స్థితప్రజ్ఞత

స్థితప్రజ్ఞత

రచయిత :: పరిమళ కళ్యాణ్


” కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణీ”

అంటే దాని అర్ధం “ఏ మనిషి అయినా పని చేయటం వరకూ మాత్రమే, కానీ దాని ప్రతిఫలాన్ని ఆశించే అధికారం లేదు. కర్మ ఫలానికి నువ్వు కారణం కాదు, అలాగని కర్మ అంటే పని చేయటం మానకు!”

అంటే నీకు పని చెయ్యడం మీదే అధికారం ఉంది. దాని ఫలితం మీద మాత్రం లేదు. ఫలితానికి నువ్వు కారణం కాకూడదు. అలాగే పని చెయ్యడం మానకూడదు. ప్రతిఫలం ఆశించకుండా పనులు చెయ్యి. ఇదే శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలో అర్జునుడికి బోధించిన నీతి.”

అలా పిల్లలకు అర్ధమయ్యేలా వివరిస్తూ చెప్పుకుంటూ పోతున్నారు శంకరశాస్త్రిగారు. పిల్లలు కూడా అర్ధం అయినట్టు తల పంకిస్తున్నారు. వారిలో ఒక విద్యార్థి లేచి,

“అయితే గురువు గారూ, మనం ఏ పని చేసినా దాని ఫలితం గురించీ ఆశించకూడదు అని కృష్ణ భగవానుడు చెప్పాడు కదా! కానీ మనం ప్రతి పనీ చేసేముందు ఆ తర్వాత ఏమవుతుంది? అప్పుడు ఏం చెయ్యాలి అని ఎన్నో ఆలోచిస్తాం కదా? మరెలా అది సాధ్యం గురువు గారు?” అని తన మనసులో కలిగిన సందేహాన్ని గురువు గారి ముందు అడిగాడు.

“అవును నాయనా! సరిగ్గా అడిగావు. మనం మానవ మాత్రులం, నిమిత్తమాత్రులం కూడా. అలా సాధ్యాసాధ్యాలను, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయలేము. అలా చెయ్యగలిగే వారిని కర్మయోగి, నిష్కామ యోగి అని అంటారు. అలా ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండటాన్ని స్థితప్రజ్ఞత అని కూడా అంటారు.

ఉదాహరణకి శ్రీరాముడు స్థితప్రజ్ఞుడు. ఎందుకంటే ఆయన తండ్రి దశరథ మహారాజు ఒకరోజు వచ్చి, మరునాడు నీకు పట్టాభిషేకం అన్నాడు. సరే అని ఒప్పుకున్నాడు. అలాగే మరల పినతల్లి కైక వచ్చి, నీకు పట్టాభిషేకం లేదు, నువ్వు అడవులకు వెళ్ళటం మీ తండ్రి గారి ఆజ్ఞ అంది.

దానికి కూడా ప్రశ్నించకుండా ‘సరే’ అన్నాడు. తాను ఒక్కడు అడవులకు వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. సీతమ్మ భర్త ఉన్న చోటనే భార్య ఉండాలి అంటూ రామయ్య తో పాటు అడవులకు వెళ్ళింది. పట్టువస్త్రాలు, ఆభరణాలు విడిచి, వనవాసంలో నార చీరలు కట్టింది. కష్టాలకు కృంగి పోలేదు, సంతోషాలకు పొంగిపోలేదు. భర్త అడుగు జాడల్లోనే నడిచింది. తను కూడా స్థితప్రజ్ఞురాలే. అంతేకాదు లక్ష్మణుడు కూడా రాజభోగాలు వదిలి అన్నగారి కోసం అడవి బాట పట్టాడు. ఆయన కూడా స్థితప్రజ్ఞుడే.

కానీ మనం అలా ఉండలేం. దానికోసం ఎంతో సాధన చెయ్యాలి.” అంటూ వివరించారు గురువు గారు.

“ఓహో, అయితే గురువు గారు మీరు కూడా స్థితప్రజ్ఞులే కదా!” అన్నాడు ఒక విద్యార్థి.

గురువు గారు చిన్నగా నవ్వి, “నేనా?” అన్నారు.

“అవును గురువు గారూ, మీరు ఎన్నో వేదాలను అభ్యసించారు. మీ విద్యకు తగిన ఫలంగా ఒక పెద్ద పేరు మోసిన దేవాలయంలో అర్చక స్థానం సంపాదించారు. భగవంతుని సమీప్యంలో కాలం గడిపే అవకాశం దొరికింది. కానీ అక్కడ కూడా ఏవో కొన్ని రాజకీయాలు ఉన్నాయని, భగవంతుని సన్నిధానంలో ఉన్నా, అటువంటి రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నారు. అందుకే అంతటి విలువైన అవకాశాన్ని వదులుకొని వచ్చారు. ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా మాకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు. మాతో వేద పారాయణం చేయిస్తున్నారు. స్థితప్రజ్ఞతకు ఇంతకంటే మంచి ఉదాహరణ ఎవరు ఉంటారు గురువు గారు?” అని అతని సమాధానాన్ని చెప్పాడు.

“మీకు ఇవన్నీ ఎలా తెలుసు?” అని అనుమానంగా అడిగారు గురువుగారు.

“మాకే కాదు గురువుగారు, మీ గురించీ అందరికీ తెలుసు” అన్నారు విద్యార్థులు అందరూ…

“చిన్నవాళ్ళు అయినా ఎంత చక్కగా చెప్పారో చూశారా. అతను చెప్పింది నిజమే అండి, మీరు స్ధితప్రజ్ఞులే!” అంది శాస్త్రిగారి భార్య సీతాలక్ష్మి గారు.

పడక్కుర్చీలో నడుం వాల్చి, ఆలోచనలో మునిగిపోయారు శాస్త్రిగారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!