తీయని తలపులు

తీయని తలపులు

రచన: సావిత్రి కోవూరు

జల జల పారే జలపాతంలో జలకాలాడేయాలని, జగమునే మరవాలని

పచ్చపచ్చని పచ్చిక పైన పవ్వళించాలని, పరవశించి పోవాలని

రెక్కలు విప్పి పక్షుల్లాగా పైపైకి ఎగరాలని, జగములన్నీ చూడాలని

పలుకులు పలికే పచ్చని చిలకలా ముద్దు ముద్దుగా పలకాలని, పదములెన్నో చెప్పాలని

మబ్బును చూసి మయూరములా పింఛము విప్పి నర్తించాలని, నాట్యము లెన్నో చేయాలని

చల్లచల్లని పిల్లగాలిలా ప్రపంచమే చుట్టేయాలని, వింతలన్నీ చూడాలని

కొమ్మ మీది కోకిలమ్మలా కొత్త రాగాలు పాడాలని, అందరినీ మెప్పించాలని

ప్రభాత కాంతుల సూర్యోదయమును  పరికించాలని, పసిడి కిరణాల తడవాలని

సాయం సంధ్య శశికిరణాలు కన్నులార చూడాలని, తనివి తీర ఆడాలని

తళతళలాడే తారలు గుచ్చి తలలో తురుముకోవాలని, తన్మయం పొందాలని

మిలమిల మెరిసే చందురునితో ముచ్చట్లాడాలని, మైమరచి పోవాలని

చిరు చిరు నవ్వుల చిట్టి పాపల మనసారా నవ్వాలని, చింతలన్ని మరవాలని

మదిలో మెదిలే నా కోరికలు తీరునో లేదో ఎరుగను కాని, మదిలో తలచి మురిసెదను.

***

*

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!