు చెప్పు తల్లీ దేనికి ఇంటికి రమ్మని అన్నావు?.” అంది మాధవమ్మ ఆయాసం ఆపుకుని.

“ఉండు అమ్మమ్మా ఒక్క నిమిషం ఆగు.” అని “నాన్నా! ఇదిగో అమ్మమ్మ వచ్చింది. ఇప్పుడు చెప్తా మీ పని.” అని మాధవమ్మ చెయ్యి పట్టుకుని,

“అమ్మమ్మా! ఉదయం నాన్న నన్ను తిట్టాడు. నువ్విప్పుడు నాన్నని బాగా తిట్టు అమ్మమ్మా.” అంటూ ఏడుపు లంఖించుకుంది.

“రవీ! ఏమైందయ్యా మానస ఎందుకు ఏడుస్తుంది. నువ్వు తనని ఎందుకు తిట్టావసలు. పండగంటి పూట ఆడపిల్లని ఎవరైనా తిడతారా చెప్పండి అల్లుడు గారూ.” అంది మాధవమ్మ మందలింపుగా.

“అది అలా తిట్టు అమ్మమ్మా. బాగా తిట్టు. నన్నే తిట్టారు కదా నాన్న. ఆయన్ని బాగా తిట్టు.” అంది మానస.

“అవునూ పిల్లనసలు ఎందుకు తిట్టావు?.” సందేహంగా, కాస్త మందలింపుగా అడిగింది మాధవమ్మ.

“అదీ అత్తయ్యా…” అంటూ రవి సందేహ పడుతుంటే,

“హా నీ ముద్దుల మనవరాలు కొత్త బట్టల మీద పసుపు పడేసింది. అది చూసి కాస్త కోపంగా మాట్లాడేసరికి మా అమ్మమ్మ ని తీసుకుని వస్తాను. తను మిమ్మల్ని బాగా తిడుతుంది అని మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకుని వచ్చింది. ఏమ్మా నీ కసి తీరిందా. మీ నాన్నని మీ అమ్మమ్మ తిడుతుంటే చూసి నీ కడుపు నిండిందా?!.” నవ్వుతూ అంది మానస తల్లి లలిత.

“హా… బాగా. నన్నెవరైనా ఏమైనా అంటే మా అమ్మమ్మ వారిని చెడామడా తిడుతుంది. అది చూస్తే నా బాధంతా పోతుంది. ఇప్పుడు కూడా నాన్న నన్ను తిట్టారన్న బాధకంటే ఆయన్ని అమమ్మ తిట్టిందని సంతోషంగా ఉంది. అమ్మా ఇప్పుడివ్వు నా కొత్త బట్టలు నేను వేసుకుంటా.” అంటూ తల్లి చేయి పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళింది మానస.

“ఓసి నీ ఇల్లు బంగారం కాను. మీ నాన్న చిన్నమాట అన్నాడని నన్ను తీసుకొచ్చి ఆయన్ని తిట్టించాలనుకున్నావా. నువ్వు అసాధ్యురాలివే తల్లీ. మీ చిలిపి తగాదా బాగుంది లే. సరేనయ్యా ఉంటాను. మీ మామయ్య కి చెప్పకుండా వచ్చాను. వెళ్తాను.హా దాన్నే మీ అనొద్దు.” అంటూ వెళ్లిపోయింది మాధవమ్మ.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!