ఆశా కిరణం

ఆశా కిరణం

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

యామిని ఫైళ్ళన్నీ పోగేసుకొని కుస్తీలు పడుతూ ఉండడం చూసిన అసిస్టెంట్ మేనేజర్ రవి ఏంటి మేనేజర్ గారు ఏదో టెన్షన్ గా ఉన్నారు అన్నాడు.రవి మాటలు యామిని చెవిన పడలేదు తన పనిలో నిమగ్నమై ఉంది.రవి కాసేపు ఉండి పక్కన ఎవరొచ్చారో కూడా పట్టించుకోవట్లేదంటే ఏదో పెద్ద సమస్యే వచ్చినట్లుందనుకొని తన సీటు దగ్గరికెళ్ళి పి.ఎ ఆశ ని పిలిచి మేడమ్ టెన్షన్ గా ఉన్నారు వెళ్ళి చూడు అనడంతో ఆశ యామిని దగ్గరికెళ్ళి మేడమ్ ఏంటి వెతుకుతున్నారు అని అడిగింది.లాస్ట్ టైం మనం వేసిన టెండర్ అగ్రిమెంట్ కోసం.ఇప్పుడది అవసరమైంది.నాకు చెప్తే నేనూ వెతుకుతాను కదా మేడమ్ అంటూ ఆశ కూడా ఫైళ్ళన్నీ వెతకడం ప్రారంభించింది.ఆశ ఎంతసేపయినా రాకపోయే సరికి రవి పక్కన ఉన్న మరో అసిస్టెంట్ మేనేజర్ కిరణ్ ని పిలిచి లోపల ఏం జరుగుతుందో అసలు ప్రాబ్లమ్ ఏంటో కనుక్కొని రమ్మని పంపాడు.కిరణ్ రవి ఆర్డర్ కి తల ఊపి యామిని దగ్గరికొచ్చి చూస్తే రూమంతా ఫైల్స్ తో నిండిపోయి ఉంది “మేడమ్.!ఏంటి ప్రాబ్లమ్ “అన్నాడు.యామిని కోపంగా టెండర్ అగ్రిమెంట్ కోసం వెతుకులాట అంది.అక్కడ అయ్యగారు దిగులు పడిపోతూ ఉన్నారు ,ఇక్కడ అమ్మగారికేమైందోనని అనడంతో అవునా ఆయన్నే వచ్చి వెతకమను తెలుస్తుందయితే అంది యామిని.కిరణ్ నేరుగా రవికి విషయం చెప్పడంతో రవి వెంటనే వచ్చి “యామినీ..!నీకెన్నిసార్లు చెప్పాలి.ఏదైనా అవసరమైతే చెప్పమని.ఆ అగ్రిమెంట్ నా డస్క్ లోనే ఉంది.ఇదిగో అంటూ చేతిలో పెట్టాడు.యామిని కోపంగా “నువ్వు నాతో మాట్లాడకు..కావాలనే అగ్రిమెంట్ దాచేసి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా నటించకు అంటూ నోటికొచ్చినట్లు తిట్టేసింది.కోపంతో రగిలిపోయిన రవి తన సీటు దగ్గరికెళ్ళి పెన్ స్టాండ్ ను విసిరి గోడకి కొట్టాడు.ఆశ “ఏంటి మేడమ్..మీరు ..!ఎంత ఆఫీసయితే మాత్రం కట్టుకున్న మొగున్ని మా ముందు అలా తిడితే ఫీలవుతారుకదా “అంటూ హితవు పలకడంతో యామిని “ఆశా..!అసలింట్లో ఏం జరిగిందో నీకు తెలుసా?మధ్యలో ఎందుకు ఆయన్ని వెనకేసుకొస్తారు” అంటూ ఆశకి చీవాట్లు పెట్టింది.కిరణ్ అదేంటి మేడమ్ అలా అంటారు ఆయనైనా మీరైనా ఒకటే కదా.సార్ తన ఆస్తి మొత్తం మీ పేరు మీద మార్చేటప్పటికి చులకనయినట్టున్నారు కానీ ఆయన ఇప్పుడయినా సంపాదించుకోగల శక్తి యుక్తులున్నాయి.మీకు ఆస్తి ,చదువు తప్ప ఏం లేవని గుర్తు పెట్టుకోండి అంటూ వెళ్ళిపోయాడు.యామిని కోపంతో ఆయనతరపున వకాల్తా పుచ్చుకొన్న వకీలు ఈయన.మా సమస్యలు మావి అంటూ నోట్లో గొనిగింది.కిరణ్,రవి దగ్గర గత పదేళ్ళుగా పని చేస్తున్నాడు.యామిని ,ఆశ లు ఈ మధ్య జాయినయిన కొత్త వాళ్ళు.రవి దురదృష్టమో లేక యామిని అదృష్టమో తెలియదు కాని యామిని నచ్చడంతో జాయినయిన సంవత్సరానికి పెళ్ళి చేసుకొన్నాడు.యామిని వాళ్ళ నాన్న ఆస్తి నా కూతురి పేరు మీద రాస్తేనే పెళ్ళికి ఒప్పుకుంటానని షరతు పెట్టడంతో రవి మనసారా ప్రేమించిన యామినికోసం ఆస్తిని తన పేరు మీద రాసి మేనేజర్ గా కూర్చోబెట్టి తను అసిస్టెంట్ అయ్యాడు.యామినీకి కూడా రవి అంటే పంచప్రాణాలే ఎంతో అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్య ఏదో జరిగింది రెండు మూడు రోజులుగా ఎడమొకం పెడమొకంగా ఉన్నారు.కిరణ్ ఎలాగైనా బాస్ కాపురంలో అన్యోన్యతని మళ్ళీ నింపాలని ప్రయత్నంలో రవితో మనసు విప్పి మాట్లాడాలని నిర్ణయించు కొన్నాడు.రవితో “సార్ మీతో పర్సనల్ గా మాట్లాడాలి”అనడంతో రవి నా గురించి యామిని గురించేనా నువ్వేమీ దిగులు పడకు.అదంతా డ్రామా.నిన్ను ఫూల్ ని చేయడంలో నన్నూ పావులా వాడుకుంటున్నారు.ఈ ఆడాళ్ళ మాట వినకపోతే ఒప్పుకోరు కదా”అంటూ ఏదో పిచ్చి పిచ్చిగా వాగాడు.ఆ మాటలు విన్న కిరణ్ “యామిని అన్ని తిట్టినా ఈయనలో బాధలేదు.పైగా నేనేదో అమాయకుడైనట్టు నన్ను ఓదార్చుతున్నాడు.ఈయన కేదో మంటలెక్కింది.దీనికొక్కటే పరిష్కారం బాస్ ఇంటికి సర్ప్రైజ్ గా డిన్నర్ కి వెళ్ళి మాట్లాడి వాళ్ళ కాపురాన్ని నిలబెట్టాలి.దీనికి ఆశ సహాయం తీసుకొందాం అనుకొని ఆశ దగ్గరికెళ్ళాడు.ఆశ హాల్లో అద్దం ముందు నిలబడి ఏదో మాట్లాడుతూ ఉంది .కిరణ్ కర్టెన్ తీసి హాల్లోకి తొంగి చూశాడు.లోపల చూసి ఆశ్చర్య పోయాడు.ఆశ అద్దం పైన అంటించిన ఫోటోకి ముద్దులు పెడుతూ ఉంది.అది చూసి కిరణ్ కర్టెన్ వేసి ఇంటి దారి పట్టాడు.మనసులో “ఏంటి ఆశ ఎవరినో ప్రేమిస్తుందా.అలాంటమ్మాయి కాదనుకున్నానే.నేను సంవత్సరం నుంచి ప్రేమిస్తూ చెప్పలేక పోయాను.వెంటనే చెప్పేయడం బెటర్ లేకపోతే ఆశ నాకు దక్కదేమో అనుకుంటూ వెళ్తున్న కిరణ్ ని ఆశ “ఏమండీ కిరణ్ గారు ఇంటి దాకా వచ్చి వెళ్ళి పోతున్నారే,రండి లోపలికి “అని పిలిచింది.కిరణ్ లోపలికి వెళ్ళకముందే యామిని దర్శన మిచ్చింది.కిరణ్ ఆశ్చర్యంగా “మేడమ్ మీరేంటి ఇక్కడ ,సార్ ఇంటికెళ్తామన్నారు.బయలు దేరుతున్నారా” అన్నాడు.”కిరణ్ ఏంటి టెన్షన్ పడుతున్నావ్ ఏదో పర్సనల్ గా మాట్లాడాలని రవి చుట్టూ తిరుగుతున్నావంట. మా ఇద్దరి గొడవ తీర్చేద్దామనే” అనడంతో కిరణ్ “అవును మేడమ్..! రవి గారి గురించి నాకు బాగా తెలుసు ఈ మధ్య మీరూ ఆయన సఖ్యతగా ఉండట్లేదని అర్థం అయింది.అందుకే ప్రాబ్లం ఏంటో అడుగుదామని “అన్నాడు.మేము సఖ్యంగా లేమని కనిపెట్టినోడివి నిన్ను ప్రేమిస్తున్న ఆశ బాధ అర్థం చేసుకోలేక పోతున్నావే”అనడంతో లోలోపల ఆనందంతో పొంగిపోతూ ఆశా నిజమా?నువ్వు ప్రేమించేది నన్నేనా?అంటుండగా రవి ఎంట్రీ ఇచ్చాడు.”ఒరేయ్ కిరణ్ ..!నాకు యామిని కి ఏ గొడవలూ లేవు.రావు కూడా.ఎందుకంటే మేం రెండు సన్నని దారాలతో అల్లిన లావుపాటి దారం.ఇదంతా నిన్నూ ఆశ ను కలపడానికి మేం ముగ్గురం ఆడిన నాటకం.యామిని కసిరినట్టు ,అక్కడ అగ్రిమెంట్ కనపడనట్టు,నువ్వు మాకోసం ఆశ హెల్ప్ తీసుకోవాలనే ప్లాన్ సక్సెస్ అయింది. ఆశ తన ప్రేమని నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదంటే యామినీ వేసిన ప్లాన్ సక్సెస్ అయినట్లే ఉంది “అంటూ కిరణ్ ని ఆశ పైకి నెట్టాడు.కిరణ్ పడబోతుండడం చూసిన ఆశ కిరణ్ ని గట్టిగా పట్టుకోవడంతో చూపులు కలిసిన శుభవేళ పాటేసుకొన్నారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!