సంకల్పం

సంకల్పం

రచన::సావిత్రి కోవూరు

“నీలిమ మీ నాన్న పిలుస్తున్నారు” అన్నది తల్లి సుగుణమ్మ.

“వస్తున్నానమ్మా” అని ముందు గదిలో నుంచి తండ్రి ఉన్న గదిలోకి వచ్చిన నీలిమకు అప్పటివరకు తల్లిదండ్రులు తన గురించే ఏదో సీరియస్ గా మాట్లాడుకున్నారని అర్థమైంది. చెల్లెలు మల్లిక ఎవరో ఫ్రెండ్ పుట్టినరోజు అని వెళ్ళింది.

“ఆదివారము అన్నా రెస్ట్ తీసుకోవచ్చు కదమ్మా.ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు.” అన్నది తల్లి.

“అవునమ్మా కొంచెం సేపు రెస్ట్ తీసుకో” అన్నాడు తండ్రి ప్రభాకర్.

“ఏం లేదు నాన్నా ఎదురింటి ఆంటీ చీరల ఫాల్స్ కుట్టమంటే కుడుతున్నాను.” అన్నది

“ఇప్పుడు కుట్టడం అవసరమా? ఇప్పటివరకూ ఖాళీగా ఉన్నవు, కనుక టైలరింగ్ పని, ట్యూషన్స్, ఎంబ్రాయిడరీలు, అద్దాలు కుట్టడం చేశావు. నాలుగు పైసలొస్తాయి కదా అని, మేము కూడ  సరే నీ ఇష్టం అనుకున్నాము. ఇప్పుడు మంచిగా టీచర్ ఉద్యోగం వచ్చింది కదా. ఇవన్నీ మానేయవచ్చు కదమ్మా.” అన్నాడు తండ్రి.

“నాకు కష్టం అనిపిస్తే అలాగే ఈ పనులన్నీ మానేస్తాను నాన్న.” అన్నది నీలిమ.

“నీ ఇష్టం తల్లి, ఇంతకీ ఎందుకు పిలిచానంటే మా పిన్ని మనవడు, నిన్ను ఎక్కడో చూశాడట. నీవు నచ్చావట. అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. సొంతంగా పెద్ద ఇల్లు కొన్నాడట. ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలను కుంటున్నాడు.నీ అభిప్రాయం కనుక్కోమన్నారమ్మా. నిన్ను అడిగి చెప్తానన్నాను. నీవు ఏమంటావు” అన్నాడు ప్రభాకర్.

“నా ఇష్టం ఏంటో మీకు ఎన్నో సార్లు చెప్పాను. మీరు మళ్లీ అదే అడుగుతుంటే నేను ఏమని చెప్పాలి నాన్నా”అన్నది.

“సరేనమ్మా నీవు చందుని ఇష్టపడుతున్నావని తెలుసు. కానీ వాడు నీ కంటే తక్కువ చదువుకున్నాడు. అంతేకాకుండా మా చెల్లెలు ఆరోగ్యం బాగాలేదని తెలుసు కదా నీకు. దానికి తోడు వాడికి కూడా చెల్లెల్లి బాధ్యత ఉన్నది. వాళ్ళ నాన్న ఒక్కడే సంపాదిస్తే నలుగురికి సరిపోవటం లేదట. చిన్న ఇల్లు తప్ప వేరే ఆదాయం లేదు.  అందుకే ఇంటర్తో చదువు ఆపేసి ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుంటాడట. నీవు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు. నీవు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన నా పెన్షన్తో మేము ముగ్గురం ఎలాగైనా బ్రతుక గలుగుతాము.” అన్నాడు ప్రభాకర్.

 “నాన్న చందు బావ చదువులో వెనక పడి పోవడానికి కారణం వాళ్ళ అమ్మ అంటే, అత్తయ్యకు సడన్ గా గుండె నొప్పి వచ్చి ఆపరేషన్ చేయవలసి వచ్చినందుకు డబ్బులకు ఇబ్బందై తండ్రికి సహాయంగా కొన్నేళ్ళు చదువు మానేసి ఉద్యోగం చేయాల్సి వచ్చింది. అంతేగానీ చదువులో బావ ఎంత తెలివైన వాడో నీకు తెలియదా? తన ఫ్రెండ్స్ చదువులో ఎవ్వరికీ ఏ డౌట్ వచ్చినా బావనే అడుగుతారు.

 మీరంతా మా చిన్నప్పటి నుండి మేమిద్దరం కాబోయే భార్యభర్తలమని మళ్ళీ మళ్ళీ అని, మా మనసులలో నాటుకునేల చేశారు.

నేను బుద్ధి తెలిసినప్పటి నుండి బావనే నా భర్త అని  ఊహించుకున్నాను. ఈ రోజు నాకు ఉద్యోగం వచ్చిందని బావ చదువులో వెనక బడ్డాడని నా మనస్సు మార్చుకోమనడం న్యాయమా.” అన్నది.

“బావను నేను ఎంతో ప్రేమిస్తున్నాను నాన్న. నా జీవితమే బావ. బావకు కూడా నేనంటే ప్రాణం అని ఆ కళ్ళల్లో నా పట్ల చూపే ప్రేమ ఆరాధనని చూస్తే తెలుస్తుంది. బావ లేకుండా నేను బ్రతకలేను నాన్న. ఇప్పుడు చదువులో వెనుకబడ్డా, బావ చదువు మానకుండా నేను ఆదుకుంటాను. బావను, వాళ్ళ చెల్లెను, మన మల్లికను నేనే చదివిస్తాను. బావ ఎంత వరకు చదివుతానంటే, అంత వరకు  నేను చదివిస్తాను” అన్నది నీలిమ.

“నీ ఇష్టం తల్లీ. చందు నాకు పరాయి వాడు కాదు సొంతం చెల్లెలు కొడుకు. ఎంతో బుద్ధిమంతుడు ముఖ్యంగా నువ్వంటే చాలా ఇష్టం అని తెలుసు. కానీ ఆడపిల్లను ఇచ్చేటప్పుడు మన స్థాయి కంటే ఉన్నత స్థాయికి ఇవ్వాలని, ఆడపిల్లను తెచ్చుకునే టప్పుడు కింది స్థాయి నుండి తెచ్చుకోవాలని పెద్దలంటారు. అందుకే నిన్ను అడిగాను నీ ఇష్టం. సాయంత్రం ఒకసారి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసి రా. రమ్మని చెప్పింది” అన్నాడు.

“సరే నాన్న మీరు ఏమి ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోండి. నేను అన్ని చూసుకుంటాను” అన్నది.

“నీలిమ నీవెళ్లేటప్పుడు నేను కూడా వస్తాను. సరోజను చూడక చాలా రోజులు అయింది” అన్నది సుగుణమ్మ.

“సరేనమ్మా రెడీ అవ్వు తొందరగా వెడితే కొంచెం ఎక్కువ సేపు కూర్చోని రావచ్చు.” అన్నది.

“ఇద్దరు కలిసి ఆటోలో మేనత్త ఇంటికి వెళ్లారు. వీళ్ళు వెళ్లేసరికి చందు, వాళ్ళ చెల్లెలు లాస్యతో క్యారమ్స్ ఆడుతున్నాడు. “నేను ఆడొచ్చా బావ” అన్నది నీలిమ వెళ్లి కూర్చుంటూ.

“నీతో నేను ఆడలేను. మా చెల్లి తో ఆడుకో” అని లేచి వెళ్ళిపోయాడు అక్కడి నుండి.

“కొత్త ఉద్యోగం ఎలా ఉందే నీలిమా” అన్నది మేనత్త సరోజమ్మ.

“బాగానే ఉంది అత్తయ్య అయినా, నాకు ముందు నుండి పిల్లలకు ట్యూషన్ చెప్పడం అలవాటే కనుక పెద్ద కష్టమేమీ లేదు అత్తయ్య” అన్నది.

“మీ అమ్మ ఏదో సంబంధం గురించి చెబుతున్నది
మంచి సంబంధం అట కదా. కట్నం కూడ వద్దన్నారట.నిన్ను ఒప్పించమని అడుగుతుంది. ఏమంటావ్” అన్నది సరోజమ్మ.

“అదేంటమ్మా, నీలిమ వదిన చందు అన్నయ్య భార్య అవుతుందని ముందు నుండి మీరే కదా అన్నారు. ఇప్పుడు వేరే సంబంధం గురించి మాట్లాడుతున్నారేంటి” అన్నది లాస్య.

“అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు నా ఆరోగ్యం బాగాలేదు ఖర్చులు పెరిగిపోయాయి. చదువు మానేసి, చందు కూడా సంపాదిస్తే గాని మనకు గడవదు. నీలిమాకు మంచి ఉద్యోగం వచ్చింది. పరిస్థితులకు తగ్గట్టు మన ఆలోచనలు మారాలి కదమ్మా.దేనికైన అదృష్టం ఉండాలి” అన్నది బాధగా.

“నాకు అదంతా తెలియదు కానీ అన్నయ్యకు నీలిమ వదినంటే ప్రాణం. మన అందరికీ కూడా ఇష్టమే కదమ్మా” అన్నది.

“అలా చెప్పవే చిట్టి మరదలా. పరిస్థితులను బట్టి ప్రేమలు, మనసులు మారవు అత్తయ్యా. నేను బావను అడుగుతా. వేరే వాళ్ళని చేసుకోమంటే చేసుకుంటా” అన్నది.

“వెళ్ళు పైన గది లో ఉన్నట్టున్నాడు ఏమడుగుతావో అడుగు”అన్నది సరోజమ్మ.

నీలిమ పైన గది లోకి వెళ్ళేసరికి ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు చందు. “బావ నిజంగా చెప్పు. నేనంటే నీకు ఇష్టమా కాదా? అమ్మ వాళ్లు వేరే అబ్బాయిని చేసుకోమంటున్నారు. నన్ను చేసుకో మంటావా” అన్నది.

నీలిమ డైరెక్ట్ గా అలా అడుగుతుందని ఊహించ లేదు చందు. అందుకే జవాబు ఇవ్వడానికి తికమక పడ్డాడు. చందుకీ కొంచెం సిగ్గు ఎక్కువే. తల్లిదండ్రులతో, చెల్లెలుతో తప్ప, ఎవరితో ఎక్కువ మాట్లాడడు. ఆడవాళ్ళతో అసలే మాట్లాడడు. ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే విపరీతంగా జోక్స్ వేస్తూ, సినిమా ముచ్చట్లు చెబుతూ, ఎడతెరిపి లేకుండా మాట్లాడతాడు. నీలిమతో కూడా ఎప్పుడు ఎక్కువ మాట్లాడడు. నీలిమ తనే కల్పించుకొని మాట్లాడిన చాల క్లుప్తంగా మాట్లాడుతాడు. కానీ ఎదురు పడ్డప్పుడు చూడడంతప్ప. అలా చూసె చూపుతోనే, తనంటే బావకి ఎంతో ఇష్టం అని తెలుసుకుంది నీలిమ.

“చెప్పు బావా ఏమంటావు ఇదివరకులా నీవు మౌనంగా మాట్లాడితే సరిపోదు. నోరువిప్పి చెప్పు నేనంటే ఇష్టమా? కాదా? నన్ను ప్రేమిస్తున్నావా లేదా. లేక నేనే అలా అనుకుంటున్నానా?” అన్నది.

చందు మెల్లగా “నీలిమా, నా చదువు ఇంతటితో ఆగిపోతుంది. ఏ పని అయినా చూసుకుని నాన్నకు సహాయంగా ఉండాలి. నీవు కోరుకున్న జీవితం నేనివ్వక పోవచ్చు. నిన్ను చేసుకోవడానికి మంచి సంబంధాలు వస్తున్నాయి. కనుక మీ అమ్మ, నాన్న మాట విని  ఎవరినైన చేసుకో. నీకు సరైన వాడు దొరికితే చేసుకొని హాయిగా వుండు.” అన్నాడు.

“అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? నీవు వేరే అమ్మాయినెవరినైనా చేసుకుంటావా? అన్నది.

“నాకు జ్ఞానం తెలిసినప్పటి నుండి నీవే నా భార్య అని అనుకుంటున్నాను. నా మనసులో నిన్నెంతో ఆరాధిస్తున్నాను నీకు తెలియదు. నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను. చనిపోతాను అని చెప్పను. ఎందుకంటే కన్న వాళ్ళ బాధ్యత, చెల్లి బాధ్యత ఉంది. వాళ్ళకి కడుపుకోత మిగిల్చి నా దారి నేను చూసుకునేంత మూర్ఖుడిని కాదు. ఎన్ని కష్టాలు పడి నన్ను ఇంతవాడిని చేశారు. వాళ్ళని మధ్యలోనే వదిలిపెట్టి వాళ్ళు జీవితాంతం బాధ పడేలా చేయను. వాళ్ళని దిక్కులేని వాళ్ళని చేసి
వెళ్లేటంత స్వార్థం, అజ్ఞానం ఇంకొకటి లేదు. కానీ నీవు ఎవరిని చేసుకున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. నీవు నన్ను చేసుకోక పోయినా ఎలాగో జీవితమంతా బ్రతికేయ గలను. కాని వేరే అమ్మాయిని మాత్రము చేసుకోను. మనము అనుకున్నవన్ని అనుకున్నట్టు జరుగవు. భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. ఆ నిర్ణయానికి మనము తలవంచాల్సిందే” అన్నాడు.

“ఎందుకు జరగవు మనమిద్దరమూ మనస్ఫూర్తిగా ఆనుకుని ప్రయత్నిస్తే, అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయి. నీవు ఇంటర్తో చదువు ఆపవలసిన పనిలేదు బాగా కష్టపడి ఎంట్రన్స్ వ్రాయి. అదృష్టం బాగుంటే నీవు కోరుకున్నట్టుగా మెడిసిన్లో సీటు వస్తే నేను చదివిస్తాను. ఇప్పుడు నాకు ఉద్యోగం ఉంది కనుక ఆ ధైర్యం ఉంది.  బావ నీ తోడుంటే నేను నీ బాధ్యతలు పాలుపంచుకుంటాను. ఎంత కష్టమైన మన రెండు కుటుంబాలకు ఆసరాగా ఉంటాను.” అన్నది.

“అదెలా సాధ్యం అవుతుంది. మెడిసిన్ అంటే మాటలు కాదు. మంచి ర్యాంకు రావడం అంత తేలిక కాదు. పేమెంట్ సీటు మనము కలలో కూడ తలవలేము. ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నీకు తెలియదు. అందుకే నాపైన, నా తెలివితేటలపైన అంత గుడ్డి నమ్మకం పెట్టుకొని ఏవేవో కలలు కనకు. అట్లని నేను చదువనని కాదు నా శాయశక్తులా కష్టపడతాను.”అన్నాడు.

“నీకెందుకు నీ తెలివి తేటల పైన నాకు పూర్తి నమ్మకముంది. ఒక వేళ మెడిసన్ లో సీటు రాకపోయినా ప్రత్యామ్నాయంగా ఎన్నో కోర్సులు ఉన్నై ఏదో ఒకటి చేయొచ్చు. నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చే పూచి నాది. నేను టైలరింగ్ చేస్తాను. ట్యూషన్సు చెప్తాను. నీవు నాకు తోడుంటే చాలు. నేను ఇవన్నీ ధైర్యంగా చేయాలంటే మనము ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి. అప్పుడే నువ్వు మొహమాట పడకుండా నా సహాయం అంగీకరిస్తావు. నీవు నీ కాళ్ళపైన నిలబడేంత వరకు నేను ఆసరాగా ఉంటాను. నీవేమి ఆలోచించకుండ మనస్సు మొత్తం చదువుపై లగ్నం చేయి చాలు.” అన్నది నీలిమ.

“నీవు ఇంత  ధైర్యంగా చెప్తుంటే, నేనేమీ మాట్లాడను. నీ ఇష్టం వచ్చినట్టే కానీ.” అన్నాడు చందు.

చందు అహోరాత్రులు కష్టపడి చదివి ఎంట్రెన్స్ బాగానే వ్రాశాడు. అందర్నీ ఒప్పించి చందు ఎంట్రెన్స్ అయిపోగానే పెళ్లి చేసుకున్నారు చందు నీలిమా.

అప్పటినుండి నీలిమ ఒక యంత్రంలా పని చేయడం మొదలు పెట్టింది తెల్లవారుజామున 5 గంటల నుండి ట్యూషన్సు మొదలుపెట్టి 8:30 కి వాళ్లని పంపించేసి  స్కూల్కి వెళ్లి పోవడం, స్కూల్ నుండి రాగానే సాయంత్రం లాస్యను, మల్లికను కూర్చోబెట్టుకొని వేరే బ్యాచ్ కి ట్యూషన్ చెప్పేది. కేక్స్  తయారి కోర్స్ అటెండయి కేక్స్ తయారు చేయడం నేర్చుకున్నది. ఆర్డర్ పైన కేక్స్ తయారు చేసి సప్లై చేసేది. పచ్చళ్ళు పోడులు తయారు చేసి దుకాణాలకు సప్లై చేసేది.  చుట్టుపక్కల వాళ్ళ బట్టలు కుట్టేది. శని ఆదివారాల్లో కొంతమందికి యోగ క్లాసెస్ తీసుకునేది.

నీలిమ కష్టం చూస్తుంటే అందరికీ చాలా బాధ అనిపించేది. ఒక యజ్ఞం చేస్తున్నంత నిష్ఠగా కష్టపడ సాగింది. ఇంట్లో పని మాత్రం ఆమెకు అస్సలు చెప్పేవారు కాదు.

ఇలా కొన్ని రోజులు గడవగానే ఎంసెట్ రిజల్ట్ వచ్చింది. చందుకు మంచి ర్యాంకు వచ్చి ఫ్రీ సీట్ వచ్చింది మెడిసిన్లో. అందరూ సంతోషించారు. నీలిమ సంతోషానికి అంతే లేకుండా పోయింది.

నీలిమ క్షణం తీరిక లేకుండా పని చేస్తూనే ఉంది. అలా నాలుగున్నర సంవత్సరాలు గడిచి చందు ఎంబీబీఎస్ డిగ్రీ చేతికి వచ్చింది. చందు హౌసర్జన్ చేసేటప్పుడు స్టైఫండ్ రావడం వల్ల నీలిమకు కొంచెం  ఒత్తిడి తగ్గింది. చందు అలవాటయిన కళ్ల భాషతోనే కృతజ్ఞతలు చెప్పాడు. లాస్య ఐతే వదినని పట్టుకుని “వదిన నీ వల్లనే అన్నయ్య డాక్టర్  అయ్యాడు. లేకపోతే అన్నయ్య కోరిక తీరక పోయేది.”

“పట్టుదల సంకల్పం ఉంటే దేనినైనా సాధించవచ్చు నీకు కూడ డిగ్రీ చేతికొచ్చింది. మీ అన్నయ్యని ఇంకా పై చదువులు చదివిస్తాను. నీకు, మా చెల్లికి ఎంత వరకు చదవాలని ఉంటే అంత వరకు చదివించి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను” అన్నది.

ఈ మాటలన్నీ వింటున్న సరోజమ్మ “చాలా కష్టపడుతూ అందరి కోరికలు తీరుస్తూ ఉన్నావు. మరి నా కోరిక ఎప్పుడు తీరుస్తావు తల్లి” అన్నది.

నీలిమ తల్లిదండ్రులు కూడ నీలిమ జవాబు కొరకు చూస్తున్నారు.

“అత్తయ్య మొదట మీ అబ్బాయి పి.జీ అయిపోవాలి. తర్వాత మీ కోరిక తప్పక తీరుస్తాను” అన్నది. మెడిసిన్ కంప్లీట్ అయిన సందర్భంగా సత్యనారాయణ వ్రతం చేసుకుని అందరికీ పార్టీ ఇచ్చారు.

“నీలిమ నీ పట్టుదల ప్రేమ వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. నీ రుణం ఎలా తీర్చుకోవాలి.” అన్నాడు.

“ఇలా” అంటూ తన రెండు చేతులను అతని మెడలో పూల మాలలా వేసి దగ్గరకు జరిగింది నీలిమ.
అలా జరిగిన నీలిమను ఇంకా దగ్గరకు తీసుకోబోయిన చంద్రంని  “ఆగండి, ఆగండి ఇంకా నా బాధ్యతలు అయిపోలేదు. మీ చెల్లెలి, మా చెల్లెలి   చదువులు కూడ అయిపోయినాయి. కనుక వాళ్ల పెళ్లిళ్ల కొరకు వేసిన చిట్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఈలోపల మీరు పి.జి కి ప్రిపేర్ కండి. అప్పుడు మన గురించి, మన పిల్లల గురించి ఆలోచిద్దాం” అన్నది నీలిమ.

చందు పిజి ఎన్ట్రెన్స్ వ్రాసి తనకు ఇష్టమైన ‘జనరల్ ఫిజీషియన్’ కోర్స్ లో సీట్ సంపాదించాడు. ఇప్పుడు స్టైఫండ్ బాగానే వస్తుంది. కనుక నీలిమా కష్టాలు గట్టెక్కినవి. నీలిమా చందుల వైవాహిక జీవితం ఏ ఒడిదుడుకులు లేకుండ హాయిగా సాగిపోతుంది.

నీలిమా చిట్స్ ఎత్తి మంచి సంబంధాలు చూసి చెల్లెలుకి, ఆడపడుచుకి పెళ్ళిళ్ళు చేయించింది. అలా మూడు సంవత్సరాలు గడిచి చందు పీ.జి కోర్సు కూడ అయిపోయి, గాంధీ హస్పిటల్ లో జాబ్ దొరికింది. ఇక నీలిమా తల్లిదండ్రులు, చందు తల్లిదండ్రులు కూడ నీలిమను అనుకున్నది సాధించిందని ఎంతో మెచ్చుకున్నారు. చందు కూడ భార్యకు ఎన్నోవిధాల మెచ్చుకున్నాడు.

ఆ విధంగా టీచర్ నీలిమా సంకల్ప బలంతో డాక్టర్ గారి సతీమణిగా కూడ మారింది. ” నీవు ఇన్ని రోజులు కష్టపడ్డది చాలు. ఇక నీవు నీ బాధ్యతలన్నీ నాపై పెట్టి నీవు హాయిగా నిదురపో” అన్నాడు ప్రేమగా. ఎన్నోరోజుల తర్వాత నీలిమ భర్త సన్నిధిలో  నిశ్చింతగా సేద తీరింది.

***

You May Also Like

One thought on “సంకల్పం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!