సభ్య సమాజంలో స్త్రీలు 

సభ్య సమాజంలో స్త్రీలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సావిత్రి కోవూరు

ఆధునిక సమాజంలో స్త్రీలు ఎంత చదువుకుని విజ్ఞానవంతులు అయినా మగవారితో సమానంగా విజ్ఞానవేత్తలై ఉద్యోగాలు చేస్తున్నా, రైళ్లు, విమానాలు నడుపుతున్నా, ఉపగ్రహాలకు వెళ్లివచ్చిన, పెద్దపెద్ద వ్యాపారాలలో నిష్ణాతులైన కూడ వారిని కొందరు చలకనగా చూడడమే కాకుండా, లైంగికంగా కూడా వేధిస్తూనే ఉన్నారు.
పనిచేసే ప్రదేశాలలో కాని, కార్యాలయాల్లో గాని, ప్రయాణాలలో కానీ బయటి ప్రపంచంలో ఎక్కడైన స్త్రీలు అప్రమత్తంగా లేకపోతే  భద్రత కరువే. ఒక్కొక్కసారి కుటుంబంలోని కొందరు వ్యక్తులు కూడా స్తీలను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు.
చదువులో, విజ్ఞానంలో, వయసులో తమ కన్నా పై స్థాయిలో ఉన్నా స్త్రీలను కూడ  దేనికి కొరగాని పోరంబోకులు, చీడపురుగులు కూడా లైంగికంగా వేధించడానికి వెనుకాడడంలేదు. దానికి తార్కాణంగా దిశ సంఘటననే తీసుకోవచ్చు.
అంత విజ్ఞానవంతురాలయినా ఆ అమ్మాయిని ఆమె కాలి గోటికి కూడా సరిపోని పోరంబోకు వెదవలు ఆమె జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా చిదిమి వేశారు. మగవాడికి స్త్రీలంటే ఎందుకు అంత చులకన భావం, స్త్రీని లైంగిక పరంగానే ఎందుకు చూస్తారు. ఎక్కడుంది లోపం అంటే, ముమ్మాటికీ తల్లిదండ్రుల పెంపకం అని చెప్పవచ్చు. ఒక ఇంట్లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఉన్నట్లయితే అమ్మాయి అవసరమై బయటకు వెళుతున్న యక్ష ప్రశ్నలు వేసే తల్లిదండ్రులు అబ్బాయిలను విచ్చలవిడిగా అర్ధరాత్రి వరకూ ఎక్కడెక్కడ తిరిగినా ఒక్క మాట కూడా అనరు. కనీసం అబ్బాయి ఎక్కడికి వెళుతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, వాడి అలవాట్లు ఏంటి, వాడి ఆలోచనలు ఎలా మారుతున్నాయి, బయట ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవాలన్న స్పృహకూడా తల్లిదండ్రులకు ఉండదు. మగ పిల్లవాడు ఎక్కడికైన వెడతాడు, ఏమైనా చేస్తాడు అని వెనకేసుకొస్తారు.  అలాకాకుండా చిన్నప్పటినుండి తల్లిదండ్రులు మగ పిల్లవాడికి ఇంట్లో తల్లి పైన, అక్కచెల్లెళ్ళ పైన ఇతర స్త్రీల పైన గౌరవం కలిగేలా చెబుతూ పెంచాలి. స్త్రీలు కూడ తమలాంటి మనుషులే, వారితో చులకనగ మాట్లాడటం గానీ, చూడడం గాని తప్పు అన్న భావన కలగచేసినట్లయితే పెద్దగయిన తర్వాత ఆడవాళ్ళతో గౌరవంగా  మెలుగుతాడు.
చిన్నప్పటినుండి మగపిల్లలు తమకు ఆధారం అవుతాడన్న స్వార్థంతో మగపిల్లలను మహారాజుల్లా పెంచడం, ఆడపిల్లను చిన్న చూపు చూడడం వల్ల మగ పిల్లలకు ఆడవాళ్లంటే చిన్నప్పటినుండే చులకన భావం ఏర్పడి పెద్దవాడైన తరువాత బయట ప్రపంచంలో స్త్రీలను కూడా నీచంగా చూస్తూ కొన్ని కొన్ని సార్లు ఆడవాళ్ళ పాలిట రాక్షసుల్లా, కిరాతకుల్లా మారి ప్రాణాలు తీసే యమకింకరుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్లలు శారీరకంగా బలహీనంగా ఉన్న ఆత్మ రక్షణకు అవసరమైన ‘జూడో, కరాటే’ లాంటి విద్యలే కాకుండ అవసరార్ధం ఆయుధ ప్రయోగాలు చేసి తమను తాము రక్షించుకొనే తర్ఫీదు కూడా తప్పనిసరి ఇవ్వాలి.  అంతే కాకుండా వారికి తమను తాము రక్షించుకునే ఆత్మవిశ్వాసము, ముందుచూపు,యుక్తి మొదలైనవి కలిగించాలి. ప్రతి యొక్క ఆడపిల్ల పాఠశాలల్లో గాని కళాశాలలో కానీ విద్యతో పాటు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి నేర్పించాలి. అప్పుడే తనను చులకన చేసినా,  లైంగికంగా వేధించిన వారిని ధైర్యంగా ఎదుర్కొని మట్టికరిపించ కలుగుతుంది. అప్పుడే సమాజంలో స్త్రీలపై జరిగే దాడులు కొన్నయినా తగ్గుతాయని ఆశిద్దాం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!