సప్త వర్ణాలు (కవితా సమీక్ష)

సప్త వర్ణాలు (కవితా సమీక్ష)

సమీక్ష: వడలి లక్ష్మీనాథ్ (సుబ్బలక్ష్మి రాచకొండ) 

కవితా శీర్షిక: సప్త వర్ణాలు
రచన: శ్రీమతి రాధ ఓడూరి

శ్రీమతి రాధ ఓడూరి గారు రాసిన కవిత “తెలుగు సాహితీ వనం”లో ప్రచురితమైన “సప్తవర్ణాలు” ప్రకృతి యొక్క అందాన్ని కళ్ళముందు చిత్రీకరించారు.

కవయిత్రి శీతాకాలపు ఉదయపు మంచుని ముత్యాలుగా అభివర్ణించి ఆ ముత్యాల పూదోట పలకరిస్తున్నాయి అని మొదలు పెట్టిన వర్ణన చాలా బాగుంది.
మందారం మకరందం చూపిస్తూ ఉంటే, దేవకాంచనలు మంచు కలయికతో కాంతి రేఖలా మారగా, ఎర్ర గులాబీలు నవ్వితే అన్నారు. అంటే ప్రకృతికి గులాబీ రేకలు పెదాలను పోలి ఉన్నాయి అన్న ఆలోచన గొప్పది. నందివర్ధనాలు హంస తూలికా పాన్పు అయ్యాయి సాధారణంగా నందివర్ధనం పువ్వు చాలా మృదువుగా ఉంటుంది. అది హంసతూలికా తల్పం అయితే దాని మీద నిద్రించడం అనేది చాలా మధురంగా ఉంటుంది.
బంతి చామంతి రకరకాల రంగులు కలిగి రాణివాసం చేస్తున్నాయన్నారు. శీతాకాలంలో అసలైన అందం డిసెంబర్ నెల. ఆ నెలలోనే విరుస్తాయి డిసెంబర్ పూలు అనేక రంగులు అని వర్ణించడం కవితకి మరింత అందాన్ని తెచ్చింది.

పూలలో కల్లా సంపంగి సువాసన చాలా మత్తు కలిగిస్తుంది. అది సన్నాయి నాదంలా ఉంది అన్నారు. అలాగే విరజాజి పూల వాసన మనసుని తాకి ముక్కుపుటాలు లో చేరి ఊసులాడుతున్నాయి .
అంటే ఆ సువాసన ముక్కు ముక్కుపుటాల నుండి వేరు పడలేదన్న మాట. రాధా రమణ మనోహరాలు రసరమ్యమైన ఉన్నాయి. పున్నాగ పూలు శీతాకాలంలోనే విరుస్తాయి. అవి తెల్లవారేసరికి చుట్టూ కింద పడి ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, అంటే పట్టు పరుపు పరిచినట్టుగా ఉన్నాయి. ఆ పక్కనే ఉన్న మల్లెలు వనదేవత చిరునవ్వులుగా ఉండగా రంగులు పూసుకున్న ప్రకృతి హేమంతునితో కలిసి మమేకమై, సప్త వర్ణాలు కలిగిన ఆకులూ తుషారు గీతమైంది.

ప్రకృతి అందాలలో ఉన్న రంగులను వర్ణించడం, అది కూడా శీతాకాలపు మంచుతో ఉన్న అందాన్ని వర్ణించడంలో కవయిత్రి దృష్టి అభినందనీయం. శీర్షిక పేరు “సప్తవర్ణాలు” కవిత వర్ణనకు అతికినట్టుగా ఉంది.

***********************

సప్త వర్ణాలు
రచన: వడలి లక్ష్మీనాథ్

ఉదయకాలాన మంచు ముత్యాల వానలో
విరిసి విరియని పూదోట పలకరిస్తోంది
మందారాలు మకరందాన్ని చిమ్ముతున్నాయి
దేవకాంచనాలు మంచులో కాంతిరేఖలా మారాయి
ఎర్ర గులాబీలు గుంభనంగా నవ్వాయి
నందివర్ధనాలు హంసతులీకా పాన్పులైనాయి
బంతిపూలు చేమంతులు రాణి వాసము నేలుతున్నాయి
డిసెంబరాలు తమ రంగులతో కనువిందు చేస్తున్నాయి
సంపెంగలు కురిపించెను సన్నాయి గుభాళింపులు
విరిసిన జాజిపూలు ఊసులాడుతున్నాయి
రాధామనోహరాలు రసరమ్యమై
పున్నాగపూలు పట్టుపరుపులై
విరిసిన మల్లెల చిరునవ్వులు వనదేవతకి అలంకారమై
ప్రకృతిలోని ప్రతీ పూవు హేమంతునితో మమేకమై
సప్త వర్ణాలమయమై ఆకులతో తుషార గీతమైనది

***********************

You May Also Like

3 thoughts on “సప్త వర్ణాలు (కవితా సమీక్ష)

  1. కవిత వర్ణాలు అద్భుతం. మీ సమీక్ష సొగసులతో మరింత ప్రకాశం. కవిత సమీక్ష రెండూ పోటీ పడ్డాయి.

  2. నేను రాసిన కవిత ను చాలా బాగా విశ్లేషించి రాశారు. ధన్యవాదాలండీ🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!