ప్రశ్ననే ప్రశ్నిస్తా

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

ప్రశ్ననే ప్రశ్నిస్తా

రచన: నెల్లుట్ల సునీత

నిస్తేజమైన మెదళ్లను నా కవనంతో కదిలిస్తానని జవాబిస్తా
ప్రపంచ బాధల్ని నా బాధగా భావించి
నా కలంలో కరుణరస సిరా నింపి కైతలతో స్వాంతన చేకూరుస్తా

సాహిత్యాన్ని శాసించి సమస్యలని సంధించే అస్త్రమే నేనవుతా
చైతన్య జ్వాల తోరణాలు కట్టి సమాజాన్ని మేలుకొలిపే దివ్య జ్యోతి వెలుగై ప్రసరిస్తా

నా మస్తిష్కంలో నిక్షిప్తమైన అభ్యుదయ భావాలతో స్ఫూర్తి నింపే కవితనవుతా

అంతరంగ పొదరింట్లో పల్లె మట్టి పరిమళమై గుబాళిస్తా
మనుగడంత పరాధీనమైన మాయా
వ్యవస్థను ప్రశ్నిస్తా

పాలకుల నిర్లక్ష్యాన్ని నా అక్షరాగ్నితో తగలేస్తా
దురాగతాల్ని సమర్థించే పిచ్చి వాళ్ళ రాతల్ని ఖండిస్తా

భజన చేసే సంఘాల ముసుగుల్ని తొలగిస్తా
లక్ష్యాన్ని చేరకుండా అడ్డుపడే అవినీతి పిశాచాల్ని అణిచేస్తా

అగుపించని పంపకాలకు చమరగీతం పాడేస్తా
మంచిని కోరే ప్రపంచాన్ని కలగంటానని
విన్నవిస్తా
నిషీధిలో మిణుగురుగా దారి చూపే
వెలుగవుతానని హామీ ఇస్తా
స్వేచ్ఛా దిగంతాల్లో ఎగిరే శ్వేత కపోతమై శాంతి సందేశం అందిస్తా

అంతరంగం ప్రశ్నిస్తే సమాధానమిస్తూ
భారతి పెదాలపై చిరునవ్వు సంతకం చేసేస్తా.!

You May Also Like

One thought on “ప్రశ్ననే ప్రశ్నిస్తా

  1. రచన అద్భుతం.. ధన్యవాదములు అండీ సునీత గారు. 🙏

Leave a Reply to Gangineni Venkateswarlu Naidu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!