అమ్మమ్మకి ప్రేమతో

అంశం: ప్రేమ లేఖ

అమ్మమ్మకి ప్రేమతో
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: లహరి

నువ్వు దగ్గర ఉన్నంత వరకు ఏది తెలియక పోయేది. ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఏం కాదు అది నువ్వు పాజిటివ్ గా ఆలోచించు అని ధైర్యం చెప్పే దానివి. తప్పు చేస్తే మనస్సు నొచ్చుకోకుండా సున్నితంగా మందలించే దానివి. అన్ని ప్రేమలు దగ్గరగా ఉన్నా నువ్వు మా దగ్గర లేవు అనే ఊహ కూడా భరించలేక పోతున్నా. అమ్మమ్మ  అంటే అమ్మ కన్నా చాలా బాగా చూసుకున్నావు. జీవితం ఎలా అనుభవించాలో చాలా జీవిత పాఠాలు నేర్పించావు. నువ్వు నడిచిన దారిలో నడవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. కవిగా నీ రాతలు బాగుంటాయి అని నన్ను మొదటగా ప్రోత్సహించింది నువ్వే.  ఇప్పుడు నాదైన రీతిలో భావాలను, రాతలుగా రాసుకుంటూనే ఉన్నాను. ఎప్పుడు ఏ తప్పు చేసినా నాన్న తో తిట్లు తింటాను అని నాకు తిట్లు పడకుండా నువ్వు ముందు నిలబడతావు చూడు అప్పుడు చాలా బాధ వేస్తుంది. మళ్ళీ ఆ తప్పు చేయకూడదు అని అనుకుంటూ ఉండేదాన్ని.  నువ్వు చనిపోయినప్పుడు నీ దగ్గరగా కూర్చొని ఎందుకు వదిలిపెట్టి పోయావు అని అడగాలి అనిపించింది. చివరిసారిగా నా చేతితో అన్నం తిన్నావన్న తృప్తి తప్పిస్తే ఏమీ మిగలలేదు. నన్ను ఎవరు చూసుకోవడం లేదు త్వరగా చనిపోతే బాగుండు అని  నాకు చెప్పి ఏడ్చినప్పుడు అయినా ధైర్యంగా నీ వెనక నిలబడలేకపోయాను. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు ఇదే. ఇప్పటికీ  కాదు ఎప్పటికీ బాధ పడుతూనే ఉంటాను. నువ్వు లేని లోటు, ప్రతి విషయంలో తెలుస్తూనే ఉంటుంది.

కనులు మూసినా నువ్వే…
ఆ కనుల కలలలోనూ నువ్వే…
కనులు తెరిచినా నువ్వే…
కనిపించే ప్రతి మనిషిలోనూ నువ్వే…
నిన్నటి ధ్యాసలోనూ నువ్వే…
నా రేపటి ఆశలోనూ నువ్వే…
నాలో నువ్వై… నీవే నేనై…
నా శ్వాస నువ్వే నా ఊపిరి నువ్వే…
ఆలోచనలో నువ్వే…
ప్రతి అడుగులో నువ్వే…
నా పాటలో ప్రతి పల్లవి వి నువ్వే…
నాది అనుకున్న ప్రతి క్షణం నువ్వే…
నాకు ప్రతిసారి గుర్తుకొచ్చేది నువ్వే…
నా మౌనం నువ్వే…
నా ప్రతి జ్ఞాపకం నువ్వే…
అనుక్షణం నా తలపులో నువ్వే…
నా కష్టసుఖం నువ్వే…
నా ప్రతి కన్నీటి బొట్టుని తుడిచేది  నువ్వే…
నా నవ్వు, కోపం నువ్వే…
నా గెలుపోటముల్లో నువ్వే…
నా జీవితపు ఆఖరి మజిలీవి నువ్వే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!