స్టేషన్ బ్రిడ్జి

(అంశం : మనసులు దాటని ప్రేమ)

స్టేషన్ బ్రిడ్జి

రచయిత : పాండు రంగా చారి వడ్ల

మా ఊరికి బస్సు సదుపాయం లేక, రెండు కిలోమీటర్లు నడిచి రాయుడు పాలెం రైల్వే స్టేషన్ కి వచ్చి, అక్కడ నుండి రోజూ కాలేజీకని పట్నానికి ఇదే రైలులో వెళ్లివస్తుంటాను. తరువాత వచ్చేది రాయుడు పాలెమే అనడానికి గుర్తు ఈ స్టేషను బ్రిడ్జి. ఇది కట్టి ఒక వందేళ్లు అయి ఉంటుంది, చాలా పాతది అవడం మూలానో లేక స్టేషన్ దగ్గర్లోనే ఉండడం మూలానో, బ్రిడ్జి రాగానే రైలు వేగం తగ్గేది.  బ్రిడ్జి పక్కగా పచ్చని పంట చేలు, బ్రిడ్జి కింద నుండి పారుతున్న వాగు,ఈ వాగే మా ఊరు మీదుగా పారుతూ మా ఊరిని పట్నానికి వెళ్ళే వైపు రోడ్డును కలవకుండా అడ్డం పడి  బస్సు రాకుండా చేస్తుంది. ఎంత మంచి వాగో కదా! అలా జరగకపోయి ఉంటే, ఆమె నాకు కనిపించేదే కాదు. ఈ  బ్రిడ్జి ఎప్పుడు వచ్చినా నా గుండెల్లో ఏదో అలజడి, నేను దిగవలసిన స్టేషను వచ్చిందని కాదు, ఆ పాత బ్రిడ్జి కూలుతుందనీ కాదు.
బ్రిడ్జి పక్కన చేలో కలుపు తీస్తూనో, కాయగూరలు తెంపుతూనో, నీరు పెడుతూనో, ఆ వేప చెట్టు కింద గడ్డిలో వయ్యారంగా పడుకునో, వాగులో దిగి తన ఒంటి మీద ఓణీని రెండు చేతుల్లో వలలా పట్టుకుని  చేపలు పడుతూనో.. ఇలా ఎక్కడో ఓ చోట ప్రతీసారీ కనిపిస్తున్న ఆమే కారణం. ఆమెతో పాటూ ఉన్న వేరెవరూ నా కళ్ళకి ఆనరు. ఆమెని చూస్తుంటే దడదడమనే రైలు శబ్దం నా గుండెల్లో వినిపించేది, ఆ వయ్యారి పైరుని తాకిన చల్లగాలి నన్ను తగలగానే నా ఊపిరి ఆగేది,  ఆమె ఎటు తిరిగి ఉన్నా, నా వైపే చూస్తున్నట్లు అనిపించేది. నా చూపులు ఎప్పుడూ ఆ చేల వైపే ఉండేది.
రోజూ చివరి క్లాసు అవకముందే క్లాసులో నుండి బయటపడేవాడిని, స్నేహితులందరూ అయిదు గంటల రైలుకు వెళదాం అని ఎంత బలవంతం చేసినా, ఆగకుండా మూడు గంటలకి ఈ రైలుకే వచ్చేవాడిని. ఎందుకంటే ఆ రైలుకు వస్తేనే నాకు ఆమె కనిపించేది. కాలేజీకి సెలవులు వచ్చాయంటే, నా ప్రాణం పోయినట్లు అనిపించేది. తట్టుకోలేక ఒకసారి నడుచుకుంటూ వెళ్ళిపోయాను బ్రిడ్జి దగ్గరకు, ఆ పచ్చటి చేలల్లో వెతికాను, ఆమె పలకరించిన ప్రతీ మొక్కనూ అడిగాను “ఆమె ఎక్కడ అని?”. నా ప్రేయసి తాకిన మొక్కలు కదా! వాటికామాత్రం పొగరు ఉంటుంది, ఆమె గురించిన సమాచారం ఏదీ ఇవ్వలేదు. పోతే పోనిమ్మని వదలలేను కదా, ఈ సారి ఆమె మేని స్పర్శతో పులకించిన ఈ వాగును అడిగా, కాసిన్ని కబుర్లు నా చెలి గురించి చెప్పమని, ‘నేను చెప్పనుపో’ అని పారిపోయాయి.
ఆమెతో ఊసులు పంచుకున్న ఈ పిల్లగాలిని అడిగా, అది కూడా సమాధానం చెప్పకుండా చల్లగా జారుకుంది. ఎంత వెతికినా నాకు ఆమె కనపడలేదు.
తరువాత రోజు కాలేజికి రైలులో వెళ్ళేటపుడు మళ్లీ అదే చేలో కనిపించింది. నా ఆశలకు ప్రాణం పోసింది.
సంవత్సరం గడిచింది ఈ మూగ ప్రేమలో పడి అని కాలేజీకి వేసవి సెలవులు ఇచ్చాక గానీ నాకు తెలియలేదు. చూస్తూ అలా ఉండిపోవాలనిపించే ఆమెని, మళ్లీ కాలేజీ మొదలయ్యే వరకు నేను చూడలేనా అనే భావన నన్ను ఊరికే ఉండనీయలేదు.
ఆ బాధలో నుండే ఒక ఉపాయం తట్టింది “కాలేజీ లేకపోయినా రైలు రావడం అయితే ఆగదు కదా, అందుకని రోజూ లాగే రైలులో పట్నం వెళ్లి వస్తూ ఆమెని చూడవచ్చు” అని.
వెంటనే ప్రాణం లేచొచ్చింది.
వెళ్ళాను, వచ్చాను. ఆమె కనిపించలేదు.
తరువాత రోజు..
ఆ తరువాత రోజు..
ఆ తరువాత రోజు..
అలా రెండు నెలలు గడిచాయి. కాలేజీలు తిరిగి తెరిచారు. నేనూ ఎప్పటిలానే వెళ్లి వస్తూనే ఉన్నాను.ప్రతీసారి ఆమె జ్ఞాపకాలు మాత్రమే నాకు కనిపిస్తున్నాయి రైలు ఆ స్టేషన్ బ్రిడ్జి సమీపించినప్పుడల్లా.

***

You May Also Like

One thought on “స్టేషన్ బ్రిడ్జి

  1. బాగుంది sir పచ్చని పల్లెటూరి జ్ఞాపకాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!