వీరవనిత

వీరవనిత

– సుశీల రమేష్

కమల కి చిన్ననాటి నుండి సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనే బలమైన కోరిక. తన మాట తీరు నడిచే నడక చూసే చూపు వేటాడడానికి సిద్ధపడిన ఆడపులిని తలపించేది
చదువుకునే రోజుల్లో.

నేను భారతీయ వనితను వెన్ను చూపడం, వెనక్కి తగ్గడం నా భారత మాత నాకు నేర్పలేదు అనేది కమల నాతో.

నేను భరతమాత ముద్దుబిడ్డ ను‌, నా తల్లి వైపు నా సోదర సోదరీమణులు వైపు కన్నెత్తి చూసిన వారి గుండెను నా చేత్తో పెరికివేస్తాననేది కమల, అప్పుడు తన మొహం చూడాలంటే భయం వేసేది.

అసలు భారతీయులుగా పుట్టి ఇక్కడ స్కాలర్షిప్లతో చదువుకొని విదేశాలకు వెళ్లి వాళ్ల కింద పని చేస్తూ మా దేశం మాకు ఏమి ఇచ్చింది అంటారు, భారతీయుడుగా పుట్టినందుకు నీవు నీ దేశానికి ఏమి ఇచ్చావు.
ఇదా నువ్వు నీ దేశానికి ఇచ్చే మర్యాద అనేది కమల. తను ప్రశ్నించే తత్వం అంటే నాకెంతో ఇష్టం.

నా పేరు సుస్మిత నేను కమల క్లాస్మేట్సే కాకుండా సైన్యంలో ఒకేసారి సైన్యంలో చేరాము. ట్రైనింగ్ కూడా కలిసే చేసాము. మేమంతా ట్రైనింగ్ చేసేటప్పుడు అలిసిపోతే అలసటను దూరం చేస్తూ ఎంతో మంది వీరాధివీరుల కథలను మాకు వినిపించి మాలో స్ఫూర్తి నింపే ది కమల.

మగవారు కూడా ఆమెతో పోటీకి ఎదుట నిలువలేక పోయేవారు. ట్రైనింగ్ సెంటర్లో కమలను మాపై
ఆఫీసర్లు అంతా ఆడపులిగా సంబోధించేవారు. అంతటి ధీశాలి కమల.

ట్రైనింగ్ పూర్తి అయ్యాక మా ఇద్దరికీ వేర్వేరు ప్రాంతాల్లో కి బదిలీ చేశారు. కానీ మేము రోజు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. కమల తల్లి మీరాబాయి నాతో బేటీ నువ్వన్నా చెప్పమ్మా కమల తో, ఈ లోకంలో నా కంటూ ఎవరు లేరు ఒక్కగానొక్క ఆడపిల్ల అని , తన సైన్యంలో చేరుతానంటే కాదనలేదు. మరి నా కోరిక కూడా తీర్చాలి కదా నువ్వు ఎలాగైనా కమలను పెళ్లికి ఒప్పించు అని అంటుండేవారు ఆంటీ.

నేను ఎన్నో సార్లు కమలతో చెప్పి చూసినా లాభం లేకపోయింది.

నేను పెళ్లి చేసుకుంటే మరో కుటుంబం బాధ్యతను సక్రమంగా నిర్వర్తించ కలగాలి ఆ ఇంటి కోడలిగా…. నా లక్ష్యం దేశ సేవ చేయడం, మరో కుటుంబానికి కోడలిగా వెళ్లి అక్కడ నేను వారి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోవచ్చు, నా లక్ష్యం కారణంగా, నేను వారికి ఎలాంటి సేవలు చేయడం కుదరక పోవచ్చు అప్పుడు మనస్పర్థలు వస్తాయి ఇది సహజం….

అటు నా లక్ష్యానికి, ఇటు అత్తింటి వారికి న్యాయం చేయలేక సతమతమవడం నాకు ఇష్టం లేదు.
అలాగని సైన్యంలో ఉన్న మహిళలు పెళ్లి చేసుకోవడం లేదా అని నువ్వు నన్ను అడగొచ్చు, చేసుకుంటున్నారు కాదనను కానీ అందరికీ కోడల్ని అర్థం చేసుకునే అత్తింటివారు దొరకరు కదా. నిజమా కాదా అని నన్ను ప్రశ్నించేది కమల. తను చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉందనిపించింది నాకు.

ఢిల్లీలో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ వారు అప్రమత్తం చేయడంతో భద్రతను పెంచారు. లోటస్ టెంపుల్, పార్లమెంట్ దగ్గర.

నా దురదృష్టమో అద్రృష్టమో నాకు తెలియదు కానీ ట్రైనింగ్ పూర్తయిన మూడేళ్ల తర్వాత నాకు కమలకు పార్లమెంట్ భవనంలో విధులు నిర్వహించే బాధ్యతను అప్పగించారు.

*ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది . అలాంటి ఒక రోజు నా జీవితంలో ఉంటుందని నేను ఏనాడూ ఊహించలేదు. ఇద్దరం కలుసుకుని
ఆనంద భాష్పాలు రాల్చిన క్షణాలే ఆఖరి క్షణాలని నేను ఊహించలేదు నా జీవితంలో చీకటి రోజు* ఆ రోజు ఏం జరిగిందంటే,

లష్కరే తోయిబా, జైషే ఎ మహమ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు చేతులు కలిపి పార్లమెంట్పై దాడికి ప్రయత్నించారు.

ఆరోజు అప్పటికే లోక్ సభ రాజ్యసభ వాయిదా పడి 40 నిమిషాలు అయింది.

గృహ మంత్రిత్వ శాఖ పార్లమెంటు గుర్తులు కలిగిన స్టిక్కర్ లతో భద్రతా వలయాన్ని వంచించారు ఉగ్రవాదులు.

ఉగ్రవాదులు కారుతో ఉపరాష్ట్రపతి కారుని ఢీ కొట్టి కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులను మొదటగా చూసిన కమల మమ్మల్నందర్నీ అప్రమత్తం చేయడానికి కేకలు వేస్తూ పార్లమెంట్ భవనంలోని వారు ఈ కాల్పులు చప్పుడు విని బయటకు రాకుండా భవనం యొక్క ప్రధాన ద్వారం మూయడానికి చిరుతలా
మెరుపువేగంతో అటువైపు పరిగెత్తింది.కమల.

మేమంతా అప్రమత్తమై ఎదురుకాల్పులు జరుపుతుండగా ఒక ఉగ్రవాది మాత్రం కమలను వెనుక నుండీ ఏకే 47 తో షూట్ చేయడం మొదలుపెట్టాడు. అయినా కమల పరిగెత్తడం ఆపకుండా వెళ్లి పార్లమెంటు ప్రధాన ద్వారం మూసివేసింది. కమలను షూట్ చేసిన ఉగ్రవాదిని నేను గురిపెట్టి షూట్ చేశాను. అప్పటికే కమల వళ్ళంతా రక్తసిక్తమైంది.

ఉగ్రవాదుల దగ్గర ఏకే 47 గన్నులు, గ్రైనేడ్ లు, లాంచర్లు చాలా ఉన్నాయి.

అంతటి భీకర పోరులో తన ఒళ్ళంతా రక్తసిక్తమైన కమల కూడా కాల్పులు జరుపుతుంది. బాంబులను తనకు చుట్టుకొని పార్లమెంటు భవనం లోకి చొరబడడానికి ఒక ఉగ్రవాది ప్రయత్నించగా, అక్కడే ఉన్న కమల సివంగిలా ఉగ్రవాదిని
ఒక్క ఉదుటున ఎత్తి అవతలకి విసిరేసి ఉగ్రవాది చుట్టుకున్న బాంబులకు తన దగ్గర ఉన్న గన్ తో షూట్ చేసి కమల కుప్పకూలిపోయింది. ఆ సన్నివేశాన్ని చూస్తున్న నేను ఎదురు కాల్పులు జరపడం వల్ల వెళ్లలేకపోయాను అనే బాధ అంతే.

మరుక్షణంలో ఉగ్రవాది చుట్టుకున్న బాంబులు పేలి తునాతునకలు అయిపోయాడు. కమల ఉగ్రవాదిని అడ్డుకోకపోయి ఉంటే అతను లోపలికి ప్రవేశించి ఎంతటి బీభత్సం సృష్టించే వాడో తలచుకుంటేనే ఒళ్ళు గగుర్పాటు కు గురవుతుంది.

లోపల పార్లమెంట్ భవనంలో వంద మందికిపైగా సీనియర్ నాయకులు అధికారులు ఉన్నారు ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండేవారు కాదేమో కమల ఉగ్రవాదిని అడ్డుకోకపోతే.

అంతటి భీతావహ వాతావరణంలో మేమంతా మా ఆత్మవిశ్వాసం పట్టు సడలకుండా కలసికట్టుగా ఎదురు కాల్పులు జరపడం వలన అధిక ప్రాణనష్టం నివారించగలిగాము.

ఆరోజు జరిగిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాదులు ఐదుగురు చనిపోయారు. మా సిబ్బందితో పాటు పార్లమెంటు భవనం తోటమాలి, తో సహా తొమ్మిది మంది అమరులయ్యారు.

ఈ దాడికి కీలకపాత్ర పోషించిన
ఉగ్రవాది కి ఉరిశిక్ష విధించారు.

కమల బాడీతో నేను కూడా ఆమె ఇంటికి వెళ్ళాను. అక్కడి పరిస్థితిని చూసిన నాకు ఆశ్చర్యం వేసింది. కారణం కమల తల్లి మీరాబాయి ఏడవడం లేదు సరికదా నేను ఉద్వేగానికి లోనై ఏడుస్తుంటే చూడు బేటి ఈనాడు నా కమల భారత మాత ఒడిలో సేద తీరుతుంది. దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. తన ప్రాణం సైతం లెక్క చేయకుండా తన దేశ భక్తిని చాటుకుంది కమల. అలాంటి ఆడపులి నా కూతురు అని చెప్పుకోవడానికి నేను ఈరోజు ఎంతో గర్వపడుతున్నాను. నా కమల త్యాగం ఊరికే పోదు. మరికొంతమంది వెన్ను చూపని వీరాధివీరులు పుడుతూనే ఉంటారు భారత మాత సేవ కోసం అని ఆ తల్లి నోటనుండి సింహ గర్జన లా మాటలు మాట్లాడుతుంటే నా కన్నీటిని తుడిచి కొని, ఆంటీ కాళ్లకు నమస్కరించాను మనస్ఫూర్తిగా.

“ఎందుకంటే తల్లికి తగ్గ తనయ అనాలో, తనయ కు తగ్గ తల్లి అనాలో నాకు అర్థం కాలేదు”

ఎందుకంటే ఇద్దరికీ దేశభక్తి సమపాళ్లలో ఉందనే విషయం నేను గమనించాను.

కమల తనను షూట్ చేస్తారని తెలిసిన ప్రాణాలు పోతాయని తెలిసినా, పార్లమెంటు లోపలినుండి ఎవరు బయటకు రాకుండా తన ప్రాణాలకు తెగించి భవనం ప్రధాన ద్వారం మూసివేసింది. అందుకుగాను కమలకు భారత ప్రభుత్వం అశోక చక్రను ప్రకటించి తన తల్లికి అందజేశారు.

* ఎందరో వీరాధివీరులు ఉన్న నా భారతదేశం మహోన్నతమైన దేశం*
తమ దేశ భక్తిని చాటుతూ నిరంతరం దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికులకు నా వందనం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

జైహింద్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!